కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఇండియా మొబైల్ కాంగ్రెస్-2026లో 'ఏఐ ఫర్ గుడ్ ల్యాబ్' కార్యశాలను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా
"ఏఐ నిజమైన కొలమానం దాని మోడల్ పరిమాణం కాదు... దాని ద్వారా మెరుగుపడిన జీవితాల సంఖ్య": కేంద్ర మంత్రి శ్రీ సింధియా
'గ్లోబల్ సౌత్'లో ఏఐ వ్యూహం, దాని ప్రభావం మధ్య అంతరాన్ని తగ్గించేందుకు, పైలట్ దేశంగా ఐటీయూతో భారత్ భాగస్వామ్యం
నాడు పోస్టు చేయడమైనది:
09 OCT 2026 6:17PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ)-2026 వేదికగా "ఏఐ ఫర్ గుడ్ ల్యాబ్ కార్యశాల: వ్యూహం నుంచి ప్రభావం దాకా" కార్యక్రమాన్ని కేంద్ర కమ్యూనికేషన్లు, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా ప్రారంభించారు. టెలికమ్యూనికేషన్ల శాఖ (డీవోటీ), కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ, అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) సంయుక్తంగా ఈ ప్రతిష్ఠాత్మక సదస్సును నిర్వహించాయి. ఏఐని కేవలం అంతర్జాతీయ వ్యూహాత్మక చర్చలకే పరిమితం చేయకుండా... క్షేత్రస్థాయిలో ఆచరణాత్మక వినియోగం, స్థానిక పరిష్కారాలు, మానవ ప్రయోజనాలకూ విస్తరించడంలో ఈ కార్యశాల కీలక మైలురాయిగా నిలిచింది. ఈ కార్యశాలలో ఐటీయూ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ బిలాల్ జమూసీ, టెలికమ్యూనికేషన్ల విభాగం కార్యదర్శి శ్రీ అమిత్ అగర్వాల్‌తో పాటు ప్రముఖ పరిశోధకులు, ఆవిష్కర్తలు, పారిశ్రామిక దిగ్గజాలు, విధాన నిపుణులు పాల్గొన్నారు.
సదస్సునుద్దేశించి కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా మాట్లాడుతూ... “ఈ 'ఏఐ ఫర్ గుడ్ ల్యాబ్' జెనీవా నుంచి న్యూఢిల్లీ దాకా సాగించిన ప్రయాణం... ఏఐ సాంకేతికత సాధించాల్సిన అసలైన ప్రయాణాన్ని ప్రతిబింబిస్తోంది. గ్లోబల్ చర్చల స్థాయి నుంచి స్థానిక పరిష్కారాల వైపు... సాంకేతిక సాధ్యత నుంచి మానవ జీవితాలపై అది చూపే ప్రభావం వైపు... ఒక వ్యూహం నుంచి క్షేత్రస్థాయి విస్తరణ వైపు ఏఐ అడుగులు వేయాలి. ఏఐ సాధించాలనుకునే ఆశయాలకు, దాని నిజమైన ప్రభావానికి మధ్య దూరాన్ని... నైపుణ్యాలు, గణన, డేటా, సంస్థలు, కనెక్టివిటీ మాత్రమే భర్తీ చేయగలవు. ఏఐ నిజమైన విజయం దాని మోడల్స్ పరిమాణంపైనో లేదా దాని అల్గారిదమ్స్ సాంకేతికతపైనో ఆధారపడి ఉండదు. అది ఎంతమంది మానవుల జీవితాలను మెరుగుపరిచింది అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది" అని అన్నారు.
భారత సనాతన జీవన తత్వమైన "సర్వజన హితాయ, సర్వజన సుఖాయ" సిద్ధాంతాన్ని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పునరుద్ఘాటించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ దాదాపు 220 కోట్ల మంది ప్రజలు ఇంటర్నెట్ సౌకర్యానికి దూరంగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. సాంకేతికత కేవలం కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం కాకుండా.. మానవాళి అందరికీ అవకాశాలను విస్తరింపజేయాలని ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుతం ఉన్న డిజిటల్ విభజన భవిష్యత్తులో "ఏఐ విభజన"గా మారకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
ఈ సదస్సునుద్దేశించి కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ.. రూ. 10,000 కోట్లకు పైగా కేటాయింపులతో సాగుతున్న 'ఇండియాఏఐ మిషన్' ద్వారా దేశీయ ఏఐ సామర్థ్యాలు, డిజిటల్ మౌలిక వసతులలో సాధించిన కీలక విజయాలను వివరించారు. దీని కింద అంతర్జాతీయ సగటు ధరలో కేవలం మూడో వంతు ఖర్చుతోనే 38,000 పైగా హై-ఎండ్ జీపీయూలను అందుబాటులోకి తెచ్చామనీ, వీటికి తోడు మరో 20,000 జీపీయూలను జోడిస్తున్నామనీ ఆయన తెలిపారు. 'ఏఐ కోశ్' ప్లాట్‌ఫారమ్ ద్వారా వ్యవసాయం, ఆరోగ్యం, విద్యా రంగాలకు చెందిన డేటాసెట్‌లను అందుబాటులోకి తెస్తున్నామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఏఐ నైపుణ్యాల విస్తరణలో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలో ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. గిట్‌హబ్‌లోని కీలక ఓపెన్-సోర్స్ ఏఐ ప్రాజెక్టుల్లో భారతీయ డెవలపర్ల వాటా 5.2 శాతంగా ఉందని ఆయన పేర్కొన్నారు. భద్రత విషయానికొస్తే, 'సంచార్ సాథీ' లాంటి ఏఐ సాధనాల ద్వారా 7.14 కోట్లకు పైగా నకిలీ మొబైల్ కనెక్షన్లను తొలగించామన్నారు. 35 లక్షలకు పైగా పోయిన ఫోన్లను గుర్తించి, రూ. 5,000 కోట్లకు పైగా సంభావ్య ఆర్థిక మోసాలను అరికట్టామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సెంటర్ (టీఈసీ) ద్వారా ఏఐ పారదర్శకత, పటిష్ఠతపై జాతీయ ప్రమాణాలను రూపొందిస్తూ... అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 'నేషనల్ వర్కింగ్ గ్రూప్ ఆన్ ఏఐ స్టాండర్డైజేషన్'ను ఏర్పాటు చేసినట్లు కేంద్ర మంత్రి వివరించారు.
పరిమిత నైపుణ్యాలు, విచ్ఛిన్న ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాల కొరత వంటి సవాళ్లను అధిగమించడంలో దేశాలకు సహాయపడటానికి రూపొందించిన 'ఏఐ ఫర్ గుడ్ ల్యాబ్' విధాన ప్రణాళికను ఈ కార్యశాల పరిచయం చేసింది. ఇది మూడు పరస్పర అనుసంధాన స్తంభాల ఆధారంగా పనిచేస్తుంది. మొదటిది, 'ఏఐ సంసిద్ధత, విధానం'. ఇది విధానపరమైన లోపాలను అంచనా వేసి, ఆచరణాత్మక పాలనా విధానాలను రూపొందిస్తుంది. రెండోది, 'ఏఐ నైపుణ్యాల అభివృద్ధి'. ఇది జాతీయ ఏఐ ప్రతిభను మెరుగుపరచడం, సామర్థ్య నిర్మాణం, శిక్షణా కార్యక్రమాలపై దృష్టి సారిస్తుంది. మూడోది, 'పబ్లిక్ ఏఐ మౌలిక సదుపాయాలు'. ఇది స్థానికంగా సంబంధిత ఏఐ పరిష్కారాలను పరీక్షించడం, ధ్రువీకరించడం, విస్తరించడం, తిరిగి ఉపయోగించడం కోసం ప్రమాణాల ఆధారితమైన, పరస్పర అనుసంధానమైన ఏఐ శాండ్‌బాక్స్ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా, గల్ఫ్ దేశాల భాగస్వాములతో పాటు పది పైలట్ దేశాల్లో ఒకటిగా భారత్... తన భాగస్వామ్య కంప్యూట్, ఓపెన్ డేటాసెట్‌లు, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) నమూనాతో గ్లోబల్ సౌత్ వ్యాప్తంగా అభ్యసన, సాంకేతిక సహకారానికి నాయకత్వం వహిస్తోంది.
ఈ సమావేశాలు... సంస్థాగత భాగస్వామ్యం, ప్రాధాన్య రంగాల్లో సాంకేతికతను అందిపుచ్చుకోవడం, గ్లోబల్ సౌత్ దేశాల మధ్య జ్ఞానాన్ని పంచుకోవడం కోసం ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను రూపొందించడంపై నిర్మాణాత్మక చర్చలను అందించాయి. స్థానిక పరిష్కారాలను మారుమూల ప్రాంతాల పౌరుల వరకు విస్తరించడానికి ముందే... వాటి పారదర్శకత, పటిష్ఠత, భద్రతను ధ్రువీకరిస్తూ ప్రయోగాలు చేయడానికి అవసరమైన 'ఏఐ శాండ్‌బాక్స్' నిబంధనలపై భాగస్వాములందరి మధ్య ఒక ఉమ్మడి అవగాహన కుదిరింది.
ఈ కార్యశాల ముగింపు సమావేశంలో డాక్టర్ బిలేల్ జమూసి సమర్పించిన నివేదికతో కార్యక్రమం ముగిసింది. టెలికమ్యూనికేషన్ల శాఖ (డీవోటీ)కి చెందిన ఏఐ, డిజిటల్ ఇంటెలిజెన్స్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీ సంజీవ్ కుమార్ శర్మ మాట్లాడుతూ... భవిష్యత్తు కార్యాచరణకు పిలుపునిచ్చారు. అనంతరం టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సెంటర్ (టీఈసీ) సీనియర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీ ఎస్. టి. అబ్బాస్ కీలక ప్రసంగం చేశారు.
అందరి కోసం వినూత్న, సమష్టి, సురక్షిత, విశ్వసనీయ, ప్రయోజనకరమైన ఏఐ వ్యవస్థను నిర్మించడానికి.. ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థలు, అంకురసంస్థలు, పౌర సమాజం, అంతర్జాతీయ సంస్థల మధ్య నిరంతర సహకారం ప్రాముఖ్యతను ఈ కార్యశాల మరింత బలోపేతం చేసింది. ఈ చర్చలు కేవలం మాటల స్థాయి నుంచి ఆచరణలోకి... ఒక విజన్ నుంచి కార్యాచరణలోకి... విడివిడిగా సాగే ప్రయత్నాల నుంచి 'అందరి మేలు కోసం ఏఐ', 'అందరి కోసం ఏఐ' అనే ఉమ్మడి ఉద్యమంగా ముందుకు సాగడానికి బలమైన పునాదిని అందించాయి.
***
(రిలీజ్ ఐడి: 2321554)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5