సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పుణెలో నాలుగు రోజుల పాటు ‘రిత్విక్ ఘటక్ చలనచిత్రోత్సవం’ నిర్వహించనున్న ఎన్‌ఎఫ్‌డీసీ-ఎన్‌ఎఫ్‌ఏఐ... సినీ రూపకర్త వైవిధ్యమైన వారసత్వాన్ని వీక్షించే అరుదైన అవకాశం

నాడు పోస్టు చేయడమైనది: 21 OCT 2026 6:13PM by PIB Hyderabad

ఎన్‌ఎఫ్‌డీసీ- నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎఫ్‌డీసీ-ఎన్‌ఎఫ్‌ఏఐ) అక్టోబర్ 22 నుంచి 25 2026 వరకు పుణేలోని లా కాలేజీ రోడ్డులోని ఆడిటోరియంలో “ఘటక్: ఎ రెట్రోస్పెక్టివ్” పేరుతో నాలుగు రోజుల పాటు చలనచిత్రోత్సవాన్ని నిర్వహిస్తుంది. ప్రఖ్యాత సినీ రూపకర్త రిత్విక్ ఘటక్ రూపొందించిన 4కే-పునరుద్ధరించిన ఫీచర్ ఫిల్మ్స్, అరుదైన 35ఎంఎం ప్రింట్లు, నాన్-ఫిక్షన్ డాక్యుమెంటరీలు, విద్యాపరమైన లఘు చిత్రాలు, అసంపూర్ణ చిత్రాలకు సంబంధించి డిజిటలైజ్డ్ అంశాలను దీనిలో ప్రదర్శిస్తారు. సినీ రూపకర్తగా చేసిన కృషితో పాటు వివిధ సృజనాత్మక విభాగాల్లో అంతగా ప్రాచుర్యం పొందని ప్రాజెక్టులతో సహా ఘటక్ సినీ ప్రస్థానాన్ని తెలుసుకునేందుకు సినీ పరిశోధకులు, విద్యార్థులు, సినీ ప్రియులకు ఈ ఉత్సవం వేదికగా నిలుస్తుంది.

ఘటక్ నటుడిగా, నేమై ఘోష్ దర్శకత్వం వహించిన ‘ఛిన్నముల్’ (1950) చిత్ర ప్రదర్శనతో అక్టోబర్ 22న ఈ చలనచిత్రోత్సవం ప్రారంభమవుతుంది. దేశ విభజన అనంతరం గ్రామాల్లోని ప్రజల నిర్వాసిత పరిస్థితిని ఈ చిత్రం కళ్లకు కడుతుంది. ప్రఖ్యాత సినీ రూపకర్తగా ఘటక్ ఎదగటానికి ముందు... తొలి దశ సినీ ప్రయాణంలోని కీలక ఘట్టంపై ఈ చిత్రం అవగాహన కల్పిస్తుంది.

నాగరిక్ (1952), అజంత్రిక్ (1958), బరి తేకే పాలియే (1959), మేఘే ధాకా తార (1960), కోమల్ గంధార్ (1961), సుబర్ణరేఖ (1962), తితాష్ ఏక్తి నాదిర్ నామ్ (1973), జుక్తి తక్కో ఆర్ గప్పో (1974) వంటి ఘటక్ చిత్రాల్లో ప్రశంసలు పొందిన ఫీచర్ ఫిల్మ్స్ 4కే-పునరుద్ధరించిన ప్రింట్లను ఈ కార్యక్రమంలో ప్రదర్శిస్తారు. వీటితో పాటు ఘటక్ స్క్రీన్‌ప్లే అందించిన, హృషీకేశ్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ‘ముసాఫిర్’ (1957), ఘటక్ కథ-స్క్రీన్‌ప్లే, బిమల్ రాయ్ దర్శకత్వంలో వచ్చిన ‘మధుమతి’ (1958) చిత్రాలను కూడా ప్రదర్శిస్తారు. ఈ హిందీ చిత్రాలు ఆయన సృజనాత్మకతను చాటిచెప్పటమే కాక, భారతీయ చలనచిత్ర రంగంలో ఆయన స్థానాన్ని తెలియజేస్తాయి.

బీహార్ కే దర్శనియా స్థాన్ (1955), ఫియర్ (1965), రెండీవూ (1965), నాగరిక్ సంరక్షణ, సివిల్ డిఫెన్స్ (1965), మై లెనిన్ (1970), సైంటిస్ట్స్ ఆఫ్ టుమారో (1967), పురూలియార్ ఛౌ (1970), ఆదివాసియోం కా జీవన్, యే క్యున్ (1970), దుర్బార్ గతి పద్మ (1971) వంటి డాక్యుమెంటరీలు, లఘు చిత్రాలు కూడా ఈ రెట్రోస్పెక్టివ్‌లో ఉన్నాయి. ఫీచర్ ఫిల్మ్ కథనాలకు అతీతంగా డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకింగ్, సాంస్కృతిక పద్ధతులు, ప్రజా జీవితం, కళాత్మక వ్యక్తీకరణ పట్ల ఘటక్‌ దృక్పథాన్ని అర్థం చేసుకునేందుకు ఇవి ఎంతగానో సహకరిస్తాయి.

 

ఈ కార్యక్రమంలో చేర్చిన అసంపూర్ణ చిత్రాలు ప్రత్యేక ఆర్కైవల్ ప్రాధాన్యత గలవి. రౌంగర్ గోలం, బగలర్ బంగా దర్శన్, కటో అజనారే (1959), ప్రఖ్యాత శిల్పి రాంకింకర్ బైజ్‌ జీవిత చరిత్రకు సంబంధించి ఘటక్ రూపొందించిన అసంపూర్ణ చిత్రం వంటివి వీటిలో ఉన్నాయి. నేషనల్ ఫిల్మ్ హెరిటేజ్ మిషన్ (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎం) ద్వారా 2కే,4కేలో పునరుద్ధరించి, డిజిటలైజ్ చేసిన ఈ అసంపూర్ణ చిత్రాల మిగిలిన భాగాలను ఈ రెట్రోస్పెక్టివ్‌లో ప్రదర్శిస్తారు. వీటిని బహిరంగంగా ప్రదర్శించటం ద్వారా పూర్తిస్థాయి చిత్రాల రూపంలో అందుబాటులో లేని సినీ సంపదను వీక్షించే అరుదైన అవకాశం ప్రేక్షకులకు కలుగుతుంది. కేవలం పూర్తయిన చిత్రాలనే కాక, సినీ రూపకర్త సృజనాత్మక ప్రయాణాన్ని పూర్తిస్థాయిలో అర్థం చేసుకునేందుకు తోడ్పడే అసంపూర్ణ, అంతగా ప్రాచుర్యం పొందని కళాఖండాలను భద్రపరచటంలో ఫిల్మ్ ఆర్కైవ్స్ కీలక పాత్రను ఇవి స్పష్టం చేస్తాయి.

ఆడియోవిజువల్ వారసత్వాన్ని పరిరక్షించేందుకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నేషనల్ ఫిల్మ్ హెరిటేజ్ మిషన్ ద్వారా ఈ చిత్రాల పునరుద్ధరణ జరిగింది. పశ్చిమబెంగాల్ స్టేట్ ఫిల్మ్ ఆర్కైవ్ నుంచి సేకరించిన విలువైన సమాచారంతో పాటు ఎన్‌ఎఫ్‌డీసీ-ఎన్‌ఎఫ్‌ఏఐ దశాబ్దాలుగా భద్రపరిచిన ఒరిజినల్ ఫిల్మ్ ఎలిమెంట్స్ ఆధారంగా ఈ 4కె పునరుద్ధరణ చేపట్టారు. దృశ్యపరమైన వాస్తవికతను, ఘటక్ అసలైన సినీ దార్శనికతను యథాతథంగా ఉంచేందుకు జాతీయ అవార్డు గ్రహీత, సినిమాటోగ్రాఫర్ శ్రీ అవిక్ ముఖోపాధ్యాయ పర్యవేక్షణలో కలర్-గ్రేడింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ పునరుద్ధరణ కార్యక్రమాన్ని ఆయన ప్రశంసించారు.

షెడ్యూల్ పూర్తి వివరాల కోసం ఆసక్తి గలవారు nfaifilmcircle@nfdcindia.comకు ఈ-మెయిల్ చేయవచ్చు. ఎన్‌ఎఫ్‌డీసీ-ఎన్‌ఎఫ్‌ఏఐ సోషల్ మీడియా వేదికలను సందర్శించవచ్చు.

***


(రిలీజ్ ఐడి: 2326610) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali