వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
నాణ్యతా ప్రమాణాలతో ఆయుష్ వైద్య విధానాల ప్రోత్సాహానికి దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన భారత ప్రమాణాల సంస్థ
ఆయుర్వేదం, యోగా, సోవా - రిగ్పా వైద్య విధానాల్లో ప్రామాణీకరణ, భద్రత, రోగుల సంరక్షణ, అంతర్జాతీయ గుర్తింపును పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన కార్యక్రమాల్లో 600 మందికి పైగా నిపుణులు, ప్రాక్టీషనర్లు, పరిశ్రమ రంగానికి చెందిన ప్రముఖుల భాగస్వామ్యం
నాడు పోస్టు చేయడమైనది:
19 OCT 2026 6:52PM by PIB Hyderabad
భారతీయ సంప్రదాయ వైద్య విధానాల్లో ప్రామాణీకరణకు మరింత ప్రాధాన్యం కల్పించే దిశగా భారత ప్రమాణాల సంస్థ (బీఐఎస్) ఆయుష్ విభాగం ఆయుర్వేదం, యోగా, సోవా-రిగ్పా వైద్య విధానాల్లో ప్రామాణీకరణపై రెండు జాతీయ స్థాయి కార్యక్రమాలు నిర్వహించింది. సంప్రదాయ వారసత్వాన్ని శాస్త్రీయ నాణ్యతా నియంత్రణతో అనుసంధానించడం ద్వారా వినియోగదారుల్లో విశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు, ఆయుష్ రంగానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలని బీఐఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో ప్రముఖ పరిశోధకులు, పరిశ్రమల అధిపతులు, విద్యారంగ ప్రముఖులు, వైద్య నిపుణులు సహా 600 మందికి పైగా కీలక భాగస్వాములు పాల్గొన్నారు.
ప్రగతి - 2026: ఆయుర్వేదం, యోగాలో ప్రామాణీకరణపై జాతీయ సదస్సు
కర్ణాటకలోని బెలగావిలో భారతీయ ప్రమాణాల సంస్థ, కేఎల్ఈ శ్రీ బీఎంకే ఆయుర్వేద మహావిద్యాలయం, కేఎల్ఈ ఉన్నత విద్య, పరిశోధనా అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ప్రగతి - 2026 సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 600 మంది పాల్గొని, ఆయుర్వేదం, యోగా రంగాలను బలోపేతం చేయడంలో భారతీయ ప్రమాణాల పాత్రపై చర్చించారు. భారతీయ ప్రమాణాల రూపకల్పనలో బీఐఎస్ చేపడుతున్న కృషిని, అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ (ఐఎస్ఓ) ద్వారా ప్రపంచవ్యాప్త ప్రామాణీకరణలో భారత్ పాత్రను విస్తరించేందుకు తీసుకుంటున్న చర్యలను బీఐఎస్ శాస్త్రవేత్త–ఇ, ఆయుష్ విభాగాధిపతి శ్రీమతి సృష్టి దీక్షిత్ వివరించారు. సదస్సులో పాల్గొన్న ప్రముఖులు నాణ్యతకు భరోసా కల్పించడం, రోగుల భద్రత, విశ్వసనీయ పరిశోధనలు, సమర్థవంతమైన నియంత్రణ వ్యవస్థల అమలుకు స్పష్టమైన ప్రమాణాలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. సదస్సులో ప్రధానంగా చర్చించిన అంశాలు ఇవి:
యోగా, ఆయుర్వేదంలో ప్రామాణీకృత ఆచరణ - విద్య: యోగా, ఆయుర్వేద రంగాల్లో ఏకరీతి పరిభాష, విద్యా ప్రమాణాలు, వైద్య మార్గదర్శకాల అవసరాన్ని ప్రముఖులు వివరించారు.
పరిశ్రమలు, స్టార్టప్‌లకు ప్రోత్సాహం: బీఐఎస్ ధ్రువీకరణ పొందడం ద్వారా మార్కెట్‌లోకి ఉత్పత్తులను వేగంగా తీసుకెళ్లడంతో పాటు వినియోగదారుల్లో విశ్వాసాన్ని ఎలా పెంపొందించవచ్చో హిమాలయ వెల్‌నెస్ కంపెనీకి చెందిన డాక్టర్ బిందు ఇందిర, కర్ణాటక ఆయుష్ ఔషధ తయారీదారుల సంఘానికి చెందిన డాక్టర్ శ్రీనివాస్ పాటిల్ సహా పరిశ్రమల ప్రముఖులు మార్గనిర్దేశం చేశారు.
నిపుణులతో ముఖాముఖి: ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదకు చెందిన ప్రొఫెసర్ (డాక్టర్) కాశీనాథ్ సామగండి, బీఐఎస్ ఆయుర్వేద విభాగ కమిటీ అధ్యక్షుడు వైద్య జయంత్ దేవ్‌పుజారి నేతృత్వంలోని నిపుణుల బృందం ప్రతినిధులతో ముఖాముఖి చర్చలు నిర్వహించింది. విద్య, పరిశోధన, ఔషధ తయారీ, వైద్య ఆచరణలో ప్రమాణాలను అమలు చేయడంలో ఎదురవుతున్న ఆచరణాత్మక సమస్యలపై చర్చించారు. ప్రమాణాలను విస్తృతంగా అమలు చేసేందుకు పరిష్కరించాల్సిన లోటుపాట్లను కూడా ఈ సందర్భంగా గుర్తించారు.
లేహ్, లడఖ్‌లో సోవా-రిగ్పా ప్రామాణీకరణకు ముందడుగు
లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలోని లేహ్‌లో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోవా-రిగ్పా (ఎన్ఐఎస్ఆర్)లోబీఐఎస్ తన ఐదో సోవా-రిగ్పా విభాగ కమిటీ సమావేశానికి అనుబంధంగా ఆలోచనల మేధోమథన సదస్సును నిర్వహించింది. ఈ కార్యక్రమంలో బీఐఎస్ సోవా-రిగ్పా విభాగ కమిటీ అధ్యక్షుడు, ఎన్ఐఎస్ఆర్ వ్యవస్థాపక డైరెక్టర్ పద్మశ్రీ డాక్టర్ పద్మ గుర్మెట్, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్‌కు చెందిన డాక్టర్ అర్జున్ సింగ్, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యునానీ మెడిసిన్‌కు చెందిన డాక్టర్ ఉసామా అక్రమ్, బీఐఎస్‌కు చెందిన డాక్టర్ మహే ఆలం పాల్గొన్నారు. కింద అంశాలపై చర్చించారు:
ఈ కార్యక్రమాలకు ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఏహెచ్ఏ), నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ (ఎన్సీఐఎస్ఎం), సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యునానీ మెడిసిన్ (సీసీఆర్యూఎం), సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్ఏఎస్) వంటి ప్రముఖ జాతీయ సంస్థలు సహకారం అందించాయి. పరిశ్రమలు, విద్యా సంస్థలతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించేందుకు బీఐఎస్ తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. కొత్త ప్రమాణాల రూపకల్పనకు ప్రతిపాదనలు సమర్పించే ప్రక్రియను సులభతరం చేసేందుకు ఆన్‌లైన్ సమర్పణ పోర్టళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది.
భారత ప్రమాణాల సంస్థ దేశంలో ప్రామాణీకరణ, అనుగుణ్యత మదింపు కార్యకలాపాల సమన్వయ అభివృద్ధికి బాధ్యత వహించే జాతీయ ప్రమాణాల సంస్థగా పని చేస్తోంది. ప్రత్యేక ఆయుష్ విభాగం ద్వారా సంప్రదాయ భారతీయ వైద్య విధానాలు ప్రపంచస్థాయి నాణ్యతా ప్రమాణాలను అందుకునేలా బీఐఎస్ నాణ్యతా ప్రమాణాలను రూపొందిస్తోంది.
ప్రజా సంబంధాల విభాగం
భారత ప్రమాణాల సంస్థ
ఈమెయిల్: pr@bis.gov.in
ఎక్స్ (ట్విట్టర్): @indianstandards
***
(రిలీజ్ ఐడి: 2325302)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7