వ్యవసాయ మంత్రిత్వ శాఖ
పీఎం ధన-ధాన్య కృషి యోజన జాతీయ సదస్సులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లాలను అభినందించిన శ్రీ శివరాజ్ సింగ్ చౌహన్
పథకాల అనుసంధానంతో క్షేత్రస్థాయిలో మార్పులు… రైతుల ఆదాయాన్ని పెంచేందుకు సమన్వయంతో చర్యలు చేపట్టాలని శ్రీ శివరాజ్ సింగ్ చౌహన్ పిలుపు
నీటి సంరక్షణ నుంచి ప్రకృతి వ్యవసాయం వరకు… వ్యవసాయాభివృద్ధికి జిల్లా స్థాయి ఆవిష్కరణల దిశా నిర్దేశం
తూర్పు భారత్‌లో వ్యవసాయ రుణాల కోసం, వరి కోత తర్వాత ఖాళీగా ఉండే భూముల్లో పప్పుధాన్యాల సాగుకు పిలుపునిచ్చిన శ్రీ శివరాజ్ సింగ్ చౌహన్
పట్టుదలతో లక్ష్య సాధన… వ్యవసాయాభివృద్ధిని వేగవంతం చేయాలని కలెక్టర్లకు విజ్ఞప్తి
వ్యవసాయ రంగ వృద్దికి జిల్లా స్థాయి ప్రణాళికలు, అంతర్ మంత్రిత్వశాఖల సమన్వయం కీలకం: శ్రీ శివరాజ్ సింగ్ చౌహన్
నాడు పోస్టు చేయడమైనది:
12 OCT 2026 7:05PM by PIB Hyderabad
క్షేత్రస్థాయిలో పరిస్థితులకు అనుగుణంగా విధానాలు రూపుదిద్దుకున్నప్పుడు, ప్రభుత్వ శాఖల్లోని విభాగాలు సమన్వయంతో పనిచేసినప్పుడు అభివృద్ధి పోటీలో జిల్లాలు ముందుంటాయని కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహన్ అన్నారు. ఇది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సుపరిపాలన నమూనాకు నిదర్శనమని పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని పూసా క్యాంపస్ లో భారతరత్న సి. సుబ్రహ్మణ్యం ఆడిటోరియంలో జరిగిన ప్రధానమంత్రి ధన-ధాన్య కృషి యోజన జాతీయ సదస్సును ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. దేశవ్యాప్తంగా 50కి పైగా జిల్లాల నుంచి వచ్చిన కలెక్టర్లు, శాస్త్రవేత్తలు, సీనియర్ విధానరూపకర్తలకు నవరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అద్భుతమైన ప్రతిభ కనబరిచిన జిల్లాలను అభినందించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత... అభివృద్ధి చెందిన, స్వావలంబన భారత్ కలను సాకారం చేసేందుకు అధికారులు కృషి చేయాలని ఆయన కోరారు.
జిల్లాలే కేంద్రంగా వ్యవసాయ ప్రణాళికలు
స్థానిక ప్రణాళికల ప్రాధాన్యతను శ్రీ శివరాజ్ సింగ్ స్పష్టం చేశారు. ఢిల్లీలోని కార్యాలయాల్లో కాకుండా క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితుల ఆధారంగా జిల్లా కలెక్టర్లే పీఎం ధన-ధాన్య కృషి యోజన విధివిధానాలను రూపొందించినట్లు తెలిపారు. ప్రతి నెలా పర్యవేక్షణ అవసరమని చెప్పారు. కలెక్టర్లు, వారి బృందాలతో కలిసి ప్రతి నెలా జిల్లాల వ్యవసాయ ప్రణాళికల పురోగతిని సమీక్షించాలని కోరారు. పురోగతి మందగించిన చోట, అమలును వేగవంతం చేసేందుకు వివిధ శాఖల మధ్య సమన్వయ ప్రయత్నాలను ముమ్మరం చేయాలని సూచించారు. వివిధ మంత్రిత్వ శాఖలు, సంస్థల ప్రయత్నాలను అనుసంధానించటం ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపునకుపైగా చేయవచ్చన్నారు. ఈ సందర్భంగా అంతర్-మంత్రిత్వశాఖల సమన్వయ ప్రాముఖ్యతను శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. నీటి నిర్వహణకు జల శక్తి మంత్రిత్వశాఖ, ఆహార శుద్ధి, దాని విలువ పెంపుదలకు ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వశాఖ, ఉమ్మడి ప్రయత్నాల బలోపేతానికి సహకార మంత్రిత్వశాఖ, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, పశుసంవర్ధక, డెయిరీ, మత్స్య పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు, నైపుణ్యాభివృద్ధి రంగాలు ఇందులో ఉన్నాయి. వ్యవసాయ పరిశోధనలకు, రైతులకు మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని వివరించారు. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలికి చెందిన సుమారు 16,000 మంది శాస్త్రవేత్తల పరిశోధనలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, అగ్రికల్చరల్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ, వ్యవసాయ విశ్వవిద్యాలయాల కృషి నేరుగా రైతుల వ్యవసాయ క్షేత్రాలకు చేరాలని ఆయన తెలిపారు.
తక్కువ ఉత్పాదకత, వరిసాగు తర్వాత ఖాళీగా ఉండే భూములు, రుణాల మంజూరుపై దృష్టి
వ్యవసాయోత్పత్తిలో వెనుకబడిన, తక్కువ పంటలు పండే, సంస్థాగత రుణాలకు సరైన అవకాశం లేని 100 జిల్లాలకు పీఎండీడీకేవై ప్రాధాన్యతనిస్తున్నట్లు శ్రీ శివరాజ్ సింగ్ చౌహన్ తెలిపారు. వరికోత తర్వాత ఖాళీగా ఉండే ప్రాంతాల్లో మిషన్ మోడ్ పద్ధతిలో పప్పుధాన్యాలు, నూనెగింజల సాగును ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతాల్లో సాగు విస్తరణ వల్ల భూమి వినియోగం మెరుగవటంతో పాటు వ్యవసాయోత్పత్తి పెరుగుతుందన్నారు. ముఖ్యంగా తూర్పు భారతదేశంలో, వెనుకబడిన జిల్లాల్లో కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని మరింత విస్తృతంగా అమలు చేయాలని, సంస్థాగత రుణాల అమలును వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. రైతులు ఆధునిక వ్యవసాయ సాంకేతికతలను అందిపుచ్చుకునేందుకు, మెరుగైన విత్తనాలు, ఎరువులను ఉపయోగించేందుకు ఆర్థిక వనరులు అందుబాటులో ఉండాలని అన్నారు.
సంకల్పంతో పనిచేయాలని అధికారులకు శ్రీ శివరాజ్ సింగ్ చౌహన్ పిలుపు
ఉన్నతాభివృద్ధి లక్ష్యాలను సాధించేలా అధికారులను ప్రోత్సహిస్తూ… శ్రీ శివరాజ్ సింగ్ చౌహన్ ప్రసిద్ధ సూక్తులను ప్రస్తావించారు. "ఆకాశానికి రంధ్రం చేయలేమని ఎవరు చెప్పారు. మిత్రులారా... దృఢ సంకల్పంతో ఒక రాయి విసరండి" అంటూ జిల్లా కలెక్టర్లు బలమైన సంకల్పంతో బాధ్యతలను నిర్వర్తించాలని ప్రోత్సహించారు. ఆయన పంచుకున్న సూక్తులు:
మీరు తలచుకుంచే పర్వతాలు, కొండలను బద్దలు కొట్టగలరు.
మీరు తలచుకుంచే నదుల ప్రవాహాన్ని మార్చగలరు.
మీరు తలచుకుంచే మట్టి నుంచి అమృతాన్ని తీయగలరు.
మీరు అనుకుంటే భూమిని ఆకాశంతో అనుసంధానించగలరు!
