భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఎమ్‌హెచ్ఐ ఇండస్ట్రీ యాక్సిలరేటర్ ఇంపాక్ట్ రిపోర్టును ‘నవీజ్ఞాన్-2026’లో విడుదల చేసిన శ్రీ హెచ్.డి. కుమారస్వామి...
దీంతో సరికొత్త జోరును అందుకోనున్న భారత స్వదేశీ సాంకేతికత
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, సాంకేతికతను అభివృద్ధి పరిచే ప్రక్రియ నుంచి అంతర్జాతీయ తయారీ దిశగా భారత్ దూసుకుపోవాలన్న శ్రీ హెచ్.డి. కుమారస్వామి
ఎమ్‌హెచ్ఐ ఇండస్ట్రీ యాక్సిలరేటర్ ఇంపాక్ట్ రిపోర్టును విడుదల చేసి, ప్రాజెక్టు సభ్యులను సత్కరించిన శ్రీ హెచ్.డి. కుమారస్వామి
రూ.35.72 కోట్ల సాయం అందడంతో 10 సాంకేతికతలు టీఆర్ఎల్-3 నుంచి టీఆర్ఎల్-9కి పురోగమించాయన్న శ్రీ హెచ్.డి. కుమారస్వామి
భావన దశ నుంచి ప్రోటోటైప్ దశకు, ఉత్పాదన దశ నుంచి అంతర్జాతీయ మార్కెటు దశకు:
దేశీయ సాంకేతిక ఇకోసిస్టమ్ బలోపేతం కావాలని పిలుపునిచ్చిన శ్రీ హెచ్.డి. కుమారస్వామి
నాడు పోస్టు చేయడమైనది:
30 SEP 2026 12:21PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో నవీజ్ఞాన్-2026ను నిర్వహించిన సందర్భంగా భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎమ్‌హెచ్ఐ) ఇండస్ట్రీ యాక్సిలరేటర్ ప్రాజెక్టుకు చెందిన ఇంపాక్ట్ రిపోర్టును కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి శ్రీ హెచ్.డి. కుమారస్వామి డిజిటల్ మాధ్యమం ద్వారా విడుదల చేశారు. దీంతో భారతదేశ మొబిలిటీ, తయారీ రంగాలను దృష్టిలో పెట్టుకొని దేశవాళీ సాంకేతికతలను అభివృద్ధిపరిచి, మరింత ముందుకు తీసుకుపోయే దిశగా ఒక ప్రధాన ముందంజ వేసినట్లయింది.

మంత్రి శ్రీ హెచ్.డి. కుమారస్వామి సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ చేపట్టిన ఇండస్ట్రీ యాక్సిలరేటర్ ప్రాజెక్టు సమాప్తం అయిందని ఈ కార్యక్రమం సూచిస్తోందన్నారు. స్వదేశీ సాంకేతిక, తయారీ రంగ సామర్థ్యాలను మరింత పెంపొందింపచేసుకోవడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.
‘‘గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశీయ సాంకేతిక, తయారీ సామర్థ్యాలను పెంపొందించడానికి చాలా ప్రాధాన్యాన్ని ఇస్తోంది’’ అని మంత్రి అన్నారు.
ఆత్మనిర్భర్ భారత్ గమ్యస్థానాన్ని చేరుకోవాలంటే భారత్ ఆధునిక సాంకేతికతలకు ఒక పెద్ద మార్కెట్టుగా రూపొందడానికి మించి ఆయా సాంకేతికతలను విరివిగా తయారు చేసి, ఎగుమతి చేసే సత్తాను పుంజుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి అన్నారు.
‘‘ఆత్మనిర్భర్ భారత్ ఆశయాన్ని సాధించడానికి భారత్ అధునాతన సాంకేతికతలకు ఒక పెద్ద మార్కెట్టుగా రూపొందితేనే సరిపోదు, ఆయా సాంకేతికతలను అభివృద్ధిచేయడం, తయారీకి నడుం బిగించడంతో పాటు వాటిని ఎగుమతి చేసే శక్తిని కూడా సంతరించుకోవాలి’’ అని శ్రీ హెచ్.డి. కుమారస్వామి ఉద్బోధించారు.
భారతీయ భారీ యంత్ర పరికరాల రంగం రెండో దశలో భాగంగా పోటీపడే తత్వాన్ని పెంపొందించే పథకం కింద విస్తృత స్థాయిలో మద్దతును అందించిన సంగతిని మంత్రి ప్రస్తావించారు. ఈ పథకానికి మొత్తం రూ.1,207 కోట్ల ఆర్థిక వ్యయాన్ని నిర్దేశించారని, ఉమ్మడి సాంకేతిక అభివృద్దితో పాటు సేవల రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు మద్దతివ్వడం దీని లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ పథకంలో భాగంగా, 33 ప్రాజెక్టులను ఆమోదించారన్నారు.

ఈ కార్యక్రమాల్లో ఒకటైన ఎమ్‌హెచ్ఐ ఇండస్ట్రీ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ మొత్తం 10 సాంకేతికతలకు రూ.35.72 కోట్ల ఆర్థిక సహాయాన్ని సమకూర్చిందని, ఆయా సాంకేతికతలు టెక్నాలజీ రెడీనెస్ లెవెల్ (టీఆర్ఎల్) 3 నుంచి లెవెల్ 9కి పురోగమించాలనే ఉద్దేశంతో ఈ మేరకు సహాయాన్ని అందించారని మంత్రి వివరించారు.
విద్యుత్తు ఆధారితంగా నడిచే పవర్‌ట్రయిన్లు సహా భవిష్య కాల మొబిలిటీ, అధిక వోల్టేజీ మోటార్ కంట్రోల్, ఇంధన నిల్వ వంటి వివిధ రంగాలతో ముడిపడిన సాంకేతికతలకు ఈ ప్రోగ్రాములో భాగంగా మద్దతును ఇచ్చారని శ్రీ కుమారస్వామి వెల్లడించారు. ఆయా సాంకేతికతలుప్రాథమిక స్థాయి ప్రోటోటైపు (మూలరూపం) దశ నుంచి వాణిజ్యపరంగా లాభదాయకమైన ఉత్పాదనల స్థాయికి చేరుకొన్నాయని ఆయన అన్నారు.
సాంకేతికతను అభివృద్ధి చేయడంలో సహకారానికి ఉన్న ప్రాధాన్యాన్ని మంత్రి ప్రస్తావించారు. నూతన ఆవిష్కరణల విస్తారిత అనుబంధ వ్యవస్థ (ఇకోసిస్టమ్)ను పటిష్టపరచడంలో ప్రభుత్వం, పరిశ్రమ, పరిశోధక సంస్థలు, విద్యారంగ ప్రముఖులు, అంకుర సంస్థలు, ఏఆర్ఏఐ వంటి సంస్థలు ముఖ్య పాత్రను పోషిస్తున్నాయని ఆయన అన్నారు.

‘‘ప్రభుత్వం విధానపరమైన ప్రాథమిక ప్రణాళికను, లక్షిత సమర్థనను అందించగలదు. పరిశ్రమ మార్కెట్టు పట్ల అవగాహనను, తయారీ సామర్థ్యాన్ని జోడించగలదు. పరిశోధక సంస్థలు, విద్యాసంస్థలు జ్ఞానం, సాంకేతికత అంశాల్లో తోడ్పాటును అందించగలవు. అంకుర సంస్థలు కొత్త కొత్త ఆలోచనలను, క్రియాశీలత ని సమకూర్చగలవు’’ అని ఆయన వివరించారు.
సాంకేతికత అభివృద్ధి, తనిఖీ, పరిశ్రమలో ఆయా సాంకేతికతల స్వీకారం.. వీటి మధ్య ఉన్న అంతరాన్ని తొలగించడంలో ఏఆర్ఏఐ వంటి సంస్థలు పోషించవలసిన భూమికను గురించి కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
భారతదేశం 2047కల్లా అభివృద్ధి చెందిన దేశంగా మారాలన్న గమ్యం వైపు పయనిస్తున్న క్రమంలో, దేశం లోపల శక్తియుక్తులను పెంపొందింపచేసుకోవడంతో పాటు భారతీయ సాంకేతికతలను అంతర్జాతీయ మార్కెట్లలోకి తీసుకుపోవడంపైన కూడా దృష్టిని కేంద్రీకరించాల్సివుందని శ్రీ కుమారస్వామి సూచించారు.

‘‘ఈ విధమైన ఇకోసిస్టమ్‌ను మనం మరింత బలోపేతం చేసుకోవాలి. ‘వికసిత్ భారత్@2047’ వైపు మనం పయనిస్తున్నాం. ఈ క్రమంలో మన లక్ష్యం స్పష్టంగా ఉండాలి. నేర్పించడం, కొత్త ఆవిష్కరణలకు నడుం కట్టడం, తయారీ, సాంకేతికతల ఏకీకరణ.. ఈ ప్రక్రియలు భారతదేశంలో పూర్తి కావాలి. భారతీయ సాంకేతికతలను ప్రపంచ మార్కెట్లకు తీసుకుపోవాలి’’ అని మంత్రి అన్నారు.
స్వావలంబన అంటే, అది దిగుమతులకు ప్రత్యామ్నాయాలను రూపొందించడానికి మాత్రమే పరిమితం కాకూడదని, భారతీయ మేధా సంపత్తిని, ప్రతికూల పరిస్థితులకు, సవాళ్లకు ఎదురీది గమ్యాన్ని చేరుకోగలిగే ప్రబల సరఫరా వ్యవస్థను, నైపుణ్యం కలిగిన మానవ వనరులను సమకూర్చుకోవడంపై శ్రద్ధ వహించాలని మంత్రి స్పష్టం చేశారు.
‘‘స్వావలంబన ధ్యేయం కేవలం దిగుమతులను భర్తీ చేయడం కారాదు. అది.. మేధా సంపత్తి, సరఫరా వ్యవస్థ, నైపుణ్యం కలిగిన సిబ్బందిని అందించగలగాలి’’ అని శ్రీ కుమారస్వామి అన్నారు.

సాంకేతికత అభివృద్ధితో ముడిపడిన అవసరాలను గుర్తించడం, పరిశ్రమకు, విద్యారంగానికి మధ్య సహకారాన్ని పటిష్టపరచడం, రాబోయే కాలంలో ఎదురుకాగల సాంకేతిక అవసరాలను తీర్చే సత్తా కలిగిన ప్రతిభావంతులను తీర్చిదిద్దడానికి నిరంతర కృషి జరగాలని ఆయన పిలుపునిచ్చారు.
అభివృద్దితో ముడిపడిన ప్రతి ఒక్క దశలోనూ సమర్థంగా ముందుకు సాగిపోవడానికి వీలు కల్పించే నూతన ఆవిష్కరణలకు చోటిచ్చే ఇకోసిస్టమ్‌ను భారత్ తీర్చిదిద్దుకోవాల్సిందే అని శ్రీ కుమారస్వామి తన ప్రసంగం చివర్లో స్పష్టం చేశారు.
‘‘ప్రోటోటైప్‌ను కనుగొనడం, ప్రోటోటైప్‌ను ఉత్పాదనగా మలచడం, ఉత్పాదనలను ప్రపంచ మార్కెట్టుకు చేర్చడం.. ఈ దశలను భారతీయ నూతన ఆవిష్కరణల వ్యవస్థ సాఫీగా అధిగమించే ఓ ఇకోసిస్టమ్‌ను నిర్మించడానికి మనమందరం మన కృషిని కొనసాగిద్దాం’’ అని ఆయన అన్నారు.
సాంకేతికతలను అభివృద్ధిపరచడం నుంచి వాటిని పరిశ్రమల్లో వినియోగించేందుకు అనువైనవని ప్రమాణీకరించడం, వాణిజ్య సరళి ఉత్పాదన స్థాయికి చేర్చడంలో తోడ్పాటును అందించిన ఎమ్‌హెచ్ఐ ఇండస్ట్రీ యాక్సిలరేటర్ ప్రాజెక్టులో పనిచేసిన వారిని మంత్రి సత్కరించారు. ఏఆర్ఏఐ-ఏఎమ్‌టీఐఎఫ్ ఆధ్వర్యంలోని ఎమ్‌హెచ్ఐ ఇండస్ట్రీ యాక్సిలరేటర్ ప్రాజెక్టు సమాప్తం అయిందనడానికి సూచికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం, పరిశ్రమ, విద్యా, పరిశోధన రంగాలు, సాంకేతిక విస్తారిత అనుబంధ వ్యవస్థల ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన అంకుర సంస్థల ప్రదర్శనను శ్రీ కుమారస్వామి సందర్శించారు. యాక్సిలరేటర్ ప్రోగ్రాములో భాగంగా మద్దతును అందించిన నూతన ఆవిష్కారాలను ఆయన సమీక్షించారు. విద్యుత్తు వాహనాలు, పవర్ ఎలక్ట్రానిక్స్, హై-వోల్టేజీ వ్యవస్థలు, ఇంధన నిల్వ వ్యవస్థలు, ముందుగా ఊహించగలిగే నిర్వహణ వ్యవస్థలు, సెన్సర్లతో పాటు ఉన్నత స్థాయికి చెందిన సర్ఫేస్ ఇంజినీరింగ్ వంటి రంగాల సాంకేతికతలను ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు.
***
(రిలీజ్ ఐడి: 2317078)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4