పర్యటక మంత్రిత్వ శాఖ
పర్యాటకంలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసేందుకు భారత్, ఇటలీ ఆమోదం
సినీ పర్యాటకం, డెస్టినేషన్ ట్విన్నింగ్, నైపుణ్యాలు, బీ2బీ భాగస్వామంపై భారత్-ఇటలీ జాయింట్ వర్కింగ్ గ్రూప్ రెండో సమావేశం
పర్యాటక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా ప్రత్యేక సాంకేతిక బృందాలు, సంప్రదింపుల కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఉభయపక్షాల అంగీకారం
నాడు పోస్టు చేయడమైనది:
29 SEP 2026 6:23PM by PIB Hyderabad
ఇండియా-ఇటలీ జాయింట్ వర్కింగ్ గ్రూప్ (జేడబ్ల్యూజీ) రెండో సమావేశం 2026 సెప్టెంబర్ 29న జరిగింది. ఈ సమావేశానికి భారత పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ భువనేష్ కుమార్, ఇటలీ పర్యాటక మంత్రిత్వశాఖ సెక్రటరీ జనరల్ మిస్ ఎమ్మాన్యుయేలా ట్రిపి సహ అధ్యక్షత వహించారు.
భారత్ పక్షాన పర్యాటక మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రోమ్‌లో భారత్ ఎంబసీ, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (ఐఏటీవో) ప్రతినిధులు పాల్గొన్నారు. ఇటలీ ప్రతినిధి బృందంలో పర్యాటక మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాలు, అంతర్జాతీయ సహకార మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీలోని ఇటలీ ఎంబసీ, ఈఎన్ఐటీ (ఇటాలియన్ నేషనల్ టూరిజం బోర్డు)కు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రెండు దేశాల మధ్య పర్యాటక సహకారాన్ని బలోపేతం చేసేందుకు విస్తృత అవకాశం ఉన్న రంగాలపై చర్చల్లో దృష్టి సారించారు. వాటిలో టూరిజం డేటాను పంచుకోవడం, అంతగా ప్రాచుర్యం పొందని పర్యాటక ప్రాంతాలను వెలుగులోకి తీసుకు రావడం, సినీ పర్యాటకం, డెస్టినేషన్ ట్విన్నింగ్, నైపుణ్యాలు, సామర్థ్య నిర్మాణం, సంస్థల మధ్య (బీ2బీ) భాగస్వామ్యాన్ని విస్తరించడం తదితరమైనవి ఉన్నాయి.
గుర్తించిన రంగాల్లో సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, సంబంధిత వర్గాల మధ్య నిరంతర సంప్రదింపులను సులభతరం చేయడానికి ప్రత్యేక సాంకేతిక బృందాలను, సంప్రదింపుల కేంద్రాలను ఏర్పాటు చేయడానికి రెండు దేశాలూ ఈ సమావేశంలో అంగీకరించాయి.
పర్యాటక రంగంలో సహకారానికి ఉన్న అవకాశాలపై ఉభయ పక్షాలు చర్చించాయి. భారత్-ఇటలీ సాంస్కృతిక, పర్యాటక సంవత్సరంగా 2027ను నిర్వహించాలన్న ప్రతిపాదన నేపథ్యంలో రెండు దేశాల మధ్య సాంస్కృతిక, పర్యాటక వినిమయాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ చర్చలు జరిగాయి.
పర్యాటకంలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి, రెండు దేశాల మధ్య బలమైన సంస్థాగత, పారిశ్రామిక సంబంధాలను ఏర్పాటు చేసుకోవడానికి భారత్, ఇటలీ కట్టుబడి ఉన్నాయని జాయింట్ వర్కింగ్ గ్రూప్ రెండో సమావేశం పునరుద్ఘాటించింది.
***
(రిలీజ్ ఐడి: 2317035)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3