ఆర్థిక మంత్రిత్వ శాఖ
మాదక ద్రవ్యాలపై అవగాహన, అభివృద్ధి కోసం కుల్లూ జిల్లాలోని మలానాలో కేంద్ర నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో జన సంవాద్ నిర్వహణ
నాడు పోస్టు చేయడమైనది:
07 OCT 2026 5:19PM by PIB Hyderabad
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని రెవెన్యూ శాఖకు చెందిన కేంద్ర నార్కోటిక్స్ బ్యూరో (సీబీఎన్).. హిమాచల్ ప్రదేశ్‌లోని కుల్లూ జిల్లాలో మలానా గ్రామంలో 2026 అక్టోబర్ 6న ‘జన సంవాద్’ కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘యువ రక్ష’ కార్యక్రమాల్లో భాగంగా మాదక ద్రవ్యాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2012 నాటి భారత జాతీయ మాదకద్రవ్యాలు, మానసిక ప్రభావిత పదార్థాల (ఎన్‌డీపీఎస్) విధానం, నార్కోటిక్స్ నియంత్రణ విజన్ డాక్యుమెంట్ 2026–2029కు అనుగుణంగా అక్రమ గంజాయి సాగు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ప్రత్యామ్నాయ జీవనోపాధిని ప్రోత్సహించే సీబీఎన్ లక్ష్యాల్లో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘నషా ముక్త్ భారత్’ లక్ష్యానికి అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నిరంతర మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కల్పించడం, యువతను భాగస్వామ్యం చేయడం, సమాజ భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ లక్ష్యాలకు తోడ్పడటం దీని ఉద్దేశం.
మలానా గ్రామం తన ప్రత్యేకమైన సాంస్కృతిక వారసత్వం, సంప్రదాయ సామాజిక వ్యవస్థలకు ప్రసిద్ధి చెందింది. అలాగే అక్రమంగా గంజాయి సాగు జరిగే ప్రాంతాలతో ఈ గ్రామానికి చాలాకాలంగా సంబంధం ఉంది. ‘జన సంవాద్’ కార్యక్రమంలో భాగంగా కేంద్ర నార్కోటిక్స్ బ్యూరో (సీబీఎన్) గ్రామీణ యువత, ప్రజలకు గంజాయి, చరస్, హషీష్ ఆయిల్ వినియోగం వల్ల కలిగే హానిపై అవగాహన కల్పించింది. గ్రామస్థులు ప్రత్యామ్నాయ పంటలు, అభివృద్ధి కార్యక్రమాలు, స్థిరమైన జీవనోపాధి మార్గాలను ఎంచుకునేలా ప్రోత్సహించింది. ఇందుకు వివిధ ప్రభుత్వ శాఖలు అందిస్తున్న సహాయాన్ని కూడా వివరించింది.
ప్రత్యామ్నాయ జీవనోపాధిని అభివృద్ధి చేసుకోవడంలో గ్రామస్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా చర్చించారు. ముఖ్యంగా ఆపిల్ సాగులో ఇబ్బందులు, రవాణా, అనుసంధాన సమస్యలు, మార్కెట్‌కు చేరుకోవడంలో ఇబ్బందులు, వ్యవసాయ ఉత్పత్తులకు సరైన ధరలు లభించకపోవడం వంటి అంశాలు చర్చకు వచ్చాయి. అలాగే తేనెటీగల పెంపకం, పశుపోషణ, పాల ఉత్పత్తి, పర్యాటకం వంటి స్థానికంగా అనుకూలమైన ఇతర జీవనోపాధి అవకాశాలపై కూడా చర్చించారు. అక్రమ గంజాయి సాగు వల్ల స్థానిక పర్యావరణంపై పడుతున్న ప్రభావాన్ని కూడా ప్రస్తావించారు. ముఖ్యంగా గొర్రెలు, మేకలు మేపేందుకు సంప్రదాయంగా అందుబాటులో ఉన్న మేత ప్రాంతాలు తగ్గిపోవడం, అడవుల నరికివేతకు సంబంధించిన ఆందోళనలపై చర్చ జరిగింది.
ఈ సమావేశం నిర్మాణాత్మకంగా సాగింది. గ్రామస్థులు ఎదుర్కొంటున్న సమస్యలను, స్థిరమైన అభివృద్ధి, ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించేందుకు ఉన్న అవకాశాలను సీబీఎన్ బృందం, స్థానిక ప్రజలు కలిసి చర్చించేందుకు ఈ కార్యక్రమం ఒక అవకాశాన్ని కల్పించింది.
జన్ సంవాద్ ముగింపులో రాబోయే పంట కాలంలో గంజాయి అక్రమ సాగును తొలగించాలని, మాదకద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని స్థానిక ప్రజలు కలసికట్టుగా ప్రతిజ్ఞ చేశారు. కేంద్ర నార్కోటిక్స్ బ్యూరో భాగస్వామ్యంతో ప్రత్యామ్నాయ జీవనోపాధి, ఇతర లాభదాయక పంటల సాగు అవకాశాలను అన్వేషించేందుకు అంగీకరించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన, మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని పాఠశాల విద్యార్థులు కూడా ప్రతిజ్ఞ చేశారు.
అక్రమ సాగును అరికట్టేందుకు కేవలం చట్టపరమైన చర్యలకే పరిమితం కాకుండా, నివారణ అవగాహన, ప్రజల భాగస్వామ్యం, ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలను ప్రోత్సహించడంలో సీబీఎన్ చూపుతున్న నిరంతర నిబద్ధతకు ఈ జన్ సంవాద్ నిదర్శనంగా నిలిచింది.
***
(రిలీజ్ ఐడి: 2320426)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6