ఆయుష్
ప్రామాణిక అశ్వగంధ వేర్ల సారంతో కాలేయం, మూత్రపిండాలకు ఎలాంటి హాని లేదని నిరూపించిన 24 వారాల అశ్వగంధ క్లినికల్ పరీక్ష
టీకా పొందిన 1,200 మంది పెద్దలపై నిర్వహించిన మల్టీసెంటర్ ర్యాండమైజ్డ్ ప్లాసిబో నియంత్రిత పరీక్ష..
అశ్వగంధ వేరు సారాన్ని శరీరం 24 వారాల పాటు బాగా తట్టుకుందని వెల్లడి
ఇటీవల 'ఫ్రాంటియర్స్ ఇన్ మెడిసిన్'లో అధ్యయనం ప్రచురణ
నాడు పోస్టు చేయడమైనది:
28 SEP 2026 3:15PM by PIB Hyderabad
'ఫ్రాంటియర్స్ ఇన్ మెడిసిన్'లో ఇటీవల ప్రచురితమైన ఒక పెద్ద మల్టీసెంటర్ క్లినికల్ అధ్యయనం ప్రకారం ప్రామాణీకరించిన అశ్వగంధ వేర్ల సారాన్ని 24 వారాల పాటు ప్రతిరోజూ తీసుకోవడం సురక్షితమని.. చికిత్స కారణంగా కాలేయం లేదా మూత్రపిండాలకు ఎలాంటి హానీ జరగలేదని తేలింది.
2026 ఆగస్టు 20న ప్రచురితమైన ఈ అధ్యయనం (ఫ్రంట్. మెడ్., వ్యాల్యూమ్ 13, 20 అగస్టు 2026. https://doi.org/10.3389/fmed.2026.1852954), "కొవిషీల్డ్ టీకా తీసుకున్న తర్వాత నివారణ కోసం 24 వారాల పాటు దీర్ఘకాలికంగా అశ్వగంధను తీసుకోవటం, తట్టుకునే శక్తి: ఒక మల్టీసెంటర్ ర్యాండమైజ్డ్ డబుల్-బ్లైండ్ ప్లాసిబో-నియంత్రిత పరీక్ష" అనే శీర్షికతో వెలువడింది. దీనిని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్ఏఎస్), అఖిల భారత ఆయుర్వేద సంస్థ, జాతీయ ఆయుర్వేద సంస్థ(జైపూర్), ఆయుష్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ట్రాన్స్‌లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్, సెంటర్ ఫర్ కాంప్లిమెంటరీ అండ్ ఇంటిగ్రేటివ్ హెల్త్, పుణెలోని సావిత్రీబాయి పూలే విశ్వవిద్యాలయానికి చెందిన ఇంటర్ డిసిప్లినరీ స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వంటి 9 సంస్థలకు చెందిన బహుళ విభాగ పరిశోధకుల బృందం సంయుక్తంగా నిర్వహించింది.
ఆయుర్వేదం, క్లినికల్ మెడిసిన్, రుమటాలజీ, కాంప్లిమెంటరీ అండ్ ఇంటిగ్రేటివ్ హెల్త్, సంబంధిత విభాగాల నిపుణులతో కూడిన 9 సంస్థలకు చెందిన 45 మంది పరిశోధకుల బహుళ విభాగ బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. ఈ ర్యాండమైజ్డ్, డబుల్-బ్లైండ్, ప్లాసిబో-నియంత్రిత పరీక్షలో కొవిషీల్డ్ టీకా మొదటి, రెండో లేదా బూస్టర్ డోస్ తీసుకున్న 18 నుంచి 70 సంవత్సరాల వయస్సు గల 1,200 మంది ఆరోగ్యకరమైన పెద్దలు పాల్గొన్నారు. వీరికి రోజు వారీగా ర్యాండమైజ్డ్ పద్ధతిలో 500 మి.గ్రాల ప్రామాణీకరించిన అశ్వగంధ వేర్ల రసాన్ని (ఇది 4 గ్రాముల ముడి వేరు పొడికి సమానం) లేదా దానికి సమానంగా ప్లాసిబోను అందించారు. భారత్‌లోని ఏడు అధ్యయన కేంద్రాలలో నిర్వహించిన ఈ పరిశోధనలో క్లినికల్, ప్రయోగశాల, ఇమ్యునోలాజికల్ ప్రమాణాలను చేర్చారు. ఈ క్లినికల్ ట్రయల్ - ఇండియా (సీటీఆర్ఐ/2021/06/034496) క్లినికల్ ట్రయల్స్ రిజిస్ట్రీలో నమోదయింది.
