నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వరల్డ్‌స్కిల్స్‌ షాంఘై 2026లో మహిళా శక్తికి ప్రత్యేక స్థానం.. వివిధ నైపుణ్య విభాగాల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న 14 మంది యువతులు

కెమికల్‌ ల్యాబొరేటరీ టెక్నాలజీ, లాజిస్టిక్స్‌ నుంచి విజువల్‌ మెర్చండైజింగ్‌, ఆతిథ్యం, బ్యూటీ, బేకరీ వరకు విస్తరిస్తున్న భారత నైపుణ్య రంగాన్ని చాటుతున్న మహిళా పోటీదారులు



వరల్డ్‌స్కిల్స్‌ షాంఘై 2026లో భారత జట్టుకు చెందిన 70 మంది పోటీదారుల్లో అయిదో వంతుకు పైగా మహిళలు

నాడు పోస్టు చేయడమైనది: 25 SEP 2026 5:38PM by PIB Hyderabad

విభిన్న వృత్తి, సాంకేతిక నైపుణ్యాల్లో భారత మహిళల భాగస్వామ్యం పెరుగుతున్న తీరుకు వరల్డ్‌స్కిల్స్‌ షాంఘై 2026 వేదికగా నిలుస్తోంది. పలు నైపుణ్య విభాగాల్లో 14 మంది యువతులు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ అంతర్జాతీయ వేదికపై తమ ప్రతిభను చాటుతున్నారు.

 

2026 సెప్టెంబర్‌ 22 నుంచి 27 వరకు షాంఘైలో జరుగుతున్న 48వ వరల్డ్‌స్కిల్స్‌ పోటీల్లో 63 నైపుణ్య విభాగాల్లో పోటీపడుతున్న 70 మంది సభ్యుల భారత జట్టు బృందంలో ఈ మహిళా పోటీదారులు భాగంగా ఉన్నారు.

 

ముఖ్యంగా సాంకేతిక, ప్రత్యేక, సృజనాత్మక, సేవా రంగాలకు చెందిన విభిన్న నైపుణ్యాల్లో మహిళా పోటీదారులు భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీటిలో రసాయన ప్రయోగశాల సాంకేతికత, సరకు రవాణా, సరుకు రవాణా నిర్వహణ, వస్తు ప్రదర్శన, ఫ్యాషన్‌ సాంకేతికత, రిటైల్‌ విక్రయాలు, ఆరోగ్యం, సామాజిక సంరక్షణతో పాటు హోటల్‌ రిసెప్షన్‌, రెస్టారెంట్‌ సేవలు, వంట, పెయింటింగ్‌, అలంకరణ, కేశాలంకరణ, సౌందర్య సంరక్షణ, బేకరీ, పేస్ట్రీ, మిఠాయిల తయారీ వంటి నైపుణ్యాలు ఉన్నాయి.

 

ఈ విస్తృత భాగస్వామ్యం యువతులకు అందుబాటులో ఉన్న వృత్తి ఎంపికలు విస్తరిస్తున్న తీరును, సంప్రదాయ వృత్తి మార్గాలకు మించి వివిధ నైపుణ్య రంగాల్లో యువతకు పెరుగుతున్న భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తోంది. 

 

వరల్డ్‌స్కిల్స్‌ ఇండియా అధికార ప్రతినిధి,  నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ సీనియర్‌ ఆర్థిక సలహాదారు శ్రీమతి మనీషా సెన్సర్మా మాట్లాడుతూ.. “వరల్డ్‌స్కిల్స్‌ షాంఘైలో యువతుల భాగస్వామ్యం భారత్‌లో నైపుణ్యాభివృద్ధి రంగంలో వస్తున్న సానుకూల మార్పును ప్రతిబింబిస్తోంది. రసాయన ప్రయోగశాల సాంకేతికత, సరకు రవాణా, వస్తు ప్రదర్శన నుంచి ఆతిథ్యం, సౌందర్య సంరక్షణ, ప్రత్యేక హస్తకళల వరకు వారు పోటీపడుతున్న నైపుణ్యాల వైవిధ్యం ప్రత్యేకంగా ప్రాధాన్యత కలిగిన అంశం. నైపుణ్యాలకు లింగభేదం ఉండదనే సరళమైన, శక్తిమంతమైన సందేశాన్ని ఇది బలపరుస్తోంది. యువతులు తమ ఆసక్తి, సామర్థ్యం, ఆకాంక్షలకు అనుగుణంగా వృత్తులను ఎంచుకునేందుకు అవసరమైన అవకాశాలు, శిక్షణ, ఆత్మవిశ్వాసం కల్పించడం, ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా పోటీపడేలా వారిని తీర్చిదిద్దడం మా లక్ష్యం” అని అన్నారు.

 

పోటీలో పాల్గొంటున్న వారిలో రసాయన ప్రయోగశాల సాంకేతికతలో సంపదా దేశాయ్‌, సరకు రవాణా, సరుకు రవాణా నిర్వహణలో మెహరున్నీసా బేగం, వస్తు ప్రదర్శనలో అనూజ అజయ్‌ వారే, ఫ్యాషన్‌ సాంకేతికతలో విధి నిరవ్‌కుమార్‌ సుతార్‌, రిటైల్‌ విక్రయాల్లో సానియా జోషి, ఆరోగ్యం, సామాజిక సంరక్షణలో విష్ణుప్రియ సునీల్‌, హోటల్‌ రిసెప్షన్‌లో రష్మీత్‌ కౌర్‌ హాన్స్‌పాల్‌, రెస్టారెంట్‌ సేవల్లో ఝాన్సీరాణి రౌత్‌, వంటలో తనుశ్రీ మాగేష్‌, పెయింటింగ్‌, అలంకరణలో ముస్కాన్‌, కేశాలంకరణలో జుయి సంతోష్‌ సాప్కే, సౌందర్య సంరక్షణలో టీ సబీర్‌ సుతార్‌, బేకరీలో స్మృతి నంబియార్‌, పేస్ట్రీ, మిఠాయిల తయారీలో కృష్ణాంజలి సాహూ ఉన్నారు.

 

వీరి భాగస్వామ్యం భారత నైపుణ్యాభివృద్ధి వ్యవస్థలో అవకాశాలు విస్తరిస్తున్న తీరును ప్రతిబింబిస్తోంది. సాంకేతిక, సృజనాత్మక, ఆరోగ్య సంరక్షణ, సరకు రవాణా, ఆతిథ్య, సేవా రంగాల్లో యువతులు మరింతగా వృత్తి అవకాశాలను అన్వేషిస్తున్నారు.

 

వరల్డ్‌స్కిల్స్‌ పోటీలు పోటీదారులకు అంతర్జాతీయ ప్రమాణాలతో తమ నైపుణ్యాలను పోల్చి చూసుకునే అవకాశం కల్పించడంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ నైపుణ్యాలు కలిగిన యువ నిపుణులతో కలిసి నేర్చుకునే అవకాశాన్ని అందిస్తాయి. ప్రపంచస్థాయి పోటీలకు ముందు భారత జట్టుకు చెందిన మహిళా పోటీదారులు తీవ్ర శిక్షణ, సన్నద్ధత పొందారు. తద్వారా తమ సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంతో పాటు, కఠినమైన అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తమ ప్రతిభను ప్రదర్శించే సామర్థ్యాన్ని పెంపొందించుకున్నారు.

 

నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ వృత్తి విద్య, అప్రెంటిస్‌షిప్‌లు, పరిశ్రమలతో అనుసంధానమైన శిక్షణలో మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు నిరంతరం ప్రోత్సహిస్తోంది. అలాగే విస్తృత స్థాయిలో వృత్తి ఎంపికలు, స్థిరమైన జీవనోపాధికి దారితీసే అవకాశాలను అందించేందుకు మద్దతు అందిస్తోంది.

 

షాంఘైలో పోటీలు కొనసాగుతున్న నేపథ్యంలో నైపుణ్యాలు, సాంకేతికత, హస్తకళా నైపుణ్యం, వృత్తిపరమైన అత్యుత్తమ ప్రతిభ ద్వారా తమ కెరీర్‌ను నిర్మించుకోవడంపై మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న ఈ తరం యువతులకు ఈ యువ మహిళలు ప్రతినిధులుగా నిలుస్తున్నారు.

          

సంపదా దేశాయ్‌

 

మెహరున్నీసా బేగం

అనూజ అజయ్‌ వారే

 

విధి నిరవ్‌కుమార్‌ సుతార్‌

 

సానియా జోషి,

 

విష్ణుప్రియ సునీల్‌

 

రష్మీత్‌ కౌర్‌ హాన్స్‌పాల్‌

 

ఝాన్సీరాణి రౌత్‌

 

తనుశ్రీ మాగేష్‌

 

ముస్కాన్‌

 

జుయి సంతోష్‌ సాప్కే

 

టీ సబీర్‌ సుతార్‌

స్మృతి నంబియార్‌,

 

కృష్ణాంజలి సాహూ

****


(రిలీజ్ ఐడి: 2315383) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Malayalam