రక్షణ మంత్రిత్వ శాఖ
జోధ్‌పూర్‌లో తరంగ్ శక్తి–2026 విన్యాసంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగం
రక్షణ రంగంలో స్వావలంబన, అంతర్జాతీయ సహకారానికి ప్రాధాన్యత ఇవ్వాలి: రాజ్‌నాథ్ సింగ్
‘‘విభిన్న దేశాలు, విభిన్న విమానాలు, విభిన్న అనుభవాలు.. కానీ ఆకాశం ఒక్కటే. ఇదే తరంగ్ శక్తి సందేశం’’: రక్షణమంత్రి
‘‘గుర్తించడం, అర్థం చేసుకోవడం, నిర్ణయించడం, చర్యలు తీసుకోవడంలో వేగంపై భవిష్యత్తులో సైనిక శక్తి సామర్థ్యం ఆధారపడి ఉంటుంది’’: రక్షణమంత్రి
‘‘భవిష్యత్తులో రక్షణ సంబంధాలు కేవలం ఆయుధ వేదికలకే పరిమితం కావు.. సాంకేతికత, పరస్పర విశ్వాసమే కీలకం’’: రక్షణ మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
10 OCT 2026 2:27PM by PIB Hyderabad
జోధ్‌పూర్‌లోని వైమానిక దళ కేంద్రంలో తరంగ్ శక్తి–2026 రెండో విడత విన్యాసంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి అక్టోబర్ 10న రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగించారు. భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 12 వరకు ఈ బహుళజాతి వైమానిక విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఇందులో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఫ్రాన్స్, జర్మనీ, శ్రీలంక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా సహా ఏడు స్నేహపూర్వక విదేశీ దేశాల వైమానిక దళాలు పాల్గొన్నాయి. వీటితో పాటు 32 దేశాల ప్రతినిధులు పరిశీలకులుగా హాజరయ్యారు.
ఈ విన్యాసాలను విజయవంతంగా నిర్వహించిన భారత వైమానిక దళంతో పాటు ఇందులో భాగస్వాములైన అన్ని సంస్థలు, సిబ్బందిని రక్షణ మంత్రి అభినందించారు. పాల్గొన్న దేశాలకు స్వాగతం పలుకుతూ... వృత్తిపరమైన అవగాహనను పెంపొందించడం, కార్యాచరణ పరమైన సహకారాన్ని బలోపేతం చేయడంలో ఆయా దేశాలు అందించిన సహకారాన్ని ప్రశంసించారు. పాల్గొన్న దేశాల వైమానిక దళాల ఉనికి ఈ విన్యాసాలకు గణనీయమైన విలువను అందించిందని ఆయన పేర్కొన్నారు. ఈ విన్యాసాల ద్వారా విలువైన వృత్తిపరమైన అనుభవాలు, దేశ సామర్థ్యాలు, దృక్పథాలపై మరింత లోతైన అవగాహనతో ఆయా దేశాల బృందాలు తమ దేశాలకు తిరిగి వెళ్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆధునిక యుద్ధరంగంలో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి రక్షణ రంగంలో స్వావలంబన, సాంకేతిక ఆవిష్కరణలు, అంతర్జాతీయ భాగస్వామ్యాలు ఎంతో కీలకమని రక్షణ మంత్రి స్పష్టం చేశారు.
సభను ఉద్దేశించి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగిస్తూ... ఆధునిక యుద్ధ విధానాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు. సంప్రదాయంగా భూమి, సముద్రం, ఆకాశానికి పరిమితమైన యుద్ధ రంగాలు ప్రస్తుతం అంతరిక్షం, సైబర్ రంగం, విద్యుదయస్కాంత తరంగాల పరిధి, సమాచార రంగాలకు కూడా విస్తరించాయని వివరించారు. మానవరహిత వ్యవస్థలు, డ్రోన్లు, కృత్రిమ మేధ, ఎలక్ట్రానిక్ యుద్ధ విధానాలు, సుదూర లక్ష్యాలను కచ్చితంగా ఛేదించే ఆయుధాలు ఆధునిక సైనిక కార్యకలాపాలను ప్రభావితం చేస్తున్నాయని ఆయన తెలిపారు.
‘‘భవిష్యత్తులో సైనిక శక్తి సామర్థ్యం మన వద్ద ఎన్ని ఆయుధ వేదికలు ఉన్నాయనే దానిపై మాత్రమే ఆధారపడి ఉండదు. పరిస్థితులను ఎంత వేగంగా గుర్తించగలుగుతున్నాం, అర్థం చేసుకోగలుగుతున్నాం, నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాం, చర్యలు చేపట్టగలుగుతున్నాం అనే అంశాలే దానిని నిర్ణయిస్తాయి” అని ఆయన పేర్కొన్నారు. సైనిక సామర్థ్యంలో వేగం, కచ్చితత్వం, సమాచారం, సమన్వయం కీలక లక్షణాలుగా మారాయని స్పష్టం చేశారు. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో రక్షణ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధితో ముడిపడిన అనిశ్చితులను దృష్టిలో ఉంచుకుని నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎదురవుతున్నభద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు దేశం తన సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని భారత్ గుర్తించిందని రక్షణ మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా రక్షణ రంగంలో స్వావలంబనను జాతీయ విధానంగా స్వీకరించిందని పేర్కొన్నారు. సుదీర్ఘకాలం పాటు యుద్ధాలు కొనసాగినప్పుడు, అనిశ్చిత పరిస్థితులు ఎదురైనప్పుడు దేశం తన అవసరాలను తానే తీర్చుకునేలా సొంతంగా ఆయుధాలు, కీలక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
భారత రక్షణ దళాల్లో చోటుచేసుకున్న మార్పులను ప్రస్తావిస్తూ.. స్వాతంత్య్రం వచ్చిన సమయంలో పరిమిత వనరులతో పనిచేసిన భారత వైమానిక దళం నేడు ఆధునిక విమానాలు, లక్ష్యాలను కచ్చితంగా ఛేదించే ఆయుధాలు, అత్యాధునిక సెన్సార్లు, సమగ్ర సమాచార వ్యవస్థలు, అభివృద్ధి చెందుతున్న స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాలతో కూడిన ఆధునిక అంతరిక్ష-వైమానిక శక్తిగా ఎదిగిందని రక్షణ మంత్రి పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ అంటే ప్రపంచానికి దూరంగా ఉండటం కాదు అని ఆయన స్పష్టం చేశారు. కీలక రక్షణ సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశీయంగా రూపకల్పన చేయడం, అభివృద్ధి చేయడం, తయారు చేయడం, నిర్వహించడం, అవసరాలకు అనుగుణంగా ఆధునీకరించడం వంటి సామర్థ్యాలను దేశంలోనే పెంపొందించుకోవడమే స్వావలంబన లక్ష్యమని వివరించారు.
భారత్‌లో అభివృద్ధి చెందుతున్న ఏరోస్పేస్, రక్షణ పరికరాల తయారీ వ్యవస్థను ప్రస్తావిస్తూ.. స్వదేశీ రక్షణ కార్యక్రమాలు, వ్యవస్థల గురించి రక్షణ మంత్రి వివరించారు. వీటిలో తేజస్ యుద్ధ విమానం, ధ్రువ్, రుద్ర, ప్రచండ్ హెలికాప్టర్లు, లైట్ యుటిలిటీ హెలికాప్టర్ (ఎల్‌యూహెచ్), ఆకాశ్ వైమానిక రక్షణ వ్యవస్థ, ఏఈఎస్ఏ రాడార్లు, ఎలక్ట్రానిక్ వ్యవస్థలు, అభివృద్ధి చెందుతున్న మానవరహిత, ఏరోస్పేస్ సాంకేతిక పరిజ్ఞానాలు ఉన్నాయి. అయిదో తరం ఆధునిక యుద్ధ విమాన సాంకేతిక పరిజ్ఞానంలో ప్రావీణ్యం సాధించే దిశగా అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ) కార్యక్రమం కీలక ముందడుగు అని రక్షణ మంత్రి పేర్కొన్నారు. అధునాతన విమాన ఇంజిన్ల అభివృద్ధి, వాటి సహ తయారీకి కూడా ప్రాధాన్యత ఉందని వివరించారు. పరిశోధన, సంయుక్త అభివృద్ధి, సహ ఉత్పత్తి, నిర్వహణ, శిక్షణ, ఆవిష్కరణల రంగాల్లో ఒకే విధమైన లక్ష్యాలు కలిగిన దేశాలతో సహకారాన్ని పెంపొందించుకోవడానికి భారత్ ఆసక్తిగా ఉందని ఆయన తెలిపారు. పరస్పర విశ్వాసంతో కూడిన భాగస్వామ్యాలు, సంక్షోభాలను తట్టుకోగల సరఫరా వ్యవస్థల ప్రాముఖ్యత పెరుగుతోందని పేర్కొంటూ,, ‘‘భవిష్యత్తులో రక్షణ సంబంధాలు కేవలం ఆయుధ వేదికలకే పరిమితం కావు.. సాంకేతికత, పరస్పర విశ్వాసమే వాటికి పునాది’’ అని అన్నారు.
