అంతరిక్ష విభాగం
azadi ka amrit mahotsav

రాబోయే 7 - 8 ఏళ్లలో భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ విలువ 40 -45 బిలియన్‌ డాలర్లకు చేరే అవకాశం: డాక్టర్‌ జితేంద్ర సింగ్‌


అంతరిక్షంలో ప్రైవేటు రంగాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ అనుమతించడంతో పెరుగుతున్న పెట్టుబడులు

అంతరిక్ష సామర్థ్యాల ప్రదర్శన దశ నుంచి ప్రపంచ స్థాయిలో పోటీపడగల అంతరిక్ష సంస్థల నిర్మాణం దిశగా భారత్‌: డాక్టర్‌ జితేంద్ర సింగ్‌

ఊహించదగిన డిమాండ్‌, వేగవంతమైన అనుమతులు, స్థిరమైన వ్యాపార నమూనాలే ప్రైవేటు అంతరిక్ష పరిశ్రమ విస్తరణకు కీలకం: డాక్టర్‌ జితేంద్ర సింగ్‌

మౌలిక సదుపాయాల పర్యవేక్షణ నుంచి వ్యవసాయం, విపత్తుల నిర్వహణ వరకు భూమిపై అభివృద్ధికి దోహదపడుతున్న అంతరిక్ష సాంకేతికత: డాక్టర్‌ జితేంద్ర సింగ్‌

నాడు పోస్టు చేయడమైనది: 17 OCT 2026 3:50PM by PIB Hyderabad

ప్రస్తుతం సుమారు 9 బిలియన్‌ డాలర్ల విలువతో ఉన్న భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ రాబోయే ఏడు నుంచి ఎనిమిదేళ్లలో 40 - 45 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరుతుందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ, భూ విజ్ఞాన శాఖల సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ తెలిపారు. న్యూఢిల్లీలో ఈ రోజు ‘అంతరిక్షం, సార్వభౌమత్వం, నూతన ఆర్థిక వ్యవస్థ’ అనే అంశంపై నిర్వహించిన మీడియా రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన ఈ విషయం వెల్లడించారు. 

సాంకేతిక సామర్థ్యాలను ప్రదర్శించే దశను దాటి, ప్రపంచ మార్కెట్లలో పోటీపడగల వాణిజ్య అంతరిక్ష సంస్థలను నిర్మించడంపై భారత్‌ దృష్టి సారించాలని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. భారత అంతరిక్ష సంస్థల విస్తరణకు, అంతర్జాతీయ మార్కెట్లలో వాటి ప్రాబల్యాన్ని పెంచేందుకు దేశీయ, విదేశీ పెట్టుబడులు పెరగడం, స్థిరమైన డిమాండ్‌ ఉండటం, నియంత్రణపరమైన అనుమతులు వేగంగా లభించడం, దీర్ఘకాలం కొనసాగగల వ్యాపార నమూనాలు కీలకమని ఆయన స్పష్టం చేశారు.

న్యూఢిల్లీలో జరుగుతున్న ‘బ్లూమ్‌బర్గ్‌ న్యూ ఎకానమీ ఫోరమ్‌’ నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. దేశాలు తమ స్వతంత్ర అంతరిక్ష సామర్థ్యాలను ప్రపంచ మార్కెట్లలో పోటీపడగల వాణిజ్య పరిశ్రమలుగా ఎలా అభివృద్ధి చేసుకోవాలి, ప్రైవేటు పెట్టుబడులను ఎలా ఆకర్షించాలి, జాతీయ ప్రయోజనాలకు భంగం కలగకుండా బలమైన సరఫరా వ్యవస్థలను ఎలా నిర్మించుకోవాలనే అంశాలపై చర్చించారు. మారుతున్న ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ భాగస్వామ్యాల పాత్ర, ప్రైవేటు అంతరిక్ష సంస్థల విస్తరణలో ఎదురవుతున్న సవాళ్లపైనా సమావేశంలో అభిప్రాయాలు పంచుకున్నారు.

ఈ సమావేశంలో భారత జాతీయ అంతరిక్ష ప్రోత్సాహక, అనుమతుల కేంద్రం (ఇన్ - స్పేస్) డైరెక్టర్‌ (ప్రమోషన్‌) వినోద్‌ కుమార్‌, స్టెమ్ బోర్డ్ , లింగో సంస్థల వ్యవస్థాపకురాలు, సీఈఓ, మాజీ నాసా ఇంజినీర్‌, బ్లూ ఆరిజిన్‌ వ్యోమగామి ఐషా బోవ్‌ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అంతరిక్ష పరిశ్రమ, పారిశ్రామిక రంగం, విద్యా సంస్థలు, అంతర్జాతీయ అంతరిక్ష సమాజానికి చెందిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 2019 - 2020లో భారత అంతరిక్ష రంగాన్ని ప్రైవేటు భాగస్వామ్యానికి తెరవడం ఐదారు ఏళ్లలోనే గణనీయమైన ఫలితాలను ఇచ్చిందని కేంద్ర మంత్రి తెలిపారు. అధిక సాంకేతిక నైపుణ్యం, భారీ పెట్టుబడులు, దీర్ఘకాలిక నిబద్ధత అవసరమయ్యే అంతరిక్ష రంగంలో ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు పరిశ్రమలు కలిసి పనిచేస్తే ఎంతటి పురోగతి సాధించవచ్చో భారత్‌ అనుభవం చాటుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సామర్థ్యాలను వాణిజ్యపరంగా లాభదాయకమైన వ్యాపారాలుగా అభివృద్ధి చేసి, అంతర్జాతీయ మార్కెట్లలో పోటీపడగల స్థాయికి తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

