వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ప్రపంచం సరిహద్దులు కడుతుంటే, భారత్ స్నేహ వారధులను నిర్మిస్తోంది: వాణిజ్య, పరిశ్రమల శాఖ కేంద్రమంత్రి శ్రీ పీయూష్ గోయల్
ఒక ట్రిలియన్ డాలర్ల ఎగుమతి లక్ష్య సాధనపై భారత్ ధీమా… 7 శాతానికి పైగా వృద్ధి నమోదు: శ్రీ పీయూష్ గోయల్
నిరంతరాయంగా సాగిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవలను కొనియాడిన శ్రీ పీయూష్ గోయల్
కీలక రంగాలను రక్షిస్తూనే, ఎగుమతులు, పెట్టుబడి అవకాశాలపై దృష్టి సారిస్తున్న భారతదేశ ఎఫ్‌టీఏలు: శ్రీ పీయూష్ గోయల్
సాంకేతికత ఆధారిత అభివృద్ధి, పరిపాలన ద్వారా ప్రగతిశీల రాష్ట్రంగా ఎదుగుతున్న ఆంధ్రప్రదేశ్: శ్రీ పీయూష్ గోయల్
నాడు పోస్టు చేయడమైనది:
08 OCT 2026 2:34PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో జరిగిన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు సన్నాహక కార్యక్రమం సందర్భంగా వాణిజ్య, పరిశ్రమల శాఖ కేంద్రమంత్రి శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ… "ప్రపంచం విభేదాలతో సతమతం అవుతున్న కాలంలోనే, భారత్ స్నేహ వారధులను నిర్మించింది" అని అన్నారు. గతేడాది భారత్ 863 బిలియన్ డాలర్ల ఎగుమతులను నమోదు చేయగా… ఈ ఏడాది ఒక ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ వాణిజ్యం కేవలం 2.5 నుంచి 3 శాతం మాత్రమే వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్న తరుణంలో ఇది దాదాపు 16 శాతం వృద్ధిని సూచిస్తుందన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒడిదొడుకులకు లోనయ్యే అవకాశం ఉందని, ప్రపంచ వృద్ధి రేటు 3 శాతం కన్నా తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నట్లు వెల్లడించారు.
భారత్ నిర్దేశించుకున్న ఒక ట్రిలియన్ డాలర్ల ఎగుమతి లక్ష్యాన్ని కచ్చితంగా సాధిస్తామని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ లక్ష్యం ప్రభుత్వం నిర్దేశించుకున్నది మాత్రమే కాదని... దేశ ప్రజలు, వ్యాపార వర్గాలు, 6.3 మిలియన్ల ఎంఎస్ఎంఈలు, చిన్న, పెద్ద పరిశ్రమలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, దాదాపు 2,50,000 అంకుర సంస్థలు సంయుక్తంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వృద్ధి అంచనాలను ఆర్బీఐ మరోసారి పెంచిందన్నారు. ఏటా 7 శాతానికి పైగా వృద్ధి రేటును నమోదు చేస్తూ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ సన్నాహక కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్రమంత్రి హాజరయ్యారు. విశాఖపట్నంలో నవంబర్ 12, 13 తేదీల్లో భాగస్వామ్య సదస్సు జరుగుతుంది.
ఈ సదస్సులో పాల్గొనాల్సిందిగా ప్రపంచ దేశాలకు కేంద్రమంత్రి శ్రీ పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. భారతదేశ వృద్ధి, అవకాశాలు, భాగస్వామ్యాలను పరిశీలించేందుకు ఈ భాగస్వామ్య సదస్సు అద్భుతమైన వేదికగా నిలుస్తుందని అన్నారు. విశాఖపట్నంలో జరిగే ఈ సదస్సుకు ఆయా దేశాల శక్తిమంతమైన ప్రతినిధి బృందాలను పంపాలని విజ్ఞప్తి చేశారు. సదస్సులో భాగంగా నిర్వహించే విభిన్న కార్యక్రమాలు, చర్చా వేదికలు, అధికారిక, అనధికారిక వ్యవస్థల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఎంఎస్ఎంఈల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు ప్రతి రాష్ట్ర కౌన్సిల్ లోనూ ఎఫ్‌టీఏ వినియోగ డెస్కులను ఏర్పాటు చేయాలని సీఐఐని కేంద్రమంత్రి కోరారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై అవగాహన కల్పించటం, నూతన మార్కెట్ అవకాశాలు, రూల్స్ ఆఫ్ ఆరిజన్‌ను తెలిపేందుకు ఈ డెస్కులు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రదర్శనలు, సదస్సుల్లో ప్రతినిధి బృందాలు పాల్గొనటం ద్వారా ఎంఎస్ఎంఈల ఉత్పత్తులు, సాంకేతికతలు, సేవలను ప్రపంచ మార్కెట్లకు పరిచయం చేసుకునేందుకు వీలుంటుందని అన్నారు.
ప్రభుత్వ పాలనలో 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజాసేవను కొనియాడారు. అక్టోబర్ 7, 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మే 26, 2014న ప్రధానమంత్రిగా ఎన్నికై, ఇప్పటివరకు ప్రజాసేవ కొనసాగుతోందని చెప్పారు. కళంకం లేని వ్యక్తిగా 25 ఏళ్ల పాటు ప్రజాసేవ చేశారని కేంద్రమంత్రి కొనియాడారు. భారత్‌ను శక్తిమంతమైన దేశంగా తీర్చిదిద్దటానికి, భారతదేశ పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకువచ్చేందుకు, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌ను నిర్మించటమే ఆయన లక్ష్యమని కేంద్రమంత్రి తెలిపారు.
2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు, దేశంలో పుట్టే ప్రతిబిడ్డ కలను సాకారం చేసేందుకు 140 కోట్ల మంది భారతీయుల ఉమ్మడి సంకల్పాన్ని ప్రధానమంత్రి ముందుకు నడిపిస్తున్నారని శ్రీ పీయూష్ గోయల్ అన్నారు.
భగవద్గీతలోని 3వ అధ్యాయంలో 21వ శ్లోకాన్ని ఉదహరిస్తూ, శ్రీ పీయూష్ గోయల్ ఇలా అన్నారు. "ఉత్తమ నాయకులు ఆచరించి చూపిన మార్గాన్నే ఇతరులు అనుసరిస్తారు. వారు ఏర్పరచిన ప్రమాణాలనే ప్రపంచం తీసుకుంటుంది" అని అన్నారు. ప్రధానమంత్రి స్వయంగా నడిపించిన 25 ఏళ్ల సేవా కార్యక్రమాల పట్ల దేశం గర్విస్తోందని అన్నారు.
సంక్షేమం, సుపరిపాలన ప్రయోజనాలను ప్రతి లబ్ధిదారుడికి చేర్చటంపై ప్రధానమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారని కేంద్రమంత్రి కొనియాడారు. గుజరాత్‌లో జ్యోతిగ్రామ్ యోజన అమలును ఉదాహరణగా చెబుతూ.. ప్రతీ ఇళ్లు, ప్రతీ వ్యవసాయ క్షేత్రానికి విద్యుత్ అందించటంతో పాటు పారిశ్రామికీకరణను ప్రోత్సహించేందుకు పరిశ్రమలకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు ఆ కాలంలో చేపట్టిన తొలి ప్రయత్నమిదని పేర్కొన్నారు.
ప్రభుత్వం, ప్రజల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేసిన జామ్ త్రయం… జన్-ధన్, ఆధార్, మొబైల్ గురించి, దేశవ్యాప్తంగా డిజిటల్ సాంకేతికతను, డిజిటల్ అనుసంధాన విస్తరణలో కీలక పాత్ర పోషించిన డిజిటల్ ఇండియా గురించి ఆయన ప్రస్తావించారు.
ఇండియా మొబైల్ కాంగ్రెస్ 10వ ఎడిషన్‌ను ప్రస్తావిస్తూ… గత 12 ఏళ్లలో డిజిటల్ ఇండియా ఉద్యమం కారణంగా దేశానికి రూ.5 లక్షల కోట్లకుపైగా ఆదా జరిగిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుర్తు చేశారని ఆయన తెలిపారు.
