పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పదేళ్ల కృషి అనంతరం పునరుత్పత్తి కేంద్రాల్లో పెరిగిన బట్టమేక పిట్టలను జైసల్మేర్‌లోని డెసర్ట్ నేషనల్ పార్కు వద్ద అటవీ ప్రాంతంలో విడుదల చేసే ప్రక్రియను ప్రారంభించిన కేంద్ర పర్యావరణ మంత్రి, రాజస్థాన్ ముఖ్యమంత్రి

జీఐబీ పునరుత్పత్తి కార్యక్రమంలో ముఖ్యమైన దశ –సంరక్షణ కేంద్రంలో పెంచిన పక్షులను తిరిగి వాటి సహజ ఆవాసాల్లోకి పంపే విధివిధానాలను మెరుగుపరచడంలో తోడ్పాటు

నాడు పోస్టు చేయడమైనది: 03 OCT 2026 3:14PM by PIB Hyderabad

అంతరించిపోతున్న దశలో ఉన్న బట్టమేక పిట్ట (జీఐబీ)ల పరిరక్షణలో ముఖ్యమైన కార్యక్రమంలో భాగంగా... సంరక్షణ కేంద్రంలో పెరిగిన రెండు బట్టమేక పిట్టలను ఎన్‌క్లోజర్‌లోకి రేపు విడుదల చేస్తారు. జైసల్మేర్‌లోని డెసర్ట్ నేషనల్ పార్కులో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ ప్రక్రియ ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, అటవీ, పర్యావరణ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్‌లాల్ శర్మ (వర్చువల్ విధానంలో) పాల్గొన్నారు. ఇది రాజస్థాన్ రాష్ట్ర పక్షి అయిన బట్టమేక పిట్టల సంఖ్యను పెంచడానికి పదేళ్లుగా చేపడుతున్న కృషి, అంకితభావం, శాస్త్రీయ అన్వేషణ ద్వారా సాధించిన ఫలితం. రాందేవ్రా, శామ్‌ వద్ద ఉన్న జీఐబీ కన్జర్వేషన్ బ్రీడింగ్ కేంద్రాన్ని వారు సమీక్షించారు. అలాగే నూతనంగా అభివృద్ధి చేసిన రీవైల్డింగ్ ఏవియరీని ప్రారంభించారు. అలాగే ఈ ప్రాంతంలో జీఐబీ దశాబ్దపు ప్రయాణానికి సంబంధించిన బ్రోచర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి రాజస్థాన్ రాష్ట్ర అటవీ, పర్యావరణ మంత్రి శ్రీ సంజయ్ శర్మ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం రాజస్థాన్‌లో ప్రారంభమైంది. అనంతరం గుజరాత్‌లో ‘జంప్‌స్టార్ట్’ కార్యక్రమంగా విజయవంతంగా కొనసాగుతోంది. గుజరాత్‌లోని కచ్ వద్ద ఉన్న నాలియా కేంద్రం వద్ద దశల వారీ విడుదల, సంరక్షణ కేంద్రాన్ని కేంద్ర మంత్రి ఇటీవలే సమీక్షించారు. వన్యప్రాణుల సంరక్షణ-పునరుత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయడం నుంచి వాటిని సహజ ఆవాసాల్లోకి తిరిగి పంపించడం, వాటి సంఖ్యను పెంపొందించడం వరకు భారతదేశం చేపడుతున్న జీఐబీ సంరక్షణ కార్యక్రమంలో ముఖ్యమైన మార్పునకు నాందిగా రేపు చేపట్టే పక్షుల విడుదల కార్యక్రమం నిలవనుంది. పక్షులకు మానవుల వల్ల ఎదరయ్యే ఆటంకాలను తగ్గించేందుకు నియంత్రిత విధానంలో దీనిని నిర్వహిస్తున్నారు. అలాగే వాటిని విడుదల చేసే ప్రదేశంలో పరిమిత సంఖ్యలో మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రయోగాత్మకంగా చేపట్టే ఈ విడుదల నుంచి నేర్చుకున్న వాటిని భవిష్యత్తులో చేపట్టే ఈ తరహా కార్యక్రమాల కోసం నిబంధనలను మెరుగుపరిచేందుకు ఉపయోగిస్తారు.

ఈ కార్యక్రమంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి ప్రసంగించారు. రాష్ట్ర పక్షిని తిరిగి అడవిలోకి వదిలే రోజు యావత్ రాజస్థాన్‌కు గర్వకారణమన్నారు. థార్ సాంస్కృతిక వారసత్వంలో భాగమైన జీఐబీని అంతరించిపోతున్న దశ నుంచి తిరిగి పెంపొందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన సమన్వయ ప్రయత్నాల గురించి ఆయన వివరించారు. జీఐబీ సంరక్షణ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నిధుల గురించి, రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ విభాగంలో చేపడుతున్న ఇతర విజయవంతమైన కార్యక్రమాల గురించి కూడా ముఖ్యమంత్రి వివరంగా తెలియజేశారు.

 

జీఐబీ పక్షితో థార్ ఎడారి ప్రాంతం మొత్తానికి భావోద్వేగ పరమైన, సాంస్కృతిక పరమైన అనుబంధం ఉందని శ్రీ భూపేందర్ యాదవ్ తెలియజేశారు. గడచిన దశాబ్దంలో ప్రపంచానికే ఆదర్శంగా మారిన జీఐబీ సంరక్షణ కార్యక్రమానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతే కారణమని కేంద్ర మంత్రి అన్నారు. పక్షిని అడవిలోకి తిరిగి చేర్చే దశకు చేరుకున్న జీఐబీ సంరక్షణ కార్యక్రమం విజయం సాధించేలా కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ, రాష్ట్ర అటవీ విభాగం అధికారులు, డబ్ల్యూఐఐ శాస్త్రవేత్తలు, స్థానిక సమాజాలు చేపట్టిన ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు.

 

ఈ కార్యక్రమం సాధించే విజయం ద్వారా థార్ ఎడారి ప్రాంతంలోని జీవావరణ వ్యవస్థలో భాగమైన జీవుల్లో ఒకటైన బట్టమేక పిట్ట పరిరక్షణ వల్ల కలిగే ప్రయోజనాల గురించి శ్రీ యాదవ్ వివరించారు. అలాగే స్థానిక సమాజాలకు ఎకోటూరిజం ద్వారా ఆర్థిక ప్రయోజనాలు చేకూరతాయన్నారు. గడ్డిభూముల పరిరక్షణ, భూసార క్షీణతను తటస్థం చేయడం, మధ్య ఆసియా వలస మార్గాల్లో వలస పక్షులకు ముఖ్యమైన విశ్రాంతి ప్రదేశంగా మార్చడంలో జీఐబీకి ఉన్న ప్రాధాన్యాన్ని మంత్రి వివరించారు.  

 

పర్యటనలో భాగంగా ఇంక్యుబేషన్, బ్రీడింగ్ కేంద్రాలను శ్రీ యాదవ్ సమీక్షించారు. ఈ సంరక్షణ కార్యక్రమంలో భాగస్వాములైన అధికారులు, శాస్త్రవేత్తలతో ముచ్చటించారు. రాజస్థాన్ రాష్ట్ర రోడ్డు అభివృద్ధి, నిర్మాణ సంస్థ (ఆర్ఎస్ఆర్‌డీసీ) సహకారంతో రాజస్థాన్ అటవీ విభాగం రామ్‌దేవ్రాలోని 160 మీ. × 64 మీ. × 14 మీ.ల కొలతలతో ఉన్న రీవైల్డింగ్ ఏవియరీని నిర్మించింది. దీనికోసం మంత్రిత్వ శాఖకు, డబ్ల్యూఐఐకి చెందిన నిపుణులు, శాస్త్రవేత్తలతో సంప్రదింపుల అనంతరం రాజస్థాన్ ప్రభుత్వం రూ.9.25 కోట్ల నిధులను మంజూరు చేసింది. కృత్రిమ పునరుత్పత్తి విధానంలో పొదిగిన జీఐబీలను తిరిగి అడవుల్లోకి విడుదల చేసేందుకు వీలుగా సన్నద్ధం చేయడానికి అవసరమైన, ఎలాంటి అడ్డంకులు లేని ప్రదేశాన్ని పిల్లర్లు లేకుండా విశాలంగా నిర్మించిన ఈ కేంద్రం అందిస్తుంది. ఎగరడానికి అవసరమైన కండరాలను బలోపేతం చేసుకోవడం, సహజ వాతావరణ పరిస్థితులకు అలవాటు పడటం, సహజసిద్ధ స్వభావాన్ని పెంపొందించుకోవడంలో జీఐబీలకు ఈ కేంద్రం తోడ్పడుతుంది.

బట్టమేక పిట్ట పునరుత్పత్తి కార్యక్రమం

 

పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ, రాజస్థాన్ అటవీ విభాగం, వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ) సంయుక్తంగా చేపడుతున్న కార్యక్రమమిది. దీనికి ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ హౌబరా కన్జర్వేషన్ సాంకేతిక సహకారం అందిస్తోంది. నేషనల్ కాంపా నిధులను సమకూరుస్తోంది. పునరుత్పత్తి, శాస్త్రీయపరమైన ఆవాసాల నిర్వహణ, ముప్పు నివారణ, సామాజిక భాగస్వామ్యమే లక్ష్యంగా జాతీయ కార్యాచరణ ప్రణాళిక అమలవుతోంది.

 

ఈ పరిరక్షణ-పునరుత్పత్తి కార్యక్రమం గణనీయమైన పురోగతిని సాధించింది. శామ్, రామ్‌దేవ్రా వద్ద ఉన్న జీఐబీ కేంద్రాల్లో ప్రస్తుతం 97 పక్షులు ఉన్నాయి. వాటిలో అడవిలో పెట్టిన గుడ్లను పొదిగితే 40 పక్షుల జన్మించాయి. మరో 57 పక్షులను కృత్రిమ విధానంలో పునరుత్పత్తి చేశారు. వీటిలో 86 పక్షులను పునరుత్పత్తి కోసం సంరక్షణ కేంద్రాల్లో ఉంచగా, మరో 11 పక్షులను అడవిలోకి విడుదల చేయనున్నారు. కృత్రిమ పునరుత్పత్తి ద్వారా 2025లో 24, 2026లో 29 పక్షులు జన్మించాయి. ఈ కార్యక్రమం ద్వారా చేపట్టిన ‘జంప్‌స్టార్ట్’ విధానం లాంటి ప్రయత్నాలు ఈ జాతి పునరుద్ధరణకు తోడ్పడుతున్నాయి. దీనిలో భాగంగా పునరుత్పత్తి కేంద్రాల్లో పెట్టిన గుడ్లను ఆడపక్షులు అంగీకరించిన గూళ్లలో ఉంచడం ద్వారా రాజస్థాన్‌లో ఆరు, గుజరాత్‌లో రెండు పక్షులు పొదిగాయి.

 

జీఐబీ సంరక్షణ-పునరుత్పత్తి విజయవంతం కావడంతో చేపట్టిన ఈ చర్యలకు... ఆవాసాల పునరుద్ధరణకు రాజస్థాన్ అటవీ శాఖ చేపడుతున్న ప్రయత్నాలు మరింత బలాన్నిస్తున్నాయి. డెసర్ట్ నేషనల్ పార్క్ పరిధిలో దాదాపు 200 చదరపు కిలోమీటర్ల మేర కంచె వేసిన గడ్డిభూముల ఎన్‌క్లోజర్ల ఏర్పాటు వీటిలో భాగం. డబ్ల్యూఐఐ చేపట్టిన దీర్ఘకాలిక టెలిమెట్రీ అధ్యయనాల ప్రకారం ఈ ప్రాంతాలు ఈ పక్షులకు ప్రధాన సంతానోత్పత్తి ఆవాసాలుగా ఉపయోగపడుతున్నాయి. ఈ జాతి పక్షుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు, సుప్రీంకోర్టు తీర్పు అందించిన తీర్పునకు అనుగుణంగా ఈ సంరక్షణ చర్యలు ఉన్నాయి.

 

సంరక్షణ కేంద్రాల్లో పెంచిన జీఐబీలను అటవీ ప్రాంతాల్లో విడుదల చేయడం... ఈ జాతి పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా వేసే ముఖ్యమైన ముందడుగుగా నిలుస్తుంది. ఇలా పెంచిన పక్షులను తిరిగి వాటి సహజ ఆవాసాల్లోకి తిరిగి ప్రవేశపెట్టేందుకు అవసరమైన విధివిధానాలను దశలవారీగా అభివృద్ధి చేసేందుకు, మెరుగుపరిచేందుకు అవసరమైన శాస్త్రీయ అనుభవాలను ఈ కార్యక్రమం అందిస్తుంది. జైసల్మేర్‌‌లోని బట్టమేక పిట్టల సంరక్షణ కేంద్రాలకు శ్రీ యాదవ్ పర్యటన సందర్భంగా రాజస్థాన్ అంతటా అవగాహన, ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు.

****


(రిలీజ్ ఐడి: 2318745) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Urdu , हिन्दी , English , Bengali , Tamil