వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
కర్ణాటకకు సంబంధించి భౌగోళిక గుర్తింపు పొందిన గుల్బర్గా కందిపప్పును మాల్దీవులకు ఎగుమతి చేసేందుకు సౌలభ్యం కల్పించిన అపెడా
ఎగుమతి ద్వారా ప్రస్తుత మార్కెట్ ధర కిలోకి రూ.60తో పోలిస్తే, రైతుకు కిలోకు రూ.82 చొప్పున రాబడి
నాడు పోస్టు చేయడమైనది:
25 SEP 2026 3:42PM by PIB Hyderabad
వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ (అపెడా) సహకారంతో జీఐ ట‌్యాగ్ గల కర్ణాటకకు చెందిన గుల్బర్గా కందిపప్పు ఒక మెట్రిక్ టన్నును సెప్టెంబర్ 24, 2026న మాల్దీవులకు ఎగుమతి చేశారు. భారతదేశంలోని జీఐ-ట్యాగ్ పొందిన వ్యవసాయ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు విస్తరించటం, వ్యవసాయ ఎగుమతుల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘం (ఎఫ్‌పీఓ) నేతృత్వంలోని బ్రాండ్ల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయటం ఈ కార్యక్రమ ఉద్దేశం.
రైతులకు మెరుగైన ధర లభించేలా చేయటమే ఎగుమతి ఆధారిత విలువ వ్యవస్థలో ముఖ్యమైన ప్రయోజనం. ప్రస్తుత మార్కెట్ ధర కిలో రూ.60 ఉండగా, ఎగుమతి ఆధారిత మార్గం ద్వారా రైతులకు కిలోకు రూ.82 లభిస్తోంది. ఇది 30 శాతానికిపైగా అధిక రాబడిని సూచిస్తుంది. ఎగుమతి ఆధారిత విలువ వ్యవస్థలో రైతులు మరింత క్రియాశీలకంగా పాల్గొనేందుకు, ఉత్పత్తిదారులను అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానించేందుకు ఈ కార్యక్రమం చక్కటి అవకాశాన్ని కల్పిస్తుంది.
మైసూరు సంస్థ సిల్కెన్ గ్లోబల్ ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్... ఎఫ్‌పీఓ బ్రాండ్ ద్వారా ఎగుమతి అవుతున్న ఈ సరకును సముద్ర మార్గం ద్వారా మాల్దీవులకు తరలిస్తారు.
కర్ణాటకలోని కలబురగి ప్రాంతానికి చెందిన గుల్బర్గా కందిపప్పుకు 2019లో భౌగోళిక గుర్తింపు (జీఐ) లభించింది. ప్రత్యేకమైన రుచి, నాణ్యతకు ఈ ఉత్పత్తి గుర్తింపు పొందింది. ఈ ప్రాంతపు వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన భాగం. కర్ణాటకలోని నమోదిత జీఐ ఉత్పత్తుల్లో గుల్బర్గా కందిపప్పును అపెడా చేర్చింది.
భారతదేశంలోని ప్రధాన వ్యవసాయ రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. మెట్ట వ్యవసాయంలో, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఇక్కడ పప్పుధాన్యాలు కీలక పాత్ర పోషిస్తాయి. కంది సాగు, ఉత్పత్తికి ప్రధాన కేంద్రాల్లో కలబురగి ఒకటి. గుల్బర్గా కందిపప్పు ఈ ప్రాంతపు ప్రత్యేకమైన వ్యవసాయ గుర్తింపును ప్రతిబింబిస్తుంది.
భారతదేశ జీఐ గుర్తింపు పొందిన వ్యవసాయ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లకు విస్తరించటం, రైతులకు మరింత మార్కెట్ అనుసంధానాన్ని కల్పించటం వంటి ప్రాముఖ్యతను అపెడా ఛైర్మన్ శ్రీ అభిషేక్ దేవ్ తెలిపారు. గుల్బర్గా కందిపప్పును మాల్దీవులకు ఎగుమతి చేయటం ద్వారా ఆ ఉత్పత్తికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చేందుకు అవకాశం లభించటమే కాక, భవిష్యత్తులో మార్కెట్ విస్తరణకు కూడా మార్గం సుగమమవుతుందని తెలిపారు.
ఈ ఎగుమతి ద్వారా మాల్దీవులకు గుల్బర్గా కందిపప్పు నిరంతరం రవాణా అవుతుంది. తద్వారా కర్ణాటకలోని ఉత్పత్తిదారులకు, ఎగుమతిదారులకు స్థిరమైన మార్కెట్ అవకాశాలు లభిస్తాయి. ఇది రైతులకు మెరుగైన లాభాలను చేకూర్చటంతో పాటు ఎగుమతి ఆధారిత విలువ వ్యవస్థలతో ఎఫ్‌పీఓలు, రైతులు మరింత అనుసంధానం అయ్యేందుకు సహాయపడుతుంది.
ఈ సరకు రవాణాను అపెడా చైర్మన్ శ్రీ అభిషేక్ దేవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అపెడా సీనియర్ అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. వీరిలో అపెడా సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ తరుణ్ బజాజ్, అపెడా జనరల్ మేనేజర్ శ్రీమతి వినితా సుధాన్షు, గుల్బర్గా కేఎస్‌పీఏఎంఎల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వి. సదాశివ, మైసూర్ లోని సిల్కెన్ గ్లోబల్ ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ సంస్థకు చెందిన శ్రీ ఇమ్రాన్ పాషా తదితరులు హాజరయ్యారు.
జీఐ ట్యాగ్ పొందిన ఇతర విలువైన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను అంతర్జాతీయ మార్కెట్లకు సులభంగా విస్తరించేందుకు అపెడా చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా ఈ ఎగుమతి ఉంది. అంతర్జాతీయ వాణిజ్యం ద్వారా ప్రాంతీయ ప్రత్యేకత గల వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించటంలో ఉన్న అవకాశాలను ఇది ప్రతిబింబిస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2315369)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9