పాల్గొన్నవారు 24 వారాల పాటు దీనిని తీసుకున్నారు. వారిని 28వ వారం వరకు పరిశీలించారు. నమోదు చేసుకున్న 1,200 మందిలో 1,032 మంది (86 శాతం) ఈ అధ్యయనాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.
ప్రామాణీకరించిన అశ్వగంధ వేరు సారం 24 వారాల వ్యవధిలో అనుకూలమైన భద్రత, తట్టుకునే ప్రొఫైల్‌ను కలిగి ఉందని ఈ అధ్యయనం కనుగొంది. కాలేయం ఎంజైమ్‌లు, బిలిరుబిన్, క్రియాటినిన్, రక్తంలో యూరియా వంటి పరీక్షలతో సహా కాలేయం, మూత్రపిండాల పనితీరు ప్రమాణాలు సాధారణ స్థాయిలలోనే ఉన్నాయి. చికిత్స కారణంగా కాలేయానికి లేదా మూత్రపిండాలకు ఎలాంటి నష్టం జరగలేదని ఈ పరీక్షలు స్పష్టం చేశాయి.
అధ్యయనం కారణంగా ఎటువంటి తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు నమోదుకాలేదని తేలింది. అలాగే ఏ ఒక్కరు కూడా ప్రతికూల ప్రభావం కారణంగా ఈ పరీక్ష నుంచి తప్పుకోలేదు.
ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కొటేచా మాట్లాడుతూ.. ప్రామాణీకరించిన ఆయుర్వేద పదార్థాల భద్రత, సరైన వినియోగానికి మద్దతు ఇచ్చే బలమైన శాస్త్రీయ ఆధారాలను ఈ ఫలితాలు అందిస్తున్నాయన్నారు. "నాణ్యమైన క్లినికల్ పరిశోధనలు ఆయుర్వేదానికి ఉన్న శాస్త్రీయ ఆధారాలను బలపరుస్తాయి.. సమకాలీన ఆరోగ్య సంరక్షణలో దాని సామర్థ్యాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి తోడ్పడతాయి. కఠినమైన క్లినికల్ అధ్యయనాల నుంచి పెరుగుతున్న ఈ ఆధారాలు ఆరోగ్యం, సంపూర్ణ ఆరోగ్య రంగాలలో ఆయుర్వేదాన్ని, దాని అనువర్తనాలను ప్రపంచవ్యాప్తంగా బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవడానికి కూడా మద్దతు ఇస్తున్నాయి" అని ఆయన వ్యాఖ్యానించారు.
భారత్‌లోని పుణెలో ఉన్న సెంటర్ ఫర్ రుమాటిక్ డిసీజెసెస్ డైరెక్టర్, చీఫ్ రుమటాలజిస్ట్, ఆయుష్ విశిష్ట శాస్త్రవేత్త, ఈ అధ్యయనానికి ప్రధాన రచయిత అయిన డాక్టర్ అరవింద్ చోప్రా ఈ ఫలితాల ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ.. "24 వారాల పాటు నిర్వహించిన ఈ పెద్ద, మల్టీసెంటర్, ర్యాండమైజ్డ్ క్లినికల్ పరీక్ష.. ప్రామాణీకరించిన అశ్వగంధ విషయంలో భద్రత, తట్టుకునే శక్తిపై ముఖ్యమైన ఆధారాలను అందిస్తుంది. అధ్యయనం అంతటా కాలేయం, మూత్రపిండాల పనితీరు ప్రమాణాలు సాధారణ శారీరక స్థాయిలలోనే ఉన్నాయి. చికిత్స కారణంగా కాలేయం లేదా మూత్రపిండాలకు ఎలాంటి హాని జరగలేదు. టీకా ద్వారా లభించిన రోగనిరోధక శక్తికి అశ్వగంధ ఎలాంటి భంగం కలిగించలేదని కూడా ఈ అధ్యయనం నిరూపించింది. అశ్వగంధ, ప్లేసిబో రెండు గ్రూపులలోనూ అధిక స్థాయి న్యూట్రలైజింగ్ యాక్టివిటీ నిలకడగా కొనసాగింది. ఈ ఫలితాలు కఠినమైన, బాగా నియంత్రణలో ఉన్న క్లినికల్ పరిశోధనల ద్వారా ప్రామాణీకరించిన ఆయుర్వేద పద్ధతులను పరిశీలించాల్సిన ప్రాముఖ్యతను మరింత బలపరుస్తున్నాయి" అని వ్యాఖ్యానించారు.