బలమైన స్వదేశీ సామర్థ్యాలను నిర్మించుకోవడంతో పాటు, విశ్వసనీయ భాగస్వామ్య దేశాలతో అర్థవంతమైన సహకారాన్ని కొనసాగించాలని రక్షణశాఖ మంత్రి పేర్కొన్నారు. అవసరమైనప్పుడు భారత్ స్వతంత్రంగా చర్యలు తీసుకోగలగాలని, అదే సమయంలో ఇతర దేశాల ప్రయోజనాలు, బాధ్యతలు కలిసివచ్చినప్పుడు వాటితో సమర్థవంతంగా కలిసి పనిచేయగలగాలని ఆయన పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో సామర్థ్యం, సాంకేతికత, పరస్పర కార్యాచరణ సమన్వయం, విశ్వాసం వంటి సూత్రాలను ఆచరణాత్మక అనుభవంగా మార్చడంలో తరంగ్ శక్తి విన్యాసం కీలకమని రక్షణ మంత్రి పేర్కొన్నారు. ఈ విన్యాసం ద్వారా పాల్గొన్న దేశాల వైమానిక దళాలు కలిసి పనిచేయడానికి, కార్యాచరణకు సంబంధించిన జ్ఞానాన్ని పరస్పరం పంచుకోవడానికి, విధివిధానాలను పరిశీలించడానికి, వివిధ రకాల విమానాలు, సైనిక వ్యూహాలు, మిషన్ ప్రణాళికల విధానాలను అర్థం చేసుకోవడానికి అవకాశం లభించిందని తెలిపారు. బహుళజాతి సైనిక విన్యాసాల ద్వారా వైమానిక సిబ్బంది, కమాండర్లు ఒకరి నుంచి మరొకరు నేర్చుకోవచ్చని, ఇప్పటికే అనుసరిస్తున్న విధానాలను పరిశీలించవచ్చని, వ్యవస్థలు, ప్రక్రియలను మెరుగుపరచుకునేందుకు ఉన్న అవకాశాలను గుర్తించవచ్చని ఆయన వివరించారు.
