ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అనువాదం: 2026 ఆసియా క్రీడల్లో పాల్గొన్న అథ్లెట్లతో ముఖాముఖి సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

నాడు పోస్టు చేయడమైనది: 15 OCT 2026 7:04PM by PIB Hyderabad

 

కేంద్ర క్రీడల శాఖ మంత్రి శ్రీ మన్‌సుఖ్ మాండవీయ గారు, క్రీడల శాఖ సహాయ మంత్రి సోదరి రక్షా ఖడ్సే గారు, యువ అథ్లెట్లు, కోచ్‌లు, ఇతర ప్రముఖ అతిథులు, మహిళలు, సజ్జనులారా.. 

మీ అందరి మధ్యకు రావడం నాలో కూడా నూతన ఉత్సాహాన్ని, శక్తిని నింపుతోంది. ఇంతమంది పతక విజేతలు ఒకే చోట చేరడం, వారందరినీ ఒకేసారి కలవడం సాధారణ విషయం కాదు. ఇది ఎంతో సంతోషకరమైన అనుభూతి. యువ అథ్లెట్లయిన మీరంతా.. పట్టుదల విజయంగా మారినప్పుడు అది పతకాలను మాత్రమే కాకుండా ముఖాల్లో కాంతిని కూడా ఎలా తీసుకువస్తుందో చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనాలు. అది నిస్సందేహంగా దేశాన్ని కూడా ప్రకాశింపజేస్తుంది.

మిత్రులారా, 

మీరు 140 కోట్ల మంది దేశవాసులకు గర్వపడే అవకాశాన్ని అందించారు. ఎందుకంటే ఒక గొప్ప విజయం అనేది ఏదైనా ఉందంటే.. అది త్రివర్ణ పతాకం గౌరవాన్ని మరింత పెంపొందించడమే. మీరు త్రివర్ణ పతాక ప్రతీకను ఉన్నత శిఖరాలకు చేర్చి దాని కీర్తిప్రతిష్టలను పెంచారు. కాబట్టి మీ విజయం కేవలం మీది మాత్రమే కాదు… ఇది ఈ దేశంలోని కోట్లాది మంది విజయం. భారతీయులందరి తరఫున మీ అందరికీ నేను మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అదే విధంగా మీ కోచ్‌లకు, మీ సహాయ సిబ్బందికి, మీ కుటుంబ సభ్యులకు కూడా నా హృదయపూర్వక అభినందనలు అందజేస్తున్నాను.

మిత్రులారా, 

నేడు మన మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి కూడా. ఆయన మహోన్నత జీవితం, దూరదృష్టిగల ఆలోచనలు మనందరికీ ఎల్లప్పుడూ ఎంతో స్ఫూర్తిదాయకం. నేను కూడా ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను.

మిత్రులారా, 

అనేక రకాలుగా ఈ ఆసియా క్రీడలు మనకు చిరస్మరణీయంగా నిలిచాయి. మన పురుషుల, మహిళల హాకీ జట్లు రెండూ నేడు ఇక్కడ ఉన్నాయి. ఈ సారి ఇరు జట్లూ స్వర్ణ పతకాలను సాధించాయి. ప్రత్యేకించి మన మహిళల హాకీ జట్టు… 44 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ స్వర్ణ పతకాన్ని స్వదేశానికి తీసుకొచ్చింది. క్రికెట్‌లో మన రెండు జట్లూ వరుసగా రెండోసారి పతకాలను గెలుచుకోవడమే కాకుండా తమ సొంత రికార్డును మళ్లీ పునరావృతం చేశాయి. కబడ్డీలో కూడా మన పురుషులు, మహిళల జట్లు రెండూ స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నాయి. అలాగే విలువిద్యలో ఐదు స్వర్ణ పతకాలు లభించాయి. ఐదు పతకాలు లభించిన చోట సర్వేశ్వరుడి దయానుగ్రహం కచ్చితంగా ఉంటుంది. షూటింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శనలు, బాక్సింగ్- రెజ్లింగ్‌లలో ఘన విజయాలు, అథ్లెటిక్స్‌లో నూతన రికార్డులు, ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత వెయిట్‌లిఫ్టింగ్‌లో లభించిన పతకం, 1982 తర్వాత తొలిసారిగా మారథాన్ పోటీలలో లభించిన విజయం.. ఇవన్నీ నిజంగానే మహత్కరమైన ఆనందాన్ని కలిగిస్తున్న విషయాలు.