దేశాభివృద్ధి కోసం ప్రధానమంత్రి సులభమైన మార్గాన్ని కాకుండా ఎల్లప్పుడూ కఠినమైన సంస్కరణల మార్గాన్నే ఎంచుకున్నారని కేంద్రమంత్రి అన్నారు. దేశంలో వేర్వేరుగా ఉన్న పన్ను విధానాలను ఒకతాటిపైకి తీసుకువచ్చేందుకు జీఎస్టీని ప్రవేశపెట్టటం, ప్రాంతీయ విద్యుత్ గ్రిడ్లను అనుసంధానించి ఒకే జాతీయ గ్రిడ్‌ను ఏర్పాటు చేయటం వంటి చరిత్రాత్మక నిర్ణయాలే ఇందుకు నిదర్శనమని కొనియాడారు.
కొవిడ్-19 వల్ల ఎదురైన సవాళ్లు, ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం యుద్ధ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతోందని శ్రీ గోయల్ అన్నారు. సాంకేతికత విలువలను అర్థం చేసుకుని, ప్రజల ప్రయోజనాల కోసం వాటిని వినియోగించవచ్చని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిరూపించారని తెలిపారు. గత 25 ఏళ్లుగా ఆధునిక సాంకేతికతను స్వీకరించటం ఆయన పనితీరులో కీలక భాగమని పేర్కొన్నారు.
గతంలో భారత విధానాల్లో కాస్త వెనుకబాటుతనం ఉండేదని, అభివృద్ధి చెందిన దేశాలతో సంబంధాలు పెంచుకోవటంలోనూ వెనుకాడేదని కేంద్రమంత్రి శ్రీ పీయూష్ గోయల్ అన్నారు. నూతన సాంకేతికతలకు ఆటోమొబైల్ రంగాన్ని, దేశ మార్కెట్‌ను విస్తరించటంలోనూ భారత్ సంకోచించేదన్నారు. ప్రస్తుతం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్న దేశంగా ప్రపంచ దేశాలతో ఆత్మవిశ్వాసంతో భారత్ సత్సంబంధాలను కొనసాగిస్తోందని చెప్పారు. ప్రపంచానికి సాంకేతికత, ప్రతిభ, పోటీతత్వం, భారతీయ వస్తువులు, సేవలకు మరింత మార్కెట్ అవకాశాలను అందిస్తూ అంతర్జాతీయ వేదికపై భారత్ దూసుకెళ్తుందని పేర్కొన్నారు.
భారత్ కుదుర్చుకునే ప్రతి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ఇతర ఒప్పందాల్లోనూ భారత వ్యవసాయ రంగం, మత్స్యకారులు, సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలు వంటి సున్నిత రంగాలకు రక్షణ కల్పిస్తున్నామని కేంద్రమంత్రి శ్రీ పీయూష్ గోయల్ పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు, మత్స్య, సముద్ర ఉత్పత్తులు, అధిక ఖచ్చితత్వంతో తయారు చేసే ఉత్పత్తులు, ఇంజినీరింగ్ ఉత్పత్తులు, ఎంఎస్ఎంఈలు తయారు చేసే ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ఎగుమతులకు కొత్త అవకాశాలను ఈ ఒప్పందాలు కల్పిస్తున్నాయని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ అయిన భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇతర దేశాలు, కంపెనీలకు కూడా ఈ ఒప్పందాలు అవకాశాలను అందిస్తున్నాయని తెలిపారు.
ప్రస్తుతం సుమారు 4 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ.. 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకునే సామర్థ్యం కలిగి ఉందని శ్రీ గోయల్ అన్నారు. భారత మెరుగైన జీవన ప్రమాణాలను కోరుకుంటోందని ఆయన పేర్కొన్నారు.
సాంకేతికతపై మాట్లాడుతూ.. కొత్త తరం సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడంలో భారత్ వెనుకాడదని శ్రీ గోయల్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాలను భారత్ స్వీకరిస్తోందని తెలిపారు. కొత్త సాంకేతికతల వల్ల ఉద్యోగాలు తగ్గుతాయనే ఆందోళనలను భారత్ ఇప్పుడు అధిగమించిందని అన్నారు. ఈ సాంకేతికతలు దేశంలోని ప్రతిభావంతులైన యువతకు కొత్త అవకాశాలను సృష్టిస్తాయనే నమ్మకంతో ముందుకు సాగుతున్నామని శ్రీ గోయల్ తెలిపారు.
కొత్త సాంకేతికతలను ఉపయోగించుకుని భారత్‌లోని ప్రతిభ, నైపుణ్యాలను ప్రపంచానికి అందిస్తామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ తెలిపారు. సాంకేతికతను ఉపయోగించడం ద్వారా పనుల సామర్థ్యం, ఉత్పాదకతను పెంచవచ్చని అన్నారు. భారత్‌లో తయారయ్యే వస్తువులు, సేవలను ప్రపంచ మార్కెట్‌లో మరింత పోటీగా మార్చవచ్చని చెప్పారు. సైబర్ భద్రత, కొత్తగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల ఆధారంగా రూపొందించే అప్లికేషన్ల వంటి రంగాల్లో యువతకు కొత్త అవకాశాలు ఏర్పడతాయని తెలిపారు. భారత పరిశ్రమలు, ప్రజలు కొత్త సాంకేతికతలను, సాంకేతిక అభివృద్ధిని సమర్థంగా ఉపయోగించుకుని 140 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చగలరనేని కేంద్రమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. దీని ద్వారా ఉద్యోగాలు, వ్యాపారం, పారిశ్రామిక రంగాల్లో మరిన్ని కొత్త అవకాశాలు ఏర్పడతాయని అన్నారు.
ప్రపంచంతో భారత్‌కు ఉన్న సంబంధాల్లో నమ్మకం చాలా కీలక అంశమని కేంద్రమంత్రి పేర్కొన్నారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ.. వస్తువుల సరఫరా, సేవల అందజేతకు సంబంధించి అంతర్జాతీయంగా ఇచ్చిన ప్రతి హామీని సమయానికి భారత్ నెరవేర్చిందని తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో కూడా ఎగుమతుల కోసం పనిచేసే పరిశ్రమలు భద్రతా నిబంధనలు, జాగ్రత్తలు పాటిస్తూ తమ వినియోగదారులకు సేవలను కొనసాగించాయని చెప్పారు. సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రజల ఇళ్ల వద్దే అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ప్రపంచ కంపెనీలతో కుదుర్చుకున్న సర్వీస్ లెవల్ అగ్రిమెంట్స్ (ఎస్ఎల్ఏ)ను కూడా భారత్ గౌరవించి, వాటికి అనుగుణంగా సేవలను అందించిందని శ్రీ గోయల్ చెప్పారు.
2022లో రోమ్‌లో జరిగిన జీ20 సదస్సును శ్రీ గోయల్ గుర్తుచేశారు. ఆ సమయంలో ప్రపంచ నాయకులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ, భారత్‌ను ప్రపంచానికి విశ్వసనీయ భాగస్వామిగా అభివర్ణించారని తెలిపారు. ఇటీవల పలు క్రెడిట్ రేటింగ్ సంస్థలు భారత్ క్రెడిట్ రేటింగ్‌ను పెంచిన విషయాన్ని కూడా కేంద్ర మంత్రి ప్రస్తావించారు.
భారత పరిశ్రమలు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకుని ప్రపంచంలో ముందంజలో ఉండేందుకు దృష్టి పెట్టాయని కేంద్ర మంత్రి తెలిపారు. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు కార్బన్ ఉద్గారాలను తగ్గించే దిశగా కూడా పరిశ్రమలు ముందుకు సాగుతున్నాయని చెప్పారు. పరిశ్రమలు అభివృద్ధి చెందేందుకు వీలుగా కార్మిక సంస్కరణలు తీసుకురావడం వల్ల భారత కార్మికులకు సామాజిక భద్రత, మంచి జీతాలు, వేతనాలు, మెరుగైన సౌకర్యాలు లభించి, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని తెలిపారు. వ్యాపారం, పరిశ్రమలు సులభంగా నిర్వహించేందుకు అవసరమైన ‘వ్యాపార సౌలభ్యం’ చర్యలపై ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని శ్రీ గోయల్ చెప్పారు. సుపరిపాలనను మెరుగుపరచడం, పరిశ్రమలతో ప్రభుత్వం నిరంతరం చర్చలు జరపడం ద్వారా పరిశ్రమల అవసరాలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ స్థాయిలో అమలవుతున్న కఠినమైన ప్రమాణాలను కూడా భారత్ స్వీకరించేందుకు, వాటితో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
భాగస్వామ్య సదస్సు ఇతివృత్తాన్ని ప్రస్తావిస్తూ.. 2025లో విశాఖపట్నంలో జరిగిన సదస్సులో తాను ప్రస్తావించిన అయిదు ‘టీ’లకు -సాంకేతికత, విశ్వాసం, వాణిజ్యం, ప్రతిభ, సంప్రదాయాలకు ఈ అంశం దగ్గరగా ఉందని శ్రీ గోయల్ తెలిపారు. ఈ అయిదు టీలు బలమైన భాగస్వామ్యాలను ప్రతిబింబిస్తాయని అన్నారు. భారత్ అభివృద్ధిలో వాణిజ్యం, సాంకేతికత, విశ్వాసం, ఆలోచన నాయకత్వం కీలక అంశాలుగా మారుతున్నాయని పేర్కొన్నారు.
భారత్ సాధించిన విజయాలను వేడుకగా జరుపుకోవడానికి, దేశ అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు, ప్రపంచంలోని వివిధ దేశాలు, ప్రతినిధి బృందాలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు వంతెనలు నిర్మించడానికి భాగస్వామ్య సదస్సు కీలక వేదికగా అభివర్ణించారు.
ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా భావించే “వసుధైక కుటుంబం’’ అనే భారతీయ స్ఫూర్తికి అనుగుణంగా.. కష్టకాలంలో కూడా భారత్ తన మిత్ర దేశాలకు అండగా నిలుస్తుందని కేంద్ర మంత్రి శ్రీ గోయల్ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో సాంకేతికత ఆధారంగా అభివృద్ధి, పాలనను ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడిని శ్రీ గోయల్ అభినందించారు. ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోని “సన్‌రైజ్ స్టేట్” (అభివృద్ధి పథంలో సాగుతున్న రాష్ట్రం)గా అభివర్ణించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వాములుగా కలిసి పనిచేసినప్పుడు ప్రజలు అభివృద్ధి చెందడంతో పాటు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరింత శ్రేయస్సు లభిస్తుందని అన్నారు.
భాగస్వామ్య సదస్సు జరగనున్న విశాఖపట్నంలో గూగుల్ తొలి కృత్రిమ మేధ కేంద్రం ఏర్పాటు అవుతోందని కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ తెలిపారు. అమరావతి క్వాంటం వ్యాలీగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు, ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడంతో పాటు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు ‘వ్యాపార సౌలభ్యంపై’ నిరంతరం దృష్టి పెడుతున్నారని పేర్కొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయడం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, ఇతర అవకాశాల ద్వారా ప్రపంచ మార్కెట్లను కేంద్ర ప్రభుత్వం అవకాశాలు అందించడం, వీటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశ్రమలు, డేటా సెంటర్లు, ఉద్యోగాలుగా మార్చడాన్ని “భారత్ బృందం అత్యుత్తమ పని తీరుకు” (టీం ఇండియా ఎట్ ఇట్స్ బెస్ట్) నిదర్శనమని శ్రీ గోయల్ అన్నారు. ఆంధ్రప్రదేశ్, ఆ రాష్ట్ర ప్రజలు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సాధించిన విజయాల ద్వారా భారత్‌కు గర్వకారణంగా నిలిచారని పేర్కొన్నారు. కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్, సాంకేతికత ప్రభావం పెరుగుతున్న అంశాలపై జరిగిన చర్చను ప్రస్తావిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందిస్తున్న సేవలను ప్రశంసించారు. సంఖ్యలు, శాస్త్ర, సాంకేతికత, గణిత శాస్త్రాల్లో వారి ప్రతిభను ప్రస్తావించారు.
ప్రస్తుతం భారత్‌లో ప్రజలు ఉన్నత లక్ష్యాలను సాధించాలనే పట్టుదలతో ఉన్నారని, భారత వ్యాపార రంగంలో విశ్వాసం పెరిగిందని, ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు గౌరవం లభిస్తోందని కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అన్నారు. 140 కోట్ల మంది ప్రజల సంకల్పమే భారత్‌ను ముందుకు నడిపిస్తోందని పేర్కొన్నారు. భారత్ 30 ట్రిలియన్ డాలర్ల విలువైన అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగే దిశగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో, 31వ భాగస్వామ్య సదస్సు.. భారత్, దేశ పరిశ్రమల అభివృద్ధి ప్రయాణంలో మరో కీలక ప్రస్థానంగా నిలుస్తుందనే విశ్వాసాన్ని శ్రీ గోయల్ వ్యక్తం చేశారు.
****
(రిలీజ్ ఐడి: 2320975)
సందర్శకుల సూచీ సంఖ్య : : 2