ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో గల వన్యప్రాణుల అభయారణ్యంలో 2.87 హెక్టార్లలో (7.08 ఎకరాల్లో) అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను ధ్వంసం చేసిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ (సీబీఎన్)

నాడు పోస్టు చేయడమైనది: 15 OCT 2026 6:25PM by PIB Hyderabad

మహారాష్ట్రలోని ధూలే జిల్లా షిర్‌పూర్‌లోని జామ్నియాపాని గ్రామానికి సమీపంలో గల వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో పెద్ద విస్తీర్ణంలో గంజాయి అక్రమంగా సాగు చేస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) సమాచారం అందుకుంది. ఈ సమాచారం ఆధారంగా... డీఆర్ఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ (సీబీఎన్) అధికారుల సంయుక్త బృందం... 14.10.2026న మహారాష్ట్రలోని ధూలే జిల్లా షిర్‌పూర్‌లోని జామ్నియాపాని గ్రామానికి సమీపంలో ఉన్న వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి చేరుకుంది.

అభయారణ్యంలోని మారుమూల, దట్టమైన అటవీ ప్రాంతంలో అయిదు వేర్వేరు భూభాగాల్లో మొత్తం 2.87 హెక్టార్ల (7.08 ఎకరాల) విస్తీర్ణంలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్నట్లు అదికారుల బృందం గుర్తించింది. చేరుకోవడం కష్టంగా ఉండే భూభాగం, వన్యప్రాణుల సంచారం ఉండడం, మొబైల్ నెట్‌వర్క్ కనెక్టివిటీ లేకపోవడం వంటి కారణాల వల్ల ఈ ఆపరేషన్ గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంది. అధికారులు పూర్తి అప్రమత్తతతో, అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. చట్టపరమైన లాంఛనాలన్నీ పూర్తి చేసిన తర్వాత... పోలీసు, అటవీ శాఖ అధికారుల సమక్షంలో గంజాయి పంటను పూర్తిగా ధ్వంసం చేశారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

 

డీఆర్ఐ, సీబీఎన్‌ల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అక్రమ గంజాయి సాగు నిర్మూలన కార్యకలాపాలను కొనసాగించనున్నారు. మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారాన్ని ఎదుర్కోవడం... భవిష్యత్తు కోసం మాదకద్రవ్య రహిత, సురక్షితమైన వాతావరణాన్ని పెంపొందించడం పట్ల ఈ సంస్థలు తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2324183) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , Marathi , हिन्दी , Tamil