మిత్రులారా, 

ప్రత్యేకించి మన కుమార్తెలను నేను ఎంతగానో అభినందించాలనుకుంటున్నాను. భారత్ గెలుచుకున్న 85 పతకాల్లో 38 పతకాలను మన మహిళా అథ్లెట్లే సాధించారు. వాటిలో 11 స్వర్ణ పతకాలు కూడా ఉన్నాయి. ఈ పతకాలు కేవలం సంఖ్యలు మాత్రమే కావు.. అవి 'నవ భారత్' శక్తిమంతమైన రూపానికి ప్రతీకలు. ఆసియా క్రీడల చరిత్రలో గతంలో మనకు ఎన్నడూ పతకం లభించని క్రీడల్లో కూడా నేడు భారత్ పతకాలను సాధిస్తోంది. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్, సాఫ్ట్ టెన్నిస్, నిర్దిష్ట సైలింగ్ పోటీల్లో మన క్రీడాకారులు తొలిసారిగా పతకాలు గెలుచుకుని నూతన చరిత్రను లిఖించారు.

మిత్రులారా, 

ఇప్పుడు మనం క్రీడారంగంలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. మనం సాధించాలి.. అవునా? కాదా? మనం ఇంకా మరెన్నో ఘనతలను సాధించాలి.. అవునా? కాదా? నేను మీ ముందు కొన్ని సంకల్పాలను ఉంచాలనుకుంటున్నాను. ‘మనం దీనిని సాధించి తీరుతాం’ అని మీరంతా పూర్తి ఉత్సాహంతో చెప్పాలి. కాబట్టి నా తర్వాత మళ్లీ అనండి:

ప్రతి క్రీడా ప్రాంగణంలోనూ త్రివర్ణ పతాక శోభ.. మనం దీనిని సాధించి తీరుతాం!

ప్రతి క్రీడా ప్రాంగణంలోనూ త్రివర్ణ పతాక శోభ.. మనం దీనిని సాధించి తీరుతాం!

క్రీడారంగంలో భారతదేశపు నూతన గుర్తింపు.. మనం దీనిని సాధించి తీరుతాం!

ప్రతి క్రీడలోనూ సరికొత్త విజేతలు.. మనం దీనిని సాధించి తీరుతాం!

మన పేరిట మరిన్ని సరికొత్త రికార్డులు.. మనం దీనిని సాధించి తీరుతాం!

మిత్రులారా, 

మనం నేడు సమావేశమైన ఈ స్టేడియానికి మేజర్ ధ్యాన్‌చంద్ పేరు ఉంది. హాకీ పట్ల ఆయనకున్న అంకితభావం ఎంత గొప్పదంటే.. ఆయన రాత్రి వేళల్లో సైతం గంటల తరబడి సాధన చేసేవారు. ఆయన చేసిన ఈ కఠిన శ్రమ.. సంకల్పాలు, కలలు ఒక్క రోజులో నెరవేరవనే విషయాన్ని మనకు పదే పదే గుర్తుచేస్తుంది. వాటి సాకారానికి ఏళ్ల తరబడి నిరంతర ఓపిక, సడలని కృషి అవసరం.

మిత్రులారా, 

గత 12 ఏళ్లుగా భారత్ కూడా తన క్రీడాకారుల పట్ల, దేశీయ క్రీడా వ్యవస్థ పట్ల ఎంతో ఓపికతో, అంకితభావంతో పనిచేసింది. ప్రధాన అంతర్జాతీయ టోర్నమెంట్లలో భారత్ కొన్ని పతకాలను మాత్రమే గెలిచే పరిస్థితి ఒకప్పుడు ఉండేది. అనేక క్రీడలకు సంబంధించి.. అసలు అటువంటి క్రీడలు ఉనికిలో ఉన్నాయనే విషయమే దేశంలో చాలామందికి తెలియదు. ఒలింపిక్స్ వంటి అతిపెద్ద క్రీడోత్సవాలు జరిగేవి కానీ సగానికి పైగా క్రీడాంశాల్లో భారత్‌కు ప్రాతినిధ్యమే ఉండేది కాదు. ఒక్కసారి ఆలోచించండి.. అసలు మనం పోటీలోనే లేనప్పుడు పతకాలు ఎక్కడి నుంచి వస్తాయి?

మిత్రులారా, 

మేం ఈ నిరాశాజనక మనస్తత్వాన్ని తుడిచిపెట్టాలని సంకల్పించాం. దానికి ఫలితంగానే నేడు ప్రతి అంతర్జాతీయ వేదికపైనా మన ప్రాతినిధ్యం నిరంతరం పెరుగుతోంది.

మిత్రులారా, 

ఈ మార్పు ఎలా సాధ్యమైంది? మీరు విజయాన్ని సాధించడంలో మీకు తోడ్పడిన అదే స్ఫూర్తి ద్వారా ఇది సాధ్యమైంది. గత 10–12 సంవత్సరాలుగా దేశం అంకితభావం, నిజాయితీతో నిరంతరం శ్రమించింది.. దీర్ఘకాలిక ఆలోచనలతో ముందుకు సాగింది.. క్రీడల కోసం పారదర్శకమైన, ఆధునిక వ్యవస్థను నిర్మించింది. మీ అందరికీ తెలిసినట్లుగానే మనం 'టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకాన్ని' (టాప్స్) ప్రారంభించాం.. 'ఖేలో ఇండియా' పథకాన్ని ప్రారంభించాం. కాలక్రమేణా దాని పరిధిని మరింత విస్తరించాం. మన్‌సుఖ్ భాయ్ ఇంతకుముందు పేర్కొన్నట్లుగా ఖేలో ఇండియాను విస్తరించడానికి, క్రీడా సమాఖ్యలను బలపరచడానికి రూ. 36,000 కోట్లకు పైగా నిధులను కేటాయించాం. 

మిత్రులారా, 

నేడు దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా 'ఖేలో ఇండియా కేంద్రాలు' ఏర్పాటయ్యాయి. స్టేడియంలు, మినీ-స్టేడియంలు, బహుళావసరాల క్రీడా హాళ్లు నిర్మాణమయ్యాయి. అథ్లెటిక్స్ ట్రాక్‌లు, ఫుట్‌బాల్ మైదానాలు, హాకీ మైదానాలు, ఈతకొలనులు వంటి వేలాది క్రీడా మౌలిక సదుపాయాలు చిన్న, పెద్ద నగరాలు రెండింటిలోనూ ఏర్పాటవుతున్నాయి. ఈ పథకం కింద అథ్లెట్లకు నేరుగా ఆర్థిక సహాయం కూడా అందుతోంది. వారికి 'అవుట్-ఆఫ్-పాకెట్ అలవెన్సెలు’ ఇస్తున్నాం. టాప్స్ పథకం కింద అథ్లెట్లు నెలకు రూ. 50,000 పొందుతున్నారు. ఏదైనా క్రీడకు విదేశాల్లో శిక్షణ అవసరమైతే ప్రభుత్వం దానికి పూర్తి వెసులుబాటు కల్పిస్తూ ఆర్థిక సాయం అందిస్తోంది.

మిత్రులారా, 

యువతకు ఆటలాడేందుకు, పోటీ పడేందుకు గరిష్ఠ అవకాశాలు లభించేలా చూసేందుకు... శీతాకాల క్రీడలు వంటి పోటీలను ప్రారంభించడంతో పాటు పార్లమెంటు సభ్యుల క్రీడా పోటీలను కూడా మొదలుపెట్టాం. దేశం ఒక నూతన క్రీడా విధానాన్ని, నూతన 'ఖేలో భారత్' విధానాన్ని రూపొందించింది. మన పారా-అథ్లెట్లు కూడా తమ ప్రతిభ, సామర్థ్యాలతో దేశ కీర్తిప్రతిష్టలను ఇనుమడింపజేస్తున్నారు. వారికోసం కూడా మెరుగైన అవకాశాలు, ఆధునిక క్రీడా సౌకర్యాలు వస్తున్నాయి. అందుకే నేడు ప్రతి అథ్లెట్ కూడా... దేశం తన ప్రయాణమంతటా తనకు అండగా నిలుస్తుందనే పూర్తి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఒక అథ్లెట్‌కు ఆ రకమైన మద్దతు లభించినప్పుడు వారు దేశం కోసం సాధించగల అద్భుతాలు ఏంటో మీరందరూ స్వయంగా అందుకు అత్యుత్తమ ఉదాహరణలుగా నిలుస్తున్నారు.

 మిత్రులారా,

 

ఈసారి ఆసియా క్రీడల్లో భారత జట్టులోని అనేక మంది క్రీడాకారుల వయసు కేవలం 15 నుంచి 17 సంవత్సరాలే. ఇంత చిన్న వయసులోనే వారు అద్భుతమైన ప్రదర్శనలతో దేశ గౌరవాన్ని పెంచారు. దేశ ప్రజల మనసులను గెలుచుకున్నారు. విజయం సాధించడానికి వయసు అడ్డంకి కాదని ఇది నిరూపిస్తోంది. వాస్తవానికీ చిన్న వయసుసులోనే క్రీడలను ప్రారంభించడం అదనపు ప్రయోజనాన్ని ఇస్తుంది. అందుకే చిన్న వయసు నుంచే క్రీడా ప్రతిభను గుర్తించేందుకు మనం ప్రయత్నిస్తున్నాం. అయిదు నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల్లో ప్రతిభను గుర్తించి, వారికి తగిన శిక్షణ అందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. రాబోయే సంవత్సరాల్లో ఖేలో ఇండియా, ఎమర్జింగ్ ఖేలో ఇండియా కార్యక్రమాల ద్వారా వేలాది మంది కొత్త క్రీడాకారులకు అవకాశాలు లభిస్తాయి. భవిష్యత్తులో జరిగే క్రీడా పోటీల కోసం మన సన్నద్ధతను మరింత బలోపేతం చేసుకోవాలి. 2028లో లాస్‌ ఏంజెల్స్‌ ఒలింపిక్స్‌ జరగనున్నాయి. 2030లో భారత్‌ కామన్వెల్త్‌ క్రీడలకు ఆతిథ్యమివ్వనుంది. 2036లో ఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వాలన్నది కూడా భారత్‌ ఆకాంక్ష. ఈ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని, ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో ప్రతిభాన్వేషణ కార్యక్రమాన్ని ప్రారంభించడం గురించి ప్రస్తావించాను. నేడు దేశవ్యాప్తంగా గ్రామాల్లో క్రీడా ప్రతిభను గుర్తించి, ప్రోత్సహిస్తున్నారు. రాబోయే సంవత్సరాల్లో వీరే భారత్‌కు పతకాలు సాధించి తీసుకొస్తారు.

 

మిత్రులారా, 

మన కలలు పెద్దవి. మన సంకల్పాలు కూడా గొప్పవి. వాటిని సాకారం చేసుకోగలమనే విశ్వాసం నేడు భారత్‌కు ఉంది. ప్రతి భారతీయుడిలోనూ ఆ నమ్మకం ఉంది. అందుకే పూర్తి విశ్వాసంతో నేను చెబుతున్నాను:

 

భారత్‌లో ప్రధాన క్రీడా పోటీలు నిర్వహించడం-మనం సాధిస్తాం.

 

భారత్‌లో ప్రధాన క్రీడా పోటీలు నిర్వహించడం-మనం సాధిస్తాం.

 

భారత్‌లో ప్రధాన క్రీడా పోటీలు నిర్వహించడం-మనం సాధిస్తాం

 

ప్రపంచంలోని అగ్రశ్రేణి క్రీడా దేశాల్లో భారత్‌ నిలవడం-మనం సాధిస్తాం

 

ప్రపంచ క్రీడా కేంద్రంగా భారత్‌ ఎదగడం-మనం సాధిస్తాం.

 

భారత్‌లో ప్రపంచస్థాయి క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం-మనం సాధిస్తాం.

 

భారత్‌లోని ప్రతి ప్రాంతం నుంచి ఒక ఛాంపియన్‌ ఎదగడం-మనం సాధిస్తాం.

 

మిత్రులారా, 

ఆసియా క్రీడల్లో మన విజయం భారత్‌లో మారుతున్న ఆలోచనా విధానానికి కూడా ఒక ఉదాహరణ. నేటి యువత ప్రతి ఉన్నత శిఖరాన్ని అధిరోహించాలనే తపనతో ఉందని ఇది చూపిస్తోంది. భారత యువత సంకల్పానికి మించిన ఎత్తైన శిఖరం లేదు. మన యువశక్తి సామర్థ్యానికి మించిన లక్ష్యం లేదు. అపారమైన అవకాశాల ఆకాశం మన ముందు విస్తరించి ఉంది. ఆకాశమే హద్దుగా తమ గమ్యాన్ని భారత యువతే నిర్ణయించుకుంటోంది. అందుకే అతి తక్కువ కాలంలోనే భారత్‌ ప్రపంచంలో మూడో అతిపెద్ద అంకుర సంస్థల వ్యవస్థగా ఎదిగింది. మన యువత అంతరిక్ష రంగంలో కంపెనీలను స్థాపిస్తోంది. ఉపగ్రహ సాంకేతికతపై పనిచేస్తోంది. ఇదే యువత రక్షణ రంగంలో నూతన సాంకేతికతలను అభివృద్ధి చేస్తోంది. కృత్రిమ మేధ రంగంలో కొత్త ప్రయోగాలు చేస్తోంది. ఈ మార్పు కేవలం పెద్ద నగరాలకే పరిమితం కాలేదు. మారుమూల ప్రాంతాల్లోని ప్రతిభావంతులకు క్రీడల్లో అవకాశాలు లభిస్తున్నట్లే, అంకుర సంస్థలు, పరిశోధనలు, ఇతర రంగాల్లోనూ చిన్న పట్టణాలు, గ్రామాలకు చెందిన యువత కొత్త ఆలోచనలతో ముందుకు వస్తోంది. ఈ విశ్వాసం వెనుక బలమైన నమ్మకం ఉంది. గత దశాబ్ద కాలంలో దేశం అభివృద్ధి చేసుకున్న వ్యవస్థలు యువతలో పెద్ద కలలు కనగలమనే ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. తమ కలలను సాకారం చేసుకునేందుకు దేశం మొత్తం తన శక్తితో అండగా నిలుస్తుందని వారికి తెలుసు. 

 

మిత్రులారా,  

మన ప్రయత్నాల వల్ల కలిగే ప్రయోజనాలు కేవలం మైదానంలో పోటీపడే క్రీడాకారులకే పరిమితం కావు. క్రీడా శిక్షణ, ఫిజియోథెరపీ, క్రీడా నిర్వహణ, క్రీడా ప్రసారాలు వంటి రంగాల్లో యువతకు కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నాయి. క్రీడలు అభివృద్ధి చెందుతున్న కొద్దీ వాటికి అనుబంధంగా ఉన్న అనేక వృత్తులు కూడా ముందుకు సాగుతున్నాయి. దీనివల్ల యువతకు ఉద్యోగాలు పొందడంతో పాటు సొంతంగా వ్యాపారాలు ప్రారంభించేందుకు కూడా కొత్త మార్గాలు అందుబాటులోకి వచ్చాయి.

 

మిత్రులారా, 

ఈ రోజు మనం ఏ రంగంలో ఉన్నప్పటికీ, మన విజయానికి మనం కష్టపడి పనిచేయాలి. అలాగే తదుపరి తరాన్ని తీర్చిదిద్దే బాధ్యతను కూడా మనం తీసుకోవాలి. ఇప్పుడు మీకు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న అనుభవం ఉంది. అందువల్ల, మీలాగే ముందుకు సాగాలని కలలు కంటున్న పిల్లల కోసం కొంత సమయం కేటాయించాలని మిమ్మల్ని కోరుతున్నాను. మీ కృషి అనే చెమటతో వారి కలలకు నీరందించాలి. అప్పుడే విజయం సాధ్యమవుతుంది. మీకు అవకాశం దొరికినప్పుడల్లా మీ గ్రామం, పట్టణంలోని పిల్లలను కలవండి. వివిధ పాఠశాలలను సందర్శించండి. మీరు తొలిసారిగా క్రీడలు ఆడటం ప్రారంభించిన మైదానాలను తప్పకుండా సందర్శించండి. మీ అనుభవాలు ఆ పిల్లలకు ఎంతో విలువైనవి కావచ్చు. మీరు చెప్పే ఒక్క మాటే ఒక పిల్లవాడికి క్రీడల్లో ముందుకు సాగేందుకు ధైర్యాన్ని ఇవ్వవచ్చు. 

 

మిత్రులారా, 

దేశ యువత క్రీడల విషయంలోనే మీ నుంచి స్ఫూర్తి పొందడం లేదు. ఎందుకంటే క్రీడల పాత్ర మైదానానికే పరిమితం కాదు. క్రీడలు మన జీవితంలో క్రమశిక్షణను నేర్పుతాయి. పడిపోయిన తర్వాత మళ్లీ ఎలా లేవాలో నేర్పుతాయి. ఓటమి తర్వాత కూడా విజయం ఎలా సాధించాలో తెలియజేస్తాయి. ఒక లక్ష్యం కోసం సుదీర్ఘకాలం ఎలా కట్టుబడి ఉండాలో, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనం ఎలా మార్చుకోవాలో క్రీడలు నేర్పుతాయి. ఈ పాఠాలు మన నిత్య జీవితంలో భాగమవుతాయి. క్రీడా స్ఫూర్తి మన జీవితమంతా మనకు తోడుగా నిలుస్తుంది.

 

మిత్రులారా, 

నేను ఎప్పుడూ ఒక మాట చెబుతుంటాను... ఆడేవాడు వికసిస్తాడు. కాబట్టి ఆడుతూ ఉండండి, వికసిస్తూ ఉండండి. రాబోయే పోటీల్లోనూ, భవిష్యత్తులో మీరు చేపట్టే అన్ని ప్రయత్నాల్లోనూ మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఉత్సాహం, మీ ఆత్మవిశ్వాసమే నవ భారతదేశానికి గొప్ప బలం. ఈ విశ్వాసంతో మనం భారత్‌ను మరిన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలి. 

రండి, మరోసారి పూర్తి ఉత్సాహంతో ముందుకు వచ్చి, నాతో కలిసి చెప్పండి.

వికసిత్ భారత్‌-మనం సాధిస్తాం.

2047 నాటికి వికసిత్ భారత్‌-మనం సాధిస్తాం.

మనం సాధిస్తాం.

ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌-మనం సాధిస్తాం.

ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌-మనం సాధిస్తాం.

ఆత్మనిర్భర భారత్‌-మనం సాధిస్తాం.

ఆత్మనిర్భర భారత్‌-మనం సాధిస్తాం. 

ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్‌-మనం సాధిస్తాం.

ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్‌-మనం సాధిస్తాం.

సాంకేతిక రంగంలో భారత్‌ నాయకత్వం-మనం సాధిస్తాం.

అంతరిక్ష రంగంలో ముందడుగు-మనం సాధిస్తాం.

ఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వడం-మనం సాధిస్తాం.

కొత్త క్రీడల్లో పతకాలు సాధించడం-మనం సాధిస్తాం.

అవును, మనం సాధిస్తాం.

మీ అందరికీ అనేక అభినందనలు.

మీకు హృదయపూర్వక  ధన్యవాదాలు.

 

 

(రిలీజ్ ఐడి: 2324306) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Malayalam , Kannada , Assamese , English , Urdu , हिन्दी , Bengali , Punjabi , Gujarati