ప్రైవేటు అంతరిక్ష సంస్థల అభివృద్ధికి డిమాండ్‌ పెంపు అత్యంత కీలకమని డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా వినియోగ మార్గాలను గుర్తించే విధానాన్ని ప్రస్తావిస్తూ, ప్రభుత్వ సంస్థలను ప్రధాన వినియోగదారులుగా నిలపడం, ప్రాథమిక సాంకేతిక నమూనాల నిరూపణ  ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడం ద్వారా సంస్థలు తమ సాంకేతికతను నిరూపించుకుని వాణిజ్య వినియోగం దిశగా ముందుకు సాగగలవని తెలిపారు. స్థిరమైన వినియోగదారుల వర్గం ఉంటే ఉత్పత్తి సామర్థ్యంపై పెట్టుబడులు పెట్టేందుకు, మార్కెట్‌కు సిద్ధమైన ఉత్పత్తులను అభివృద్ధి చేసేందుకు, దీర్ఘకాలిక ఆదాయ మార్గాలను ఏర్పాటు చేసుకునేందుకు సంస్థలకు విశ్వాసం కలుగుతుందని పేర్కొన్నారు.

నిర్దిష్ట గడువులో నియంత్రణ పరమైన అనుమతులు మంజూరు చేయడం, వ్యాపార వ్యయాలను తగ్గించడం, సరఫరా వ్యవస్థల అనుసంధానాన్ని బలోపేతం చేయడం అవసరమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఉపగ్రహాల ఏర్పాటు లేదా ఎగుమతులకు లైసెన్సులు కోరే సంస్థలకు నిర్ణీత కాలవ్యవధిలో అవసరమైన అనుమతులు లభించేలా చూడాలని పేర్కొన్నారు. అంతరిక్ష ఉత్పత్తులకు సంబంధించి జీఎస్టీ పరమైన చర్యలను ప్రస్తావిస్తూ, సంస్కరణలు పరిశ్రమకు ఆచరణాత్మక ప్రయోజనాలను అందించాలని అన్నారు. స్థిరమైన డిమాండ్‌, సమర్థవంతమైన ప్రక్రియలు, వాణిజ్యపరమైన వృద్ధికి స్పష్టమైన మార్గం ఉన్నప్పుడే పెట్టుబడులు దీర్ఘకాలం కొనసాగుతాయని వివరించారు.

పెట్టుబడులు, అంతర్జాతీయ సహకారానికి భారత్‌ కొత్త అవకాశాలను కల్పిస్తోందని, అదే సమయంలో స్వదేశీ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తోందని కేంద్ర మంత్రి తెలిపారు. పెట్టుబడులు పెరగడం వల్ల సాంకేతిక అభివృద్ధి, తయారీ రంగం, అంతర్జాతీయ మార్కెట్లకు చేరువయ్యే అవకాశాలు విస్తరిస్తాయని పేర్కొన్నారు. జాతీయ భద్రత, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి దృష్ట్యా దేశీయ సామర్థ్యాలకు కూడా ఎంతో ప్రాధాన్యం ఉందని స్పష్టం చేశారు.

భారత ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు సంస్థల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని, దీనికి అంతర్జాతీయ భాగస్వామ్యాలను జోడించాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. ఈ విధానం ద్వారా భారతీయ సంస్థలు ప్రపంచ సరఫరా వ్యవస్థల్లో భాగస్వాములు కావడంతో పాటు, తమ వినియోగదారుల పరిధిని విస్తరించుకుని, జాతీయ ప్రయోజనాలకు భంగం కలగకుండా ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదపడగలవని తెలిపారు. భారత్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల బలాలను విదేశీ భాగస్వాముల సామర్థ్యాలతో సమన్వయం చేయడమే ఈ విధానం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

అంతరిక్షంలో సాధిస్తున్న విజయాలతో పాటు, భూమిపై అంతరిక్ష సాంకేతికతను విస్తృతంగా వినియోగించడం కూడా భారత అంతరిక్ష కార్యక్రమం ప్రత్యేకత అని కేంద్ర మంత్రి తెలిపారు. ఉపగ్రహ సమాచార వ్యవస్థలు, భౌగోళిక సమాచార సాంకేతికత, భూ పరిశీలన సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధికి , ప్రాజెక్టుల పర్యవేక్షణకు, వ్యవసాయం, విపత్తుల నిర్వహణ, రక్షణ రంగాలకు తోడ్పడుతున్నాయని పేర్కొన్నారు.

