మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఐఐఐటీ రాంచీలో విద్యార్థి మృతి... విచారణకు ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసిన కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ
నాడు పోస్టు చేయడమైనది:
13 OCT 2026 2:26PM by PIB Hyderabad
రాంచీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) ప్రాంగణంలో ఒక విద్యార్థి విషాదకర రీతిలో మృతి చెందడంపై తక్షణమే కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ సంఘటనకు దారి తీసిన పరిస్థితులు, తత్సంబంధిత అంశాలను కూలంకషంగా విచారించడానికి ఢిల్లీ విశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ రజని అబ్బి అధ్యక్షతన ముగ్గురు సభ్యులతో కూడిన ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ఒక సీనియర్ సైకియాట్రిస్ట్, విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారి సభ్యులుగా ఉన్నారు. పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం) నమూనా కింద ఐఐఐటీ రాంచీ ఏర్పాటైంది.
ఈ ఘటన వెనుక ఉన్న పరిస్థితులను పరిశీలించడంతో పాటు ప్రాథమిక సదుపాయాల లభ్యత, పనితీరు, సంస్థాగత మద్దతు వ్యవస్థలు, కౌన్సెలింగ్- మెంటారింగ్ ఏర్పాట్లు, విద్యార్థుల ఫిర్యాదుల పరిష్కార విధానాల అమలును సమీక్షించడం ఈ కమిటీ ప్రధాన బాధ్యత. వ్యవస్థాగత లోపాలను గుర్తించి విద్యార్థుల సంక్షేమాన్ని బలోపేతం చేయడానికి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలను ఈ కమిటీ సిఫార్సు చేస్తుంది. అవసరమైన విధంగా భాగస్వాములు, అధికారులు, విద్యార్థులతో కమిటీ సంప్రదింపులు జరిపి సంబంధిత రికార్డులను, పత్రాలను తనిఖీ చేస్తుంది.
విద్యార్థుల ప్రయోజనాలు, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ విద్యా సంస్థ పరిపాలన సజావుగా, సమర్థవంతంగా సాగేలా విద్యా మంత్రిత్వ శాఖ తగిన తాత్కాలిక పరిపాలనా ఏర్పాట్లను చేపడుతోంది.
***
(రిలీజ్ ఐడి: 2323135)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7