మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

యువ సంగమం ఏడో దశలో భాగంగా అస్సాం సుసంపన్న

సాంస్కృతిక వారసత్వం, సంప్రదాయాలను తెలుసుకున్న తెలంగాణ ప్రతినిధి బృందం
అస్సాం గవర్నర్ శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యతో సమావేశమైన ప్రతినిధి బృందం

నాడు పోస్టు చేయడమైనది: 10 OCT 2026 7:20PM by PIB Hyderabad

భారత యువతలో సాంస్కృతిక, భావోద్వేగ బంధాలను బలపరచడానికి 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' చొరవలో భాగంగా విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఉన్నత విద్యా శాఖ 'యువ సంగమం' ఏడో విడత కార్యక్రమాన్ని నిర్వహించింది.

20 జంట రాష్ట్రాలు, ఉన్నత విద్యా సంస్థల ద్వారా పరస్పర అవగాహనను, జాతీయ సమైక్యతను పెంపొందిస్తూ... వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సాంస్కృతిక వారసత్వాన్ని, సంప్రదాయాలను, విద్యా రంగాన్ని,  అభివృద్ధి అంశాలను అన్వేషించడానికి ఈ కార్యక్రమం యువ భాగస్వాములకు అవకాశం కల్పించింది.

కర్ణాటక కేంద్రీయ విశ్వవిద్యాలయం నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం 2026 అక్టోబర్ 4న గౌహతికి చేరుకున్న సందర్భంగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) గౌహతి ఘన స్వాగతం పలికింది.

తెలంగాణ ప్రతినిధి బృందం అస్సాంలో 2026 అక్టోబర్ 5న ఒక ఉత్తేజకరమైన యోగా సెషన్‌తో తమ పర్యటనను  ప్రారంభించింది. భారతదేశ సంప్రదాయ విజ్ఞానం, సాంస్కృతిక వారసత్వంలోని ఒక ముఖ్యమైన కోణాన్ని అనుభూతి చెందుతూనే... యువ ప్రతినిధులు తమ రోజును ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, సానుకూల శక్తితో ప్రారంభించడానికి ఈ సెషన్ చక్కటి అవకాశాన్ని అందించింది.

తెలంగాణ ప్రతినిధి బృందం అదే రోజున అస్సాం గవర్నర్ శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను మర్యాదపూర్వకంగా కలుసుకుంది. ఈ సమావేశం ద్వారా యువ ప్రతినిధులు అస్సాం సంపన్న వారసత్వం, సంప్రదాయాలు, సాంస్కృతిక విశిష్టతపై అవగాహన పెంచుకున్నారు. ఈ పరస్పర చర్చలు భారతదేశ వైవిధ్యభరితమైన సాంస్కృతిక స్వరూపంపై యువ ప్రతినిధుల అవగాహనను మరింత పెంపొందించాయి. దేశవ్యాప్తంగా యువత మధ్య పరస్పర సంబంధాలను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను కూడా వారికి తెలియజేశాయి.

యువ సంగమం ఏడో దశలో భాగంగా తెలంగాణ - అస్సాం రాష్ట్రాల మధ్య చేపట్టిన ఈ పరస్పర పర్యటన.. దేశంలోని వైవిధ్యాన్ని అన్వేషించడానికి, సొంత రాష్ట్రాలకు ఆవల ఉన్న సమాజాలతో మమేకం కావడానికి, భారతదేశ ఉమ్మడి సాంస్కృతిక వారసత్వంపై మరింత లోతైన అవగాహన పెంపొందించుకోవడానికి యువ భారతీయులను ప్రోత్సహించాలనే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాన్ని ప్రతిబింబిస్తోంది. ఇలాంటి పరస్పర పర్యటన  కార్యక్రమాలు యువతకు కొత్త విషయాలను తెలుసుకోవడానికి, ఇతరులతో అనుబంధాలను పెంపొందించుకోవడానికి, చిరస్మరణీయ అనుభూతులను సొంతం చేసుకోవడానికి విలువైన అవకాశాలను కల్పిస్తాయి. అదే సమయంలో ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’  విస్తృత లక్ష్య సాధనకు దోహదపడుతూ, భిన్నత్వంలో ఏకత్వ  భారతీయ స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2321949) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी