యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
జామ్సాహెబ్ స్మారక యువజన మార్పిడి కార్యక్రమం రెండో సంచిక.. విజయవంతంగా పూర్తి చేసిన పోలిష్ యువ ప్రతినిధి వర్గం
నాడు పోస్టు చేయడమైనది:
16 OCT 2026 12:24PM by PIB Hyderabad
జామ్సాహెబ్ స్మారక యువజన మార్పిడి కార్యక్రమం రెండో సంచికను ఈ నెల 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నిర్వహించారు. 19 మంది సభ్యులతో కూడిన పోలిష్ యువజన ప్రతినిధి వర్గం గుజరాత్ను, మహారాష్ట్రను, న్యూ ఢిల్లీని సందర్శించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి చరిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన స్థలాలను చూడడం, సాంస్కృతిక కార్యకలాపాల్లో పాలుపంచుకోవడం, భారతదేశ విజ్ఞానశాస్త్ర పరమైన, ఆర్థికశాస్త్ర పరమైన, సాంస్కృతిక పరమైన అభివృద్ధిని చాటే సంస్థలను సందర్శించడంతో పాటు, భారతీయ సీనియర్ నేతలతో మాటామంతీ జరిపారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 ఆగస్టులో పోలెండుకు అధికార పర్యటనకు వెళ్లిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని గురించి ప్రకటించారు. భారత్-పోలెండ్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించిన పంచవర్ష ప్రణాళికను 2024-2028 సంవత్సరాల మధ్య అమలు చేయాలని సంకల్పించి, అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. పోలెండ్ యువత ఏటా భారతదేశానికి వచ్చి భారత చరిత్ర, సంస్కృతి, సంస్థలు, సమకాలీన అభివృద్ధిని తెలుసుకోవడానికి ఒక అవకాశాన్ని ఈ కార్యక్రమం అందిస్తుంది.
గుజరాత్లోని జామ్నగర్లో బాలాచడీ పోలిష్ బాలల శిబిర స్మారక కట్టడాన్ని సందర్శించడం ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మహారాజా జామ్సాహెబ్ దిగ్విజయ్సింగ్జీ రంజిత్సింగ్జీ జడేజా మానవీయ దృక్పథంతో అందించిన తోడ్పాటును ఈ కట్టడం గుర్తుకు తెస్తుంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో, యుద్ధం వల్ల చెల్లాచెదురు అయిన పోలిష్ బాలలకు మహారాజా ఆశ్రయాన్ని కల్పించి, విద్యాబుద్ధులను నేర్పించడంతో పాటు చికిత్సాపూర్వక సహాయాన్ని కూడా అందించారు. ఆయన చూపిన కరుణ ‘దోబ్రీ మహారాజా’ (మనసున్న మారాజు) అనే చిరకాల గుర్తింపును ఆయనకు తెచ్చిపెట్టింది. ఈ యాత్రతో ఉమ్మడి చరిత్రతో ముడిపడిన ఈ అసాధారణ అధ్యాయంతో పాటు రెండు దేశాల మధ్య ఉన్న ప్రగాఢ సంబంధాలను గురించి తెలుసుకునే అవకాశం ప్రతినిధి వర్గానికి కలిగింది.
ప్రతినిధి వర్గం దీని తరువాత మహారాష్ట్రలోని కొల్హాపూర్లో వాలివాడే పోలిష్ శరణార్థి శిబిర స్మారకాన్ని కూడా సందర్శించింది. ఈ స్మారకం రెండో ప్రపంచ యుద్ధ కాలంలోనూ, ఆ తర్వాత వేలాది పోలిష్ శరణార్థులకు ఆశ్రయాన్ని కల్పించింది.

కష్ట కాలంలో పోలెండు జాతీయులకు భారత్ మానవతాపూర్వక మద్దతును అందించిన విషయాన్ని బాలాచడీ, వాలివాడే సందర్శనలు స్పష్టం చేశాయి. ఈ సందర్శనలు భారత్, పోలెండ్ మైత్రితో పెనవేసుకున్న చారిత్రక పునాదులను బలోపేతం చేశాయి.

న్యూఢిల్లీలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పోలిష్ యువ ప్రతినిధి వర్గానికి రాత్రి భోజన కార్యక్రమంతో పాటు, అదే సందర్భంగా చర్చా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న యువజనులు మంత్రితో సంభాషించి, తమ ఆలోచనలను వెల్లడించారు. వారు యువత అభివృద్ధి, యువజన భాగస్వామ్యం అంశాలలో భారత్ దృష్టికోణాన్ని అర్థం చేసుకొనేందుకు ప్రయత్నించారు. భారత్, పోలెండ్ మధ్య అవగాహనను, సంబంధాలను బలపరుచుకోవడానికి ప్రజల మధ్య పరస్పర సంబంధాలు ప్రధాన పాత్రను పోషిస్తాయని ఈ మాటామంతీ కార్యక్రమం చాటింది.
వారం రోజుల పాటు కొనసాగిన ఈ కార్యక్రమంలో భారతదేశ సంపన్న చరిత్ర, సాంస్కృతిక వారసత్వాలను గురించి తెలుసుకొనే అవకాశం లభించినందుకు ప్రతినిధి వర్గం కృతజ్ఞతలు తెలిపింది. జామ్సాహెబ్, వాలివాడే శిబిర స్మారకాలు, గాంధీనగర్లోని దండి కుటీరం, పోర్బందర్లోని కీర్తి మందిరాల సందర్శన యువతకు ఎప్పటికీ గుర్తుంచుకోదగిన అనుభూతులను పంచింది. ఆప్యాయతభరిత ఆతిథ్యాన్ని అందించినందుకు ప్రతినిధి వర్గం సభ్యులు ప్రశంసలు కురిపించారు. ఈ యాత్ర ఎన్నో గొప్ప అనుభూతులను అందించిందని, దీంతో భారత్ పట్ల తమకున్న అవగాహన పెంపొందిందని, దేశంతో తమ అనుబంధం బలోపేతం అయిందని వారు అన్నారు.

కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్తో భేటీ అయ్యే అవకాశం కూడా ప్రతినిధి వర్గానికి లభించింది. భారత్-పోలెండ్ సంబంధాలతో ముడిపడిన అంశాలు, ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టపరుచుకోవడంలో యువ బృందాల రాకపోకలు పోషించగల పాత్రపై ప్రతినిధి వర్గం సభ్యులు మంత్రితో చర్చించారు.

భారత్-పోలెండ్ సంబంధాల పురోగతిలో యువ దౌత్యానికి ఉన్న ప్రాధాన్యానికి అద్దం పడుతూ రెండో సంచికను విజయవంతంగా సమాప్తం చేశారు. ఈ కార్యక్రమం యువతను ఉభయ దేశాల ఉమ్మడి చరిత్రతో, సమకాలీన భారత్తో జోడించి మహారాజా జామ్సాహెబ్ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవడంతో పాటు, ఇరు దేశాల మధ్య ప్రగాఢ మైత్రిని బలపరచింది.
***
(రిలీజ్ ఐడి: 2324317)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4