వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఏపీఈడీఏ సహకారంతో తమిళనాడు నుంచి బల్గేరియాకు 1.755 మెట్రిక్ టన్నుల సేంద్రీయ తాటి బెల్లం పొడి ఎగుమతి
బల్గేరియా మార్కెట్లోకి ప్రవేశించిన దేశపు సంప్రదాయ తాటి బెల్లం పొడి
నాడు పోస్టు చేయడమైనది:
16 OCT 2026 12:06PM by PIB Hyderabad
వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ (ఏపీఈడీఏ) సహకారంతో తమిళనాడు ఈరోడ్ జిల్లాలో గల గోబిచెట్టిపాళయంలో తయారైన 1.755 మెట్రిక్ టన్నుల సేంద్రియ తాటి బెల్లం పొడి (పాల్మైరా బ్లాసమ్ నెక్టార్) బల్గేరియాలోని వార్నాకు తొలి ఎగుమతి ప్రారంభమైంది. భారత సేంద్రియ ఉత్పత్తుల జాతీయ కార్యక్రమం (ఎన్పీఓపీ), యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి ధ్రువీకరణలు లభించిన ఈ తాటి బెల్లం సరుకు ఎగుమతిని 2026 అక్టోబర్ 15న ప్రారంభించారు.
ఈ ఎగుమతి ద్వారా భారతీయ సంప్రదాయ తాటి ఆధారిత ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు పరిచయం చేయడంతో పాటు, దేశ సేంద్రియ ఉత్పత్తుల ఎగుమతుల పరిధిని విస్తరించే దిశగా కీలక ముందడుగు పడింది.
ఈ సరుకును ఈరోడ్కు చెందిన వెల్బీయింగ్ ఫుడ్స్ సంస్థ, చెన్నైకి చెందిన చెట్టి ఎక్స్పోర్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ సహకారంతో తయారు చేసి ఎగుమతి చేస్తున్నాయి. ఈ సరుకును చెన్నై నౌకాశ్రయం నుంచి సముద్ర మార్గంలో రవాణా చేయనున్నారు. బల్గేరియాకు చెందిన సౌ లైఫ్ లిమిటెడ్ ఈ సరుకును దిగుమతి చేసుకుని పంపిణీ చేయనుంది.
తమిళనాడులో సంప్రదాయ తాటి ఆధారిత ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలను బలోపేతం చేయడం, సేంద్రియ సాగులో నిమగ్నమైన ఉత్పత్తిదారులకు కొత్త అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఈ కార్యక్రమం కింద 137 ఎకరాల్లో సేంద్రియ సాగు చేపడుతున్నారు. మెరుగైన మార్కెట్ అందుబాటు, ఎగుమతులకు అనుగుణమైన సరఫరా వ్యవస్థల ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. దేశీయ మార్కెట్తో పోలిస్తే, రైతులకు లభించే ధర సుమారు 15–22 శాతం మేర, తయారీదారుకు లభించే ధర 17 శాతం అధికంగా ఉన్నట్లు నివేదించారు. దీనివల్ల ఈ కార్యక్రమంలో పాల్గొనే రైతులకు మెరుగైన ఆదాయం పొందే అవకాశం లభించడంతో పాటు, స్థిరమైన జీవనోపాధికి తోడ్పాటు అందుతుంది.
తాటి పువ్వుల మకరందం నుంచి సేకరించిన తేనె వంటి తాటి బెల్లం పొడి సంప్రదాయ భారతీయ తీపి పదార్థం. దీనికి విలువ ఆధారిత ఉత్పత్తులుగా అభివృద్ధి చేసే అవకాశం ఉండటంతో పాటు, అంతర్జాతీయ మార్కెట్లలో విస్తృత ఆదరణ పొందే అవకాశముంది. శుద్ధి చేసిన చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించగల ఈ ఉత్పత్తిలో విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు లభించే అవకాశం ఉంది.
తాటి ఆధారిత ఉత్పత్తులు సంప్రదాయ తయారీ పద్ధతులతో ముడిపడి ఉన్నాయి. తమిళనాడు వ్యవసాయ, సాంస్కృతిక జీవనంలో తాటిచెట్టుకు ఎంతోకాలంగా ప్రత్యేక స్థానం ఉంది. ఈ వనరుతో ఎగుమతులకు అనువైన ఉత్పత్తులను అభివృద్ధి చేయడం ద్వారా మార్కెట్ అవకాశాలను విస్తరించడంతో పాటు, ఉత్పత్తిదారులు, ఈ రంగానికి సంబంధించిన సరఫరా వ్యవస్థకు మద్దతు కల్పించవచ్చు.
ఏపీఈడీఏ ఛైర్మన్ శ్రీ అభిషేక్ దేవ్ ఈ ఎగుమతి సరుకు రవాణాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీఈడీఏ కార్యదర్శి డాక్టర్ సస్వతి బోస్, ఆ సంస్థకు చెందిన ఉన్నతాధికారులు, ఎగుమతి సంస్థల ప్రతినిధులు, అంతర్జాతీయ భాగస్వాములు, ప్రగతిశీల వరి రైతులు, ఎగుమతి సరఫరా వ్యవస్థకు సంబంధించిన ఇతర భాగస్వాములు పాల్గొన్నారు. భారత వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను బలోపేతం చేయడంలో వివిధ వర్గాల మధ్య ఉన్న సహకారాన్ని ఈ కార్యక్రమం ప్రతిబింబించింది.
ధ్రువీకరణ పొందిన సేంద్రియ, విలువ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఏపీఈడీఏ నిరంతరం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా మార్కెట్ అభివృద్ధి, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేయడం, భారతీయ ఉత్పత్తిదారులకు విదేశీ కొనుగోలుదారులతో సంబంధాలు ఏర్పరచడం వంటి అంశాల్లో సహకారం అందిస్తోంది. బల్గేరియాకు సేంద్రియ తాటి బెల్లం పొడిని తొలిసారిగా ఎగుమతి చేయడం ద్వారా మరిన్ని అంతర్జాతీయ మార్కెట్లలోకి ప్రవేశించేందుకు అవకాశాలు ఏర్పడతాయని, ప్రపంచ మార్కెట్లలో భారతదేశ సంప్రదాయ ఉత్పత్తులకు ఆదరణ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2324300)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6