ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్ వ్యూహాత్మక పునర్వ్వస్థీకరణకు సంబంధించి సందేహాలు - సమాధానాలు

నాడు పోస్టు చేయడమైనది: 14 OCT 2026 4:51PM by PIB Hyderabad

ప్రశ్న 1: ఐడీబీఐ బ్యాంకు లిమిటెడ్‌కు వ్యూహాత్మక కొనుగోలుదారు ఎవరు?

సమాధానం: ఐడీబీఐ బ్యాంకు లిమిటెడ్‌కు వ్యూహాత్మక కొనుగోలుదారుగా ఎం/ఎస్ 10955230 కెనడా ఇంక్. (మాతృ సంస్థ: ఎం/ఎస్  ఫెయిర్ ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ లిమిటెడ్) కు ఆమోదం లభించింది.

ప్రశ్న 2: ఈ లావాదేవీ విలువ ఎంత?

సమాధానం: ఈ లావాదేవీ కొనుగోలు విలువ రూ. 52,878.0806181 కోట్లు (అక్షరాలా యాభై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది కోట్ల ఎనిమిది లక్షల ఆరు వేల నూట ఎనభై ఒక్క రూపాయిలు మాత్రమే).

ప్రశ్న 3: ఈ లావాదేవీ ద్వారా వచ్చే మొత్తాన్ని భారత ప్రభుత్వం, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మధ్య ఎలా విభజిస్తారు?

సమాధానం: ఈ లావాదేవీ ద్వారా ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్ మొత్తం వాటాలలో 60.72 శాతం వాటాను విక్రయిస్తున్నారు. ఇందులో భారత ప్రభుత్వానికి చెందిన 30.48 శాతం వాటా, ఎల్ఐసీకి చెందిన 30.24 శాతం వాటా ఉన్నాయి. దీని ద్వారా వచ్చే విక్రయ నిధులు కూడా ఇదే నిష్పత్తిలో పంచుతారు 

ప్రశ్న 4: బిడ్డింగ్ ప్రక్రియలో ఎన్ని సంస్థలు పాల్గొన్నాయి?

సమాధానం: తొలుత ఐదు సంస్థలు ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు సమర్పించాయి. ప్రాథమిక సమాచార నివేదికలో నిర్దేశించిన అర్హత ప్రమాణాలు, అనర్హత నిబంధనల ప్రకారం వీటిలో నాలుగు సంస్థలు అర్హత సాధించాయి. చివరికి వీటిలో రెండు సంస్థలు సాంకేతిక, ఆర్థిక బిడ్లను సమర్పించి, ఈ లావాదేవీకి అర్హత కలిగిన బిడ్డర్లుగా నిలిచాయి.

ప్రశ్న 5: ఐడీబీఐ బ్యాంకు లిమిటెడ్‌ విలువను నిర్ధారించేందుకు ఏ పద్ధతులను ఉపయోగించారు?

సమాధానం: సంస్థ సక్రమ విలువను నిర్ధారించేందుకు రెండు ప్రత్యామ్నాయ పద్ధతులను ఉపయోగించారు. అవి మార్కెట్ మల్టిపుల్ పద్ధతి, ఆస్తుల విలువ నిర్ధారణ పద్ధతి.

ప్రశ్న 6: విలువ నిర్ధారణ ప్రక్రియను ఎవరు నిర్వహించారు?

సమాధానం: ఈ సంస్థ విలువ నిర్ధారణ ప్రక్రియను ప్రత్యేకంగా నియమించిన ఇద్దరు స్వతంత్ర వృత్తిపరమైన విలువ నిర్ధారణ సంస్థలు నిర్వహించాయి. ఈ ప్రక్రియలో భాగంగా అమల్లో ఉన్న గోప్యతా హామీల కారణంగా ఆ సంస్థల పేర్లను వెల్లడించడం సాధ్యం కాదు.

ప్రశ్న 7: ఐడీబీఐ బ్యాంకు విలువ నిర్ధారణలో స్టాక్ మార్కెట్ ధర ఎలాంటి పాత్ర పోషించింది?

సమాధానం: పరిమితంగా ట్రేడయ్యే ఐడీబీఐ బ్యాంకు షేర్ల ధరల్లో తీవ్ర ఒడిదుడుకులు నమోదయ్యాయి. విలువ నిర్ధారణ కాలంలో షేరు ధర రూ.61.01 నుంచి రూ.118.38 మధ్య హెచ్చుతగ్గులకు లోనైంది. ఈ ధరలు బిడ్‌ ఆఫర్‌ ధర కంటే కొన్నిసార్లు ఎక్కువగా, మరికొన్నిసార్లు తక్కువగా నమోదయ్యాయి. స్టాక్‌ మార్కెట్‌ ధరలు సంస్థ అంతర్గత విలువకు అనుగుణంగా లేకపోయే అవకాశం ఉన్నందున, వాటిని విలువ నిర్ధారణలో పరిగణనలోకి తీసుకోలేదు. వాటికి బదులుగా, ఈ సమస్యను అధిగమించే మార్కెట్‌ మల్టిపుల్‌ పద్ధతి ద్వారా సంస్థ మార్కెట్‌ విలువను నిర్ధారించారు. 2026 మార్చి 31 నాటి ముగింపు ఖాతాల ఆధారంగా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల విలువలను పోల్చి ఈ నిర్ధారణ చేశారు.

ప్రశ్న 8: ఐడీబీఐ బ్యాంకు భూములు, భవనాలు సహా ఇతర ఆస్తుల విలువను ఎలా నిర్ధారించారు?

సమాధానం: ఐడీబీఐ బ్యాంకు 2026 మార్చి 31 నాటి ఆడిట్‌ చేసిన ఖాతాల ఆధారంగా సంస్థ నికర ఆస్తుల సరైన విలువను నిర్ధారించేందుకు ఆస్తుల విలువ నిర్ధారణ పద్ధతిని ఉపయోగించారు. ఇందులో భూములు, భవనాలు సహా స్పష్టమైన ఆస్తులు, అస్పష్టమైన ఆస్తులతో పాటు సంస్థ బాధ్యతలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.

ప్రశ్న 9: ఈ లావాదేవీ కోసం ఉపయోగించిన ప్రామాణిక (బెంచ్‌మార్క్) ధర ఎంత?

సమాధానం: రెండు స్వతంత్ర వాల్యుయేషన్ సంస్థల అంచనాల సగటు ధర (షేరుకు  రూ. 75.99) అర్హత గల బిడ్ల మూల్యాంకనానికి బెంచ్‌మార్క్ ధరగా ఉపయోగపడింది. అర్హత సాధించిన విజేత బిడ్ ధర... బెంచ్‌మార్క్ ధరతో పాటు రెండు స్వతంత్ర వాల్యుయేషన్ సంస్థల ఫెయిర్ వాల్యూ అంచనాల కంటే కూడా ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

ప్రశ్న 10: బెంచ్‌మార్క్ ధరను ఎలా నిర్ణయించారు?

సమాధానం: 'మార్కెట్ మల్టిపుల్ పద్ధతి' ద్వారా నిర్ణయించిన ఫెయిర్ మార్కెట్ విలువ, 'అస్సెట్ వాల్యుయేషన్ పద్ధతి' ద్వారా నిర్ణయించిన ఫెయిర్ నెట్ అస్సెట్ విలువల సగటు ఆధారంగా ఈ బెంచ్‌మార్క్ ధరను ఖరారు చేశారు.

ప్రశ్న 11: తదుపరి అనుసరించాల్సిన కార్యాచరణ ఏమిటి?

