రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దివ్యాంగులు వినియోగించే వాహనాలకు మినహాయింపు కలిగిన ఫాస్టాగ్ ల జారీ మార్గదర్శకాలను సవరించిన కేంద్ర ప్రభుత్వం

అర్హులైన దివ్యాంగ లబ్ధిదారులకు జాతీయ రహదారుల టోల్‌ వసూలు వ్యవస్థ మరింత అందుబాటులో ఉండేలా పారదర్శకంగా, సౌకర్యవంతంగా మార్చే ఉద్దేశంతో నిబంధనల సవరణ

నాడు పోస్టు చేయడమైనది: 01 OCT 2026 4:57PM by PIB Hyderabad

ప్రజలకు జీవన సౌలభ్యం కల్పించడంతో పాటు దివ్యాంగులు, ఇతర అంగ వైకల్యాలు ఉన్న వ్యక్తులు (పీడబ్ల్యూడీ) ఎదుర్కొనే టోల్‌ సంబంధిత ప్రక్రియలను మరింత సరళీకృతం చేయడానికి భారత ప్రభుత్వం అర్హులైన దివ్యాంగులు/ పీడబ్ల్యూడీ లబ్ధిదారులకు మినహాయింపు కలిగిన ఫాస్టాగ్ ల జారీ, రెన్యువల్ కు సంబంధించిన మార్గదర్శకాలను సవరించింది. సవరించిన విధానం ద్వారా అర్హత కలిగిన దివ్యాంగులు/ పీడబ్ల్యూడీ వాహనాలకు మినహాయింపు కలిగిన ఫాస్టాగ్ ల జారీ, రెన్యువల్ లో మరింత ఏకరూపతను తీసుకురావడంతో పాటు, పదేపదే చేయాల్సిన కాగిత సంబంధ విధివిధానాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నూతన మార్గదర్శకాలు 2026 అక్టోబర్ 02 నుంచి అమలులోకి వస్తాయి.

 

దీని కింద, శారీరక వైకల్యం ఉన్నవారు ఉపయోగించేందుకు ప్రత్యేకంగా డిజైన్ చేసి తయారు చేసిన వాహనాలకు, దివ్యాంగుల పేరుతో నమోదైన వాహనాలకు మినహాయింపు కలిగిన ఫాస్టాగ్స్ ఇస్తారు. చెల్లుబాటు అయ్యే వైకల్య ధ్రువీకరణ పత్రం, యుడిఐడి కార్డ్ లేదా ఇతర వర్తించే పత్రాలలో నమోదైన వైకల్య శాతాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఈ మినహాయింపు ఫాస్టాగ్‌లను జారీ చేస్తారు.

 

గతంలో అమల్లో ఉన్న మార్గదర్శకాల ప్రకారం, దివ్యాంగ వర్గాలకు జారీ చేసిన మినహాయింపు ఫాస్టాగ్ ను ప్రతి సంవత్సరం తప్పనిసరిగా పునరుద్ధరించాల్సి (రెన్యూ) ఉండేది. అయితే, కొత్త మార్గదర్శకాల ప్రకారం, మినహాయింపు ఫాస్టాగ్ చెల్లుబాటు వ్యవధిని నమోదైన వైకల్య శాతం ఆధారంగా నిర్ణయిస్తారు. 70 శాతం నుంచి 100 శాతం వరకు వైకల్యం ఉన్న వ్యక్తులకు జారీ చేసే ఫాస్టాగ్ ఐదేళ్లపాటు, 40 శాతం నుంచి 70 శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్న వ్యక్తులకు జారీ చేసే ఫాస్టాగ్ మూడేళ్లపాటు చెల్లుబాటులో ఉంటుంది. ఆ తర్వాత కూడా అర్హత కొనసాగుతున్నట్లయితే, అది నేషనల్ హైవేస్ రుసుము నిబంధనలు, 2008 నిబంధనలకు అనుగుణంగా ఉంటే, మినహాయింపు ఫాస్టాగ్ ను పునరుద్ధరించుకోవచ్చు.

సవరించిన నిబంధనల ద్వారా అర్హులైన దివ్యాంగ/పీడబ్ల్యూడీ లబ్ధిదారులకు జాతీయ రహదారుల టోల్‌ వసూలు వ్యవస్థను మరింత అందుబాటులో ఉంచడంతో పాటు పారదర్శకంగా, సౌకర్యవంతంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్నారు. నిర్దేశించిన నిబంధనలు, అర్హత ప్రమాణాలకు అనుగుణంగానే టోల్‌ మినహాయింపులు అమలయ్యేలా ఈ విధానం కొనసాగుతుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2318312) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Malayalam