వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ఈఎస్టీఐసీ-2026 కిి ముందు పరిచయ కార్యక్రమంతోపాటు ప్రసార మాధ్యమాలతో చర్చ కార్యక్రమాన్ని నిర్వహించనున్న ఐసీఏఆర్
హర్యానాలోని కర్నాల్‌లో ఈ కార్యక్రమంలో...
ఈఎస్టీఐసీ-2026లో ఐసీఏఆర్ పాత్రను గురించి వివరించనున్న డాక్టర్ ఎమ్.ఎల్. జట్
నాడు పోస్టు చేయడమైనది:
14 OCT 2026 1:01PM by PIB Hyderabad
భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) రేపు, అంటే 2026 అక్టోబర్ 15న, హర్యానాలోని కర్నాల్‌లో గల ఐసీఏఆర్-సెంట్రల్ సాయిల్ సెలైనిటీ రిసర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎస్ఎస్ఆర్ఐ)లో ఓ పరిచయ కార్యక్రమాన్ని, ప్రసార మాధ్యమాలతో చర్చ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్.. భారత్ మండపంలో ‘ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ, ఇన్నొవేషన్ కాన్క్లేవ్ (ఈఎస్టీఐసీ)-2026’ను నిర్వహించనున్నారు. కాగా ఆ సమావేశానికి ముందు సన్నాహక చర్యగా రేపటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈఎస్టీఐసీ-2026 పరిచయ కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన, విద్య విభాగం (డీఏఆర్ఈ) కార్యదర్శి, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎమ్.ఎల్. జట్ ప్రసంగించనున్నారు. ఆయన ఈఎస్టీఐసీ-2026 లో ఐసీఏఆర్ పాత్రను వివరిస్తారు.
ఈ కార్యక్రమంలో ‘వ్యవసాయ సాంకేతికత, ఆహార వ్యవస్థలు, పోషణ’ అంశాలపై ప్రసార మాధ్యమాలతో చర్చను కూడా చేపడతారు. ఈ కార్యక్రమం వ్యవసాయ సాంకేతికత, ఆహార వ్యవస్థలు, పోషణ రంగాల్లో తాజా పరిణామాలపై చర్చలకు ఒక వేదికను సమకూర్చనుంది.
ఈఎస్టీఐసీ-2026 లో ఐసీఏఆర్ భూమిక
ఈఎస్టీఐసీ-2026 సారథ్య సంఘంలో వ్యవసాయ పరిశోధన, విద్య విభాగం (డీఏఆర్ఈ) కార్యదర్శి, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్‌కు సభ్యత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వంలోని ప్రముఖ విజ్ఞానశాస్త్ర, సాంకేతిక విభాగాల అధిపతులు కూడా ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నారు. ‘‘వ్యవసాయం, ఆహార వ్యవస్థలు, పోషణ’’ ఇతివృత్తంపై ఏర్పాటు చేయబోయే సమావేశంతో ఐసీఏఆర్ ప్రత్యక్ష అనుబంధాన్ని కలిగి ఉంటుంది. దీనిని ఈఎస్టీఐసీ-2026 కు చెందిన 12 కీలక ఇతివృత్తాల సమావేశాల్లో ఒకటిగా 2026 అక్టోబర్ 29న నిర్వహించనున్నారు. సమావేశానికి ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎమ్ఓఎఫ్‌పీఐ) కార్యదర్శితో పాటు డీఏఆర్ఈ కార్యదర్శి, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ అధ్యక్షత వహిస్తారు. దీనిలో ఓ కీలకోపన్యాసం, నూతన సాంకేతికతలపై పనిచేస్తున్న ఒక కొత్త వాణిజ్య సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ), ఒక మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్త, విజ్ఞానశాస్త్ర, సాంకేతిక రంగాల్లోని ప్రముఖ వ్యక్తులు ఇచ్చే నివేదికలు, ఆ తరువాత బృంద చర్చ కార్యక్రమం చోటు చేసుకుంటాయి. ఈ సమావేశంలో భారత్‌లోని విస్తృత విజ్ఞానశాస్త్ర, సాంకేతిక రంగాలకు చెందిన వ్యవసాయ పరిశోధన, నూతన ఆవిష్కరణలు, సరికొత్త సాంకేతికతల తోడ్పాటును వివరించడానికి ఒక అవకాశాన్ని ఇస్తారు. ఐసీఏఆర్-జాతీయ ప్లాంట్ బయోటెక్నాలజీ ఇన్స్టిట్యూట్, ఐసీఏఆర్-జాతీయ వరి పరిశోధన సంస్థల పరిశోధకులతో పాటు అనేక మంది ఐసీఏఆర్ శాస్త్రవేత్తలు ఈఎస్టీఐసీ-2026 లో ప్రసంగిస్తారు. కృత్రిమ మేధ (ఏఐ), రోబోటిక్స్, డిజిటల్ ఆధారిత వ్యవసాయం, ఆధునిక పద్ధతుల్లో ఫలసాయం మెరుగుదల, జీన్ ఎడిటింగ్, సుస్థిర ప్రాతిపదిక కలిగిన వ్యవసాయ వ్యవస్థల్లో పురోగతి ఎంతవరకు వచ్చిందో ఈ సందర్భంగా ఐసీఏఆర్ వివరించనుంది. దీనికి అదనంగా, ఐసీఏఆర్ ‘‘వ్యవసాయ సాంకేతికత, ఆహార వ్యవస్థలు, పోషణ’’ ఇతివృత్తంలో భాగంగా తన నూతన ఆవిష్కరణలను కూడా ఈఎస్టీఐసీ-2026 ప్రదర్శనలో కళ్లకు కట్టనుంది.
ఈఎస్టీఐసీ-2026
ఇది విజ్ఞానశాస్త్రం, సాంకేతికత, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన ఒక ప్రధాన వేదిక. ఇది వివిధ ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల ప్రతినిధులు, పరిశోధకులు, డీప్-టెక్ అంకుర సంస్థలు, పరిశ్రమలు, విధాన రూపకర్తలు, ఆర్థిక సహాయ సంస్థలు, ప్రపంచ నిపుణులను ఏకతాటిమీదకు తీసుకు వస్తుంది. మూడు రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమాన్ని విజ్ఞానశాస్త్ర, సాంకేతికత మంత్రిత్వ శాఖ అధీనంలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రిసర్చ్ (సీఎస్ఐఆర్) ద్వారా కేంద్ర ప్రభుత్వ ప్రధాన విజ్ఞానశాస్త్ర సలహాదారు కార్యాలయం మార్గదర్శకత్వంలో నిర్వహిస్తారు. నేషనల్ ఇంటర్‌డిసిప్లినరీ సైన్స్, టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (ఎన్ఐఐఎస్టీ) ఈ కార్యక్రమ నిర్వహణలో భాగస్వామ్యాన్ని పంచుకొంటుంది. ఈ కార్యక్రమం 2047 కల్లా వికసిత్ భారత్ దృష్టికోణాన్ని సాకారం చేసే దిశగా పురోగతిని సాధించడానికి వీలుగా అత్యాధునిక పరిశోధన, సరికొత్త సాంకేతికతల, సాంకేతికత ఆధారిత నూతన ఆవిష్కరణల రంగాల్లో సహకారాన్ని పెంపొందింపచేసేందుకు అవకాశాలను అందిస్తుంది.
ఈ సమావేశంలో పాల్గొనే వారిలో అణు ఇంధన విభాగం (డీఏఈ), ఆయుష్ శాఖ, బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ), శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన విభాగం (డీఎస్టీ), రక్షణ విభాగం/డీఆర్డీఓ, పృథ్వి విజ్ఞానశాస్త్రాల శాఖ (ఎమ్ఓఈఎస్), ఉన్నత విద్య విభాగం, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత శాక (ఎమ్ఈఐటీవై), ఐసీఏఆర్, ఆరోగ్య పరిశోధన విభాగం (డీహెచ్ఆర్)/ ఆరోగ్య పరిశోధన విభాగం (డీహెచ్ఆర్)/భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎమ్ఆర్), అంతరిక్ష విభాగం/ఇస్రో, టెలికమ్యూనికేషన్స్ విభాగం (డీఓటీ)ల ప్రతినిధులు ఉన్నారు. వీరితో పాటు నోబెల్ పురస్కారాల విజేతలు, ప్రపంచ నిపుణులు, పారిశ్రామిక రంగ ప్రముఖులు, విధాన రూపకర్తలు, శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన రంగంలో ఎదుగుతున్న నేతలు, పరిశోధకులు, నూతన ఆవిష్కర్తలు, డీప్-టెక్ అంకుర సంస్థలు, పరిశ్రమలు, ఆర్థిక సహాయ సంస్థలు కూడా పాల్గొంటాయి.
ఈఎస్టీఐసీ-2026 లో ఐసీఏఆర్ భాగం పంచుకోవడం వల్ల, 2047 కల్లా అభివృద్ధి చెందిన భారత్‌ను ఆవిష్కరించాలన్న ఆశయానికి అనుగుణంగా మన్నికైన, సాంకేతికతపై ఆధారపడే వ్యవసాయ, ఆహార వ్యవస్థలను ప్రోత్సహించడానికి కలిసివచ్చే ప్రయత్నాలను బలోపేతం చేయడంలో తోడ్పాటు లభించనుంది.
***
(రిలీజ్ ఐడి: 2323233)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6