సమాధానం: ఆసక్తి వ్యక్తీకరణ దశలో నిర్వహించిన 'ఫిట్ అండ్ ప్రాపర్' మూల్యాంకనానికి అనుగుణంగా విజేత బిడ్డర్ ఇప్పుడు తమ పత్రాలను ఆర్బీఐకి సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాకుండా అందులో పేర్కొన్న నియంత్రణ నిబంధనల అమలుకు సంబంధించిన స్పష్టమైన నివేదికను  కూడా అందజేయాల్సి ఉంటుంది.

ప్రశ్న 12: భారత ప్రభుత్వం, ఎల్ఐసీ వద్ద మిగిలే చివరి ఈక్విటీ వాటా ఎంత?

సమాధానం: ఈ లావాదేవీ తర్వాత భారత ప్రభుత్వం వద్ద 15 శాతం, ఎల్ఐసీ వద్ద 19 శాతం ఈక్విటీ వాటాలు మిగులుతాయి. వీటితో పాటు రెండు సంస్థలు బోర్డు నుంచి తమ నామినీలను ఉపసంహరించుకుని సాధారణ పబ్లిక్ వాటాదారులుగా మారతాయి.

ప్రశ్న 13: ఐడీబీఐ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వం, ఎల్ఐసీ తమ వద్ద మిగిలిన వాటాలను ఎలా విక్రయించనున్నాయి?

సమాధానం: ప్రామాణిక నిర్వహణ పద్ధతి ప్రకారం ఓపెన్ మార్కెట్ ద్వారా ప్రభుత్వానికి చెందిన మిగిలిన వాటాలను విక్రయించేందుకు ప్రత్యామ్నాయ యంత్రాంగానికి ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ అధికారాలు ఇచ్చింది.  ఎల్ఐసీ విషయానికి వస్తే, తన నియంత్రణ సంస్థల మార్గదర్శకాలకు లోబడి, అంతర్గత విధివిధానాల ప్రకారం తన వద్ద ఉన్న మిగిలిన వాటాలను నిర్వహించుకునే పూర్తి స్వేచ్ఛను కలిగి ఉంటుంది.

ప్రశ్న 14: ఈ నిర్ణయం బ్యాంకింగ్ రంగం పైన, మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థపైన ఎలాంటి ప్రభావం చూపుతుంది?

సమాధానం: దేశ బ్యాంకింగ్, ఆర్థిక రంగాలపై ఈ నిర్ణయం గణనీయమైన సానుకూల ప్రభావం చూపనుంది. గతంలో ప్రభుత్వ సహాయంపై ఆధారపడిన ఐడీబీఐ బ్యాంకు  ప్రైవేటీకరణ అనంతరం ప్రభుత్వ ఆర్థిక సాయంపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా నిధులను సమీకరించుకోగలుగుతుంది. వ్యూహాత్మక కొనుగోలుదారు ప్రైవేటు పెట్టుబడులను అందించడంతో పాటు, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టి, మెరుగైన నిర్వహణ విధానాలను అమలు చేస్తారని అంచనా. దీనివల్ల బ్యాంకు వ్యాపార సామర్థ్యం పెరగడంతో పాటు, రుణాల పంపిణీ, డిపాజిట్ల సమీకరణలో పోటీతత్వం మెరుగుపడుతుందని భావిస్తున్నారు.

ప్రశ్న 15: భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత సమయంలో ఈ నిర్ణయం భారత విదేశీ రంగంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

సమాధానం: దేశ ఆర్థిక రంగంలో ఇప్పటివరకు ఇదే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి కానుంది. ఈ లావాదేవీ ఆర్థిక సంస్కరణలకు సానుకూల వాతావరణాన్ని ఏర్పరచడమే కాకుండా దేశవ్యాప్తంగా పెట్టుబడుల వాతావరణాన్ని మెరుగుపరచడానికి ఎంతో తోడ్పడుతుంది.

****


(రిలీజ్ ఐడి: 2323718) సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati , Malayalam