యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్‌లో బాక్సింగ్‌ అభివృద్ధి కోసం ఇండియన్‌ ఆయిల్‌తో చేతులు కలిపిన ఎన్ఎస్‌డీఎఫ్‌, శాయ్


దేశంలో బాక్సింగ్‌ రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చిన కేంద్ర క్రీడా శాఖ మంత్రి డాక్టర్‌ మన్సుఖ్‌ మాండవీయ

ప్రతిభ గుర్తింపు, క్రీడాకారుల వికాసం, శిక్షణ, స్పోర్ట్స్ సైన్స్ కు ప్రోత్సాహం కోసం రెండేళ్లలో భారత బాక్సింగ్‌ రంగానికి ఇండియన్‌ ఆయిల్‌ నుంచి రూ.40 కోట్ల పెట్టుబడి

డీపీఈ సాధారణ సీఎస్ఆర్‌ థీమ్‌ విధానంలో క్రీడలకు చోటు - అవగాహన ఒప్పందంపై సంతకాలు

నాడు పోస్టు చేయడమైనది: 13 OCT 2026 5:42PM by PIB Hyderabad

భారతదేశంలో బాక్సింగ్‌ క్రీడను ప్రోత్సహించేందుకు జాతీయ క్రీడాభివృద్ధి నిధి (ఎన్ఎస్‌డీఎఫ్‌), భారత క్రీడా ప్రాధికార సంస్థ (శాయ్‌), ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించడం, వారిని క్రమబద్ధమైన విధానంలో అభివృద్ధి చేయడంపై దృష్టి సారించే ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఈ రంగాన్ని మరింత బలోపేతం చేయనున్నారు. 

దేశంలో క్రీడల అభివృద్ధికి కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్‌) నిధులను వ్యూహాత్మకంగా వినియోగించాల్సిన ప్రాధాన్యాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్‌ మన్సుఖ్‌ మాండవీయ ప్రముఖంగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన పునరుద్ధరించిన ఖేలో ఇండియా పథకంలోనూ ఈ అంశాన్ని స్పష్టంగా పేర్కొన్నారు.
“
పునరుద్ధరించిన ఖేలో ఇండియా పథకం కింద ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తోంది. ఇలాంటి సీఎస్ఆర్‌ నిధుల ఆధారిత భాగస్వామ్యాలు దేశవ్యాప్తంగా సమగ్ర క్రీడా వ్యవస్థ అభివృద్ధికి దోహదపడతాయి” అని డాక్టర్‌ మాండవీయ అన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థల విభాగం (డీపీఈ) రూపొందించిన ఉమ్మడి సీఎస్ఆర్‌ థీమ్‌ విధానంలో క్రీడలను ప్రత్యేక అంశంగా చేర్చిన నేపథ్యంలో ఈ అవగాహన ఒప్పందం కుదిరింది. క్రీడల అభివృద్ధిలో కార్పొరేట్‌ సంస్థల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఇది  ముఖ్యమైన ముందడుగు.

ఈ భాగస్వామ్యంలో భాగంగా, ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించడం, వారిని అభివృద్ధి చేయడం, శిక్షణ అందించడం, క్రీడా విజ్ఞానాన్ని పెంపొందించడం, అంతర్జాతీయ స్థాయి అనుభవాన్ని కల్పించడం, బాక్సింగ్‌ అకాడమీలను బలోపేతం చేయడం వంటి కార్యక్రమాలకు ఇండియన్‌ ఆయిల్‌ రెండేళ్లలో రూ.40 కోట్లు అందించనుంది. కోచ్‌లు, రిఫరీలు, సాంకేతిక అధికారుల నైపుణ్యాభివృద్ధికి కూడా ఈ నిధులను వినియోగించనున్నారు.

