రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
టోల్ ప్లాజాల వద్ద మరుగుదొడ్ల పరిశుభ్రత, ఇతర మౌలిక వసతుల సక్రమ నిర్వహణపై ఎన్‌హెచ్ఏఐ కఠిన పర్యవేక్షణ
పెండింగ్‌లో ఉన్న అన్ని లోపాలను సరిదిద్దే వరకు లేదా 15 రోజుల పాటు యూజర్ ఫీజు వసూలు చేసే ఏజెన్సీలు ఎన్‌హెచ్ఏఐ టెండర్లలో పాల్గొనకుండా నిషేధించే నిబంధన
నాడు పోస్టు చేయడమైనది:
12 OCT 2026 4:56PM by PIB Hyderabad
జాతీయ రహదారుల వెంబడి ఉన్న మరుగుదొడ్ల పరిశుభ్రత, నిర్వహణను మరింత మెరుగుపరిచే నిరంతర ప్రయత్నాల్లో భాగంగా, భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) మరింత కఠినమైన పర్యవేక్షణ, నిబంధనల అమలు విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త చర్యల ద్వారా మరుగుదొడ్ల సముదాయాలు, టోల్ వసూలు కేంద్రాలు, వాటి పరిసర ప్రాంతాలు, సూచిక బోర్డులు సహా ఇతర సౌకర్యాలను సక్రమంగా నిర్వహించేలా చూడనున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా మౌలిక సదుపాయాల నిర్వహణ ఏజెన్సీలు నిర్దేశించిన సేవా ప్రమాణాలను పాటించేలా, గుర్తించిన లోపాలను సత్వరమే సరిదిద్దేలా చర్యలు తీసుకోనున్నారు.
టోల్ యూజర్ ఫీజు వసూలు చేసే ఏజెన్సీలు మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాల నిర్వహణకు సంబంధించి నిర్దేశించిన సేవా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి. కొత్త విధానం ప్రకారం, ఎన్‌హెచ్ఏఐ అధికారులు ఈ సౌకర్యాలను కనీసం వారానికి ఒకసారి తనిఖీ చేస్తారు. తనిఖీల్లో ఏవైనా లోపాలు గుర్తిస్తే, సంబంధిత యూజర్ ఫీజు వసూలు ఏజెన్సీకి సంజాయిషీ నోటీసు జారీ చేస్తారు. నిర్దేశించిన గడువులోగా ఆ లోపాలను సరిదిద్దాలని ఆదేశిస్తారు.
పారదర్శకత, సరైన పర్యవేక్షణ కోసం నోటీసులతో పాటు తేదీలతో కూడిన ఫోటోలను ఎన్‌హెచ్ఏఐ డేటా లేక్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు. సంబంధిత ఏజెన్సీ కూడా తన సమాధానాన్ని సమర్పించడంతో పాటు చేపట్టిన దిద్దుబాటు చర్యలను తెలిపే ఫోటోలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎన్‌హెచ్ఏఐ క్షేత్రస్థాయి విభాగాలు పురోగతిని పర్యవేక్షిస్తూ, నిర్దేశిత సమయంలోగా లోపాలను నివారించేలా చర్యలు తీసుకుంటాయి.
నిబంధనలు పాటించకపోతే జరిమానాలు
ఏదైనా లోపం ఒప్పంద నిబంధనలను లేదా నిర్దేశించిన సేవా ప్రమాణాలను ఉల్లంఘించినట్లయితే, ఒప్పందంలోని నిబంధనలు, ప్రస్తుతం అమల్లో ఉన్న మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్‌హెచ్ఏఐ నిర్దేశిత జరిమానాను విధిస్తుంది.
లోపాలను సరిదిద్దడంలో పదేపదే విఫలమయ్యే ఏజెన్సీలపై చర్యలు తీసుకునేందుకు ఎన్‌హెచ్ఏఐ మరో నిబంధనను ప్రవేశపెట్టింది. ఒక ఏజెన్సీ నిర్వహిస్తున్న మొత్తం టోల్ ప్లాజాల సంఖ్యలో, పరిష్కారం కాని లోపాలకు సంబంధించి జారీ చేసిన నోటీసుల సంఖ్య 10 శాతానికి చేరినా లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నా, ఆ ఏజెన్సీని పనితీరు సరిగా లేని సంస్థగా (నాన్ పెర్ఫార్మర్) ప్రకటిస్తారు అటువంటి ఏజెన్సీ 15 రోజుల పాటు లేదా పెండింగ్‌లో ఉన్న అన్ని లోపాలను సరిదిద్దే వరకు - ఈ రెండింటిలో ఏది ఎక్కువ కాలమైతే అంతవరకు - టోల్ ప్లాజాల నిర్వహణకు సంబంధించిన బిడ్డింగ్‌లో, సాధారణ టోల్ ప్లాజా కాంట్రాక్టుల్లో, సివిల్ పనుల టెండర్లలో లేదా ఎన్‌హెచ్ఏఐ నిర్వహించే ఇతర ఏ టెండర్ ప్రక్రియలోనూ పాల్గొనడానికి అర్హత కోల్పోతుంది.
