ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
బహుభాషా ఏఐ, భాషా సాంకేతికతల వినియోగం పెంపునకు ఒప్పందం కుదుర్చుకున్న డిజిటల్ ఇండియా భాషిణి విభాగం, మణిపూర్ ప్రభుత్వం.. ‘భాషిణి రాజ్యం’ వర్క్‌షాప్ నిర్వహణ
భాషా సాంకేతికత, స్థానిక భాషలో సమాచారం, డిజిటల్ మాధ్యమం ద్వారా ప్రజలకు సేవలు అందించడానికి ఉన్న అవకాశాలను పరిశీలించిన భాషిణి రాజ్యం వర్క్‌షాప్ మణిపూర్ చాప్టర్
నాడు పోస్టు చేయడమైనది:
15 OCT 2026 10:47AM by PIB Hyderabad
భాషిణి రాజ్యం వర్క్‌షాప్ మణిపూర్ చాప్టర్ కార్యక్రమాన్ని నిన్న, అంటే 2026 అక్టోబర్ 14న ఇంఫాల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత మంత్రిత్వ శాఖ (ఎమ్ఈఐటీవై)లో ఓ భాగం అయిన డిజిటల్ ఇండియా కార్పొరేషన్ (డీఐసీ)కి చెందిన డిజిటల్ ఇండియా భాషిణి డివిజన్ (డీఐబీడీ) మణిపూర్ ప్రభుత్వ సమాచార సాంకేతికత విభాగం సహకారంతో నిర్వహించింది. ఈ వర్క్‌షాపులో బహుభాషా కృత్రిమ మేధను ప్రోత్సహించడం, భాషా సాంకేతికతను బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వానికి, పౌరులకు డిజిటల్ మాధ్యమం ద్వారా సేవలను అందించే ప్రక్రియలో భారతీయ భాషా అప్లికేషన్లను ఉపయోగించడానికి గల అవకాశాలను పరిశీలించారు.
మణిపూర్ ముఖ్యమంత్రి శ్రీ యుమనమ్ ఖేమ్‌చంద్ సింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రతినిధులు, ఇతర ఆసక్తి దారు వర్గాలు పాలుపంచుకొని, డిజిటల్ సేవలను మరింత సరళంగా ఎక్కువ మంది చెంతకు చేర్చడంలో భాషా సాంకేతికత పోషించదగిన భూమికపై చర్చించారు.

వర్క్‌షాపులో భాగంగా డీఐడీబీ, మణిపూర్ ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందం (ఎమ్ఓయూ)పై సంతకాలు చేశాయి. డీఐబీడీ పక్షాన డీఐబీడీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీ అమితాభ్ నాగ్, మణిపూర్ ప్రభుత్వం పక్షాన సమాచార సాంకేతికత కార్యదర్శి ఐఏఎస్ అధికారి శ్రీ సమర్జీత్ సలామ్ వ్యవహరించారు. భాషా సాంకేతికతలో సహకారాన్ని బలోపేతం చేయడానికి, భాషాపరమైన వనరులను మెరుగుపరచడానికి, రాష్ట్రం అంతటా బహుళభాషల్లో డిజిటల్ సేవలను అందించగల సొల్యూషన్స్‌ను అన్వేషించడానికి ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.

సభను ఉద్దేశించి మణిపూర్ ముఖ్యమంత్రి శ్రీ యుమనమ్ ఖేమ్‌చంద్ సింగ్ ప్రసంగిస్తూ భారతదేశ భాషా వైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి, రాష్ట్రంలోని ప్రజలకు విస్తృత అవకాశాలను అందించడానికి కృత్రిమ మేధ (ఏఐ), భాషా సాంకేతికతకు ఉన్న శక్తిని ప్రస్తావించారు. ‘‘ఏఐ, భాషా సాంకేతికతల ద్వారా మనం భారత్ లోని వివిధ భాషలను ప్రోత్సహిస్తున్నాం. మణిపూర్‌లోని అనేక భాషలను డిజిటల్ రంగంలోకి తీసుకువచ్చేందుకు ఉన్న అవకాశాలను వెదుకుతున్నాం. మన భాషా వైవిధ్యం ఈ దిశగా మనం ముందుకు పోవడంలో విలువైన శక్తిగా ఉపయోగపడుతుంది’’ అని ఆయన అన్నారు.
డిజిటల్ సేవలను వాటిని ఎవరి కోసం రూపొందించారో వారి వద్దకు సులభంగా, సార్థకంగా అందుబాటులోకీ తీసుకుపోవాలని మణిపూర్ ప్రభుత్వ సమాచార సాంకేతికత కార్యదర్శి శ్రీ సమర్జీత్ సలామ్ స్పష్టం చేశారు. ‘‘డిజిటల్ సేవలను ప్రజలు అర్థం చేసుకొని, ఆత్మవిశ్వాసంతో ఉపయోగించుకోగలిగితేనే ఆ సేవల పరమార్థం నెరవేరుతుంది. భాషిణి ద్వారా, మనం భాషాపరమైన అడ్డుగోడలను పడగొట్టగలుగుతాం. దీని కోసం ఎంతో అప్రమత్తంగా పరిశీలించి రూపొందించిన, మణిపూర్త అవసరాలను తీర్చగలిగిన, ప్రజలకు చిరకాల ప్రయోజనాలను అందించగలిగిన సేవలు (సొల్యూషన్స్) మనకు తోడ్పడుతాయి’’ అని ఆయన అన్నారు.

భాషిణికి చెందిన భాషాకేంద్రిత డిజిటల్ సార్వజనిక మౌలిక సదుపాయాలు (డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్.. డీపీఐ), తత్సంబంధిత బహుభాషా ఏఐ విస్తారిత అనుబంధ వ్యవస్థ (ఇకోసిస్టమ్) సమీక్షను వర్క్‌షాపులో ప్రదర్శించారు. వివిధ భాషల్లో డిజిటల్ సేవలను సమకూర్చడంలో భాషా డేటాసెట్లు, ఏఐ నమూనాలు, ఏపీఐలు, అప్లికేషన్ల భూమికను గురించి వివరించారు. సేవల అందజేతను ఇప్పటి స్థాయి కన్న మరింతగా పెంపొందింప చేయడం కోసం ఈ సామర్థ్యాలను ప్రభుత్వ వేదికలను, ప్రజలను దృష్టిలో పెట్టుకొని అందుబాటులో ఉన్న అప్లికేషన్లను ఎలా ఏకీకరించవచ్చో కూడా కార్యక్రమంలో చర్చించారు.
ఇంగ్లిషు నుంచి మణిపురి లోకి వాస్తవ కాలంలో అనువాదం చేయడమెలాగన్నదానిపై ప్రత్యక్ష ప్రదర్శన (లైవ్ డెమో)ను నిర్వహించారు. ఇది భాషా సాంకేతికతకు గల సామర్థ్యాన్ని కళ్లకు కట్టింది. దీంతో కమ్యూనికేషన్లో లోటుపాటులను తొలగించవచ్చని నిరూపించారు. కార్యక్రమంలో.. డిజిటల్ భాషా వనరుల నిర్మాణం, భాషా నిపుణులు, స్థానిక ప్రజల వద్ద నుంచి అందిన సూచనలు సలహాల ఆధారంగా ప్రాసంగిక డేటాను ఉపయోగించి భాషా నమూనాలను ప్రామాణీకరించడానికి గల ప్రాధాన్యాన్ని గురించి కూడా చర్చించారు. దీని వల్ల వాస్తవ జగతిలో వాటిని ఉపయోగించే తీరును మెరుగుపరచడం సాధ్య పడుతుంది.
భారతదేశ వైవిధ్యానికి అద్దం పట్టే భాషా సాంకేతికతలను అభివృద్ధిపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని డీఐబీడీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీ అమితాభ్ నాగ్ అన్నారు. ‘‘భారత్‌లోని అన్ని భాషల తాలూకు వైవిధ్యాన్ని కృత్రిమ మేధ అర్థం చేసుకోగలగాలి. మణిపూర్‌తో చేతులు కలిపి మేం భాషా సాంకేతికతలను బలపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆచరణలో సేవల (అప్లికేషన్స్) పరిధిని విస్తరింప చేయాలనుకుంటున్నాం. డిజిటల్ సేవలను పొందడంలో గాని, లేదా అవకాశాలను అనుసరించడంలో గాని భాష ఒక అడ్డంకిగా నిలవకుండా చూడడమే మా ధ్యేయం’’ అని ఆయన స్పష్టం చేశారు.
ఈ వర్క్‌షాపులో మణిపూర్ భాషా వైవిధ్యంపై చర్చించారు. మణిపురి, తంగ్ఖుల్, థాడౌ, పైతే, హమార్, లియంగ్మాయిలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మాట్లాడుకొనే ఇతర భాషలు ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చాయి. ప్రాంతీయ అవసరాలను తీర్చడంలో, కమ్యూనికేషన్ ఆచారాలను మెరుగైన రీతిన ప్రతిబింబించ గలిగిన భాషా సాంకేతికతలను అభివృద్ధి పరచడంలో మణిపూర్ రాష్ట్ర భాషాజ్ఞానం, స్థానిక ప్రావీణ్యం, స్థానిక సమాజాల భాగస్వామ్యం వాటి వంతు తోడ్పాటును అందించే అవకాశం ఉంది.
పాలనలోనూ, విద్య, ఆరోగ్యసంరక్షణ, చట్ట సేవలు, ఫిర్యాదుల పరిష్కారం సహా పౌర సేవలలోనూ బహుభాషా ఏఐని ఎంతవరకు ఉపయోగించుకోవచ్చో సమావేశాల్లో పరిశీలించారు. లాంగ్వేజ్ ఏఐను నేర్చుకొనేందుకు, ఉపయోగించేందుకు, ప్రయోగాలు చేసేందుకు, సమస్యలను పరిష్కరించేందుకు అవకాశాలను భాషిణి శిల్పి డెవలపర్లకు, విద్యార్థులకు, నూతన ఆవిష్కర్తలకు ఒక అవకాశాన్ని- ఇంటరాక్టివ్ వేదిక ‘భాషిణి శిల్పి’ ద్వారా- అందించారు. తరచుగా నిర్వహిస్తూ ఉండే ఓ సాంప్రదాయిక సాంకేతిక సమావేశంలా దీనిని మిగిలిపోనీయకుండా, వాస్తవ ప్రపంచంలో ఎదురయ్యే సమస్యలను గుర్తెరిగి, ఆలోచనలను పరస్పరం వెల్లడించుకుంటూ, భాషిణికి సంబంధించిన భాషా సాంకేతికతలను, సేవలను, ఏపీఐలను అభివృద్ధిపరిచే, విస్తరించే, కొత్త కొత్త అంశాలను కనుగొనే అవకాశాలను కార్యక్రమంలో పాలుపంచుకున్న వారు అందిపుచ్చుకొనేటట్లు ప్రోత్సహించారు. సేవలను ఏయే అంశాల్లో వినియోగించుకోవచ్చు, అమలుకు సంబంధించి వ్యక్తమైన పలు సందేహాలను నివృత్తి చేయడంపై కార్యక్రమంలో పాల్గొన్న వారి వద్ద నుంచి ప్రశ్నలు రాబట్టి, ఆ ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చారు. లాంగ్వేజ్ డేటాకు తోడ్పాటును అందించడానికి, బహుభాషా ఏఐ వనరులను బలోపేతం చేయడానికి రాష్ట్ర సంస్థలకు, భాషా సముదాయాలకు ఒక మాధ్యమంగా ఉపయోగపడగల ‘భాషిణి మిత్ర’ కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా నిర్వహించారు.
తదుపరి దశలో డీఐబీడీ, మణిపూర్ ప్రభుత్వం కలిసికట్టుగా ప్రాధాన్య ప్రాతిపదికన ఉపయోగించవలసిన వ్యవహారాలను గుర్తించనున్నాయి. భాషా ప్రాధాన్య సమాచార అవసరాలను సమీక్షిస్తాయి కూడా. సందర్భ శుద్ధి కలిగిన ప్రభుత్వ వేదికల్లో భాషిణికి సంబంధించిన భాషా సాంకేతికతలను మేళవించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో అన్వేషిస్తారు. రాష్ట్ర భాషా సంబంధిత వైవిధ్యాన్ని ప్రతిబింబించగలిగు సరి అయిన సేవలను అభివృద్ధి పరచడానికి , ప్రజల సేవా అవసరాలను నెరవేర్చడానికి భాషానిపుణులతో కలిసి పనిచేయడంపైన, అలాగే భాషా వనరులను బలోపేతం చేయడంపైన కూడా ఈ భాగస్వామ్యం దృష్టిని కేంద్రీకరిస్తుంది.
భాషిణికి, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య సహకారాన్ని పటిష్టపరచడం ‘భాషిణి రాజ్యం’ కార్యక్రమ లక్ష్యం. దీంతో భాషా సాంకేతికత సామర్థ్యాలను ఆచరణీయ సేవలుగా మార్పు చేయడంలో సాయం లభించగలదు. ఇదే జరిగితే డిజిటల్ సేవల చెంతకు చేరుకోవడం ప్రస్తుతాని కన్న మెరుగవుతుంది. అంతేకాదు, మరింత మంది భారతదేశ డిజిటల్ విస్తారిత అనుబంధ వ్యవస్థ (ఇకోసిస్టమ్)లో భాగం పంచుకోగలుగుతారు.
డిజిటల్ ఇండియా భాషిణి డివిజన్ (డీఐబీడీ)ని గురించి
కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత మంత్రిత్వ శాఖ (ఎమ్ఈఐటీవై)లో ఓ భాగం అయిన డిజిటల్ ఇండియా కార్పొరేషన్ (డీఐసీ)కి చెందిన డిజిటల్ ఇండియా భాషిణి డివిజన్ (డీఐబీడీ).. డిజిటల్ సేవలు అనేక భాషల్లో అందుబాటులో ఉండేటట్లు చూసే లక్ష్యంతో, దేశంలో లాంగ్వేజ్-ఫస్ట్ డిజిటల్ ప్రాతిపదికతో కూడిన సార్వజనిక మౌలిక సదుపాయాలను అభివృద్ధిపరుస్తున్నది. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సేవలు పలు భాషలలో లభ్యం అయ్యేటట్లు చూసే పనిలో లాంగ్వేజ్ డేటాసెట్స్, ఏఐ నమూనాలు, ఏపీఐలతోపాటు ఇతర సేవలు (అప్లికేషన్స్)ను ఏకతాటిమీదకు తీసుకువచ్చి ప్రభుత్వ విభాగాలు, డెవలపర్లు, పరిశోధకులు, ఇతర ఆసక్తిదారు వర్గాలకు సహాయాన్ని అందిస్తోంది. ఇది 800 కు పైగా ప్రభుత్వ వెబ్సైట్లను నడుపుతోంది. 900 కోట్ల కన్న ఎక్కువ ఏఐ అభిప్రాయాల (ఇన్ఫరెన్సెస్) కు దన్నుగా నిలిచింది. రోజుకు సగటున 2.40 లక్షల ఏఐ ఆధారిత అభిప్రాయాలను అందించగలుగుతున్నది. టెక్స్ట్ విషయంలో 36 భారతీయ భాషలు, స్వరాధారిత ప్రాతిపదికన 23 భారతీయ భాషలతో పాటు 35 అంతర్జాతీయ భాషలకు భాషిణి దన్నుగా నిలబడుతోంది. మొత్తంమీద భారత డిజిటల్ విస్తారిత అనుబంధ వ్యవస్థ అంతటా భాషా సంబంధిత సాంకేతికతను అనుసరించడాన్ని డీఐబీడీ వేగవంతం చేస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2323750)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12