“ఈ అవగాహన ఒప్పందం ద్వారా క్రీడల్లో కార్పొరేట్‌ రంగం భాగస్వామ్యం అధీకృతమవుతుంది. బాక్సింగ్‌కే పరిమితం కాకుండా, ప్రతి క్రీడ అభివృద్ధికి కార్పొరేట్‌ సంస్థలు ముందుకొచ్చి సహకారం అందించాలి. క్రీడలకు ప్రారంభ దశలోనూ, అభివృద్ధి చెందుతున్న సమయంలోనూ మద్దతు అవసరం. ఆ తర్వాత క్రీడా వ్యవస్థ ఒక రూపు సంతరించుకుని, స్వయంగా నిలదొక్కుకునే స్థాయికి చేరుకున్నప్పుడు పెట్టుబడులు కూడా వాటంతట అవే వస్తాయి” అని డాక్టర్‌ మాండవీయ అన్నారు.
“
ఆర్థిక సహాయం అందించడమే కాకుండా, సమగ్ర బాక్సింగ్‌ వ్యవస్థను నిర్మించాలంటే ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించడం, క్రీడా పరికరాలు, క్రీడా విజ్ఞానం, మౌలిక సదుపాయాలు, కోచ్‌ల అభివృద్ధి, రిఫరీలకు శిక్షణ వంటి అంశాలపై కూడా పెట్టుబడులు పెట్టడం అవసరం” అని డాక్టర్‌ మాండవీయ స్పష్టం చేశారు. 

ఈ అవగాహన ఒప్పందం ద్వారా ఇండియన్‌ ఆయిల్‌ అందించే కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్‌) నిధులు, క్రీడల అభివృద్ధికి అవసరమైన వనరులను సమకూర్చడంలో జాతీయ క్రీడాభివృద్ధి నిధి (ఎన్ఎస్‌డీఎఫ్‌) పోషించే పాత్ర, భారత క్రీడా ప్రాధికార సంస్థ ( శాయ్‌)కు ఉన్న సాంకేతిక నైపుణ్యాన్ని సమన్వయం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ భాగస్వామ్యం ద్వారా బాక్సింగ్‌ క్రీడాకారులకు నాణ్యమైన శిక్షణ, శాస్త్రీయ సహకారం, శిక్షణ సదుపాయాలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో పోటీపడే అవకాశాలు లభిస్తాయి.

భారత బాక్సింగ్‌ రంగానికి కీలకమైన సమయంలో ఈ భాగస్వామ్యం కుదిరింది. 2026 ఆసియా క్రీడల్లో భారత బాక్సర్లు మూడు స్వర్ణాలు, మూడు కాంస్య పతకాలతో కలిపి మొత్తం ఆరు పతకాలు సాధించారు.

వర్ధమాన, ప్రతిభావంతులైన బాక్సర్లకు ఉన్నత అభివృద్ధి మార్గాలను బలోపేతం చేయడం ద్వారా ఈ విజయాలను మరింత ముందుకు తీసుకెళ్లడం ఈ కార్యక్రమం లక్ష్యం.
కేంద్ర క్రీడా శాఖ మంత్రితో పాటు క్రీడల శాఖ కార్యదర్శి శ్రీ హరి రంజన్ రావు, క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులు, భారత బాక్సింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు శ్రీ అజయ్‌ సింగ్‌, ఇండియన్‌ ఆయిల్‌ మానవ వనరుల విభాగం డైరెక్టర్‌ శ్రీమతి రష్మి గోవిల్‌ సమక్షంలో ఈ అవగాహన ఒప్పందం కుదిరింది.

1890 నాటి ఛారిటబుల్‌ ఎండోమెంట్స్‌ చట్టం కింద 1998లో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ క్రీడాభివృద్ధి నిధి (ఎన్ఎస్‌డీఎఫ్‌)  క్రీడల అభివృద్ధి కోసం వ్యక్తులు, కార్పొరేట్‌ సంస్థల నుంచి వనరులను సమీకరించేందుకు దోహదపడుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలతో భాగస్వామ్యాల ద్వారా క్రీడాకారుల అభివృద్ధి, క్రీడా మౌలిక సదుపాయాల కల్పన, క్రీడా అకాడమీల ఏర్పాటు, ప్రత్యేక శిక్షణ, క్రీడా పరికరాల సమకూర్పు, అంతర్జాతీయ స్థాయి అనుభవాన్ని అందించడం వంటి కార్యక్రమాలకు ఈ నిధిని వినియోగిస్తున్నారు.

***


(రిలీజ్ ఐడి: 2323133) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी