ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

వైద్య పరిశోధనలు మానవాళి ఎదుర్కొంటున్న ఆరోగ్య సవాళ్లకు పరిష్కారాలు చూపాలి: డాక్టర్ ఎన్టీఆర్ విశ్వవిద్యాలయ రూబీ జూబ్లీ వేడుకల్లో ఉప రాష్ట్రపతి

‘‘దేశంలో దిగ్గజ నేత డాక్టర్‌ ఎన్టీఆర్‌.. ప్రాంతీయ హద్దులకు అతీతంగా ఆలోచించిన నాయకుడు”: ఉప రాష్ట్రపతి

సాంకేతికత మానవాళికి సేవ చేయాలి.. వైద్య సేవల్లో కరుణే కీలకం: ఉపరాష్ట్రపతి

మాదకద్రవ్యాల దుర్వినియోగంపై సమాజం చేసే పోరాటానికి వైద్యులు నాయకత్వం వహించాలి: ఉప రాష్ట్రపతి

నాడు పోస్టు చేయడమైనది: 26 OCT 2026 2:54PM by PIB Hyderabad

ఆంధ్రప్రదేశ్‌ విజయవాడలో డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 40వ వార్షికోత్సవం (రూబీ జూబ్లీ) వేడుకల్లో భారత ఉప రాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య విద్యాసంస్థలు పరిశోధనలను బలోపేతం చేయాలని, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని, వైద్య రంగం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లకు పరిష్కారాలను అభివృద్ధి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

వైద్య విద్య, ఆరోగ్య సంరక్షణ రంగాలకు నాలుగు దశాబ్దాలుగా సేవలందిస్తున్న విశ్వవిద్యాలయానికి ఉప రాష్ట్రపతి అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, దిగ్గజ నాయకుడు డాక్టర్‌ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్‌) దార్శనికతకు ఈ విశ్వవిద్యాలయం ప్రతిరూపమని పేర్కొన్నారు. డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆలోచనలు, ప్రజాసేవ ప్రాంతీయ హద్దులను దాటి విస్తరించాయని, దేశ ప్రజల సంక్షేమం పట్ల ఆయనకు ఉన్న విస్తృత నిబద్ధతను ఇవి ప్రతిబింబించాయని తెలిపారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో వైద్య విద్య విస్తరించిన తీరును ప్రస్తావిస్తూ.. 2014కు ముందు 387గా ఉన్న వైద్య కళాశాలల సంఖ్య ప్రస్తుతం 846కు పెరిగిందని ఉప రాష్ట్రపతి తెలిపారు. ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య సుమారు 51 వేల నుంచి 1.4 లక్షలకు పైగా చేరిందని, ఇది 172 శాతం పెరుగుదలని పేర్కొన్నారు. అలాగే పీజీ వైద్య విద్య సీట్లు సుమారు 31 వేల నుంచి 86 వేలకు పైగా పెరిగి 177 శాతం వృద్ధిని సాధించిందని ఆయన పేర్కొన్నారు.

పరిశోధనలు, నూతన ఆవిష్కరణలే తదుపరి ప్రాధాన్య రంగాలని పేర్కొన్న ఉప రాష్ట్రపతి.. ప్రతిభావంతులైన విద్యార్థులు మానవాళి ఎదుర్కొంటున్న ఆరోగ్య సవాళ్లకు పరిష్కారాలు కనుగొనే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయ పరిశోధకులు వైద్య విజ్ఞాన రంగానికి అందించే సేవల ద్వారా నోబెల్‌ బహుమతితో సహా ప్రపంచస్థాయి గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు.

కృత్రిమ మేధ (ఏఐ), డిజిటల్‌ ఆరోగ్య సేవలు, టెలీమెడిసిన్‌, అధునాతన రోగ నిర్ధారణ సాంకేతికతలు వైద్య రంగాన్ని సమూలంగా మారుస్తున్నాయని శ్రీ సీపీ రాధాకృష్ణన్‌ పేర్కొన్నారు. అధునాతన పరిశోధనలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై విద్యార్థులు, పరిశోధకులకు మరింత అవగాహన కల్పించేందుకు ప్రముఖ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకోవాలని డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి సూచించారు. సాంకేతిక అభివృద్ధి శాస్త్రీయ ధ్రువీకరణ, రోగుల భద్రత, సమాచార గోప్యత, నైతిక బాధ్యతలకు అనుగుణంగా సాగాలని స్పష్టం చేశారు. వైద్యుడు-రోగి మధ్య సంబంధంలో కీలకమైన కరుణ, మానవీయ అనుబంధాన్ని సాంకేతికత భర్తీ చేయలేదని ఆయన అన్నారు.

మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించడంలో వైద్యులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు చురుకైన పాత్ర పోషించాలని ఉప రాష్ట్రపతి పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాలపై పోరాటం సమష్టి బాధ్యతగా పేర్కొంటూ.. మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి వైద్య రంగం నాయకత్వం వహించాలని కోరారు.

కార్యక్రమంలో భాగంగా అక్కడున్న వారితో కలిసి మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని ఉప రాష్ట్రపతి ప్రతిజ్ఞ చేశారు. అలాగే విశ్వవిద్యాలయం 40 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తుచేస్తూ రూపొందించిన ప్రత్యేక సంచికను కూడా ఆయన విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌, విశ్వవిద్యాలయ ఛాన్సలర్‌ శ్రీ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌, రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార, ప్రజాసంబంధాల శాఖ మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి, విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్‌ పి. చంద్రశేఖర్‌, జాతీయ వైద్య కమిషన్‌ వైద్య మూల్యాంకనం, రేటింగ్‌ బోర్డు అధ్యక్షుడు డాక్టర్‌ ఎంకే రమేశ్‌తో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

అంతకుముందు విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్న ఉప రాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్‌కు ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ శ్రీ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌, రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేశ్‌తో పాటు పలువురు ప్రముఖులు ఘన స్వాగతం పలికారు.

 

***


(రిలీజ్ ఐడి: 2328534) సందర్శకుల సూచీ సంఖ్య : : 16
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी , Bengali , Assamese , Gujarati