మూడోసారి పదవీకాలంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మూడు రెట్ల వేగంతో, బలంతో పని చేస్తామని ఎర్రకోట వద్ద ప్రతిజ్ఞ చేశారని శ్రీ శివరాజ్ సింగ్ చౌహన్ తెలిపారు. ఈ సంకల్పాన్ని నిజం చేసేందుకు వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి వ్యవస్థ పూర్తి సామర్థ్యాలను వినియోగిస్తుందన్నారు. పాల్గొంటున్న జిల్లాల పురోగతిపై విశ్వాసం వ్యక్తం చేసిన చౌహాన్... తదుపరి సమీక్షా సమావేశానికి ముందు పోటీ మరింత తీవ్రమవుతుందని, అద్భుతమైన పనితీరు కనబరిచినందుకు మరిన్ని జిల్లాలు గుర్తింపు పొందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
క్షేత్రస్థాయి ఆవిష్కరణలు, విజయగాథలను ప్రదర్శిస్తున్న జిల్లాలు
వ్యవసాయ రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లాలను ఈ సదస్సులో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, వ్యవసాయంలో స్థిరత్వాన్ని తీసుకువచ్చేందుకు చేస్తున్న వినూత్న విధానాలను పలువురు జిల్లా కలెక్టర్లు కేస్ స్టడీస్ రూపంలో వివరించారు.
గడ్చిరోలి, మహారాష్ట్ర: ఈ జిల్లాలో చేపట్టిన నీటి సంరక్షణ, కరవు నిర్వహణ చర్యలు అద్భుత ఫలితాలనిచ్చాయి. ఈ చర్యల ద్వారా ఎండిపోయిన భూములు పచ్చని పంట పొలాలుగా మారటమే కాక, వ్యవసాయోత్పత్తిలో సరికొత్త రికార్డులను ఈ జిల్లా సాధించింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్: తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లోనూ ఉద్యానవన పంటల సాగుతో రైతుల ఆదాయంలో గణనీయమైన వృద్ధి నమోదైంది.
బాంకా జిల్లా, బీహార్: రసాయన ఎరువులపై ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గించి, ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనిచ్చే లక్ష్యంతో 'లీలావరణ్ నేచురల్ ఫార్మింగ్ ల్యాండ్ రివైవల్ మోడల్‌ను ఈ జిల్లాలో విజయవంతంగా అమలు చేస్తున్నారు.
జమ్మూకాశ్మీర్‌లోని కిష్త్వార్, ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా, పంజాబ్‌లోని ఫాజిల్కా జిల్లాల్లో వ్యవసాయ రంగంలో చేపట్టిన ఆవిష్కణలకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి.
దేశ రాజధానిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన జాతీయ సదస్సుకు కేంద్రమంత్రులు హాజరయ్యారు. కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ సహాయమంత్రులు శ్రీ రామ్‌నాథ్ ఠాకూర్, శ్రీ భగీరథ్ చౌదరి, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని, కేంద్ర సహాయమంత్రి కృష్ణపాల్ గుర్జార్ పాల్గొన్నారు. వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వశాఖతో పాటు జలశక్తి, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు, వివిధ ప్రతినిధులు కూడా ఈ సదస్సుకు హాజరయ్యారు.
ఈ సమావేశంలో హాజరైన అధికారుల్లో వ్యవసాయ శాఖ కార్యదర్శి అతీష్ చంద్ర, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ కార్యదర్శి నరేష్ పాల్ గంగ్వార్, ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వశాఖ కార్యదర్శి అవినాష్ జోషి, భూ వనరుల శాఖ కార్యదర్శి దిలీప్ కుమార్, గ్రామీణాభివృద్ధి కార్యదర్శి రోహిత్ కన్సల్, జలవనరుల శాఖ కార్యదర్శి అర్చన వర్మ, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్, వ్యవసాయ పరిశోధన, విద్యా విభాగం (డీఏఆర్ఈ) కార్యదర్శి డాక్టర్ ఎం. ఎల్. జాట్ ఉన్నారు. వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి మనిందర్ కౌర్ ద్వివేది కూడా పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల వ్యవసాయోత్పత్తి కమిషనర్లు, ప్రధాన కార్యదర్శులు, 50కి పైగా జిల్లాల కలెక్టర్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ క్షేత్రస్థాయి అధికారులు కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2322726)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3