నాడు పోస్టు చేయడమైనది:
23 OCT 2026 5:43PM by PIB Hyderabad
భౌగోళిక రాజకీయ పరిణామాలతో పాటు ప్రాంతీయ పరిస్థితులను నిశితంగా గమనిస్తూ, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సైన్యాధికారులకు రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ సూచించారు. 2026 అక్టోబర్ 23న న్యూఢిల్లీలో జరిగిన సైన్యాధికారుల సదస్సులో ఆయన ప్రసంగించారు. రాబోయే 20, 30 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక వ్యూహాత్మక దృష్టితో ముందుకు సాగాల్సిన అవసరాన్ని ఆయన తెలియజేశారు. అదే సమయంలో తక్షణమే ఎదురయ్యే, కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు కూడా భారత సైన్యంలోని ఉన్నతాధికారులు సమానంగా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను ఎప్పటికప్పుడు మార్చుకునేలా, వాటిని చురుకుగా, అనువుగా రూపొందించుకోవాలని సూచించారు.
మారుతున్న కార్యాచరణ పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మలుచుకుంటున్న రక్షణ దళాలను శ్రీ రాజ్నాథ్ సింగ్ అభినందించారు. వినూత్న ఆలోచనలు, మెరుగైన సమన్వయం, ఉన్నత స్థాయి సహకారంతో పాటు అత్యాధునిక ఆయుధాల వినియోగం ‘ఆపరేషన్ సిందూర్’ విజయానికి దోహదపడ్డాయని పేర్కొన్నారు. దేశ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి భారత్ ఏమాత్రం వెనుకాడబోదనే స్పష్టమైన సందేశాన్ని ఈ ఆపరేషన్ ఇచ్చిందని ఆయన తెలిపారు.
డ్రోన్లు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ సైన్యంలో చేపడుతున్న పునర్వ్యవస్థీకరణ చర్యలను రక్షణ మంత్రి ప్రశంసించారు. సైనిక సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడం, పనితీరును నిరంతరం సమీక్షించడం, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన మెరుగుదలలు చేపట్టడం కీలకమని పేర్కొన్నారు. కృత్రిమ మేధ, స్వయంచాలక వ్యవస్థలు, డేటా విశ్లేషణ, సైబర్ భద్రత, సురక్షిత సమాచార ప్రసార వ్యవస్థల వంటి రంగాల్లో ప్రయత్నాలను వేగవంతం చేయాల్సిన అవసరాన్ని ఆయన చెప్పారు.
వాయు, సముద్ర, అంతరిక్ష, సైబర్ రంగాల్లో సవాళ్ల ప్రాధాన్యం పెరుగుతున్నప్పటికీ, భూతల యుద్ధాలు, భూ దళాలు మాత్రం కీలకమైనవిగానే కొనసాగుతాయని కేంద్ర మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆధునిక యుద్ధాల్లో సమీకృత విధానాన్ని అనుసరించాలని పిలుపునిస్తూ.. బహుళ రంగాల్లో సైనిక సామర్థ్యాలు, సంయుక్త కార్యకలాపాల్లో నిరంతర సమన్వయంపైనే విజయావకాశాలు ఆధారపడి ఉంటాయని పేర్కొన్నారు.
రక్షణ రంగంలో స్వావలంబన సాధించేందుకు రక్షణ దళాలు చేస్తున్న కృషిని రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. దేశంలో రక్షణ ఉత్పత్తుల తయారీ సామర్థ్యం పెరుగుతుండటానికి అన్ని భాగస్వామ్య పక్షాలు సమష్టిగా చేస్తున్న కృషే కారణమని పేర్కొన్నారు. “మారుతున్న ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం రక్షణ రంగంలో స్వావలంబనకు ప్రాధాన్యమిస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఉత్పత్తుల తయారీ రికార్డు స్థాయిలో రూ.1.78 లక్షల కోట్లకు చేరుకుంది. రక్షణ ఎగుమతులు కూడా ఎన్నడూ లేనంతగా సుమారు రూ.38,000 కోట్లకు చేరాయి” అని ఆయన తెలిపారు.
‘2025– సంస్కరణల సంవత్సరం’ గురించి ప్రస్తావిస్తూ.. సంస్కరణలు నిరంతరం కొనసాగే ప్రక్రియ అని, వాటి విజయం సమర్థవంతమైన అమలుపై ఆధారపడి ఉంటుందని శ్రీ రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. తమ పరిధిలోని కమాండ్లు, వివిధ స్థాయిల్లో ఈ సంస్కరణలను ముందుకు తీసుకెళ్లాలని సైన్యాధికారులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ సంస్కరణల ద్వారా సైనిక కార్యాచరణ సామర్థ్యాలకు స్పష్టమైన ప్రయోజనాలను చేకూర్చేలా చూడాలని సూచించారు.
రక్షణ దళాల ధైర్యసాహసాలు, క్రమశిక్షణ, సంసిద్ధత, సంయమనం.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చురుకైన నాయకత్వం, దౌత్యపరమైన ప్రయత్నాలు కలిసి అంతర్జాతీయంగా భారత ప్రతిష్ఠను మరింత బలోపేతం చేశాయని రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. రక్షణ రంగంలో స్వావలంబన, సంస్కరణల సమర్థవంతమైన అమలు, మానవ వనరుల మెరుగైన నిర్వహణ, మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం, జాతీయ భద్రత విషయంలో సమగ్ర విధానాన్ని అనుసరించడంపై రక్షణ దళాలు దృష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా భారత సైన్యాన్ని భవిష్యత్తులో ఎదురయ్యే యుద్ధ సవాళ్లకు సిద్ధం చేసేందుకు రూపొందించిన ‘భూ యుద్ధ సిద్ధాంతం’ (ల్యాండ్ వార్ఫేర్ డాక్ట్రిన్)ను రక్షణ మంత్రి విడుదల చేశారు. మారుతున్న యుద్ధ స్వరూపం, భవిష్యత్తులో ఎదురయ్యే సంఘర్షణల వల్ల తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత సైన్యానికి ఈ సిద్ధాంతం సమగ్ర మార్గదర్శకాన్ని అందిస్తుంది. ఐక్యరాజ్యసమితి వార్షిక జర్నల్ను కూడా ఆవిష్కరించారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకులుగా సేవలందిస్తూ విశేష కృషి చేసిన భారత సైనిక సిబ్బందిని సత్కరించారు. వారి ఆదర్శప్రాయమైన సేవలు, వృత్తిపరమైన నైపుణ్యం, అంతర్జాతీయ శాంతి, భద్రతకు అందించిన సహకారాన్ని ఈ సందర్భంగా గుర్తించారు.
ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి, ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్, రక్షణ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సమగ్ర అజెండాతో నిర్వహిస్తున్న ఈ సదస్సు భారత సైన్యంలోని ఉన్నతాధికారులకు కీలక వేదికగా నిలుస్తోంది. ప్రస్తుతం అమలవుతున్న కార్యక్రమాలను సమీక్షించడం, భవిష్యత్తులో ప్రాధాన్యం ఇవ్వాల్సిన రంగాలను గుర్తించడం, ప్రగతిశీలమైన, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పనిచేసే, సాంకేతిక పరిజ్ఞానంతో బలోపేతమైన, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే భారత సైన్యాన్ని నిర్మించడానికి తగిన విధానాలను రూపొందించడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యాలు.
***