ఈ విన్యాస స్ఫూర్తిని వివరిస్తూ.. ‘‘వేర్వేరు దేశాలు.. వేర్వేరు విమానాలు.. వేర్వేరు అనుభవాలు.. కానీ ఆకాశం ఒక్కటే. ఇదే తరంగ్ శక్తి సందేశం’’ శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అని అన్నారు. ఈ విన్యాసం విలువ కేవలం నిర్వహించిన విమానయాన కార్యకలాపాలు, సాధన చేసిన యుద్ధ పరిస్థితులకే పరిమితం కాదని తెలిపారు. భాగస్వామ్య దేశాల సైనిక దళాలతో సమర్థవంతంగా సమాచారాన్ని పంచుకోవడం, సమన్వయంతో పనిచేయడం, కలిసి కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం కూడా ఇందులో ముఖ్యమని పేర్కొన్నారు. ఈ విన్యాసాల ద్వారా నేర్చుకున్న పాఠాలను శిక్షణ, యుద్ధ వ్యూహాలు, సాంకేతికత, సైనిక సిద్ధాంతాలు, భవిష్యత్తు సామర్థ్యాల అభివృద్ధిలో భారత వైమానిక దళం భాగం చేయాలని రక్షణశాఖ మంత్రి పిలుపునిచ్చారు. ఈ విన్యాసంలో ఏర్పడిన వృత్తిపరమైన సంబంధాలు, పరస్పర అవగాహనను ముందుకు తీసుకెళ్లి, ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో సహకారానికి కొత్త మార్గాలను అన్వేషిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
2024లో నిర్వహించిన తొలి విడత విజయాల ఆధారంగా తరంగ్ శక్తి విన్యాసం రెండో విడత కొనసాగుతోంది. రక్షణ రంగంలో నిర్మాణాత్మక భాగస్వామ్యానికి, అంతర్జాతీయ సహకారానికి భారత్ కట్టుబడి ఉందనే విషయాన్ని ఈ విన్యాసం మరోసారి చాటిచెప్పింది. ఈ విన్యాసంలో వివిధ రకాల యుద్ధ విమానాలు, రవాణా విమానాలు, నిఘా విమానాలు, గగనతలంలోనే ఇంధనం నింపే సామర్థ్యాలు కలిగిన విమానాలు పాల్గొన్నాయి. దీనివల్ల ఉమ్మడి మిషన్ల ప్రణాళిక, కార్యాచరణ అనుభవాల పరస్పర మార్పిడి, వివిధ దేశాల వైమానిక దళాల మధ్య సమన్వయ సామర్థ్యాన్ని మెరుగుపరచుకునే అవకాశాలు లభించాయి. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం (ఎల్‌సీఏ) తేజస్, తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ (ఎల్‌సీహెచ్) ప్రచండ్ వంటి వేదికల భాగస్వామ్యం.. విమానయాన, అంతరిక్ష రంగాల రూపకల్పన, ఇంజినీరింగ్, తయారీలో భారత్ సాధించిన పురోగతిని కూడా ప్రతిబింబించింది.
ఆపరేషన్ సిందూర్‌లో వైమానిక శక్తి నిర్ణయాత్మక పాత్ర పోషించడం ఈ విన్యాసం సమకాలీన ప్రాధాన్యతను మరింత స్పష్టం చేసింది. జాతీయ భద్రతా లక్ష్యాల సాధన కోసం కచ్చితమైన, సమతుల్యమైన, సమర్థవంతమైన కార్యకలాపాలను నిర్వహించే సామర్థ్యం భారత వైమానిక దళానికి ఉందని ఈ ఆపరేషన్ నిరూపించింది. సంక్లిష్టమైన భద్రతా పరిస్థితుల్లో కార్యాచరణ సంసిద్ధత, సమగ్ర ప్రణాళిక, విశ్వసనీయ నిరోధక సామర్థ్యం, వైమానిక శక్తిని సమర్థవంతంగా వినియోగించడం ఎంత ముఖ్యమో ఈ ఆపరేషన్ చాటిచెప్పింది. కార్యాచరణలో పొందిన అనుభవం.. వృత్తిపరమైన అవగాహనను పెంపొందించడంలో, ఆధునిక యుద్ధరంగంలో మారుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం కావడంలో తరంగ్ శక్తి వంటి బహుళజాతి విన్యాసాల ప్రాధాన్యతను మరింత బలపరుస్తోంది.
విమానయాన కార్యకలాపాలకే పరిమితం కాకుండా.. ఈ విన్యాసంలో వృత్తిపరమైన చర్చలు, పారిశ్రామిక సంస్థల సందర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇందులో భాగంగా యోగా కార్యక్రమాలు, చారిత్రక వారసత్వ ప్రదేశాల సందర్శనలు, పాల్గొన్న దేశాల సంప్రదాయాలను చాటిచెప్పే అంతర్జాతీయ సాయంత్రపు వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్ ఎస్. రాజా సుబ్రమణి, వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, నౌకాదళాధిపతి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, ఇతర ప్రముఖులు, రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు, పాల్గొన్న దేశాల ప్రతినిధులు హాజరయ్యారు.
***
(రిలీజ్ ఐడి: 2321968)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3