కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత జీఎస్‌ఎంఏ బోర్డు సభ్యులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం.. పాల్గొన్న కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని

సమ్మిళిత, సుస్థిరాభివృద్ధికి సాంకేతికత ఒక సాధనంగా మారాలి: ప్రధాని

సైబర్ మోసాలను అరికట్టడానికి సాంకేతిక ఆధారిత పరిష్కారాలు అత్యవసరం: ప్రధాని

భారతదేశ డిజిటల్ పరివర్తన, పెరుగుతున్న ప్రపంచ సాంకేతిక భాగస్వామ్యాలను కొనియాడిన జీఎస్‌ఎంఏ బోర్డు సభ్యులు

నాడు పోస్టు చేయడమైనది: 07 OCT 2026 5:23PM by PIB Hyderabad

ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2026 ప్రారంభానికి ముందు సేవ తీర్థ్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ అసోసియేషన్ (జీఎస్ఎంఏ) బోర్డు సభ్యులతో సమావేశమయ్యారు. మొబైల్‌ రంగానికి నాయకత్వం వహించే ప్రముఖ సంస్థే ఈ జీఎస్‌ఎంఏ. ఇది మొబైల్ ఆపరేటర్లతో పాటు మొబైల్ వ్యవస్థ, దాని అనుబంధ పరిశ్రమలలోని వివిధ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తుంది.

 

కేంద్ర కమ్యూనికేషన్లు, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా.. కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

సమ్మిళిత, సుస్థిర అభివృద్ధికి సాంకేతికత ఒక సాధనంగా మారాలని ప్రధానమంత్రి చెప్పారు. సమాజంలో ఏ వర్గమూ వెనుకబడిపోకుండా ఉండేందుకు సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ఎంతో అవసరమని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాల కోసం సాంకేతికత, డిజిటల్ సేవలను అందరికీ సులభంగా, తక్కువ ఖర్చుతో లభించేలా చేయాల్సిన ఆవశ్యకతను ఆయన ప్రధానంగా చెప్పారు. డిజిటల్ అంతరం మరింత పెరగకుండా నిరోధించడానికి సాంకేతికతను చిట్టచివరి వరకు చేరవేయాల్సిన ప్రాముఖ్యతను తెలిపారు.

 

ప్రత్యేకించి అభివృద్ధి చెందుతున్న దేశాలకు డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(డీపీఐ) ఒక పరివర్తనాత్మక శక్తిగా పనిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉందని ప్రధానమంత్రి అన్నారు. పలువురు ప్రపంచ నాయకులతో డీపీఐ గురించి జరిగిన చర్చలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న దాని ప్రాముఖ్యతను నిరూపించాయని పేర్కొన్నారు. ఇటువంటి వేదికలు గ్లోబల్ సౌత్ దేశాలకు ఒక ఉత్ప్రేరకం వలె ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు.

డిజిటల్, సైబర్ మోసాల విషయంలో పెరుగుతున్న సవాళ్లను ప్రస్తావించిన ప్రధాని.. ఈ సమస్యకు సాంకేతికత ఆధారిత పరిష్కారాలు అవసరమని అన్నారు. మోసానికి గురయ్యే అవకాశం ఉన్న కాల్స్ గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి వినియోగదారులకు నిరంతర అవగాహన సందేశాలను అందించాలని సూచించారు.

 

వర్ధమాన సాంకేతికతల కోసం ప్రపంచ ప్రమాణాలు, సాధారణ నియమాలను రూపొందించాల్సిన అవసరాన్ని కూడా ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. డీప్‌ఫేక్స్, ఏఐ సృష్టించిన కంటెంట్ వల్ల మునుపెన్నడూ లేని విధంగా పెరుగుతున్న ముప్పును దృష్టిలో ఉంచుకొని వినియోగదారులు దాని మూలాన్ని తక్షణమే గుర్తించడానికి వీలుగా తగిన యంత్రంగాలను అన్వేషించాలని ఆయన సూచించారు.

 

భారతదేశ డిజిటల్ పరివర్తనను కొనియాడిన జీఎస్‌ఎంఏ బోర్డు సభ్యులు

 

డిజిటల్, మొబైల్ కనెక్టివిటీ రంగాల్లో భారత్ ప్రపంచ నాయకుడిగా అవతరించడాన్ని జీఎస్‌ఎంఏ బోర్డు సభ్యులు ప్రత్యేకంగా ప్రశంసించారు. 4జీ- 5జీ వేగవంతమైన విస్తరణ.. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ)విస్తృతి, భారతదేశ టెలికాం- మొబైల్ తయారీ రంగం సాధిస్తున్న వృద్ధిని వారు కొనియాడారు.

 

భారత పెట్టుబడి అనుకూల విధానాల చట్రాన్ని అభినందించిన జీఎస్ఎంఏ బోర్డు సభ్యులు.. నిరంతర డిజిటల్ వృద్ధికి మద్దతు ఇవ్వడంలో సురక్షితమైన, పటిష్ఠమైన, విశ్వసనీయమైన డిజిటల్ మౌలిక సదుపాయాల పాత్రను ప్రధానంగా చెప్పారు.

 

5జీ, 6జీ, కృత్రిమ మేధస్సు, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ సమ్మిళితత్వం, ఉపగ్రహ అనుసంధానత వంటి రంగాల్లో భారత్‌తో అంతర్జాతీయ సహకారానికి పెరుగుతున్న అవకాశాలను కూడా బోర్డు సభ్యులు ప్రస్తావించారు.

 

భారతదేశ సాంకేతిక సంబంధాలు మరింత బలోపేతం చేస్తూ ప్రపంచ టెలికాం భాగస్వాములతో కొనసాగిన కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా చర్చలు

 

ప్రపంచ టెలికాం, సాంకేతిక రంగ ప్రముఖులను ఒకచోట చేర్చుతూ ఢిల్లీలో పదో విడత 'ఇండియా మొబైల్ కాంగ్రెస్' నిర్వహణకు భారత్ సన్నద్ధమవుతున్న తరుణంలో ఈ సమావేశం జరగటం అనేది ప్రాధాన్యతను సంతరించుకుంది. 

 

తరువాతి తరం కనెక్టివిటీ, డిజిటల్ సాంకేతికతలలో భారతదేశ అంతర్జాతీయ సంబంధాల విషయంలో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా నాయకత్వం వహిస్తున్నారు. బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2026లో ఆయన ప్రపంచ టెలికాం వ్యవస్థతో దేశ భాగస్వామ్యాలను ముందుండి నడిపించారు. అక్కడ కనెక్టివిటీని మరింత అందుబాటు ధరల్లో సమ్మిళితంగా, భవిష్యత్తుకు అనుగుణంగా తీర్చిదిద్దడంపై జీఎస్‌ఎంఏ మంత్రివర్గ సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 

 

6జీ పరిణామాలు, సురక్షితమైన డిజిటల్ మౌలిక సదుపాయాలు, కృత్రిమ మేధస్సు, ప్రపంచవ్యాప్తంగా పరస్పరం అనుసంధానించగల సాంకేతిక ప్రమాణాల రూపకల్పనలో పెరుగుతున్న భారత్ పాత్రను ప్రపంచ సాంకేతిక నాయకులతో జరుగుతున్న ఈ చర్చలు తెలియజేస్తున్నాయి.

 

తరువాతి తరం కనెక్టివిటీ, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై ప్రపంచ వేదికలపై జరుగుతున్న చర్చలకు భారత్ మరింతగా తోడ్పడుతున్నందున జీఎస్‌ఎంఏ బోర్డుతో జరిగిన ఈ సమావేశం ప్రపంచ మొబైల్ రంగంతో భారత భాగస్వామ్యాలను మరింత బలపరుస్తుంది.

 

ఎక్స్ పోస్ట్ లింక్- https://x.com/JM_Scindia/status/2107491794518999394 

 

మరింత సమాచారం కోసం అనుసరించండి:

 

ఎక్స్- https://x.com/DoT_India 

 

ఇన్‌స్టా- https://www.instagram.com/department_of_telecom?igsh=MXUxbHFjd3llZTU0YQ== 

 

ఫేస్‌బుక్- https://www.facebook.com/DoTIndia 

 

యూట్యూబ్- https://youtube.com/@departmentoftelecom?si=DALnhYkt89U5jAaa 


(రిలీజ్ ఐడి: 2320432) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Punjabi , Gujarati , Kannada