మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘పాఠశాల నుంచి ఉపాధి దిశగా సులువైన పరివర్తన’ అంశంపై న్యూఢిల్లీలో సీబీఎస్‌ఈ నాలుగో జాతీయ సదస్సు


పాఠశాల విద్యను ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధితో అనుసంధానించాలన్న డీఓఎస్‌ఈఎల్ కార్యదర్శి శ్రీ టీకే అనిల్ కుమార్

నాడు పోస్టు చేయడమైనది: 26 OCT 2026 2:16PM by PIB Hyderabad

కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు (సీబీఎస్‌ఈ), ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ పరిధిలోని సహోదయ పాఠశాల సముదాయాల సహకారంతో ‘పాఠశాల విద్య నుంచి ఉపాధి రంగంలోకి సన్నద్ధం చేయడం’ అంశంపై నాలుగో జాతీయ సదస్సును 2026 అక్టోబర్‌ 26, 27 తేదీల్లో న్యూఢిల్లీలో నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం (డీఓఎస్‌ఈఎల్‌) కార్యదర్శి టీకే అనిల్ కుమార్, సీబీఎస్‌ఈ ఛైర్మన్‌ డాక్టర్‌ మందీప్‌ భండారీతో పాటు కేంద్ర మంత్రిత్వ శాఖ, సీబీఎస్‌ఈకి చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సదస్సులో అనిల్‌ కుమార్‌ ప్రసంగిస్తూ నాలుగు కీలక ప్రాధాన్య అంశాలను వివరించారు. అవి సాంకేతికత, డిజిటల్‌ భద్రత, నైపుణ్యాలు... రూపకల్పన, సృజనాత్మకత, ఆవిష్కరణలు... జాతీయ క్రెడిట్‌ ఫ్రేమ్‌వర్క్‌ ద్వారా వివిధ విద్యా వ్యవస్థల్లో నైపుణ్యాలకు గుర్తింపు.. సమాన అవకాశాలతో కూడిన వ‌ృత్తి మార్గదర్శకత్వం. పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య, నైపుణ్య శిక్షణ, ఉపాధి రంగాల్లోకి విద్యార్థులు సులభంగా మారేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. జీవితాంతం అభివృద్ధి సాధించేందుకు, సమాజానికి సేవ చేసేందుకు, గౌరవమైన జీవితం గడిపేందుకు విద్యార్థులు సరైన నిర్ణయాలు తీసుకునేలా వారిని సన్నద్ధం చేయాలని పేర్కొన్నారు.

రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సు ద్వారా సాధారణ పాఠశాల విద్యలో నైపుణ్య విద్యను మరింత సమర్థంగా అనుసంధానించడం, విద్యార్థులు పాఠశాలల నుంచి ఉపాధి రంగంలోకి సులభంగా అడుగుపెట్టేలా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అభివృద్ధి చెందుతున్న శ్రామిక శక్తి అవసరాలు, విద్యార్థులను భవిష్యత్తు వృత్తులకు సిద్ధం చేసేందుకు అనుసరించాల్సిన వినూత్న విధానాలపై చర్చించేందుకు పాఠశాలల నాయకులు, విద్యావేత్తలు, పరిశ్రమల నిపుణులు, విధాన రూపకర్తలు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. పరస్పరం పరిచయాలు పెంచుకోవడం, మార్గదర్శకత్వం, సహకారం కోసం భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడం వంటి అవకాశాలను కూడా ఈ సదస్సు కల్పిస్తోంది.

జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ) 2020లో నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా వివిధ విద్యా విభాగాల మధ్య అడ్డంకులను తొలగించడం, మారుతున్న ఉపాధి రంగంలో రాణించేందుకు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు అందించడం ప్రాధాన్యమని ఈ సదస్సు స్పష్టం చేస్తోంది.

చర్చావేదికలు, నిపుణుల ప్రసంగాల ద్వారా బోధనలో వినూత్న పద్ధతులు, అభివృద్ధి చెందుతున్న మూల్యాంకన విధానాలు, విద్యలో డిజిటల్‌ సాంకేతికత వినియోగం, నైపుణ్య విద్యను బలోపేతం చేసే సమర్థవంతమైన విధానాలను పరిశీలించేందుకు ఈ సదస్సు పాల్గొనేవారికి అవకాశం కల్పిస్తోంది.

సదస్సులో భాగంగా సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలల ఉపాధ్యాయులు నైపుణ్య విద్యలో సాధించిన విజయాలు, అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులను వివరించే కేస్‌ స్టడీ పత్రాలు, పోస్టర్లను ప్రదర్శిస్తున్నారు. పాఠశాల విద్యలో వస్తున్న కొత్త ధోరణులు, మార్పులకు దారితీసే వినూత్న పద్ధతులపై అవగాహన కల్పించడంతో పాటు, బోధన–అభ్యసన ప్రక్రియలను మెరుగుపరిచేందుకు ఆచరణాత్మక వ్యూహాలను కూడా ఈ సదస్సు ద్వారా పాల్గొనేవారు తెలుసుకోనున్నారు.

***


(రిలీజ్ ఐడి: 2328457) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Assamese