ఆయుష్ జాతీయ పరిశోధన ప్రొఫెసర్, ఈ అధ్యయన సహ-రచయిత అయిన ప్రొఫెసర్ భూషణ్ పట్వర్ధన్ ఆయుర్వేదం కోసం అధిక-నాణ్యత గల సాక్ష్యాధారాలను సృష్టించడానికి ఉన్న ప్రాముఖ్యతను ప్రముఖంగా చెప్పారు. “సంప్రదాయ మూలాలను కోల్పోకుండా పటిష్ఠమైన సమకాలీన క్లినికల్ పరిశోధనల ద్వారా ఆయుర్వేదాన్ని ఎలా అంచనా వేయొచ్చో చెప్పడానికి ఈ అధ్యయనం ఒక ముఖ్యమైన ఉదాహరణ. 24 వారాల పాటు నిర్వహించిన ఈ పరీక్షలో గమనించిన అనుకూలమైన భద్రత, తట్టుకునే శక్తి స్థాయిలు.. ప్రామాణీకరించిన అశ్వగంధ ఉపయోగంపై క్లినికల్ ఆధారాలను మరింత బలోపేతం చేస్తాయి. అలాగే ఆరోగ్య సంరక్షణలో వాటిని బాధ్యతాయుతంగా ఏకీకృతం చేయడానికి సాక్ష్యాధారిత విధానాల ప్రాముఖ్యతను ఇవి ప్రధానంగా చెబుతున్నాయి" అని ఆయన పేర్కొన్నారు.
ఆయుర్వేద పదార్థాల ఉపయోగం కోసం పటిష్ఠమైన క్లినికల్ ఆధారాలను సృష్టించడానికి ఉన్న ప్రాముఖ్యతను చెప్పిన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్ఏఎస్) డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ (వైద్య) రబీనారాయణ ఆచార్య .. "నియంత్రిత పరిస్థితులలో 24 వారాల పాటు ప్రామాణీకరించిన అశ్వగంధ వేరు సారం అందించినప్పుడు భద్రత, తట్టుకునే శక్తిపై ఈ మల్టీసెంటర్ క్లినికల్ ట్రయల్ ఫలితాలు విలువైన ఆధారాలను అందించాయి. ఆయుర్వేదం విషయంలో శాస్త్రీయ ఆధారాలను బలపరచడానికి, ప్రామాణీకరించిన ఆయుర్వేద పదార్థాల బాధ్యతాయుతమైన, సాక్ష్యాధారిత వినియోగానికి మద్దతు ఇవ్వడానికి ఇటువంటి చక్కగా రూపొందించిన క్లినికల్ అధ్యయనాలు ఎంతో ముఖ్యం" అని అన్నారు.
ప్రామాణీకరించిన అశ్వగంధ వేరు సారాన్ని 24 వారాల పాటు ఉపయోగించటం వల్ల కొవిషీల్డ్ టీకా తీసుకున్న వారి రోగనిరోధక శక్తిపై ప్రభావాన్ని కూడా ఈ అధ్యయనం అంచనా వేసింది. అశ్వగంధ, ప్లాసిబో రెండు గ్రూపులలోనూ వైరస్-న్యూట్రలైజింగ్ క్రియాశీలత 85 శాతానికి పైగా ఉంది.. రెండు గ్రూపుల మధ్య సంఖ్యాపరంగా ఎలాంటి గణనీయమైన వ్యత్యాసం కనిపించలేదు.
ఈ ఫలితాలు ప్రామాణీకరించిన అశ్వగంధ ఉపయోగంపై క్లినికల్ ఆధారాలను మరింత మెరుగుపరుస్తాయి. అలాగే వాటి సురక్షితమైన, సాక్ష్యాధారిత వినియోగానికి మద్దతు ఇవ్వడంలో పటిష్ఠమైన క్లినికల్ పరిశోధనల ప్రాముఖ్యతను ఇవి పునరుద్ఘాటిస్తున్నాయి.
****
(రిలీజ్ ఐడి: 2316282)
సందర్శకుల సూచీ సంఖ్య : : 15