రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
చింతన్ శిబిర్–2026ను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ: భవిష్యత్తు అవసరాలకు తగిన జాతీయ రహదారి మౌలిక వసతుల కోసం అజెండా నిర్దేశం
రెండు రోజుల జాతీయ సదస్సుకు మార్గనిర్దేశం చేస్తున్న ‘గతిశక్తి సే ప్రగతి’: సమగ్ర ప్రణాళిక, సురక్షితమైన, పచ్చదనంతో కూడిన జాతీయ రహదారులు, రోడ్డు భద్రత, టోల్ సంస్కరణలు, నాణ్యమైన ప్రాజెక్టులను అందించడంపై దృష్టి సారిస్తున్న చర్చలు
నాడు పోస్టు చేయడమైనది:
05 OCT 2026 2:19PM by PIB Hyderabad
‘‘చింతన్ శిబిర్–2026 – జాతీయ రహదారి మౌలిక వసతులపై జాతీయ సదస్సు’’ను కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఈ రోజు ప్రారంభించారు. గుజరాత్‌లోని నర్మదా జిల్లా, ఏక్తానగర్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, టెంట్ సిటీ 2 వద్ద ఈ కార్యక్రమం జరిగింది. భారతదేశంలో జాతీయ రహదారి మౌలికవసతులను బలోపేతం చేయడంపై రెండు రోజుల పాటు జరిగే కేంద్రీకృత చర్చలకు ఇది దిశానిర్దేశం చేసింది. ‘గతిశక్తి సే ప్రగతి’ అనే నినాదంతో ఈ చింతన్ శిబిర్ నిర్వహిస్తున్నారు. దీనిలో రాష్ట్రాల రవాణా, పీడబ్ల్యూడీ శాఖల మంత్రులు, రాష్ట్రాల పీడబ్ల్యూడీల ఉన్నతాధికారులు, అమలు సంస్థలు, ఇతర భాగస్వాములు... రహదారుల అభివృద్ధి, ప్రాజెక్టుల అమలు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కీలక అంశాలపై చర్చిస్తారు. రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి శ్రీ హర్ష్ మల్హోత్రా కూడా ప్రారంభ కార్యక్రమంలో ఉపన్యసించారు.
జాతీయ రహదారుల అభివృద్ధిలో ఎదురవుతున్న నూతన సవాళ్లపై సమాలోచనలు జరపడానికి, క్షేత్రస్థాయి అనుభవాలను పంచుకోవడానికి, ఆచరణాత్మక పరిష్కారాల దిశగా కలసి పనిచేయడానికి అవసరమైన వేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ చింతన్ శిబిర్ అందిస్తుందని ప్రారంభ కార్యక్రమంలో శ్రీ గడ్కరీ తెలియజేశారు. దేశవ్యాప్తంగా ప్రాజెక్టు అమలును, మౌలికవసతులను అందించే ఫలితాలను మెరుగుపరచడానికి వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న విజయవంతమైన పద్ధతుల గురించి పంచుకోవాలని, వాటిని పరిశీలించాలని, అవసరమైన చోట వాటిని ఉపయోగించాలని స్పష్టం చేశారు.
నాణ్యత, భద్రత, వేగం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలపై దృష్టి సారించి జాతీయ రహదారులను అభివృద్ధి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) దశలోనే ముందస్తు ప్రణాళిక, సన్నద్ధతకు ప్రాధాన్యమివ్వాలని పిలుపునిచ్చారు. వీటిలో తగిన సర్వేలు, అలైన్‌మెంట్ ప్రణాళిక, భూ సేకరణ, యుటిలిటీ తరలింపు, సకాలంలో చట్టబద్ధమైన అనుమతులను భాగం చేయాలన్నారు. జాప్యాలను తగ్గించడానికి, ఖర్చులను నియంత్రించడానికి, రహదారి ప్రాజెక్టుల సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ప్రారంభ సన్నద్ధత దోహదపడుతుందని ఆయన అన్నారు.
ఆరంభం నుంచే జాతీయ రహదారుల ప్రణాళిక, ప్రాజెక్టు డిజైన్‌లోనే రోడ్డు భద్రతను భాగం చేయాలని శ్రీ గడ్కరీ చెప్పారు. ప్రణాళిక, నిర్మాణ దశల్లోనే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించడం, తగిన భద్రతా చర్యలను చేపట్టడం ద్వారా సురక్షితమైన రహదారులను ఏర్పాటు చేయడంతో పాటు రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చన్నారు.
జాతీయ ఆర్థిక వృద్ధిలో జాతీయ రహదారులకు ఉన్న ప్రాధాన్యాన్ని మంత్రి వివరించారు. నగరాలు, పట్టణాలు, ఓడరేవులు, మార్కెట్లు, పారిశ్రామిక కేంద్రాల మధ్య ఎలాంటి ఆటంకాలు లేని అనుసంధానాన్ని జాతీయ రహదారులు అందించాలని చెప్పారు. వాణిజ్యానికీ, పెట్టుబడులకూ, ఉపాధికీ, సమగ్రార్థికాభివృద్ధికీ మెరుగైన రవాణా సదుపాయాలు దోహదపడతాయని తెలిపారు. పెరుగుతున్న దేశాభివృద్ధికీ, రవాణా అవసరాలకూ అనుగుణంగా సకాలంలో మౌలిక వసతులను అందించేందుకు కేంద్రం, రాష్ట్రాలు, అమలు సంస్థలు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు.
