జల శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి యాజమాన్యం, సుస్థిర నీటి లభ్యత సేవలపై ప్రధాన దృష్టితో ముగిసిన 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు - 2026


వాతావరణ మార్పులను తట్టుకునే సుస్థిర నీటి నిర్వహణను సమష్టి చర్యలతో బలోపేతం చేయాలని పిలుపునిచ్చిన శ్రీ సీ.ఆర్. పాటిల్

ఆవిష్కరణలు, విజ్ఞాన మార్పిడి, సుస్థిర డబ్ల్యూఏఎస్‌హెచ్‌ పరిష్కారాల అభివృద్ధికి ప్రపంచ జల రంగాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చిన ఐఐడబ్ల్యూడబ్ల్యూ - 2026

సుస్థిర నీటి సేవల కోసం సమాజ ఆధారిత విధానాలు, డిజిటల్‌ ఆవిష్కరణలు, పటిష్టమైన సంస్థాగత వ్యవస్థలపై దృష్టి సారించిన ఇండియా ఇంటర్నేషనల్‌ డబ్ల్యూఏఎస్‌హెచ్‌ సదస్సు

నాడు పోస్టు చేయడమైనది: 25 SEP 2026 7:54PM by PIB Hyderabad

తొమ్మిదో భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు (ఇండియా ఇంటర్నేషనల్‌ వాటర్‌ వీక్‌ - ఐఐడబ్ల్యూడబ్ల్యూ) - 2026 నేడు న్యూఢిల్లీలోని భారత్‌ మండపంలో ముగిసింది. కేంద్ర జల శక్తి శాఖ మంత్రి  శ్రీ శ్రీ సీ ఆర్ పాటిల్‌ అధ్యక్షతన ముగింపు కార్యక్రమం జరిగింది. సెప్టెంబర్‌ 22 నుంచి 25 వరకు “వాతావరణ మార్పులను తట్టుకునే నీటి నిర్వహణ”  ఇతివృత్తంతో జరిగిన ఈ సదస్సులో విధాన రూపకర్తలు, ప్రభుత్వ అధికారులు, అంతర్జాతీయ సంస్థలు, అభివృద్ధి భాగస్వాములు, పరిశోధకులు, విద్యావేత్తలు, పరిశ్రమ ప్రతినిధులు, జల రంగ నిపుణులు, ఆవిష్కర్తలు, యువ నిపుణులు పాల్గొన్నారు. నీటి భద్రతకు సంబంధించి ఉద్భవిస్తున్న సవాళ్లు, వాటికి పరిష్కార మార్గాలపై వారు చర్చించారు.

కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రులు శ్రీ వి. సోమన్న, శ్రీ రాజ్‌ భూషణ్‌ చౌదరి, తాగునీరు, పారిశుధ్య విభాగం కార్యదర్శి శ్రీ అశోక్‌ కె.కె. మీనా, జల వనరులు, నదీ అభివృద్ధి, గంగా పునరుజ్జీవన శాఖ కార్యదర్శి శ్రీమతి అర్చనా వర్మ, జాతీయ స్వచ్ఛ గంగా మిషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ శ్రీ రాజీవ్‌ కుమార్‌ మిత్తల్‌, తాగునీరు, పారిశుధ్య విభాగం అదనపు కార్యదర్శి, జాతీయ జల్‌ జీవన్‌ మిషన్‌ మిషన్‌ డైరెక్టర్‌ శ్రీ కమల్‌ కిషోర్‌ సోన్‌, కేంద్ర జల సంఘం చైర్మన్‌ శ్రీ అనుపమ్‌ ప్రసాద్‌, జాతీయ జల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ శ్రీ బాలేశ్వర్‌ ఠాకూర్‌  ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు. 

 

సమావేశాన్ని ఉద్దేశించి కేంద్ర జల శక్తి శాఖ మంత్రి శ్రీ సీ ఆర్ పాటిల్‌ మాట్లాడుతూ, వాతావరణ మార్పులను తట్టుకునే నీటి నిర్వహణపై ప్రభుత్వాలు, నిపుణులు, సంస్థలు, విద్యావేత్తలు, పరిశ్రమలు, యువత చర్చించేందుకు ఐఐడబ్ల్యూడబ్ల్యూ - 2026 ఒక వేదికను అందించిందని పేర్కొన్నారు. నీటి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం, అంతర్జాతీయ, సంస్థాగత సహకారాన్ని బలోపేతం చేయడం మూడు కీలక అంశాలని ఆయన అన్నారు. 2019లో ప్రారంభమైన జల్‌ జీవన్‌ మిషన్‌ ప్రభావాన్ని ప్రస్తావిస్తూ, ఇళ్లకు కుళాయి నీటి సౌకర్యం విస్తరించడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యం, గౌరవప్రదమైన జీవనం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో దోహదపడిందని ఆయన తెలిపారు. అదే సమయంలో మహిళలు నీటిని తెచ్చుకునేందుకు వెచ్చించే సమయం, శ్రమ కూడా తగ్గిందని పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అంచనాను ప్రస్తావిస్తూ, జల్‌ జీవన్‌ మిషన్‌ కింద సురక్షితమైన తాగునీటి లభ్యత వల్ల పిల్లల్లో మరణాలను గణనీయ సంఖ్యలో  నివారించడంతో పాటు కలుషితమైన నీటి కారణంగా ఏర్పడే ఆరోగ్య సమస్యల భారాన్ని తగ్గించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. జల్‌ జీవన్‌ మిషన్‌ తదుపరి దశలో తగిన పరిమాణంలో, క్రమం తప్పకుండా, సురక్షితమైన, సుస్థిరమైన తాగునీటి సేవలను అందించడంపై దృష్టి సారించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ ఫలితాలను కొనసాగించడంలో సమాజ భాగస్వామ్యం, నీటి వనరుల సుస్థిరత, తగిన సాంకేతిక పరిజ్ఞానం కీలకంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.

 

కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ వి. సోమన్న మాట్లాడుతూ, సురక్షితమైన, విశ్వసనీయమైన తాగునీరు, పారిశుధ్యం, పరిశుభ్రమైన పరిసరాలు, సమర్థవంతమైన మురుగునీటి నిర్వహణ ద్వారా జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రాథమికంగా నీటి భద్రత అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో జల్‌ జీవన్‌ మిషన్‌ తీసుకొచ్చిన మార్పును ప్రస్తావిస్తూ, ఇకపై తాగునీటి సేవలు సురక్షితంగా, తగిన పరిమాణంలో, క్రమం తప్పకుండా, సుస్థిరంగా అందేలా చూడటంపై దృష్టి సారించాలని ఆయన అన్నారు. తాగునీరు, పారిశుధ్యాన్ని సమగ్ర విధానంతో పరిష్కరించాల్సిన అవసరాన్ని ఆయన ప్రముఖంగా పేర్కొన్నారు. నీటి వనరులను, ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు గ్రేవాటర్‌, మురుగునీరు, ఘన వ్యర్థాలను సురక్షితంగా నిర్వహించడం ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్‌ మిషన్‌ - గ్రామీణ్‌ కింద ఓడీఎఫ్‌ ప్లస్‌, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణలో సాధించిన పురోగతి ఈ సమగ్ర విధానానికి ముఖ్యమైన పునాదిగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఇండియా ఇంటర్నేషనల్‌ వాటర్‌ వీక్‌లో జరిగిన చర్చల ద్వారా పొందిన అనుభవాలు సుస్థిరమైన, ప్రజా కేంద్రిత నీటి సేవల కల్పనతో పాటు వికసిత్ భారత్‌ - 2047 లక్ష్య సాధన దిశగా ఆచరణాత్మక చర్యలుగా మారుతాయని ఆయన తెలిపారు.

 

కేంద్ర జల శక్తి శాఖ మరో సహాయ మంత్రి శ్రీ రాజ్‌ భూషణ్‌ చౌదరి మాట్లాడుతూ, వాతావరణ మార్పులను తట్టుకునే నీటి వనరుల నిర్వహణ దిశగా భారత్‌ చేపడుతున్న చర్యలను వివరించారు. సాగునీటి అభివృద్ధి, ఆయకట్టు ప్రాంతాల ఆధునికీకరణ, ఆనకట్టల పునరుద్ధరణ, భూగర్భ జలాల నిర్వహణ, భూగర్భ జలాల పునరుద్ధరణ, నదుల పునరుజ్జీవనం, నదుల అనుసంధానం, వరదల నిర్వహణ, జల విజ్ఞాన అంచనాలు, జలాశయాల నిర్వహణ, మెరుగైన నీటి సమాచార వ్యవస్థల ద్వారా ఈ కృషి కొనసాగుతోందని ఆయన తెలిపారు. నీటి వనరుల ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి, వాటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఆయన స్పష్టం చేశారు. నీటి వనరుల ప్రాజెక్టులపై పెడుతున్న పెట్టుబడులు అంతిమంగా ప్రజలు, వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణ వ్యవస్థలకు స్పష్టంగా పరిగణించగల ప్రయోజనాలుగా మారాలని ఆయన పేర్కొన్నారు.

తాగునీరు, పారిశుధ్య విభాగం (డీడబ్ల్యూఎస్ఎస్‌) కార్యదర్శి శ్రీ అశోక్‌ కె.కె. మీనా మాట్లాడుతూ, వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యం నీటి వనరుల స్థిరత్వంతోనే ప్రారంభమవుతుందని అన్నారు. జలచక్రాన్ని (హైడ్రోలాజికల్ సైకిల్) మానవాళికి ప్రకృతి ప్రసాదించిన ఉమ్మడి సంపదగా వర్ణిస్తూ, ఇది ప్రకృతి సిద్ధమైన అత్యంత విజయవంతమైన నీటి యాజమాన్య వ్యవస్థ అని పేర్కొన్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో సమాజాలు ప్రతికూల పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు జలచక్రాన్ని పరిరక్షించడం, ప్రకృతితో సమన్వయంగా నీటిని నిర్వహించడం ప్రతి ఒక్కరి సమష్టి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ప్రతి నీటి బొట్టును సంరక్షించడం, పునర్వినియోగించడం, తిరిగి వనరుల్లోకి చేర్చడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించవచ్చని తెలిపారు. ఐఐడబ్ల్యూడబ్ల్యూ - 2026లో చర్చించిన విజ్ఞానం, పరిష్కారాలను క్షేత్రస్థాయిలో అమలు చేసి, వాటి ఫలితాలను స్పష్టంగా కొలిచేలా చర్యలు తీసుకోవడంపైనే నీటి కార్యక్రమాల దీర్ఘకాలిక విజయం ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

 

