నాడు పోస్టు చేయడమైనది:
25 OCT 2026 7:49PM by PIB Hyderabad
కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈ రోజు నెదర్లాండ్స్‌లో తన పర్యటనను ప్రారంభించారు. భారత్-నెదర్లాండ్స్ ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. ఈ పర్యటనలో భాగంగా వాణిజ్యం, పెట్టుబడుల్లో కొత్త అవకాశాలను అన్వేషించడం, అక్కడి భారతీయ సమాజంతో సంబంధాలను మరింత పెంపొందించుకోవడం లక్ష్యంగా కేంద్ర మంత్రి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ పర్యటనలో భాగంగా రోటర్‌డ్యామ్‌లో నౌకావాణిజ్యం, సరుకు రవాణా రంగాల ప్రతినిధులతో జరిగిన చర్చల్లో ఆయన పాల్గొన్నారు. ఆమ్స్టర్డ్యామ్లోని ప్రవాస భారతీయులతో కేంద్ర మంత్రి ముఖాముఖి మాట్లాడారు. పలు మీడియా సంస్థల సమావేశాల్లోనూ ఆయన పాల్గొన్నారు.
రోటర్డ్యామ్ పర్యటనలో భాగంగా శ్రీ పీయూష్ గోయల్ అక్కడి పోర్టును సందర్శించారు. ఈ సందర్భంగా ఆ పోర్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ బౌడెవిన్ సీమన్స్ ఆయన వెంట ఉన్నారు. ఐరోపాలోనే అతిపెద్దదైన రోటర్డ్యామ్ పోర్ట్... అంతర్జాతీయ వాణిజ్యం, గ్లోబల్ సప్లయి చెయిన్ కోసం అత్యంత కీలకమైనది. ఐరోపా మార్కెట్‌కు భారతీయ వస్తువులు రవాణా చేయడం కోసం ఈ పోర్టు ప్రధాన మార్గంగా ఉండటంతో, దీని వ్యూహాత్మక ప్రాధాన్యతను ఈ పర్యటన మరింతగా స్పష్టం చేసింది.
భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో, ఐరోపాకు ప్రధాన ద్వారంగా నెదర్లాండ్స్ వ్యూహాత్మక ప్రాధాన్యతనూ రోటర్డ్యామ్ పోర్టు పర్యటన మరింత స్పష్టం చేసింది. ఈ ఒప్పందం ద్వారా భారతీయ ఎగుమతిదారులకు భారీగా కొత్త అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో నెదర్లాండ్స్‌కు చెందిన అంతర్జాతీయ స్థాయి పోర్టులు, లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలు, ఐరోపా మార్కెట్లతో కనెక్టివిటీ... వాణిజ్యాన్ని పెంచడానికి, భారత్-ఐరోపా సరుకు రవాణా వ్యవస్థ బలోపేతానికి ఎంతగానో దోహదపడతాయి.
ఆమ్స్టర్డ్యామ్లోని వాల్డార్ఫ్ అస్టోరియా హోటల్లో భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన హై-టీ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ ముఖాముఖి సమావేశానికి దాదాపు 70 మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వ్యాపారవేత్తలు, వివిధ రంగాల నిపుణులతో కూడిన భారతీయ సమాజం ఒకచోటకు చేరింది. అక్కడి ప్రవాస భారతీయులతో కేంద్ర మంత్రి నేరుగా మాట్లాడటానికి ఈ సమావేశం మంచి అవకాశం కల్పించింది.
భారత్-నెదర్లాండ్స్ మధ్య సన్నిహిత సంబంధాలను పెంపొందించడంలో భారతీయ సమాజం పోషిస్తున్న కీలక పాత్రను ఈ సమావేశం మరోసారి స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఆర్థిక, సాంస్కృతిక బంధాలు, ప్రజల మధ్య సంబంధాల బలోపేతంలో ప్రవాస భారతీయుల సహకారం ఎంతో కీలకమని ఇది పునరుద్ఘాటించింది.
వాణిజ్యం, పెట్టుబడులు, వాణిజ్యపరమైన సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో డచ్ భాగస్వాములతో నిరంతర చర్చల ఆవశ్యకతను శ్రీ పీయూష్ గోయల్ పర్యటన స్పష్టం చేసింది. భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, భారత్-ఐరోపా ఆర్థిక అనుసంధానత నేపథ్యంలో సముద్ర మార్గాల ద్వారా సరుకుల రవాణా సహా పరస్పర ప్రయోజనకరమైన ఇతర రంగాల్లో మరింత పటిష్ఠ భాగస్వామ్యానికి గల అవకాశాలనూ ఈ కార్యక్రమం స్పష్టం చేసింది.
***