ఆర్థిక మంత్రిత్వ శాఖ
మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యల్లో భాగంగా
రైలు ప్రయాణికుడి నుంచి సుమారు 5.75 కిలోల క్రిస్టల్ మెత్‌ను స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ - ఒకరి అరెస్టు
నాడు పోస్టు చేయడమైనది:
11 OCT 2026 10:25AM by PIB Hyderabad
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) మంగళూరు ప్రాంతీయ విభాగం ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించిన నిఘా ఆధారిత సోదాల్లో భాగంగా... ఢిల్లీ నుంచి బెంగళూరుకు రైలులో ప్రయాణిస్తున్న ఒక భారత పౌరుడిని తనిఖీ చేసింది. ప్రయాణికుడి ట్రాలీ బ్యాగ్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అధికారులు, మెథాంఫేటమిన్ (క్రిస్టల్ మెత్)గా అనుమానిస్తున్న 5.753 కిలోల తెల్లటి స్ఫటికాకార పదార్థం గల మూడు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) చట్టం-1985లోని నిబంధనల ప్రకారం ఈ అనుమానిత మాదక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి, సంబంధిత ఎన్‌డీపీఎస్ కోర్టు ఆదేశాల మేరకు జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేశారు.
మెథాంఫేటమిన్‌ను సాధారణంగా క్రిస్టల్ మెత్ లేదా ఐస్ అని పిలుస్తారు. ఇది కేంద్రీయ నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే ఒక శక్తిమంతమైన, అత్యంత వ్యసనకరమైన కృత్రిమ మానసిక ఉత్ప్రేరక పదార్థం. దీని దుర్వినియోగం వలన దీనిపై పూర్తిగా ఆధారపడటం... శారీరక, మానసిక ఆరోగ్యంపై గణనీయమైన ప్రతికూల పరిణామాలూ సంభవించవచ్చు. దేశంలో మెథాంఫేటమిన్... నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) చట్టం-1985 నియంత్రణలో గల ఒక సైకోట్రోపిక్ పదార్థం. ఈ చట్టం ప్రకారం... అనధికారికంగా దీనిని కలిగి ఉండటం, తయారు చేయడం, అమ్మడం, కొనడం, రవాణా చేయడం, దిగుమతి లేదా ఎగుమతి చేయడం శిక్షార్హం. నేరం స్వభావం, లభించిన పరిమాణంపై శిక్ష తీవ్రత ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత కేసులో స్వాధీనం చేసుకున్న 5.753 కిలోల పరిమాణం... మెథాంఫేటమిన్ కోసం నోటిఫై చేసిన వాణిజ్య పరిమాణం 50 గ్రాముల కంటే చాలా ఎక్కువ. దీనికి 10 నుంచి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ. 1 నుంచి 2 లక్షల జరిమానా విధించవచ్చు.
నిఘా ఆధారిత సోదాల ద్వారా మాదకద్రవ్యాల అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి డీఆర్ఐ కట్టుబడి ఉంది.
***
(రిలీజ్ ఐడి: 2321947)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6