ఐఐడబ్ల్యూడబ్ల్యూ - 2026కు సంబంధించిన సంక్షిప్త నివేదిక, ముఖ్య సిఫారసులను జాతీయ స్వచ్ఛ గంగా మిషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ శ్రీ రాజీవ్‌ కుమార్‌ మిత్తల్‌ సమర్పించారు. ఈ నీటి వారోత్సవాల్లో 7,224 మంది ప్రతినిధులు, 227 మంది ప్రదర్శనకర్తలు పాల్గొనగా, 119 పరిశోధనా పత్రాలను సమర్పించారు. రెండు భాగస్వామ్య దేశాలు, 14 భాగస్వామ్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఏడు అంశాలపై వెలువడిన సిఫారసుల్లో మరింత బలోపేతమైన, ప్రజల భాగస్వామ్యంతో కూడిన నీటి పాలన, శుద్ధి చేసిన మురుగునీటిని సురక్షితంగా పునర్వినియోగించడం, అంతర్జాతీయ సహకారాన్ని మరింత విస్తరించడం, డేటా ఆధారిత పాలన, సమాజం ఆధ్వర్యంలో భూగర్భ జలాల పునరుద్ధరణ, డిజిటల్‌, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల విస్తృత వినియోగం, బహుళ విపత్తులకు సంబంధించిన ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయడం, వాతావరణ మార్పులకు అనుగుణంగా నదీ పరీవాహక ప్రాంత స్థాయిలో సమగ్ర విధానాలను అవలంబించడం వంటి అంశాలు ఉన్నాయి. అలాగే, వినూత్న ఆర్థిక వనరుల సమీకరణ, ప్రభుత్వ -  ప్రైవేటు భాగస్వామ్యాలకు అనుకూలమైన విధానపరమైన వ్యవస్థలు, నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, సుస్థిరమైన పూడిక తీత యాజమాన్యం, జలాశయాల నిల్వ సామర్థ్యాన్ని పరిరక్షించడం, శాస్త్రీయ పద్ధతుల్లో భూగర్భ జలాల గుర్తింపు, పర్యావరణ నీటి ప్రవాహాలను కొనసాగించడం, సమాజ ఆధ్వర్యంలో పర్యావరణ వ్యవస్థ ఆధారిత నీటి నిర్వహణను ప్రోత్సహించడం వంటి అంశాలను కూడా  ఆయన ప్రస్తావించారు. 

ఐఐడబ్ల్యూడబ్ల్యూ - 2026లో మరో ముఖ్యమైన అంశంగా  తాగునీరు, పారిశుధ్య విభాగం (డీడబ్ల్యూఎస్ఎస్‌) కోల్‌కతాలోని డాక్టర్‌ శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ జాతీయ జల, పారిశుధ్య సంస్థ (ఎస్‌పీఎం - నివాస్‌) సహకారంతో రెండో ఇండియా ఇంటర్నేషనల్‌ డబ్ల్యూఏఎస్‌హెచ్‌ కాన్ఫరెన్స్‌ - 2026ను నిర్వహించింది.

ముగింపు సమావేశంలో మాట్లాడిన జాతీయ జల్‌ జీవన్‌ మిషన్‌ (ఎన్‌జేజేఎం) అదనపు కార్యదర్శి, మిషన్‌ డైరెక్టర్‌ శ్రీ కమల్‌ కిషోర్‌ సోన్‌, రెండో డబ్ల్యూఏఎస్‌హెచ్‌ సదస్సు ద్వారా వెలువడిన ఫలితాలను వివరించారు. నీరు, పారిశుధ్యం, పరిశుభ్రత రంగాలకు సంబంధించిన విద్యా, పరిశోధన, క్షేత్రస్థాయి అనుభవాలను ఈ సదస్సు ఒకే వేదికపైకి తీసుకొచ్చిందని ఆయన తెలిపారు. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో 57 పరిశోధనా పత్రాలను సమర్పించినట్లు, ఎస్‌పీఎం - నివాస్‌లో కూడా అదనంగా పలు పరిశోధనా పత్రాలను సమర్పించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ చర్చల్లో నీటి వనరుల సుస్థిరత, నిర్వహణ - సంరక్షణ, నీటి నాణ్యత, వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యం, డిజిటల్‌ సాంకేతికతలు, సుస్థిర పారిశుధ్యం, సున్నా వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలకు ప్రాధాన్యం లభించిందని ఆయన తెలిపారు. సుస్థిర డబ్ల్యూఏఎస్‌హెచ్‌ ఫలితాల సాధనకు సాంకేతిక, సంస్థాగత చర్యలతో పాటు సమాజం నుంచి చురుకైన భాగస్వామ్యం ఎంతో అవసరమని ఆయన స్పష్టం చేశారు. విజ్ఞాన మార్పిడి, నిరంతర సహకారానికి ఇండో - ఆఫ్రికా రౌండ్‌టేబుల్‌ సమావేశం ఒక ముఖ్యమైన వేదికగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.

 

నీరు, పారిశుధ్యం, పరిశుభ్రత (డబ్ల్యూఏఎస్‌హెచ్‌)పై డీడబ్ల్యూఎస్ఎస్‌ నిర్వహించిన ఇండో–ఆఫ్రికా రౌండ్‌టేబుల్‌ సమావేశంలో 22 ఆఫ్రికా దేశాల రాయబారులు, హైకమిషనర్లు, సీనియర్‌ దౌత్య ప్రతినిధులతో పాటు అభివృద్ధి భాగస్వాములు, డబ్ల్యూఏఎస్‌హెచ్‌ రంగానికి చెందిన వివిధ వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు. సామర్థ్య పెంపు, నీటి నాణ్యత పర్యవేక్షణ, డిజిటల్‌ వేదికలు, సమాజ ఆధారిత విధానాలు, వాతావరణ మార్పులను తట్టుకునే మౌలిక సదుపాయాలు, అమలు అనుభవాల పరస్పర మార్పిడి వంటి అంశాల్లో సహకారానికి గల అవకాశాలను రౌండ్‌టేబుల్‌ సమావేశం చర్చించింది. 

యువ సాంకేతిక నిపుణుల భాగస్వామ్యం ఈ సదస్సులో మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) భాగస్వామ్యంతో 50 మందికి పైగా ఇంజినీరింగ్‌ విద్యార్థులు డబ్ల్యూఏఎస్‌హెచ్‌ సదస్సులో పాల్గొన్నారు. తద్వారా నీరు, పారిశుధ్య రంగాల్లోని వాస్తవ సమస్యలను అర్థం చేసుకునే అవకాశం యువ సాంకేతిక ప్రతిభకు లభించింది.

ముగింపు కార్యక్రమంలో ముఖ్యమైన అంశంగా జల్‌ జీవన్‌ మిషన్‌ కింద గ్రామ పంచాయతీ ప్రతినిధులు, గ్రామ నీరు, పారిశుధ్య కమిటీ (వీడబ్ల్యూఎస్‌సీ) సభ్యులు, సుజలం శక్తి గ్రూప్‌ సభ్యుల కోసం రూపొందించిన ఎనిమిది సామర్థ్య పెంపు శిక్షణ మాడ్యూళ్లను విడుదల చేశారు. కేంద్ర జల శక్తి శాఖ మంత్రి శ్రీ సి.ఆర్. పాటిల్‌ ఈ మాడ్యూళ్లను విడుదల చేశారు.

 

గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సేవల అందజేతకు సంబంధించిన కీలక అంశాలను సులభంగా అర్థమయ్యేలా వివరించేందుకు ఈ మాడ్యూళ్లలో గ్రామీణ ప్రాంతాల్లోని సాధారణ పరిస్థితులను ఉదాహరణలుగా తీసుకున్నారు. సంస్థాగత పాత్రలు, బాధ్యతలు, నీటి వనరుల సుస్థిరత, నీటి నాణ్యత, నిర్వహణ - సంరక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, సమాజ భాగస్వామ్యం, వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యం వంటి అంశాలను ఇందులో వివరించారు. నీటి లభ్యత సేవలను సమర్థంగా నిర్వహించడంతో పాటు, మౌలిక సదుపాయాలను దీర్ఘకాలం సుస్థిరంగా కొనసాగించేలా స్థానిక సంస్థలు, సమాజ భాగస్వాముల సామర్థ్యాన్ని బలోపేతం చేయడం ఈ మాడ్యూళ్ల ప్రధాన ఉద్దేశం.

దేశవ్యాప్తంగా గ్రామీణ తాగునీటి మౌలిక సదుపాయాల గణనీయ విస్తరణను కొనసాగిస్తూ, హామీతో కూడిన, విశ్వసనీయమైన, సుస్థిరమైన సేవల అందజేతకు మరింత ప్రాధాన్యం ఇచ్చే దిశగా జల్‌ జీవన్‌ మిషన్‌ ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఈ మాడ్యూళ్లను విడుదల చేశారు.

ముగింపు సమావేశంలో భారత్‌ ఎదుర్కొంటున్న మారుతున్న నీటి సవాళ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వాలు, సమాజాలు, శాస్త్రీయ సంస్థలు, అభివృద్ధి భాగస్వాములు, ప్రైవేట్‌ రంగం సమన్వయంతో పనిచేయాల్సిన ప్రాధాన్యాన్ని మరోసారి స్పష్టం చేశారు. భారత నీటి భద్రత లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఆధారాల ఆధారిత ప్రణాళిక, సాంకేతిక ఆవిష్కరణలు, సంస్థాగత బలోపేతం, వాతావరణ మార్పులను తట్టుకునే మౌలిక సదుపాయాలు, సమాజ భాగస్వామ్యం అవసరమని ఐఐడబ్ల్యూడబ్ల్యూ - 2026లో జరిగిన చర్చలు స్పష్టం చేశాయి.

నాలుగు రోజుల వేదిక నుంచి వెలువడిన విజ్ఞానం, భాగస్వామ్యాలు, పరిష్కారాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు, నీటి భద్రత, సుస్థిర సేవలు, వాతావరణ మార్పులను తట్టుకునే సమాజాల నిర్మాణం దిశగా సమష్టి కృషిని మరింత బలోపేతం చేయాలన్న ఉమ్మడి నిబద్ధతతో తొమ్మిదో ఇండియా ఇంటర్నేషనల్‌ వాటర్‌ వీక్‌ ముగిసింది.

ముగింపు కార్యక్రమంలో పలు ముఖ్యమైన ప్రచురణలు, నివేదికలు, ప్రోటోకాల్స్‌, సామర్థ్య పెంపు మాడ్యూళ్లను విడుదల చేశారు. వీటిలో సుస్థిరమైన, సమర్థవంతమైన సాగునీటికి సంబంధించిన అభివృద్ధి చెందుతున్న ధోరణులు, పురోగతిపై ఎన్ఈఆర్ఐడబ్ల్యూఏఎల్ఎం‌ రూపొందించిన రెండు పుస్తకాలు, జాతీయ స్వచ్ఛ గంగా మిషన్‌ రూపొందించిన నదుల్లో మాక్రోప్లాస్టిక్‌ వ్యర్థాల పర్యవేక్షణ ప్రోటోకాల్‌, జల్‌ జీవన్‌ మిషన్‌ కింద సామర్థ్య పెంపు మాడ్యూళ్లు ఉన్నాయి. ప్రధాన, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల తొలి గణన, ఏడో చిన్నతరహా సాగునీటి గణన, రెండో జల వనరుల గణన, తొలి ఊటల గణనకు సంబంధించిన నివేదికలను కూడా విడుదల చేశారు. కేంద్ర జల సంఘం రూపొందించిన సాగునీటి అట్లాస్‌ను కూడా ఈ కార్యక్రమంలో ఈ - లాంచ్ చేశారు ఐఐడబ్ల్యూడబ్ల్యూ - 2026 ప్రదర్శనలో వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులను కూడా ప్రదానం చేశారు.

ముగింపు కార్యక్రమానికి ముందు డిజిటల్‌ మార్పు, ఆవిష్కరణలు, పటిష్ట నీటి నిర్వహణపై దృష్టి సారిస్తూ ఐఐడబ్ల్యూడబ్ల్యూ - 2026లో మూడు సమావేశాలు జరిగాయి. తాగునీరు, పారిశుధ్య విభాగం (డీడబ్ల్యూఎస్ఎస్‌) నిర్వహించిన “నీటి రంగంలో డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌”, “నీటి నాణ్యత, వ్యయసమర్థ సాంకేతికత”, “గ్రామీణ నీటి సరఫరా పాలన, అమలు వ్యవస్థ” పై మూడు సమావేశాలు ఈ చర్చలకు కేంద్రంగా నిలిచాయి. ఈ సమావేశాల్లో డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, నీటి నాణ్యత నిర్వహణ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, పరిశోధన, పాలన, గ్రామీణ నీటి సేవలను బలోపేతం చేసేందుకు ఆచరణాత్మక పరిష్కారాలపై వివిధ వర్గాల అభిప్రాయాలు, అనుభవాలను పంచుకున్నారు.

నీటి రంగంలో డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పై జరిగిన సమావేశంలో ప్రభుత్వ, అంతర్జాతీయ, సాంకేతిక రంగాలకు చెందిన సీనియర్‌ నిపుణులు పాల్గొని పరస్పరం అనుసంధానించగల డేటా, కృత్రిమ మేధ, భౌగోళిక సమాచార సాంకేతికతలు, పౌర కేంద్రిత వేదికలు నీటి పాలన, సేవల అందజేతను ఎలా మార్పు చేయగలవన్న అంశంపై చర్చించారు. జాతీయ జల్‌ జీవన్‌ మిషన్‌ అదనపు కార్యదర్శి, మిషన్‌ డైరెక్టర్‌ శ్రీ కమల్‌ కిషోర్‌ సోన్‌ అధ్యక్షతన, ప్రపంచ బ్యాంక్‌కు చెందిన శ్రీ విలియం రెక్స్‌ సహాధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. “ఒకే డేటాగా నీరు”  దార్శనికతను సమావేశం ప్రధానంగా ప్రస్తావించింది. గ్రామీణ తాగునీటి రంగానికి డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌గా ‘సుజలం భారత్‌’ను అభివృద్ధి చేస్తున్న విధానాన్ని వివరించారు. విశ్వసనీయమైన, ధ్రువీకరించిన డేటా సమాహారాలు, భౌగోళిక సమాచార ఆధారిత ఆస్తుల మ్యాపింగ్‌, పౌరుల అభిప్రాయ సేకరణ, జల్‌ సేవా అనలిటిక్స్‌, రూరల్‌ డేటా స్టాక్‌ వంటి అంశాలపై చర్చించారు. ఆధార్‌, డిజిలాకర్‌, యూపీఐ వంటి ప్రాథమిక డిజిటల్‌ వేదికల నుంచి నీటి లీకేజీల గుర్తింపు, ముందస్తు నిర్వహణ, ఆస్తుల నిర్వహణకు తోడ్పడే అనువర్తనాల వరకు రంగాల వారీ డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పరిణామాన్ని కూడా సమావేశంలో చర్చించారు. 

 

శ్రీ కమల్‌ కిషోర్‌ సోన్‌ మాట్లాడుతూ, పెద్ద ఎత్తున ప్రజా సేవలను అందించేందుకు డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కీలక పునాదిగా గుర్తింపు పొందుతోందని పేర్కొన్నారు. ఆధార్‌, యూపీఐ విషయంలో భారత్‌ అనుభవాన్ని ప్రస్తావిస్తూ, ఉమ్మడి డిజిటల్‌ వేదికలు వివిధ వ్యవస్థలను అనుసంధానించడం, ఆవిష్కరణలకు తోడ్పడటం, కోట్లాది మంది పౌరులకు సేవలను అందించడాన్ని సులభతరం చేయగలవని తెలిపారు. నీటి రంగం ప్రత్యేకమైన సవాళ్లను ఎదుర్కొంటోందని ఆయన పేర్కొన్నారు. నీటి సేవలు నీటి వనరులు, మౌలిక సదుపాయాలు, సంస్థలు, భౌగోళిక పరిస్థితులు, సమాజాలతో సన్నిహితంగా అనుసంధానమై ఉండటమే ఇందుకు కారణమని వివరించారు. సుస్థిర నీటి సేవలు, మెరుగైన పాలన, సమాచార ఆధారిత నిర్ణయాలపై జల్‌ జీవన్‌ మిషన్‌ మరింతగా దృష్టి సారిస్తున్న నేపథ్యంలో, ఈ విభిన్న అంశాలకు సంబంధించిన డేటాను పరస్పరం అనుసంధానించి, సమర్థవంతంగా వినియోగించగల సామర్థ్యం మరింత ప్రాధాన్యం సంతరించుకుంటోందని ఆయన అన్నారు.

“ఒకే డేటాగా నీరు”  దార్శనికతను ప్రస్తావిస్తూ సమగ్ర డేటా ప్రణాళిక, నిర్వహణ, సేవల అందజేతను మరింత బలోపేతం చేయగలదని శ్రీ సోన్‌ తెలిపారు. ఈ దార్శనికతలో భాగంగా గ్రామీణ తాగునీటి రంగానికి డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌గా ‘సుజలం భారత్‌’ను అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న ప్రక్రియలను డిజిటలైజ్‌ చేయడం మాత్రమే దీని ఉద్దేశం కాదని, భవిష్యత్తులో అనువర్తనాలు, విశ్లేషణ వ్యవస్థలు, నిర్ణయాలకు తోడ్పడే సామర్థ్యాలను అభివృద్ధి చేసేందుకు ఉమ్మడి డిజిటల్‌ పునాదిని ఏర్పాటు చేయడమే దీని ప్రాధాన్యమని ఆయన చెప్పారు. డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ విలువ అది సృష్టించే డేటా పరిమాణంపై కాకుండా, సంస్థలు మెరుగైన నిర్ణయాలు తీసుకునేందుకు, చివరికి పౌరులకు మెరుగైన ఫలితాలు అందించేందుకు అది ఎంతగా దోహదపడుతుందన్నదానిపై ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

 

తాగునీటి రంగంలో మార్పు తీసుకురావడంలో డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (డీపీఐ) పాత్రపై శ్రీమతి స్వాతి మీనా నాయక్‌ మాట్లాడుతూ, విడివిడిగా ఉన్న డేటా సమాహారాలకే పరిమితం కాకుండా, సమగ్ర, విశ్వసనీయ, పరస్పరం అనుసంధానించగల డిజిటల్‌ వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఐఓటీ పరికరాలు, స్కాడా వ్యవస్థలు, క్షేత్రస్థాయి నివేదికలు, ఇతర డిజిటల్‌ వేదికల ద్వారా తాగునీటి రంగంలో ఇప్పటికే కోట్లాది డేటా అంశాలు నమోదవుతున్నాయని ఆమె తెలిపారు. ఈ డేటా సమాహారాలు పరస్పరం అనుసంధానించగలిగేలా, ధ్రువీకరించినవిగా, ఏకరూపతతో ఉండేలా చూడటంతో పాటు, పాలన, విధాన నిర్ణయాలకు సమర్థంగా ఉపయోగపడేలా తీర్చిదిద్దడమే ప్రధాన సవాలని ఆమె పేర్కొన్నారు. 

 

డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ప్రజల అవసరాలకు వేగంగా స్పందించే, ముందస్తు చర్యలు తీసుకోగల, పౌరుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చే నీటి సేవలను ఎలా అందించవచ్చనే అంశాన్ని కూడా ఈ సమావేశంలో చర్చించారు. జియో ట్యాగ్‌ చేసిన ఆధారాల ద్వారా నీటి సేవలకు సంబంధించిన సమాచారాన్ని పొందడంతో పాటు, సమస్యలను నివేదించేందుకు ‘మేరీ పంచాయత్‌’ వేదిక ఉపయోగపడుతున్న తీరును శ్రీమతి సునీతా జైన్‌ వివరించారు. స్కాడా, ఆటోమేషన్‌ నుంచి జీఐఎస్‌, స్మార్ట్‌ మీటరింగ్‌, కృత్రిమ మేధ, డిజిటల్‌ ట్విన్స్‌ వరకు సింగపూర్‌ సాధించిన పురోగతిని శ్రీ జీన్‌ మార్టిన్‌ వివరించారు. కృత్రిమ మేధ ఆధారిత నదీ, పట్టణ ఆకస్మిక వరదల ముందస్తు అంచనాలను అందించే గూగుల్‌ ‘గ్లోబల్‌ ఫ్లడ్‌ హబ్‌’ను ప్రదర్శించడంతో సమావేశం ముగిసింది. డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ విలువ కేవలం డేటాను సృష్టించడంలో లేదని, వివిధ వ్యవస్థల్లోని విశ్వసనీయ సమాచారాన్ని అనుసంధానించి, దానిని మెరుగైన నిర్ణయాలు, ముందస్తు నిర్వహణ చర్యలు, పౌరులకు మెరుగైన సేవలుగా మలచడంలో ఉందని చర్చలు స్పష్టం చేశాయి.

 

డీడబ్ల్యూఎస్ఎస్‌ నిర్వహించిన రెండో సమావేశం “నీటి నాణ్యత, వ్యయసమర్థ సాంకేతికత”లో నీటి నాణ్యత, పర్యావరణ పునరుద్ధరణ, వాతావరణ ధోరణులకు అనుగుణంగా మార్పులు, భూగర్భ జలాల అంచనా, నీటి రంగంలో కొలతలు, పర్యవేక్షణ పరికరాల అభివృద్ధి వంటి అంశాల్లో ఆవిష్కరణలపై పరిశోధకులు, క్షేత్రస్థాయి నిపుణులు చర్చించారు. శ్రీ అభిలాష్‌ తివారీ సూక్ష్మ శైవలాల ఆధారిత ఫైటోరిమీడియేషన్‌ పైలట్‌ ప్రాజెక్టును ప్రదర్శించారు. ఇందులో కరిగిన ఆక్సిజన్‌, జీవరసాయన ఆక్సిజన్‌ డిమాండ్‌, రసాయన ఆక్సిజన్‌ డిమాండ్‌, పీహెచ్, జీవవైవిధ్యం, దుర్వాసన నియంత్రణలో మెరుగుదల కనిపించినట్లు తెలిపారు. కార్బన్‌ నిల్వతో పాటు నిర్వహణ వ్యయాలు తగ్గినట్లు కూడా పేర్కొన్నారు. శ్రీ సురేశ్‌ శర్మ విస్తృత గ్రీన్‌ రూఫ్‌లపై నిర్వహించిన పరిశోధనను సమర్పించారు. వివిధ రకాల మట్టి, బయోచార్‌, సేంద్రియ ఎరువు కలయికలతో చేపట్టిన ప్రయోగాల్లో వర్షపాత నీటి నిల్వ పెరగడంతో పాటు, గరిష్ఠ ఉపరితల ప్రవాహం తగ్గినట్లు ఆయన వివరించారు. నీటి నాణ్యతకు సంబంధించి కొత్త ఆందోళనగా మైక్రోప్లాస్టిక్‌ల అంశాన్ని కూడా సమావేశం ప్రస్తావించింది. మైక్రోప్లాస్టిక్‌లను గుర్తించేందుకు నమూనాల సేకరణ, విశ్లేషణ, పర్యవేక్షణకు మరింత పటిష్ఠమైన ప్రోటోకాల్స్‌ అవసరమని శ్రీ శ్రీనివాస్‌ బిలకంటి సూచించారు.

శ్రీ బీరేంద్ర ప్రతాప్‌ బోర్‌హోల్‌ జియోఫిజికల్‌ ఎలక్ట్రికల్‌ లాగింగ్‌ను వ్యయసమర్థమైన విధానంగా వివరించారు. సంప్రదాయ పద్ధతుల్లో నమూనాలు సేకరించడం కష్టమైన ప్రాంతాల్లో విద్యుత్‌ వాహకత, మొత్తం కరిగిన ఘన పదార్థాలు, క్లోరైడ్‌ వంటి ప్రాథమిక భూగర్భ జలాల నాణ్యతా ప్రమాణాలను అంచనా వేసేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని తెలిపారు. పర్యావరణ ఒత్తిళ్లకు గురయ్యే నీటి వనరుల పర్యవేక్షణ పరికరాల పనితీరును ధ్రువీకరించడంలో పుణెలోని సీడబ్ల్యూపీఆర్ఎస్‌ లో నిర్వహించే ఐపీ పరీక్షల పాత్రను డాక్టర్‌ మహమ్మద్‌ ఫైసల్‌ రెహమాన్‌ వివరించారు. శాస్త్రీయ ఆవిష్కరణలు, తగిన పర్యవేక్షణ విధానాలు, పటిష్ఠమైన పరికరాల వినియోగం నీటి నాణ్యత అంచనాలను బలోపేతం చేయడంతో పాటు, నీటి రంగంలోని వ్యవస్థల విశ్వసనీయతను మెరుగుపరచి, వనరులను మరింత సుస్థిరంగా నిర్వహించేందుకు దోహదపడతాయని చర్చలో స్పష్టమైంది.

“గ్రామీణ నీటి సరఫరా నిర్వహణ, అమలు వ్యవస్థ”పై జరిగిన సమావేశంలో జల్‌ జీవన్‌ మిషన్‌ కింద వేగంగా మౌలిక సదుపాయాలను కల్పించే దశ నుంచి విశ్వసనీయమైన, సుస్థిరమైన, జవాబుదారీతనంతో కూడిన నీటి సేవల అందజేత దిశగా చోటుచేసుకుంటున్న మార్పును పరిశీలించారు.

తాగునీరు, పారిశుధ్య విభాగం (డీడబ్ల్యూఎస్ఎస్‌) కార్యదర్శి శ్రీ అశోక్‌ కె.కె. మీనా మాట్లాడుతూ, జల్‌ జీవన్‌ మిషన్‌ కింద గ్రామీణ తాగునీటి మౌలిక సదుపాయాలు గణనీయంగా విస్తరించిన నేపథ్యంలో, ప్రస్తుతం కొత్త మౌలిక సదుపాయాల కల్పన నుంచి హామీతో కూడిన, విశ్వసనీయమైన, సుస్థిరమైన సేవల అందజేతపై దృష్టి మారుతోందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాలకు నిరంతరం సురక్షితమైన, తగిన పరిమాణంలో తాగునీరు అందేలా, స్థానిక నీటి సేవల సంస్థలుగా గ్రామ పంచాయతీలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఇందుకు తగిన సేవలందించే సంస్థల సహకారంతో పాటు, పటిష్ఠమైన నిర్వహణ - సంరక్షణ (ఓ అండ్ ఎం) వ్యవస్థలు ఉండాలని ఆయన పేర్కొన్నారు. సమాజం ఆధ్వర్యంలో సేవలను అంచనా వేయాల్సిన వేయడం ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తూ,  ‘జల్‌ సేవా అంకలన్‌’ వంటి కార్యక్రమాలు భాగస్వామ్య విధానాల ద్వారా సేవల స్థాయిని అంచనా వేయడం, లోపాలను గుర్తించడం, మెరుగుదల ప్రణాళికలను రూపొందించడంలో గ్రామ పంచాయతీలకు తోడ్పడుతున్నాయని ఆయన తెలిపారు. గ్రామీణ నీటి సేవలను వృత్తిపరంగా బలోపేతం చేయడం, నీటి వనరుల సుస్థిరతను పెంపొందించడం, వాతావరణ మార్పులను తట్టుకునే చర్యలను బలోపేతం చేయడం, పర్యవేక్షణ, జవాబుదారీతనం కోసం డిజిటల్‌ వేదికలను సమర్థంగా వినియోగించడం, నిరంతర సామర్థ్య నిర్మాణం, విజ్ఞాన మార్పిడిని ప్రోత్సహించడం అవసరమని ఆయన చెప్పారు. జల్‌ జీవన్‌ మిషన్‌ (జేజేఎం) విజయాన్ని ఇకపై తాగునీటి సేవల నాణ్యత, విశ్వసనీయత, సుస్థిరతతో పాటు, స్థానిక సంస్థలు, సమాజాలు కాలక్రమంలో ఆ సేవలను సమర్థంగా నిర్వహిస్తూ, మరింత మెరుగుపరచగల సామర్థ్యాన్ని ఆధారంగా చేసుకుని ఎక్కువగా అంచనా వేయాలని ఆయన పేర్కొన్నారు.

 

గ్రామ పంచాయతీలు, నీటి (పానీ) సమితులు  నిర్వహణ - సంరక్షణలో కీలక పాత్ర పోషించాలని వక్తలు పేర్కొన్నారు. ఇందుకు స్పష్టమైన సంస్థాగత బాధ్యతలు, ఆర్థిక వనరుల సమీకరణ విధానాలు, సేవలందించే సంస్థలు, సామర్థ్య పెంపు వంటి అంశాలు తోడ్పడాలని వారు అన్నారు. భూగర్భ జలాల సుస్థిరత, నీటి వనరుల పరిరక్షణ, వాతావరణ మార్పులను తట్టుకునేలా ప్రణాళికలు రూపొందించడం, కాలానుగుణంగా మారే నీటి డిమాండ్‌, స్థానిక పరిస్థితులకు అనుగుణమైన నీటి సరఫరా నమూనాల అవసరంపై చర్చల్లో ప్రధానంగా దృష్టి సారించారు. మధ్యప్రదేశ్‌ 2026లో అమలు చేసిన నిర్వహణ - సంరక్షణ నిబంధనలను గ్రామ పంచాయతీల బాధ్యతలు, ఆర్థిక అధికారాలు, సంస్థాగత వ్యవస్థలను స్పష్టీకరించేందుకు ఒక ఉదాహరణగా సమావేశంలో ప్రస్తావించారు. గుజరాత్‌, బిహార్‌ రాష్ట్రాల అనుభవాలు నీటి పథకాల సుస్థిర నిర్వహణకు సమాజ భాగస్వామ్యం, పారదర్శక రుసుముల విధానం, వృత్తిపరమైన సేవల నిర్వహణ, డిజిటల్‌ సాధనాలు ఎంత ముఖ్యమో చాటిచెప్పాయని వక్తలు పేర్కొన్నారు.

 

దీర్ఘకాలికంగా సేవల ఫలితాలను మెరుగుపరచడంలో నిరంతర అభ్యాసం, డేటా ఆధారిత పాలన, సమాజం ఆధ్వర్యంలో సేవల అంచనా కీలకమని ఈ సమావేశంలో స్పష్టం చేశారు. లావాదేవీలపై పారదర్శక సమాచారాన్ని అందించడంతో పాటు, దాదాపు నిజసమయ ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకునేలా చేయడంలో ‘ఈగ్రామ్‌ సేవ’, ‘అవని’, డిజిటల్‌ డ్యాష్‌బోర్డులు వంటి కార్యక్రమాల ప్రాధాన్యాన్ని ప్రస్తావించారు. ఆచరణాత్మకంగా, నిరంతరంగా, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సామర్థ్య నిర్మాణాన్ని చేపట్టడం ద్వారా క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కార సామర్థ్యాన్ని ఎలా బలోపేతం చేయవచ్చో ‘ఎకో ఇండియా’ అభ్యాస నమూనా చాటిచెప్పిందని కూడా పేర్కొన్నారు. ‘జల్‌ సేవా అంకలన్‌’పై జరిగిన చర్చల్లో, గ్రామ పంచాయతీలు తమ నీటి సేవల స్థాయిని స్వయంగా అంచనా వేసి, ధ్రువీకరించడంతో పాటు లోపాలను గుర్తించి, మెరుగుదల ప్రణాళికలను రూపొందించే దిశగా చోటుచేసుకుంటున్న మార్పును మరింత స్పష్టం చేశారు. మొత్తంగా, జల్‌ జీవన్‌ మిషన్‌ తదుపరి దశకు ఎన్ని మౌలిక సదుపాయాలు కల్పించామన్నది ప్రామాణికం కాదని, సేవల విశ్వసనీయత, నాణ్యత, సుస్థిరత, బలోపేతమైన స్థానిక సంస్థలు, తమ నీటి వ్యవస్థలను నిరంతరం అంచనా వేసి మెరుగుపరచగల సమాజాల సామర్థ్యమే కీలకమని ఈ సమావేశం స్పష్టం చేసింది.

తొమ్మిదో ఇండియా ఇంటర్నేషనల్‌ వాటర్‌ వీక్‌ (ఐఐడబ్ల్యూడబ్ల్యూ) - 2026 నీటి నిర్వహణ భవిష్యత్తును తీర్చిదిద్దగల సాంకేతిక పరిజ్ఞానాలు, ఆవిష్కరణలు, పాలనా విధానాలపై ప్రధానంగా దృష్టి సారిస్తూ ముగిసింది.

 

****


(రిలీజ్ ఐడి: 2315391) సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Malayalam