పీఎం గతిశక్తి–సమీకృత మౌలిక వసతుల ప్రణాళిక, భూసేకరణ–భూమి రాశి, మెరుగైన పరిహార ఒప్పందాలు–రేటింగులు, సురక్షితమైన హైవేలు–గ్రీన్ హైవేల డిజైనింగ్, రోడ్డు భద్రత–టోల్ సంస్కరణ, నాణ్యతా హామీ–ప్రాజెక్టు పర్యవేక్షణ లాంటి కీలకమైన అంశాలపై రెండు రోజుల చింతన్ శిబిర్‌లో ఇతివృత్త ఆధారిత చర్చలు చేపడతారు. అమల్లో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడం, అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతుల గురించి పంచుకోవడం, మరింత సమర్థమైన జాతీయ రహదారుల అభివృద్ధి కోసం ఆచరణాత్మకమైన, అనుసరించదగిన పరిష్కారాలను గుర్తించడమే ఈ సమావేశాల ముఖ్యోద్దేశం.
నాణ్యతను మెరుగుపరచడానికి, నిర్మాణ, నిర్వహణ వ్యయాన్ని తగ్గించడానికి నూతన సాంకేతిక పరిజ్ఞానాలను, ఆవిష్కరణాత్మకమైన నిర్మాణ పద్ధతులను అనుసరించాలని, చౌక ధరకే లభించే సామగ్రిని విస్తృతంగా వినియోగించాలని మంత్రి పిలుపునిచ్చారు. ఆవిష్కరణలను, క్షేత్రస్థాయి పరిష్కారాలను పంచుకోవాలని రాష్ట్రాలను, అమలు సంస్థలను ఆయన ప్రోత్సహించారు. రహదారుల నిర్మాణం, నిర్వహణలో పరిశోధన, సాంకేతికత, నిరంతర అభివృద్ధి ప్రాముఖ్యతను ఆయన వివరించారు.
చింతన్ శిబిర్ అజెండాలో సుస్థిరత, పర్యావరణ బాధ్యత ముఖ్యమైన అంశంగా ఉన్నాయి. పర్యావరణహితమైన నిర్మాణ పద్ధతులనూ, వినూత్నమైన, రీసైకిల్డ్ పదార్థాల వినియోగాన్నీ ప్రోత్సహించాల్సిన అవసరం గురించి శ్రీ గడ్కరీ వివరించారు. అదే సమయంలో పర్యావరణ, వన్యప్రాణుల సంరక్షణ కోసం అవసరమైన చర్యలను తీసుకోవాలన్నారు. అనంతరం 'పర్యావరణం, వన్యప్రాణుల నష్ట నివారణ చర్యలు' అనే డాక్యుమెంటును విడుదల చేశారు.
సుస్థిర రవాణాపై బ్రిక్స్ దేశాల దృక్పథాల సంకలనాన్ని కూడా ఆవిష్కరించారు. ఇది రవాణా రంగంలో సుస్థిర విధానాలకు సంబంధించిన ఆలోచనలను ఒకచోట చేర్చింది. భవిష్యత్తు అవసరాలకు తగిన మౌలిక సదుపాయాలపై చేపడుతున్న చర్చలకు అంతర్జాతీయ కోణాన్ని జోడించింది.
ఫాస్టాగ్ వార్షిక పాస్, మల్టీ–లేన్ ఫ్రీ ఫ్లో (ఎంఎల్ఎఫ్ఎఫ్)తో పాటు హైవే ప్రయాణ సామర్థ్యాన్ని, సౌకర్యాన్ని పెంపొందించే సాంకేతిక ఆధారిత సంస్కరణల గురించి కూడా శ్రీ గడ్కరీ వివరించారు. టోలింగ్ వ్యవస్థలను ఆధునికీకరించడానికి, ట్రాఫిక్‌ను మెరుగుపరచడానికి, మొత్తంగా జాతీయ రహదారి వినియోగ అనుభవాన్ని పెంపొందిండానికి మంత్రిత్వ శాఖ ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఈ కార్యక్రమాలు ప్రతిబింబిస్తున్నాయి.
చింతన్ శిబిర్‌లో చేపట్టబోయే చర్చలకు ఈ ప్రారంభ కార్యక్రమం దిశానిర్దేశం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలకు, అనుభవాలను, ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి, వినూత్నమైన, ఆచరణాత్మకమైన పరిష్కారాలను గుర్తించడానికి అవసరమైన వేదికను చింతన్ శిబిర్ అందిస్తుంది. ప్రాజెక్ట్ ప్రణాళికను, పర్యవేక్షణను బలోపేతం చేయడం, హైవే నాణ్యతను, భద్రతను మెరుగుపరచడం, సుస్థిరమైన మౌలిక సదుపాయాలను ప్రోత్సహించడం, భవిష్యత్తు అవసరాలకు తగిన హైవే మౌలిక సదుపాయాలను వేగవంతం చేయడమే రెండు రోజుల పాటు నిర్వహించే ఈ చర్చల ముఖ్యోద్దేశం.
వికసిత్ భారత్ దార్శనికతకు అనుగుణంగా వేగవంతమైన ఆర్థిక వృద్ధికీ, పటిష్టమైన అనుసంధానానికీ దోహదపడే సురక్షితమైన, అత్యంత నాణ్యమైన, భవిష్యత్తు అవసరాలకు తగిన రహదారి మౌలిక సదుపాయాల దిశగా భాగస్వాములందరూ సమిష్టిగా కృషి చేయాలని శ్రీ గడ్కరీ పిలుపునిచ్చారు.
***
(రిలీజ్ ఐడి: 2319279)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3