గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కోల్‌కతాలో అటవీ హక్కుల చట్టం అమలుపై రెండో ప్రాంతీయ సమీక్షా సమావేశం నిర్వహణ పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, రికార్డుల్లో హక్కుల నమోదు, సామాజిక అటవీ వనరుల హక్కులు, పీవీటీజీ ఆవాస హక్కులపై ఎనిమిది రాష్ట్రాల్లో పురోగతిపై సమీక్ష జిల్లా వారీగా, నిర్దిష్ట గడువులతో కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని సూచన

నాడు పోస్టు చేయడమైనది: 10 OCT 2026 12:31PM by PIB Hyderabad

కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అటవీ హక్కుల గుర్తింపు చట్టం–2006 (షెడ్యూల్డ్ తెగలు, ఇతర సంప్రదాయ అటవీ నివాసుల అటవీ హక్కుల గుర్తింపు చట్టం) అమలుపై రెండో ప్రాంతీయ సమీక్షా సమావేశం 2026 అక్టోబర్ 9న పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఎనిమిది రాష్ట్రాలకు చెందిన గిరిజన సంక్షేమ, రెవెన్యూ, అటవీ శాఖల ఉన్నతాధికారులు, గిరిజన పరిశోధనా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆ రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, అస్సాం, త్రిపుర, జార్ఖండ్, ఒడిశా, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్. అటవీ హక్కుల పట్టాల డిజిటలైజేషన్, వాటిని ప్రభుత్వ రికార్డుల్లో చేర్చడం, అటవీ హక్కుల పట్టాదారులకు జీవనోపాధి పథకాలను అనుసంధానించడం, హక్కుదారులకు రుణ సదుపాయాలు కల్పించడం వంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేపట్టిన ఉత్తమ విధానాలను వివరించేందుకు ఆ రాష్ట్ర ఉన్నతాధికారులను కూడా ఆహ్వానించారు. అటవీ హక్కుల దరఖాస్తులు పెద్ద సంఖ్యలో పెండింగ్‌లో ఉన్న జిల్లాలకు చెందిన జిల్లా కలెక్టర్లు, సబ్‌ కలెక్టర్లు, ఐటీడీపీ/ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. చట్టం అమలు ప్రస్తుత స్థితిని సమీక్షించడంతో పాటు, వివిధ శాఖల సమన్వయంతో ముందుకు సాగేందుకు చేపట్టాల్సిన చర్యలపై వారు చర్చించారు. దక్షిణాది రాష్ట్రాల కోసం 2026 సెప్టెంబర్ 10న బెంగళూరులో నిర్వహించిన మొదటి ప్రాంతీయ సమీక్షా సమావేశానికి కొనసాగింపుగా ఈ రెండో సమావేశాన్ని నిర్వహించారు.

 

 

 

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ గిరిజన అభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి స్వాగత ప్రసంగంతో సమావేశ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశం లక్ష్యాలను ఆయన వివరించి, హాజరైన ప్రముఖులు, ప్రతినిధులకు అధికారికంగా స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి కీలకోపన్యాసం, ఆ శాఖ కార్యదర్శి ప్రత్యేకోపన్యాసం చేశారు.

 

 

 

కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి మాట్లాడుతూ.. 2026 ఆగస్టు 31 నాటికి దేశవ్యాప్తంగా 54 లక్షలకు పైగా అటవీ హక్కుల దరఖాస్తులు అందాయని, వాటిలో సుమారు 25 లక్షల హక్కుల పట్టాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇంకా సుమారు 11 లక్షల దరఖాస్తులు వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నాయని, 18 లక్షలకు పైగా దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్, ఒడిశా, అస్సాం రాష్ట్రాల్లోని కొన్ని నిర్దిష్ట జిల్లాల్లో దరఖాస్తుల పెండింగ్‌ ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. ఈ ప్రాంతీయ సమావేశంలో చట్టం, నిబంధనలకు అనుగుణంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను సకాలంలో పరిష్కరించడం.. చట్టం, నిబంధనలకు అనుగుణంగా తిరస్కరించిన దరఖాస్తులను సమీక్షించడం.. అటవీ హక్కుల చట్టానికి సంబంధించిన సమాచారాన్ని సమన్వయం చేసి, సరిచూసుకోవడం.. ఎఫ్‌ఆర్‌ఏ కేసు రికార్డులను డిజిటలైజేషన్ చేయడం.. గుర్తించిన హక్కులను రెవెన్యూ, అటవీ శాఖల రికార్డుల్లో నమోదు చేయడం.. సామూహిక అటవీ వనరుల హక్కుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయడం.. పీవీటీజీ ఆవాస హక్కులను గుర్తించడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన వివరించారు.

అవగాహన కల్పించడం, హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి తదుపరి దశలో అవసరమైన సహాయం అందించడం, సామాజిక అటవీ వనరుల నిర్వహణ ప్రణాళికలను రూపొందించడం వంటి అంశాలపై గ్రామసభల సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్రాలు ప్రాధాన్యతతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని గిరిజన పరిశోధన సంస్థలు, సమాచార సాంకేతిక విభాగం (టీఆర్‌ఐ, ఐటీ) ఉప కార్యదర్శి అటవీ హక్కుల రికార్డుల డిజిటలైజేషన్‌పై ప్రసంగించారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయి అటవీ హక్కుల వేదిక, అటవీ హక్కుల మొబైల్ యాప్ పనితీరును ప్రదర్శించారు. అటవీ హక్కుల పరిపాలనలో డిజిటలైజేషన్, భౌగోళిక సమాచార అనుసంధానం, నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగపడే వ్యవస్థల అభివృద్ధికి ఇవి దోహదపడతాయని వివరించారు. రాష్ట్రాలు తమ వద్ద ఇప్పటికే ఉన్న అటవీ హక్కుల రికార్డులను అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్ (ఏపీఐ) ద్వారా అనుసంధానించుకోవాలని ఆయన కోరారు. 

రాష్ట్రాల వారీగా ప్రజెంటేషన్లు 

 

ఎనిమిది రాష్ట్రాలకు చెందిన అధికారులు తమ తమ రాష్ట్రాల్లో అటవీ హక్కుల చట్టం (ఎఫ్‌ఆర్‌ఏ) అమలు తీరును వివరించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, హక్కుల వివరాలను ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేయడం, సామూహిక అటవీ వనరుల హక్కులు (సీఎఫ్‌ఆర్‌ఆర్‌), ప్రత్యేకంగా బలహీన గిరిజన సమూహాల (పీవీటీజీలు) ఆవాస హక్కుల గుర్తింపు, అటవీ హక్కుల రికార్డుల డిజిటలైజేషన్ వంటి అంశాలపై వివరాలను సమర్పించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను సకాలంలో పరిష్కరించడం, తిరస్కరించిన దరఖాస్తులను పునఃసమీక్షించడం, సామాజిక అటవీ వనరుల హక్కులు, ఆవాస హక్కులను నిర్దిష్ట గడువులోగా గుర్తించడం వంటి అంశాలపై రాష్ట్రాలు తమ కార్యాచరణ ప్రణాళికలను వివరించాయి. అర్హులైన హక్కుదారులకు జీవనోపాధి, అభివృద్ధి పథకాల ద్వారా సహాయం అందేలా వివిధ ప్రభుత్వ పథకాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడంపైనా ప్రణాళికలను సమర్పించాయి. 

కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ముగింపు ప్రసంగంతో సమావేశం ముగిసింది. అనంతరం అటవీ హక్కుల చట్టం విభాగం డైరెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.

***


(రిలీజ్ ఐడి: 2321727) సందర్శకుల సూచీ సంఖ్య : : 27
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Gujarati , Tamil