వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రపంచ సాంకేతికతలు, ఉపాధి కల్పన అనే ద్విముఖ వ్యూహం గురించి వివరించిన కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్

‘‘ఢిల్లీ డైలాగ్: భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న భారత్ కోసం విధానాలు’’ సదస్సులో కేంద్ర మంత్రి ప్రసంగం

ప్రపంచ కార్ల తయారీ కేంద్రంగా భారత్ అవతరించనుంది: శ్రీ గోయల్

నాడు పోస్టు చేయడమైనది: 12 OCT 2026 2:22PM by PIB Hyderabad

ప్రపంచంలోని అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాలను అందిపుచ్చుకోవడం, గణనీయమైన ఉద్యోగ, వ్యాపార సామర్థ్యం ఉన్న రంగాలను గుర్తించడం అనే ద్విముఖ వ్యూహానికి ఉన్న ప్రాధాన్యాన్ని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ వివరించారు.

న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన ‘‘ఢిల్లీ డైలాగ్: భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న భారత్ కోసం విధానాలు’’ సదస్సులో ఆయన ప్రసంగించారు. వ్యాపారాలకు, అంకుర సంస్థలకు, యువతకు అవకాశాలను కల్పించాల్సిన అవసరాన్ని వివరించారు. ‘‘అంతర్జాతీయ మార్కెట్లో మేం భాగం కావాలనుకుంటున్నాం. ప్రజలకు, ఉద్యోగార్థులకు, మా అంకుర సంస్థలకు, మా యువతకు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాం.’’

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏ) ద్వారా ప్రపంచ మార్కెట్లతో విస్తరిస్తున్న భారతదేశ సంబంధాల గురించి శ్రీ గోయల్ ప్రస్తావించారు. భారతీయ వ్యాపారులకు, యువతకు ఈ ఒప్పందాల ద్వారా లభించే అవకాశాల గురించి వెల్లడించారు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలతో భారత్ ఏర్పాటు చేసుకుంటున్న భాగస్వామ్యాల ద్వారా ఉభయ పక్షాలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. వస్త్రాలు, పాదరక్షలు, వ్యవసాయం, ఆహార శుద్ధి రంగాల్లో భారతదేశం తన నైపుణ్యాలను అందిస్తూనే అధునాతన సాంకేతికతలు, అధిక నాణ్యత గల ఎలక్ట్రానిక్ పరికరాలను పొందగలదని తెలియజేశారు.

‘‘మేము ప్రపంచానికి భారతదేశ ద్వారాలను మూసివేయడం లేదు. వాస్తవానికి వాటిని మరింత విశాలంగా తెరుస్తున్నాం’’ అంటూ ప్రపంచ భాగస్వామ్యం, స్వావలంబన పట్ల భారతదేశ వైఖరిని శ్రీ గోయల్ వివరించారు.

భారతదేశ ఆర్థిక వృద్ధికి, ఎగుమతుల కోసం స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాల్సిన ప్రాధాన్యాన్ని ఈ కార్యక్రమంలో శ్రీ పీయూష్ గోయల్ వివరించారు. ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని ప్రస్తావిస్తూ.. దాన్ని సాధించగల భారతదేశ సామర్థ్యంపై శ్రీ గోయల్ విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే ‘వికసిత్ భారత్–2047’ దిశగా దేశం సాగిస్తున్న ప్రయాణంలో భాగంగా జాతీయ లక్ష్యాలను సాధించడానికున్న ప్రాధాన్నాన్ని ఆయన తెలియజెప్పారు.

2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలన్న ఆశయానికి... దేశ వృద్ధికి దోహదపడే రంగాలను గుర్తించే ఒక రోడ్‌మ్యాప్ మద్దతు ఇస్తోందని మంత్రి అన్నారు. భారతదేశంలోని 1.4 బిలియన్ల మంది ప్రజల్లో వస్తువులు, సేవలకు పెరుగుతున్న డిమాండ్ గురించి కూడా ఆయన వివరించారు, పెరుగుతున్న దిగుమతులు దేశీయ పరిశ్రమకు, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు లభిస్తున్న అవకాశాలను సూచిస్తున్నాయని అన్నారు. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలకు పెరుగుతున్న డిమాండు వల్ల సెమీకండక్టర్ ఫ్యాక్టరీలతో సహా దేశీయ తయారీ రంగంలో పెట్టుబడులకు ప్రోత్సాహం లభించే అవకాశం ఉందని చెప్పారు.

