ప్రధాన మంత్రి కార్యాలయం
20వ రోజ్‌గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధానమంత్రి ప్రసంగం
నాడు పోస్టు చేయడమైనది:
19 SEP 2026 1:59PM by PIB Hyderabad
ప్రియమైన యువ మిత్రులారా,
దేశంలో పండుగ వాతావరణం ప్రారంభమైంది. ఈ వేడుకల మధ్య నేడు వేలాది కుటుంబాల జీవితాల్లో కొత్త ఆనందం వెల్లివిరుస్తోంది. దేశవ్యాప్తంగా 51,000 మందికి పైగా యువతకు నేడు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందుతున్నాయి. మీరు ఈ రోజు సాధించిన విజయానికి మీ కృషి మాత్రమే కాకుండా, మీ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల అంకితభావం కూడా కారణం. మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. జీవితంలో ఈ కొత్త ఆరంభానికి మీ అందరికీ నా శుభాకాంక్షలు.
మిత్రులారా,
2047 నాటికి భారత్‌ను వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దాలనే మహత్తర లక్ష్యం వైపు దేశం ముందుకు సాగుతున్న సమయంలో మీరు నేడు భారత ప్రభుత్వంలో భాగమవుతున్నారు. ఈ లక్ష్య సాధనలో మీలాంటి యువత పాత్ర ఎంతో కీలకం. ప్రభుత్వంలో సేవలందిస్తున్నప్పుడు వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణ కార్యక్రమాలను బలోపేతం చేసేలా ప్రతి నిర్ణయం తీసుకోవాలి. యువతగా ఇతర యువత పట్ల మీకు ప్రత్యేక బాధ్యత ఉంది. మన యువత ప్రతిభ, నైపుణ్యాలు ప్రపంచం మొత్తం విశ్వాసాన్ని ఎలా గెలుచుకున్నాయో మీరు చూస్తున్నారు. మన ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, యువశక్తిపై ప్రపంచం ఎన్నో ఆశలు పెట్టుకుంది. కొద్ది రోజుల క్రితమే బ్రిక్స్ సదస్సు ముగిసింది. బ్రిక్స్ సహకారం కేవలం ప్రభుత్వాలకే పరిమితం కాకుండా, మన పారిశ్రామికవేత్తలు, రైతులు, మహిళలు, యువత ఇలా ప్రతి ఒక్కరూ ఈ భాగస్వామ్యంలో చురుకైన భాగస్వాములు కావాలన్నదే భారత్ ప్రయత్నం. ఈ దార్శనికతతోనే బ్రిక్స్ కనెక్ట్, బ్రిక్స్ ఎంఎస్‌ఎంఈ సహకార వేదిక వంటి వంటి కార్యక్రమాలను ప్రారంభించాం.
మిత్రులారా,
ఇటీవలి సంవత్సరాల్లో భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు మన యువతకు కొత్త అవకాశాల తలుపులు తెరుస్తున్నాయి. ఇటువంటి వాణిజ్య ఒప్పందాలు మన పారిశ్రామికవేత్తలకు కొత్త భాగస్వామ్యాలను ఏర్పరుస్తాయి. కొత్త మార్కెట్లను అందుబాటులోకి తెస్తాయి. అలాగే మన యువతకు కొత్త వృత్తి, ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయి.
మిత్రులారా,
ఇటీవలి కాలంలో భారత ప్రభుత్వం భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా యువతను సిద్ధం చేయడంపై నిరంతరం దృష్టి సారిస్తోంది. జాతీయ విద్యా విధానం, స్కిల్ ఇండియా మిషన్, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, అప్రెంటిస్‌షిప్‌లను ప్రోత్సహించేందుకు చేపడుతున్న చర్యలన్నీ మారుతున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా మన యువత విద్య, నైపుణ్యాలు ఉండేలా చూడడమే వీటి లక్ష్యం. దీనికి పీఎం సేతు ఒక ఉదాహరణ. ఈ పథకం ద్వారా రూ.60,000 కోట్ల పెట్టుబడితో 1,000 ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలను (ఐటీఐలు) ఆధునీకరిస్తున్నాం. ఇందులో పరిశ్రమల ప్రత్యక్ష భాగస్వామ్యాన్ని కూడా నిర్ధారించాం.