ప్రాజెక్టులకు అనుమతుల మంజూరు, పనుల అమలు గడువుల పర్యవేక్షణ, అభివృద్ధి కార్యక్రమాలకు జియో ట్యాగింగ్‌ చేయడంలో అంతరిక్ష సాంకేతికతను వినియోగిస్తున్నామని డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ తెలిపారు. మయన్మార్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక సహా పొరుగు దేశాలకు కూడా భారత్‌ అంతరిక్ష ఆధారిత సమాచారం, విపత్తుల నిర్వహణలో సహకారం అందిస్తోందని పేర్కొన్నారు. అంతరిక్ష సామర్థ్యాలపై పెట్టుబడులు ప్రజా సేవలను మెరుగుపరచడంతో పాటు అభివృద్ధికి తోడ్పడి, వాణిజ్యపరమైన వినియోగాలకు కొత్త అవకాశాలను సృష్టించగలవని ఈ అనువర్తనాలు నిరూపిస్తున్నాయని వివరించారు.

సాంకేతిక విజయాలను ఆచరణాత్మక వినియోగాలు, ప్రజల అవసరాలతో అనుసంధానించడంలోనే అంతరిక్ష రంగం విస్తృత ఆర్థిక ప్రయోజనం ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రయోగ వాహకాలు, ఉపగ్రహాలతో పాటు వాటి ఆధారంగా అందించే సేవలు, సమాచార ఆధారిత పరిష్కారాలు, పారిశ్రామిక అనువర్తనాలు భారత అంతరిక్ష సంస్థలకు మార్కెట్‌ను విస్తరించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

జాతీయ అంతరిక్ష సామర్థ్యాల పెంపు, అంతర్జాతీయ సహకారం పరస్పర విరుద్ధ లక్ష్యాలు కావని డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ స్పష్టం చేశారు. ప్రపంచ భాగస్వాములతో కలిసి పనిచేస్తూ దేశీయ పరిశ్రమలకు మరిన్ని అవకాశాలు కల్పించడంతో పాటు సొంత సాంకేతిక సామర్థ్యాలను భారత్‌ నిరంతరం బలోపేతం చేసుకోవాలని అన్నారు. దేశీయ, అంతర్జాతీయ స్థాయుల్లో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల మధ్య భాగస్వామ్యాలు విస్తరించడం ద్వారా పెట్టుబడులు, సాంకేతిక అభివృద్ధి, సరఫరా వ్యవస్థల అనుసంధానం, కొత్త మార్కెట్లకు చేరువయ్యే అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.

సాంకేతిక పరిజ్ఞానం, పరిశ్రమ అవసరాలు మారుతున్న కొద్దీ ప్రగతిశీల ఆలోచనలకు స్వాగతం పలుకుతూ, విధానాలను అనుగుణంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. అంతరిక్ష రంగాన్ని ప్రైవేటు భాగస్వామ్యానికి తెరవడం ద్వారా ఇప్పటికే స్థిరపడిన ప్రభుత్వ సంస్థలతో కలిసి కొత్త సంస్థలు కూడా తమ వంతు కృషి చేసేందుకు అవకాశాలు కల్పించడం ఎంతటి విలువైన నిర్ణయమో స్పష్టమవుతోందని పేర్కొన్నారు.

భారత అంతరిక్ష రంగం తదుపరి దశలో సాధించే వృద్ధి  సాంకేతిక సామర్థ్యాలను వాణిజ్యపరంగా విజయవంతమైన సంస్థలుగా తీర్చిదిద్దడంపై ఆధారపడి ఉంటుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. పెట్టుబడుల పెంపు, స్థిరమైన డిమాండ్‌, సమర్థవంతమైన నియంత్రణ ప్రక్రియలు, స్వదేశీ సామర్థ్యాల బలోపేతం, అంతర్జాతీయ భాగస్వామ్యాలు ఈ మార్పులో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ చర్యలతో ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో భారత్‌ మరింత కీలక పాత్ర పోషించేందుకు మార్గం సుగమమవుతుందని వివరించారు.

ఫోటో-   న్యూఢిల్లీలో బ్లూమ్‌బర్గ్‌ న్యూ ఎకానమీ ఫోరమ్‌ నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ప్రసంగిస్తున్న కేంద్ర మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌. -  

 

***


(రిలీజ్ ఐడి: 2324792) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Tamil