కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
కార్పొరేట్ సామాజిక బాధ్యతపై మూడో జాతీయ సదస్సు, ప్రదర్శనను ప్రారంభించిన కోల్, గనుల శాఖ సహాయమంత్రి (ఎన్‌సీసీఎస్‌ఆర్-2026)
ఆర్థిక పురోగతి, ప్రయోజనాలు బలమైన సమాజం, విస్తృత అవకాశాలు, సుస్థిర ప్రాంతాలుగా మారినప్పుడే పరిపూర్ణమవుతాయి: కేంద్ర సహాయమంత్రి సతీశ్ చంద్రదూబే
వికసిత్ భారత్ సాకారం కోసం సమష్టి కృషికి సీఎస్‌ఆర్ నిదర్శనం: కార్పొరేట్ వ‌్యవహారల మంత్రిత్వశాఖ కార్యదర్శి డాక్టర్ పల్లవి జైన్ గోవిల్
నాడు పోస్టు చేయడమైనది:
10 OCT 2026 4:21PM by PIB Hyderabad
కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ (ఐఐసీఏ) న్యూఢిల్లీలో నిర్వహించిన మూడో జాతీయ కార్పొరేట్ సామాజిక బాధ్యత సదస్సు, ప్రదర్శన (ఎన్‌సీసీఎస్ఆర్-2026)ను కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయమంత్రి శ్రీ సతీశ్ చంద్ర దూబే ప్రారంభించారు. అక్టోబర్ 6 నుంచి 7వ తేదీ వరకు రెండు రోజులపాటు ఈ సదస్సు జరిగింది. "వికసిత్ భారత్ కోసం సీఎస్‌ఆర్ స్ఫూర్తికి నూతన రూపం: నిబంధనల నుంచి నిబద్ధత దిశగా" ఇతివృత్తంతో నిర్వహించారు.
బొగ్గు, గనుల శాఖ సహాయమంత్రి శ్రీ సతీశ్ చంద్ర దూబే కీలక ఉపన్యాసం ఇచ్చారు. జాతీయ ఆర్థికాభివృద్ధి, ప్రాంతీయ అభివృద్ధి, వనరులు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల ప్రజల సంక్షేమం మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాన్ని స్పష్టం చేశారు. ఆర్థిక పురోగతి, ప్రయోజనాలు "బలమైన సమాజం, విస్తృత అవకాశాలు, సుస్థిర ప్రాంతాలుగా మారినప్పుడే పరిపూర్ణమవుతాయి" అని ఆయన పేర్కొన్నారు.
సహజ వనరులు, స్థానిక కమ్యూనిటీలతో బలంగా ముడిపడున్న రంగాలకు సంబంధించి వృద్ధి, సామాజిక అభివృద్ధిని వేర్వేరు లక్ష్యాలుగా చూడలేమని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బొగ్గు రంగంలో మరింత నిర్మాణాత్మకమైన, అవసరాల ఆధారంగా, ఫలితాలపై దృష్టి సారించే సీఎస్‌ఆర్ అమలు విధానాలకు నిర్దిష్ట దిశను అందించేందుకు రూపొందించిన భారత బొగ్గు కంపెనీల సమగ్ర సీఎస్‌ఆర్ వ్యవస్థను అధికారికంగా విడుదల చేశారు.
భారతదేశంలో మారుతున్న సీఎస్ఆర్ తీరుతెన్నులపై సమగ్ర సమాచారాన్ని అందించే ఇండియా సీఎస్‌ఆర్ ఫ్యాక్ట్‌బుక్ 2024-25ని ఈ ప్రారంభ సదస్సులో విడుదల చేశారు. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి డాక్టర్ పల్లవి జైన్ గోవిల్, భారతదేశంలో ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం ప్రతినిధి శ్రీమతి షోకో ఇషికావా, ఐఐసీఏ డైరెక్టర్ జనరల్, సీఈఓ శ్రీ జ్ఞానేశ్వర్ కుమార్ సింగ్, ఐఐసీఏ బిజినెస్ ఎన్విరాన్‌మెంట్ స్కూల్ హెడ్ ప్రొఫెసర్ గరిమా దాధీచ్ ఈ సదస్సులో వక్తలుగా వ్యవహరించారు.
కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీమతి పల్లవి జైన్ గోవిల్ ప్రారంభ ఉపన్యాసం చేస్తూ... భారతదేశ విస్తృత కార్పొరేట్ పాలన, జాతీయాభివృద్ధి పాలన విధానంలో సీఎస్‌ఆర్‌ను భాగం చేశారు. ఎన్‌సీసీఎస్‌ఆర్-2026 ఇతివృత్తం వాటాదారులకు "వార్షిక బాధ్యతల పరిధిని మించి ఆలోచించాలి" అని పిలుపునిచ్చిందన్నారు. భారతదేశ అభివృద్ధి ప్రయాణానికి బాధ్యతాయుతమైన సంస్థలు చేయగల సహకరాన్ని పరిగణించాలని ఆమె పేర్కొన్నారు. భారతదేశ ప్రత్యేకమైన చట్టపరమైన సీఎస్‌ఆర్ నిర్మాణాన్ని ప్రస్తావిస్తూ... ఈ విధానం చట్టపరమైన బాధ్యతను కంపెనీ స్థాయి బాధ్యత, బోర్డు పర్యవేక్షణ, బహిరంగ వెల్లడి, ప్రభావ అంచనాతో మిళితం చేస్తుందని, వికసిత్ భారత్‌కు అవసరమైన సమష్టి కృషికి సీఎస్‌ఆర్ కీలకమని స్పష్టం చేశారు. ఆమె ఇండియా సీఎస్‌ఆర్ ఫ్యాక్ట్‌బుక్ 2024-25ని పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఐఐసీఏ డైరెక్టర్ జనరల్, సీఈఓ శ్రీ జ్ఞానేశ్వర్ కుమార్ సింగ్ ప్రసంగిస్తూ... క్షేత్రస్థాయి అమలు, కనిపించే అభివృద్ధి ఫలితాలపై ఆధారపడి ఉండేలా సీఎస్‌ఆర్ చర్చలు జరపాల్సిన ప్రాముఖ్యతను స్పష్టం చేశారు. ప్రభుత్వం, పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు, అమలు సంస్థలు, అభివృద్ధి భాగస్వాములు, విద్యావేత్తలను సీఎస్‌ఆర్ ఏకతాటిపైకి తెస్తుందని పేర్కొంటూ... “బోర్డు గదుల్లో నిర్ణయాలు తీసుకుంటాం. కానీ, వాటి విలువ పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, జీవనోపాధి కార్యక్రమాలు, గ్రామాలు, పట్టణాలు, జిల్లాల్లో ప్రజల జీవితాలను ప్రభావితం చేసే విధానం ద్వారానే కనిపిస్తుంది” అని అభిప్రాయపడ్డారు. కేవలం ప్రాజెక్టులను ప్రదర్శించేందుకు మాత్రమే కాకుండా, ఫలితాలను అందరికీ తెలియజేసేలా చేసేందుకు, అభ్యాసనం, అనుసరణ, భాగస్వామ్యానికి వేదికగా జాతీయ సీఎస్‌ఆర్ ప్రదర్శనను రూపొందించినట్లు ఆయన తెలిపారు.
ప్రారంభ సదస్సు తర్వాత "సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్: ప్రయోజనం, మూలధనం, ప్రభావం" అంశంపై ఫైర్‌సైడ్ చాట్ నిర్వహించారు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ పాలసీ సీనియర్ అడ్వైజర్ శ్రీ శైలేష్ కె. పాఠక్, ప్రొఫెసర్ గరిమా దాధీచ్ ఇందులో వక్తలుగా పాల్గొన్నారు. సామాజిక ప్రయోజనాన్ని మూలధనంతో అనుసంధానించటంలో సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ పాత్రను, సామాజిక రంగ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటంలో విశ్వసనీయమైన కొలమానాలు, పారదర్శకత, సంస్థాగత విశ్వాసం ప్రాముఖ్యతను ఈ చర్చలో పరిశీలించారు.
మధ్యాహ్న భోజనం తర్వాత జరిగిన సదస్సులో భారతదేశ ప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి శ్రీ అన్షుమాన్ పట్నాయక్ కీలక ప్రసంగం ఇచ్చారు. కార్పొరేట్ పాలన విస్తృతమవుతున్న తరుణంలో సీఎస్‌ఆర్ ప్రాధాన్యతను వివరిస్తూ... కంపెనీలు సీఎస్‌ఆర్‌ను బాధ్యాయుతమైన కార్పొరేట్ ప్రవర్తన, సంస్థాగత నిర్ణయాల్లో అంతర్భాగంగా చూడాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు. సీఎస్‌ఆర్ భాగస్వాములను అనుసంధానించేందుకు, సార్థకమైన భాగస్వామ్యాన్ని సులభతరం చేసేందుకు సీఎస్‌ఆర్ ఎక్స్ఛేంజ్ పోర్టల్ ప్రాముఖ్యతను తెలియజేస్తూ... అందులో నమోదు చేసుకోవాలని కంపెనీలను ఆహ్వానించారు.