మిత్రులారా,
భారత యువత శక్తి సామర్థ్యాలకు మరో రూపం మన అంకుర సంస్థల వ్యవస్థలో కనిపిస్తోంది. నేడు ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టారప్ వ్యవస్థ భారత్‌లో ఉంది. భారత అంకుర సంస్థల ప్రస్థానం ఇక కేవలం పెద్ద నగరాలకే పరిమితం కాలేదు. నేడు గుర్తింపు పొందిన అంకుర సంస్థల్లో దాదాపు సగం ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఉన్నాయి. అంటే గ్రామాలు, పట్టణాలు, చిన్న నగరాలకు చెందిన యువత కూడా భారత్ కొత్త ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారు. చిన్న పట్టణాలకు చెందిన మన యువత తమ ఆలోచనలపై పనిచేస్తూ, కొత్త సంస్థలను నిర్మిస్తూ, ఇతర యువతకు కూడా కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నారు.
మిత్రులారా,
ప్రైవేటు రంగంలోనూ కొత్త ఉపాధి అవకాశాలు వేగంగా పెరగాలన్నదే మన ప్రయత్నం. ఈ దార్శనికతతోనే ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజనను ప్రారంభించాం. ఈ పథకం కోసం దాదాపు రూ.1 లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నాం. దీని ద్వారా దాదాపు 2 కోట్ల మంది యువత తొలిసారిగా ఉద్యోగ రంగంలోకి ప్రవేశించే అవకాశం పొందనున్నారు. ఈ పథకం కింద తొలిసారి ఉద్యోగం పొందే యువతకు ప్రభుత్వం గరిష్ఠంగా రూ.15,000 వరకు ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. కొత్త ఉద్యోగాలను సృష్టించే యజమానులను కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అంటే దేశంలో ఉపాధిని పెంచేందుకు ప్రభుత్వం అన్ని స్థాయిల్లో కృషి చేస్తోంది.
దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందినప్పుడు, పెట్టుబడులు పెరిగినప్పుడు, కొత్త పరిశ్రమలు ఏర్పాటైనప్పుడు, కొత్త రంగాలు విస్తరించినప్పుడు మాత్రమే యువతకు కొత్త అవకాశాలు లభిస్తాయి. నేడు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత్ వృద్ధిరేటు 7.8 శాతంగా నమోదైంది. పెట్టుబడులు దాదాపు 12 శాతం పెరిగాయి. రేటింగ్ ఏజెన్సీలు భారత్ రేటింగ్‌లను మెరుగుపరుస్తున్నాయి. ప్రపంచం అనేక అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ఈ పురోగతి సాధిస్తోంది. ఇటీవలి సంవత్సరాల్లో చేపట్టిన సంస్కరణలు భారత్ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. మీరు బాధ్యతలు నిర్వహించే కాలంలో కూడా సంస్కరణల వేగాన్ని మరింత పెంచాలి. పన్నులు, నిబంధనల అనుసరణను సరళీకరించడం, వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని పెంచడం, విద్య, నైపుణ్యాభివృద్ధిలో సంస్కరణలు, ఆవిష్కరణలకు కొత్త రంగాలను అందుబాటులోకి తీసుకురావడం, జీవన సౌలభ్యాన్ని పెంచడం.. ఇలా ప్రతి స్థాయిలో సంస్కరణల పరంపర పూర్తి వేగంతో ముందుకు సాగాలి. ప్రస్తుతం, రాబోయే సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా ఇందులో మీ పాత్ర ఎంతో కీలకం.
మిత్రులారా,
కొద్ది రోజుల క్రితం నేను ఒక మాట చెప్పాను. సూర్యుడు మనవాడై ఉండాలి, సముద్రం మనదై ఉండాలి. పడవ మనదై ఉండాలి, నావికుడు మనవాడై ఉండాలి. అలలపై విజయాన్ని లిఖించాలనే ధైర్యం మనదై ఉండాలి. నేడు భారత యువత ఈ ధైర్యంతో ముందుకు సాగుతోంది. ఇప్పుడు భారత ప్రభుత్వంలో సేవలందిస్తూ, దేశ యువత ఆకాంక్షలను అర్థం చేసుకుని, అందుకు అనుగుణంగా మీ బాధ్యతలను నిర్వర్తించడం మీ బాధ్యత. నేను మిమ్మల్ని మరోసారి కోరుతున్నాను.. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం, ఫైల్‌పై చేసే ప్రతి సంతకం యువత ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లేలా ఉండాలి. మీరు బాధ్యతలు నిర్వహించే కాలంలో యువతకు ఎదురయ్యే అడ్డంకులను తొలగించేలా, వారి ఆలోచనలకు ముందుకు సాగే అవకాశాలు కల్పించేలా, ఆవిష్కరణలను పెంచేలా, ఆవిష్కరణలు పెట్టుబడులను ఆకర్షించేలా, పెట్టుబడులు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించేలా మీరు నిర్ధారించాలి.
మిత్రులారా,
ఇప్పుడు మీరు స్వయంగా ప్రభుత్వ వ్యవస్థలో భాగం కాబోతున్నారు. కాబట్టి, మీరు లేదా మీ తల్లిదండ్రులు ఎదుర్కొన్న ఇబ్బందులను ఇతర యువత ఎదుర్కోకుండా చూడాలన్నదే మీ ప్రయత్నంగా ఉండాలి. మీ తల్లిదండ్రులు అనుభవించిన కష్టాలు, మీరు ఎదుర్కొని వచ్చిన ఇబ్బందులు, ఇకపై మన దేశంలోని ఏ పౌరుడు కూడా అనుభవించాల్సిన అవసరం లేకుండా చూడాలి. మీరు ప్రభుత్వ వ్యవస్థలోకి అడుగుపెట్టిన వెంటనే చేయాల్సిన పని ఇదే.
మిత్రులారా,
నేడు దేశంలోని ప్రతి రంగంలో వేగవంతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మీరు నిరంతరం నేర్చుకుంటూ ఈ స్థాయికి చేరుకున్నారు. ఇక నుంచి నిరంతరం నేర్చుకునే కొత్త ప్రయాణం ప్రారంభమవుతుంది. మీరు మీ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలి. కొత్త సాంకేతికతలు, కొత్త వ్యవస్థలను అర్థం చేసుకోవాలి. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు మిషన్ కర్మయోగి మీకు సహాయపడుతుంది. నేడు 1.7 కోట్లకు పైగా ప్రభుత్వ ఉద్యోగులు ఐజీఓటీ కర్మయోగి వేదికతో అనుసంధానమై ఉన్నారు. మీలాంటి కొత్త సహచరుల కోసం ప్రత్యేకంగా కర్మయోగి ప్రారంభ్‌ను రూపొందించారు. మీరు ఎంతగా మీ సామర్థ్యాలను మెరుగుపరుచుకుంటే, దేశ పౌరులకు అంత మెరుగైన సేవలు అందించగలుగుతారు.
మిత్రులారా,
మీరు ఎల్లప్పుడూ మరో విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ప్రభుత్వానికి అసలైన బలం దేశ పౌరుల విశ్వాసమే. మీరు ఏ మంత్రిత్వ శాఖలో ఉన్నా, ఏ విభాగంలో పనిచేస్తున్నా, మీ పని ఏదో ఒక విధంగా సామాన్య పౌరుల జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. వృద్ధుడి పెన్షన్ మీ పని కారణంగా ముందుకు సాగవచ్చు. ఒక విద్యార్థికి లభించే స్కాలర్‌షిప్ మీ బాధ్యతపై ఆధారపడి ఉండవచ్చు. ఒక రైతుకు అందాల్సిన సౌకర్యం మీ విభాగం ద్వారా చేరవచ్చు. ఏదో ఒక పౌరుడికి మీరే ప్రభుత్వ ప్రతినిధిగా కనిపించవచ్చు. మీ ప్రవర్తన, మీ సున్నితత్వం, మీ సామర్థ్యం, మీ నిజాయితీ ఇవన్నీ ఆ పౌరుడు ప్రభుత్వ సేవలను ఏ విధంగా అనుభవిస్తాడో నిర్ణయిస్తాయి.
కాబట్టి మిత్రులారా,
ప్రభుత్వ సేవలో మన మంత్రం “పౌరుడే దేవుడు, పౌరుడే దేవుడు” అయి ఉండాలి. పౌరులకు సేవ చేయడం అంటే దేశానికి సేవ చేయడమే. మీ పని ఒక పౌరుడి జీవితాన్ని సులభతరం చేసినప్పుడే మీ విజయం మరింత గొప్పదవుతుంది. మీరు ఎక్కడ ఉన్నా, ఏ విభాగంలో పనిచేస్తున్నా, అంకితభావంతో, సేవా స్ఫూర్తితో మీ బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉంటారని నేను విశ్వసిస్తున్నాను. మరోసారి మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు.
***
(రిలీజ్ ఐడి: 2316850)
సందర్శకుల సూచీ సంఖ్య : : 17