ఔషధాల విభాగం
azadi ka amrit mahotsav

137 రకాల క్యాన్సర్ నిరోధక మందులపై ట్రేడ్ మార్జిన్ హేతుబద్ధీకరణ 2026 నవంబర్‌ 9 నుంచి సవరించిన ధరల అమలు

నాడు పోస్టు చేయడమైనది: 17 OCT 2026 6:53PM by PIB Hyderabad

ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఎంపిక చేసిన షెడ్యూల్‌ పరిధిలో లేని 137 క్యాన్సర్‌ ఔషధాలపై వాణిజ్య మార్జిన్లను రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఔషధాల విభాగానికి చెందిన జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్పీపీఏ) హేతుబద్ధీకరించింది. అధిక వాణిజ్య మార్జిన్లను నియంత్రించడం, క్యాన్సర్‌ చికిత్సను మరింత అందుబాటులోకి తేవడం, క్యాన్సర్‌ ఔషధాలు రోగులకు సులభంగా లభించేలా చూడటం ఈ చర్య ప్రధాన లక్ష్యాలు. ప్రస్తుత ధరల నిర్మాణాన్ని బట్టి ఎంపిక చేసిన షెడ్యూల్‌ పరిధిలో లేని క్యాన్సర్‌ ఔషధాల గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్పీ) 70 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని ఈ చర్య ద్వారా అంచనా వేస్తున్నారు.

ఎన్‌పీపీఏ 2019లో ప్రయోగాత్మకంగా చేపట్టిన వాణిజ్య మార్జిన్ల హేతుబద్ధీకరణ కార్యక్రమం విజయవంతమైన నేపథ్యంలో ప్రస్తుత చర్యలు చేపట్టారు. అప్పట్లో 42 క్యాన్సర్‌ ఔషధాలపై వాణిజ్య మార్జిన్లను 30 శాతానికి పరిమితం చేశారు. ఈ చర్యతో షెడ్యూల్‌ పరిధిలో లేని క్యాన్సర్‌ మందులకు చెందిన 526 బ్రాండ్ల గరిష్ఠ చిల్లర ధరలు 90 శాతం వరకు తగ్గాయి. ప్రస్తుతం చేపట్టిన కార్యక్రమంలో ఈ విధానాన్ని మరిన్ని క్యాన్సర్‌ ఔషధాలకు విస్తరించారు. ఆరోగ్య సేవల డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీహెచ్ఎస్) పరిధిలోని నిపుణుల కమిటీ సిఫారసు చేసిన జాబితా ఆధారంగా ఈ ఔషధాలను ఎంపిక చేశారు.

ఈ నిపుణుల కమిటీలో ప్రముఖ క్యాన్సర్‌ వైద్యులు, ఇతర వైద్య నిపుణులు, దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు సభ్యులుగా ఉన్నారు. సమగ్రంగా చర్చించిన అనంతరం, వాణిజ్య మార్జిన్ల హేతుబద్ధీకరణ పరిధిలోకి తీసుకురావాల్సిన 137 ఔషధాలను కమిటీ సిఫారసు చేసింది. ఈ జాబితాను ఎప్పటికప్పుడు నవీకరిస్తారు. కమిటీ సిఫారసు చేసిన ఔషధాలను పరిశీలించిన అనంతరం, ఔషధ ధరల నియంత్రణ ఉత్తర్వు, 2013లోని పేరా 19 ప్రకారం గరిష్ఠ చిల్లర ధరపై వాణిజ్య మార్జిన్‌ను 30 శాతానికి ఎన్‌పీపీఏ పరిమితం చేసింది.2026 అక్టోబర్‌ 17న జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ https://nppa.gov.in/en  ⁠లో అందుబాటులో ఉంచారు. క్యాన్సర్‌ చికిత్సకు అధిక వ్యయం కావడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులు, వారి కుటుంబాలకు ఈ చర్య ఎంతో ఊరటనిస్తుందని భావిస్తున్నారు.

గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రచురించిన ఏడు రోజుల్లోగా తయారీదారులందరూ సవరించిన ధరల వివరాలను జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థకు తెలియజేయాలి. సవరించిన ధరలు 2026 నవంబర్‌ 9 నుంచి అమల్లోకి వస్తాయి. తయారీదారులు తమ వెబ్‌సైట్లలో సవరించిన ధరల జాబితాలను ప్రదర్శించడంతో పాటు, వాటిని ఔషధ విక్రేతలు, ఆసుపత్రులన్నింటికీ విస్తృతంగా చేరవేయాలి. నవంబర్‌ 9, 2026 నుంచి ఔషధ విక్రేతలు, ఆసుపత్రులు తగ్గించిన ధరలకే మందులను విక్రయించాలి. తమ ఫార్మసీల్లోనూ సవరించిన ధరల జాబితాలను ప్రదర్శించాలి. ఆసుపత్రులు కూడా తమ వెబ్‌సైట్లలో సవరించిన ఔషధ ధరలను స్పష్టంగా ప్రదర్శించాలి. వినియోగదారులు మందుల తాజా ధరలను తెలుసుకునేందుకు ‘ఫార్మా సహీ దామ్‌’ యాప్‌, జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ను ఉపయోగించుకోవచ్చు. 

క్యాన్సర్‌ నిరోధక ఔషధాలు గణనీయమైన పరిమాణంలో నేరుగా ఆసుపత్రులు, వైద్య సంస్థలకు సరఫరా జరుగుతున్నందున అమలు తేదీ నుంచి ఆ మందులను సవరించిన ధరలకే అందించే బాధ్యత ఆయా సంస్థలపై ఉంటుంది. తయారీదారులు, పంపిణీదారులు, రిటైలర్లు సహా ఔషధ విక్రేతలు, ఆసుపత్రులు, వైద్య సంస్థలు నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా రాష్ట్ర ఔషధ నియంత్రణ అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటారు.

క్యాన్సర్‌ ఔషధాల పంపిణీ, రిటైల్‌ విక్రయాల్లో అధిక వాణిజ్య మార్జిన్లను నియంత్రించడం, తయారీదారులకు న్యాయబద్ధమైన ఆదాయం లభించేలా చూడటం, కృత్రిమంగా మందుల కొరత సృష్టించకుండా నిరోధించడం ఈ హేతుబద్ధీకరణ చర్య ప్రధాన లక్ష్యాలు. రోగులకు సకాలంలో, నిరంతరాయంగా మందులు అందుబాటులో ఉండేలా నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఔషధాల ప్రస్తుత ఉత్పత్తి, సరఫరా స్థాయులను కొనసాగించాలని ఔషధ తయారీ సంస్థలను ప్రభుత్వం ఆదేశించనుంది.

క్యాన్సర్‌ ఔషధాలను మరింత తక్కువ ధరకు, సులభంగా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా రోగులు, వారి కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుంది. క్యాన్సర్‌ చికిత్స అందరికీ సమానంగా అందుబాటులో ఉండాలనే విస్తృత ప్రజారోగ్య లక్ష్యానికి కూడా తోడ్పడుతుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2324787) సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Urdu , Marathi , हिन्दी , Tamil , English