ఉపాధి కల్పనకు, కొత్త వ్యాపార అవకాశాలను సృష్టించడానికి గణనీయమైన సామర్థ్యం ఉన్న రంగంగా పర్యాటకాన్ని శ్రీ గోయల్ గుర్తించారు. పర్యాటక రంగ ప్రచార సామర్థ్యాన్ని కృత్రిమ మేధ మెరుగుపరచగలదన్నారు. అయితే ఈ రంగంలో మానవులకు ఎదురైన అనుభవాలే ఎల్లప్పుడూ కీలకంగా ఉంటాయని చెప్పారు. ‘‘పర్యాటక ప్రోత్సాహక సామర్థ్యాన్ని ఏఐ కేవలం పెంచగలదు. కానీ, మానవ అనుభవాలు ఎల్లప్పుడూ ఏఐ పరిమితులను దాటి ఉంటాయి’’ అని తెలియజేశారు.

భారతదేశ పాకశాస్త్ర వారసత్వం, ప్రాంతీయ వైవిధ్యం, ఫిల్టర్ కాఫీ, రసం, ఇడ్లీ, దోశ లాంటి భారతీయ ఆహార సంప్రదాయాలు, ఉత్పత్తుల సామర్థ్యం గురించి వివరించారు.

భారతదేశానికి జనాభాపరంగా ఉన్న ప్రయోజనాన్ని కూడా శ్రీ గోయల్ వివరించారు. అనేక ఆర్థిక వ్యవస్థలు వృద్ధాప్యంతో ఉన్న జనాభాను కలిగి ఉన్న సమయంలో భారతదేశ యువ జనాభా అనేక అవకాశాలను అందిస్తోందన్నారు. జర్మనీ, జపాన్ లాంటి దేశాల్లో భారతీయ కార్మికులకు ఉన్న డిమాండు గురించి ఆయన వివరించారు. అంతర్జాతీయ మార్కెట్లకు భారతీయ నిపుణులు అందించగల సామర్థ్యాన్ని కూడా తెలియజేశారు. అంతర్జాతీయంగా భారతీయ కార్మికులపై ఉన్న విశ్వాసం గురించి కూడా శ్రీ గోయల్ వివరించారు. తమ నిజాయతీ, ఇతరుల పట్ల శ్రద్ధ వహించడంలో వారికున్న అంకితభావానికి భారతీయులకు గౌరవం లభిస్తోందన్నారు.

భారతదేశం కార్ల తయారీకి ప్రపంచ కేంద్రంగా మారుతుందనే విశ్వాసాన్ని శ్రీ పీయూష్ గోయల్ వ్యక్తం చేశారు. మార్కెట్ డిమాండ్ తగిన స్థాయికి చేరుకున్నప్పుడు అంతర్జాతీయ ఆటోమొబైల్ తయారీదారులు క్రమంగా భారతదేశంలోనే ఉత్పత్తిని ప్రారంభిస్తారన్నారు. యునైటెడ్ కింగ్‌డమ్, యూరోపియన్ యూనియన్ దేశాల నుంచి కార్ల దిగుమతికి అనుమతించిన కోటాల గురించి ప్రస్తావించారు. ఇవి ప్రధానంగా ఖరీదైన కార్లను మాత్రమే కవర్ చేస్తాయని, తక్కువ ధరల విభాగానికి ఇంకా అనుమతివ్వలేదని శ్రీ గోయల్ వివరించారు. భారత మార్కెట్‌ను తొలుత పరిశీలించిన అనంతరం లగ్జరీ ఆటోమొబైల్ తయారీదారులు పూణేలో తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఉదాహరణలను శ్రీ గోయల్ ఉటంకించారు. ప్రపంచ ఆటోమొబైల్ తయారీదారులను ఆకర్షించడంలోనూ, ప్రపంచ కార్ల తయారీ రంగంలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడంలోనూ భారతదేశానికి ఉన్న సామర్థ్యాన్ని మంత్రి వివరించారు.

అంతర్జాతీయంగా భారతదేశ పోటీతత్వాన్ని బలోపేతం చేయడంలో నాణ్యతకున్న ప్రాధాన్యాన్ని మంత్రి వివరించారు. విధాన రూపకర్తలు, పారిశ్రామిక భాగస్వాములు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో సహా ఇతర సంస్థలు నాణ్యతా ప్రమాణాలను మెరుగుపరచడానికి సమష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు.  

అంతర్జాతీయ స్థాయి నాణ్యతా ప్రమాణాలను స్వీకరించి, అనుసరిస్తే భారత్‌ను ఏ శక్తీ ఆపలేదనీ, ప్రపంచాన్ని జయించడం భారత్ చేతుల్లోనే ఉందంటూ తన ప్రసంగాన్ని శ్రీ గోయల్ ముగించారు. 

***


(రిలీజ్ ఐడి: 2322667) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Bengali , Gujarati , Tamil