ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

లదాఖ్‌లో రేపు సుమారు రూ. 3,350 కోట్ల విలువైన అయిదు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి

· విమానాశ్రయ మౌలిక సదుపాయాలు, వ్యూహాత్మక రహదారి అనుసంధానం, జలవిద్యుత్, వారసత్వ సంరక్షణ, జల భద్రతకు సంబంధించిన మొత్తం అయిదు ప్రాజెక్టులు

· లేహ్ విమానాశ్రయంలో ప్రయాణికుల కోసం నూతన టెర్మినల్ భవనం ప్రారంభం

· లదాఖ్‌కు ప్రత్యామ్నాయ అనుసంధానాన్ని కల్పిస్తూ... సాయుధ దళాల వ్యూహాత్మక రవాణాను బలోపేతం చేసే 298 కిలోమీటర్ల నిమ్ము-పదుమ్-దర్చా రహదారి జాతికి అంకితం

· లదాఖ్ పురావస్తు వారసత్వ పరిరక్షణ కోసం లేహ్‌లో భారత తొలి పెట్రోగ్లిఫ్ సంరక్షణ పార్కు ప్రారంభం

నాడు పోస్టు చేయడమైనది: 14 OCT 2026 3:15PM by PIB Hyderabad

లదాఖ్‌లో దాదాపు రూ. 3,350 కోట్ల విలువైన అయిదు ప్రధాన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు మధ్యాహ్నం సుమారు 12:30 గంటలకు వీడియో అనుసంధానం ద్వారా ప్రారంభించి, జాతికి అంకితం చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేయనున్న సభనుద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ఆ ప్రాంతంలో అనుసంధానాన్ని బలోపేతం చేయడం, ఇంధన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం, జల భద్రతను పెంపొందించడం ఈ ప్రాజెక్టుల లక్ష్యం.

లేహ్‌లోని కుషోక్ బకులా రింపోచీ విమానాశ్రయంలో రూ. 640 కోట్ల వ్యయంతో నిర్మించిన కొత్త ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. 23,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఆధునిక టెర్మినల్‌ను... ఏటా 35 లక్షల మంది ప్రయాణికుల నిర్వహణకు వీలుగా రూపొందించారు. ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడానికి, కర్బన ఉద్గారాలను తగ్గించడానికి భూతాప శక్తిని ఉపయోగించుకోవడం ద్వారా... పర్యావరణపరంగా సున్నితమైన లదాఖ్‌ ప్రాంతంలో సుస్థిర మౌలిక సదుపాయాల ఏర్పాటు ప్రాముఖ్యతను ఈ సౌకర్యం ప్రతిబింబిస్తుంది. ఆధునిక ప్రయాణికుల సౌకర్యాలను గొప్పనైన లదాఖ్ సాంస్కృతిక వారసత్వ అంశాలతో మేళవించిన ఈ టెర్మినల్ భవనం... ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరచడంతో పాటు దేశంలోని మిగిలిన ప్రాంతాలతో వాయుమార్గ అనుసంధానాన్నీ బలోపేతం చేస్తుంది.

సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్‌వో) నిర్మించిన 298 కిలోమీటర్ల పొడవైన నిమ్ము-పదుమ్-దర్చా రహదారిని ప్రధానమంత్రి జాతికి అంకితం చేయనున్నారు. మారుమూల జాన్‌స్కార్ లోయ మీదుగా లేహ్‌లోని నిమ్మును-హిమాచల్ ప్రదేశ్‌లోని దర్చాతో కలిపే ఈ రహదారి... శ్రీనగర్-లేహ్, మనాలి-లేహ్ రహదారులకు అనుబంధంగా లదాఖ్‌కు ప్రత్యామ్నాయ అనుసంధాన మార్గాన్ని అందిస్తుంది. ఎత్తయిన షింకున్ లా కనుమతో సహా, సవాలుతో కూడిన హిమాలయ భూభాగం గుండా వెళ్లే ఈ రహదారి కీలక ఇంజనీరింగ్ విజయంగా నిలుస్తుంది. సాయుధ దళాలు కార్యాచరణలో భాగంగా రాకపోకలు సాగించడానికి మరింత అనువైన రహదారిని అందించడం, సరుకు రవాణా మద్దతు బలోపేతంలోనూ ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఆరోగ్య సంరక్షణ, విద్య, మార్కెట్లు, నిత్యావసర సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడం ద్వారా జాన్‌స్కార్ లోయ నివాసితులకూ ఈ రహదారి ప్రయోజనం చేకూరుస్తుంది.

ఇంధన భద్రత బలోపేతం, లదాఖ్ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని వినియోగించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా... 9 మెగావాట్ల హను అనే చిన్న జలవిద్యుత్ ప్రాజెక్టును, 66 కేవీ డబుల్-సర్క్యూట్ దహ్-హను-ఖల్ట్సీ ట్రాన్స్‌మిషన్ లైన్‌నూ ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టులు విద్యుత్ తరలింపు మౌలిక సదుపాయాలను బలోపేతం చేసి, లదాఖ్ విద్యుత్ నెట్‌వర్క్ విశ్వసనీయతనూ మెరుగుపరుస్తాయి. ఈ ప్రాంతం జలవిద్యుత్ వనరులను వినియోగించుకోవడంలోనూ, దాని ఇంధన మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలోనూ ఇది కీలక ముందడుగు.

లదాఖ్ పురావస్తు వారసత్వ సంపదను పరిరక్షించాల్సిన ప్రాముఖ్యతను గుర్తించి... లేహ్‌లోని సింధు ఘాట్‌లో ఏర్పాటు చేసిన భారత తొలి పెట్రోగ్లిఫ్ కన్జర్వేషన్ (శిల్పాల పరిరక్షణ) పార్కునూ ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. వన్యప్రాణులు, మానవ ఆకృతులు, నాటి జీవన విధానాన్ని ప్రతిబింబించే వందలాది ప్రాచీన రాతి శిల్పాలకు లదాఖ్ నిలయంగా ఉంది. ఇవి వేల ఏళ్ల నాటి మానవ జీవన పరిణామ క్రమాన్ని, సంస్కృతిని మన కళ్లకు కడుతూ ఎంతో విలువైన సమాచారాన్ని అందిస్తాయి. ఈ ప్రాంతపు ప్రాచీన సంస్కృతి, నాగరికతలకు సజీవ సాక్ష్యాలుగా నిలిచే ఈ రాతి శిల్పాలు ఎంతో అపురూపమైనవి. ప్రస్తుతం అంతరించిపోయే దశలో ఉన్న ఈ ప్రాచీన సంపదను ప్రత్యేకంగా రక్షించడానికి, ప్రజల్లో వీటిపై అవగాహన పెంపొందించడానికి, పర్యావరణానికి హాని కలగకుండా బాధ్యతాయుతమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఈ నూతన పరిరక్షణ పార్కు ఒక అద్భుత వేదికగా నిలవనుంది.

మిషన్ అమృత్ సరోవర్ ఆశయాలకు అనుగుణంగా... లదాఖ్ ప్రాంతంలోని ప్రత్యేక భౌగోళిక, శీతోష్ణస్థితి సవాళ్లను అధిగమించడానికి ఉద్దేశించిన 'ప్రాజెక్ట్ హిమ్ సరోవర్' కింద 40 గ్రామాల్లో అభివృద్ధి చేసిన 40 జలాశయాలను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. లదాఖ్‌లోని వ్యవసాయ రంగం... నీటి లభ్యత, అవసరాల మధ్య రుతువుల ఆధారితమైన తీవ్ర అసమతుల్యతను ఎదుర్కొంటోంది. ఇక్కడ మంచు కరగడం, హిమానీనదాల ప్రవాహాల వల్ల మిగతా సమయాల్లో భారీగా నీరు లభించినప్పటికీ... పంటలు నాటే కీలక సమయంలో మాత్రం రైతులకు తరచూ నీటి కొరత ఏర్పడుతోంది. నీరు అందుబాటులో ఉన్నప్పుడు దానిని సంరక్షించి, అవసరమైనప్పుడు రైతులకు అందించడం ద్వారా ఈ సవాలును అధిగమించడానికి 'ప్రాజెక్ట్ హిమ్ సరోవర్' కృషి చేస్తుంది. తద్వారా ఈ ప్రాంతంలో సాగునీటి రంగానికి ఊతమిస్తూ, వ్యవసాయ ఆధారిత జీవనోపాధిని కాపాడుతూ, దీర్ఘకాలిక నీటి భద్రతనూ ఇది బలోపేతం చేస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2323292) సందర్శకుల సూచీ సంఖ్య : : 17
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam