నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నౌకల్లో ఉపయోగించే హరిత ఇంధనాన్ని ఉత్పత్తి చేసి సరఫరా చేయనున్న భారతదేశపు మొట్టమొదటి పోర్టు ఆధారిత ఈ-మిథనాల్ కేంద్రం


‘నెట్ జీరో 2070’ లక్ష్యానికి మద్దతుగా కాండ్లాలో ఏర్పాటు చేసిన హరిత మిథనాల్ ఉత్పత్తి కేంద్రానికి శంకుస్థాపన చేసిన గుజరాత్, అస్సాం రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రి

రూ. 2,300 కోట్ల పెట్టుబడితో కాండ్లాలో నిర్మించనున్న ఈ ఉత్పత్తి కేంద్రం ద్వారా కొత్తగా రానున్న 3,500 ఉద్యోగాలు

ప్రపంచానికి భారతదేశ ద్వారం గుజరాత్.. నేడు ఇది ప్రపంచ హరిత ఇంధన ద్వారంగా మారుతోంది: భూపేంద్ర పటేల్

భారత్ ప్రపంచంలోనే అగ్రగామి సముద్ర శక్తిగా ఎదుగుతోంది.. ఇది ఇప్పుడు హరిత శక్తితో ప్రపంచ నౌకలను నడిపిస్తుంది: సర్బానంద సోనోవాల్

అస్సాం భారతదేశానికి చమురు, తేయాకును అందించింది… ఇప్పుడు అది హరిత ఇంధనంతో ప్రపంచాన్ని నడిపిస్తుంది: డాక్టర్ హిమంత బిశ్వ శర్మ

నాడు పోస్టు చేయడమైనది: 26 SEP 2026 6:13PM by PIB Hyderabad

భారత్ హరిత ఇంధన ఎగుమతిదారుగా మారే దిశగా ఒక చారిత్రాత్మక అడుగుపడింది.ఈ రోజు గుజరాత్‌లోని గాంధీధామ్, కాండ్లాలో ఉన్న దీన్‌దయాళ్ పోర్ట్ అథారిటీ (డీపీఏ) వద్ద దేశంలోని మొట్టమొదటి ఓడరేవు ఆధారిత ఈ-మిథనాల్ కేంద్రానికి ఓడరేవులు- నౌకాయానం- జలమార్గాల (ఎంఓపీఎస్‌డబ్ల్యూ) కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, అస్సాం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిశ్వ శర్మ‌లు శంకుస్థాపన చేశారు. 

రోజుకు 150 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల ఈ కేంద్రం.. పునరుత్పాదక విద్యుత్, నీరు- బయోజెనిక్ కార్బన్ డయాక్సైడ్‌లను ఉపయోగించి ఈ-మిథనాల్‌ను ఉత్పత్తి చేస్తుంది. నౌకాయానం మరింత పర్యావరణ అనుకూలమైందిగా మారేందుకు దోహదపడే హరిత ఇంధనం ఇది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే వాణిజ్య మార్గాలలో ఒకటైన ఆసియా-ఐరోపా అంతర్జాతీయ వాణిజ్య కారిడార్‌లో తిరిగే నౌకలకు ఈ ఇంధనాన్ని సరఫరా చేస్తారు. ఈ ప్రాజెక్ట్ భారత్‌ను ప్రపంచ నౌకాయానానికి హరిత ఇంధన ఎగుమతిదారుగా నిలబెడుతుంది. ప్రపంచ దేశాల్లో ఉన్న ఉత్పత్తిదారులతో పోలిస్తే చాలా పోటీ ధరకే ఇక్కడ ఇంధనం ఉత్పత్తి అవుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో టన్ను హరిత మిథనాల్ ధర 1,300 డాలర్లు కాగా ఇక్కడ టన్ను ధర 750 డాలర్లు మాత్రమే. దీనివల్ల ఈ కేంద్రం భారత్‌ను హరిత ఇంధన ఉత్పత్తి, సరఫరాలో ప్రపంచ అగ్రగామిగా తీర్చిదిద్దనుంది.

ఈ రూ. 2,300 కోట్ల ప్రాజెక్ట్‌ను దీన్‌దయాళ్ పోర్ట్ అథారిటీ (డీపీఏ), నామరూప్‌కు చెందిన అసోం పెట్రో-కెమికల్స్ లిమిటెడ్‌లు (ఎపీసీఎల్) సంయుక్తంగా చేపడుతున్నాయి. దీనిని స్కేలబుల్ మాడ్యూల్స్‌గా దశలవారీగా ఏర్పాటు చేయనున్నారు. రోజుకు 50 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్రాజెక్ట్ మొదటి దశకు రూ. 1,200 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. దీనిని 2027 జనవరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత రెండో దశలో ఉత్పత్తి సామర్థ్యాన్ని రోజుకు 100 టన్నుల మేర పెంచుతారు. దీని కోసం రూ. 1,100 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. దీనిని 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. తద్వారా మొత్తం పెట్టుబడి రూ. 2,300 కోట్లకు చేరుతుంది.

2070 నాటికి 'సున్నా స్థాయికి నికర కర్భన ఉద్గారాలు (నెట్ జీరో)' సాధించాలనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు ఈ ప్రాజెక్ట్ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. ప్రధానమంత్రి తీసుకున్న ‘ఇంధన రంగంలో ఆత్మనిర్భరత, భారత్‌లో తయారీ, ప్రపంచ కోసం తయారీ’ అనే మిషన్‌ల అమలుకు ఇది దోహదపడుతుంది. భారతదేశ సముద్ర రంగాన్ని విస్తరించే దిశగా జరుగుతున్న విస్తృత ప్రయత్నాలలో భాగంగా ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది. రాబోయే ఐదేళ్లలో దేశ వాణిజ్య నౌకాదళంలో 100 కొత్త నౌకలను చేర్చాలని, 2047 నాటికి ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ నౌకలు కలిగిన మొదటి 5 దేశాల్లో భారత్‌ను ఒకటిగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ప్రణాళిక వేసింది. ప్రపంచ నౌకాయాన దిగ్గజం 'మెర్స్క్' కూడా భారత్‌లో తయారైన కంటైనర్లను ఆర్డర్ చేయడం ప్రారంభించింది. దీన్‌దయాళ్ పోర్ట్ అథారిటీ‌కి ఉన్న విస్తృత మెగా ఓడరేవుల ప్రణాళికలో భాగంగా వదినార్‌లో రూ. 1,520 కోట్ల వ్యయంతో చేపట్టిన డీపీఐ-కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (సీఎస్‌ఎల్) నౌకా నిర్మాణ ప్రాజెక్ట్ కూడా ప్రస్తుతం కొనసాగుతోంది. దీనితో పాటు పోర్‌బందర్‌లోని కుచ్ఛాడి వద్ద ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ నౌకానిర్మాణ కేంద్రం, రిపేర్ క్లస్టర్‌కు కూడా సూత్రప్రాయంగా ఆమోదం లభించింది.

లోక్‌సభలో డిబ్రూగర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ.. అసోం పెట్రో-కెమికల్స్ తన నియోజకవర్గమైన నామరూప్‌లో ఉందని పేర్కొన్నారు. ద్వారకా శ్రీకృష్ణుడు, ఈశాన్య ప్రాంత రుక్మిణి పురాణగాథ, తేజ్‌పూర్ ఉషా-అనిరుద్ధుల కథ, 15వ శతాబ్దపు అసోమీయ సాధువు శ్రీమంత శంకరదేవ రచనలను ప్రస్తావించిన ఆయన.. అస్సాం, గుజరాత్ మధ్య ఉన్న సాంస్కృతిక సంబంధాలను గుర్తుచేశారు. అస్సాం, గుజరాత్‌ల బలాలను దేశ సేవలో మమేకం చేస్తూ 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్'కు ఈ ప్రాజెక్ట్ అద్దం పడుతోందని ఆయన అభివర్ణించారు.

"ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ గతంలో కంటే వేగంగా హరిత మార్గంలో అభివృద్ధి చెందుతోంది. ఆ ప్రయాణానికి నాయకత్వం వహిస్తున్నందుకు గుజరాత్ గర్విస్తోంది" అని భూపేంద్ర పటేల్ అన్నారు. "కచ్, గుజరాత్‌కు ఉన్న సుదీర్ఘ తీరప్రాంతం ఇప్పుడు కాండ్లా ద్వారా ప్రపంచ నౌకలకు శక్తినిస్తుంది. ఈ కేంద్రం మన పునరుత్పాదక శక్తి సామర్థ్యాన్ని ఎగుమతిగా మారుస్తుంది.. గుజరాత్ తీరాన్ని ప్రపంచం కోసం భారత హరిత ఇంధన ద్వారంగా తీర్చిదిద్దుతుంది." అని ఆయన వ్యాఖ్యానించారు. 

"ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశానికి ఇతరులను అనుసరించడం కాకుండా నాయకత్వం వహించే ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదించారు" అని సర్బానంద సోనోవాల్ అన్నారు. "భారత్ ఇప్పుడు స్వయంగా నౌకలు, కంటైనర్లను ఎలా తయారు చేస్తోందో అలాగే త్వరలోనే ప్రపంచ వాణిజ్యాన్ని నడిపించే స్వచ్ఛమైన ఇంధనాన్ని కూడా తయారు చేస్తుంది. రాబోయే సంవత్సరాల్లో సింగపూర్-రోటర్‌డ్యామ్ మార్గంలో కాండ్లా ఒక హరిత ఇంధన కేంద్రంగా మారుతుంది. దేశంలోని ప్రతి ప్రధాన ఓడరేవుకు ఈ కేంద్రం ఒక ఆదర్శప్రాయమైన నమూనా. ఇది మన యువతకు నైపుణ్యంతో కూడిన ఉపాధి అవకాశాల ద్వారాలను తెరుస్తుంది. 2070 నాటికి సున్నా స్థాయి నికర కర్బన ఉద్గారాలు సాధించడంలో, 2047 నాటికి 'వికసిత్ భారత్' లక్ష్యాలను చేరుకోవడంలో భారత్‌కు ఇది గట్టి తోడ్పాటునందిస్తుంది" అని ఆయన పేర్కొన్నారు. 

"ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈశాన్య ప్రాంతాన్ని భారత్ అభివృద్ధి కథకు ముఖ్యమైనదిగా ఉంచారు. ఆ నమ్మకానికి అస్సాం తన పారిశ్రామిక స్పూర్తితో, ఆశయాలతో ప్రతిఫలమిస్తోంది" అని డాక్టర్ హిమంత బిశ్వ శర్మ అన్నారు. "మహాబ్రహ్మపుత్ర నది, సమృద్ధిగా లభించే సూర్యరశ్మి, అపారమైన జలవిద్యుత్ సామర్థ్యంతో కూడిన అస్సాం.. హరిత ఇంధన శక్తికేంద్రంగా మారడానికి సిద్ధంగా ఉంది. ఈరోజు ఒక అస్సాం కంపెనీ ఆ శక్తిని నామరూప్ నుంచి కాండ్లా వరకు తీసుకువెళ్లింది. దేశ స్వచ్ఛమైన ఇంధన భవిష్యత్తుకు ఈశాన్య భారతం దిక్సూచిగా మారుతుందని ఇది నిరూపిస్తోంది" అని అస్సాం ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. 

గాంధీధామ్‌లోని డీపీఏ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కచ్ లోక్‌సభ సభ్యులు వినోద్ చావ్డా, గాంధీధామ్ ఎమ్మెల్యే మాల్తిబెన్ కిషోర్ మహేశ్వరి, అస్సాం ప్రభుత్వ రాజకీయ కార్యదర్శి తరంగా గొగోయ్, అసోం పెట్రో-కెమికల్స్ ఛైర్మన్ బికుల్ దేకా, వైస్ ఛైర్మన్ హేమంత గొగోయ్, దీన్‌దయాళ్ పోర్ట్ అథారిటీ (డీపీఏ) ఛైర్మన్ సుశీల్ కుమార్ సింగ్‌తో పాటు ప్రభుత్వానికి, రెండు సంస్థలకు చెందిన ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2315813) సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Gujarati