ఈ కొత్త విధానం ప్రభుత్వ నిధులతో నిర్వహించే టోల్ ప్లాజాలతో పాటు, ఎన్‌హెచ్ఏఐ యూజర్ ఫీజు వసూలు ఏజెన్సీలను నియమించిన ఇతర టోల్ ప్లాజాలకు కూడా వర్తిస్తుంది. ఇప్పటికే అమల్లో ఉన్న విధానాలు, మార్గదర్శకాలు, ఒప్పంద నిబంధనలకు అదనంగా ఈ కొత్త విధానం అమలులో ఉంటుంది.
సౌకర్యాల నిర్వహణలో జాతీయ రహదారుల వినియోగదారులే కీలకం
2025లో ఎన్‌హెచ్ఏఐ ప్రజల భాగస్వామ్యంతో అమలు చేసే ‘క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్’ (పరిశుభ్రమైన మరుగుదొడ్ల ఫొటో ఛాలెంజ్) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ వినూత్న కార్యక్రమం ద్వారా జాతీయ రహదారులపై ప్రయాణించే వారు టోల్ ప్లాజాల వద్ద అపరిశుభ్రంగా ఉన్న మరుగుదొడ్లను గుర్తించి, వాటి స్పష్టమైన ఫొటోలను భౌగోళిక స్థాన వివరాలు (జియో-ట్యాగింగ్), తేదీ, సమయం (టైమ్‌స్టాంప్)తో సహా ‘రాజ్‌మార్గ్‌యాత్ర’ మొబైల్ యాప్ ద్వారా అప్‌లోడ్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
ప్రయాణికులే ప్రాధాన్యతగా జాతీయ రహదారులపై సౌకర్యాల పర్యవేక్షణ
2025లో భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్రజల భాగస్వామ్యంతో ‘క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్’ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా జాతీయ రహదారులపై ప్రయాణించే వారు టోల్ ప్లాజాల వద్ద అపరిశుభ్రంగా ఉన్న మరుగుదొడ్ల గురించి ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకోసం మరుగుదొడ్ల పరిస్థితిని స్పష్టంగా చూపించే ఫొటోలను, వాటి భౌగోళిక స్థాన వివరాలు, తేదీ, సమయంతో సహా ‘రాజ్‌మార్గ్‌యాత్ర’ మొబైల్ యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. ఈ విధంగా అర్హత కలిగిన ఫిర్యాదును సమర్పించిన ప్రతి వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌కు ఫాస్టాగ్ రీఛార్జి రూపంలో రూ.1,000 బహుమతిగా అందజేస్తారు.
‘క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్’ కార్యక్రమంతో పాటు పర్యవేక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం ద్వారా జాతీయ రహదారులపై మరుగుదొడ్ల సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ఎన్‌హెచ్ఏఐ బహుముఖ కార్యాచరణను అమలు చేస్తోంది. ఈ విధానంలో ప్రజల భాగస్వామ్యం, క్రమం తప్పకుండా తనిఖీలు, డిజిటల్ విధానంలో వివరాల నమోదు, నిర్దేశిత గడువులోగా లోపాల సవరణ వంటి చర్యలను సమన్వయం చేస్తున్నారు. తద్వారా సేవల నాణ్యతను మెరుగుపరచడంతో పాటు, ఈ సౌకర్యాల నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఏజెన్సీలు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేలా జవాబుదారీతనాన్ని కల్పించనున్నారు.
సౌకర్యాల లోపాలను నేరుగా తెలియజేసేలా ప్రజలను ప్రోత్సహించడం, సేవలందించే ఏజెన్సీల పర్యవేక్షణను మరింత బలోపేతం చేయడం ద్వారా జాతీయ రహదారుల వెంబడి మరుగుదొడ్లను పరిశుభ్రంగా, మెరుగ్గా నిర్వహించేలా చూడాలని, జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి మరింత సౌకర్యవంతమైన, మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించాలని ఎన్‌హెచ్ఏఐ భావిస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2322604)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9