ప్రధానోపన్యాసం అనంతరం "సీఎస్‌ఆర్‌లో బోర్డు పాలన, వ్యూహాత్మక నిబద్ధత" అనే అంశంపై ఉన్నత స్థాయి ప్యానెల్ చర్చ జరిగింది. సీఎస్‌ఆర్‌పై వ్యూహాత్మక పర్యవేక్షణను నిర్దారించటంలో బోర్డులు, సీనియర్ మేనేజ్‌మెంట్ పాత్ర, స్పష్టంగా గుర్తించిన అవసరాలు, ఫలితాలతో ఖర్చును అనుసంధానించాల్సిన ప్రాముఖ్యత, సమర్థవంతమైన పర్యవేక్షణ, జవాబుదారీ వ్యవస్థల ఆవశ్యకతపై ఈ ప్యానెల్ చర్చించింది.
ఈ ప్యానెల్‌లో దాల్మియా భారత్ ఫౌండేషన్ సీఈఓ, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ మాజీ ఛైర్‌పర్సన్ శ్రీ అశోక్ కుమార్ గుప్తా (రిటైర్డ్), అమృత విశ్వవిద్యాలయం ప్రో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మనీషా వి. రమేశ్, ఓఎన్‌జీసీ (ప్రొడక్షన్) డైరెక్టర్ శ్రీ భాస్కర్ చౌదరి నెట్టెం, గెయిల్ (ఇండియా) లిమిటెడ్ (హ్యూమన్ రిసోర్సెస్) డైరెక్టర్ శ్రీ ఆయుష్ గుప్తా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (కోఆర్డినేషన్ అండ్ సీఎస్ఆర్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ బిభూతి రంజన్ ప్రధాన్, మహీంద్రా అగ్రి సొల్యూషన్స్ లిమిటెడ్ స్వతంత్ర డైరెక్టర్ డాక్టర్ పూర్వి మెహతా, హెచ్‌సీఎల్ టెక్ ఉపాధ్యక్షురాలు శ్రీమతి రుచి సాధన పాల్గొన్నారు.
ప్రాజెక్టు ప్రాముఖ్యత, అమలు సామర్థ్యం, భౌగోళిక, నేపథ్య అవసరాలు, పర్యవేక్షణ, మూల్యాంకనం, స్థిరత్వంపై మరింత శ్రద్ధ చూపటం ద్వారా సీఎస్‌ఆర్ నిర్ణయాల నాణ్యతను మెరుగుపరుస్తుందని బోర్డు భాగస్వామ్య చర్చలు స్పష్టం చేశాయి. సీఎస్‌ఆర్ నిబద్ధతలను స్థిరమైన అభివృద్ధి ఫలితాలుగా మార్చటంలో భాగస్వామ్యాలు, వృత్తిపరమైన సంస్థాగత విధానాల ప్రాముఖ్యతను ప్యానెల్ గుర్తించింది.
"ఎస్‌డీజీ ప్రాధాన్యతలతో కూడిన రంగాలవారీగా సీఎస్‌ఆర్ విధానాలు" అంశంపై సీఎస్‌ఆర్ ప్రాధాన్యతలు, రంగాలవారీ అభివృద్ధి ప్రాధాన్యతలు, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల మధ్య మరింత సమన్వయం ఉండాల్సిన అవసరాన్ని రెండో ప్యానెల్ చర్చ పరిశీలించింది. ఈ సెషన్‌కు భారతదేశ ప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి అనితా షా అకెల్లా అధ్యక్షత వహించారు. విభిన్న అభివృద్ధి సవాళ్లు, సంస్థాగత సామర్థ్యాలు, స్థానిక ప్రాధాన్యతలను గుర్తించే రంగాలవారీ విధానాల అవసరాన్ని ఆమె ప్రస్తావించారు.
ఈ ప్యానెల్‌లో భారత ప్రభుత్వ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ లూకాస్ ఎల్. కమ్‌సువాన్, భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వశాఖ ఆర్థిక సలహాదారు శ్రీమతి రీతు జైన్, కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ చేతనా శుక్లా, కేంద్ర గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వశాఖ, సామాజిక గణాంకాల విభాగం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీమతి రుచికా గుప్తా, కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వశాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డేటా, మేనేజ్‌మెంట్) శ్రీ రాజీవ్ కుమార్, ఐటీసీ ఈవీపీ, హెడ్ - సోషల్ ఇన్వెస్ట్‌మెంట్స్ శ్రీ ప్రభాకర్ ఎల్. సభ్యులుగా ఉన్నారు. ది వాఖ్లు అడ్వైజరీ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు శ్రీ భరత్ వాఖ్లు పర్యవేక్షణలో ఈ సమావేశం జరిగింది.
సీఎస్ఆర్ విషయంలో ఒకే రకమైన పద్ధతులను పాటించటం మాని, వివిధ రంగాలకు చెందిన ప్రత్యేక అభివృద్ధి సందర్భాలు, కార్యాచరణ పరిధులు, భాగస్వామ్య వర్గాల అవసరాలను గుర్తించాల్సిన అవసరముందని ప్యానెల్ చర్చించింది. ఈ సందర్భంగా బొగ్గు మంత్రిత్వశాఖ, కోల్ ఇండియా లిమిటెడ్ కోసం ఐఐసీఏ రూపొందించిన రంగాల వారీగా ప్రత్యేక సీఎస్‌ఆర్ విధివిధానాలు... రంగాలవారీ అభివృద్ధి ప్రాధాన్యతలను, సమాజ అవసరాలను తీర్చటంలో ఎంతగానో దోహదపడుతున్నాయని స్పష్టం చేశారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలతో (ఎస్‌డీజీల) అనుసంధానించటం ద్వారా సీఎస్‌ఆర్ నివేదికలను మరింత బలోపేతం చేయాలని, తద్వారా జాతీయ, ప్రపంచ అభివృద్ధి లక్ష్యాలకు కార్పొరేట్ సంస్థల సహకారాన్ని క్రమబద్ధంగా అంచనా వేయటానికి ప్యానెల్ వీలు కల్పించింది.
సీఎస్‌ఆర్ వ్యవస్థాగత నాణ్యతను బలోపేతం చేయాల్సిన అవసరంపై విస్తృత ఏకాభిప్రాయంతో తొలిరోజు సమావేశాలు ముగిశాయి. బోర్డు స్థాయి పర్యవేక్షణ, సాక్ష్యాధారిత ప్రాజెక్టు ఎంపిక నుంచి రంగాలవారీ సమన్వయం, అనుసంధానం, పర్యవేక్షణ, ఫలితాల అంచనా వరకు ఈ చర్చలు సాగాయి. ఈ కార్యకలాపాలు కేవలం నిబంధనలను పాటించటం నుంచి, సమ్మిళిత, కొలవదగిన అభివృద్ధి పట్ల స్థిరమైన కార్పొరేట్ నిబద్ధత దిశగా మార్పు పట్ల ప్రాధాన్యతనిస్తూ సదస్సు ఇతివృత్తాన్ని ప్రతిబింబించాయి.
ఈ సదస్సులో భారత ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ రంగ కంపెనీలు, అంతర్జాతీయ సంస్థలు, విద్యావేత్తలు, పౌర సమాజ ప్రతినిధులు పాల్గొని, జాతీయ అభివృద్ధి ప్రాధాన్యతలకు మద్దతివ్వటంలో మారుతున్న కార్పొరేట్ సామాజిక బాధ్యత పాత్రపై చర్చించారు. సీఎస్‌ఆర్ కార్యక్రమాలు సంస్థాగత బాధ్యత, స్థానిక అభివృద్ధి అవసరాలు, కొలవదగిన ఫలితాలు, భాగస్వాముల మధ్య సమర్థవంతమైన సమన్వయంతో నడిపించాల్సిన అవసరాన్ని ఈ చర్చలు స్పష్టం చేశాయి.
ఐఐసీఏ ఆధ్వర్యంలోని స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎన్విరాన్‌మెంట్ ఆధ్వర్యంలో ఈ ఎన్‌సీసీఎస్‌ఆర్-2026 సదస్సు నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు, విద్యాసంస్థలు, ప్రజా భాగస్వామ్యం ఉంది.
(రిలీజ్ ఐడి: 2321954)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7