సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
పీఎం మెమెంటోస్ ఇ–వేలం 2026లో మహారాష్ట్ర వారసత్వం, కళలు, సమకాలీన విజయాల ప్రదర్శన
89 స్మారక చిహ్నాల సేకరణలో మహారాష్ట్ర సుసంపన్న సాంస్కృతిక సంప్రదాయాలు, చారిత్రక వారసత్వం, కళా వైభవం, సమకాలీన విజయాల ప్రతిబింబం
నాడు పోస్టు చేయడమైనది:
26 SEP 2026 5:16PM by PIB Hyderabad
మహారాష్ట్ర సుసంపన్న చారిత్రక వారసత్వం, ఆధ్యాత్మిక సంప్రదాయాలు, స్వదేశీ కళారూపాలు, సమకాలీన విజయాలు పీఎం మెమెంటోస్ ఇ–వేలం 2026లో ఆవిష్కృతమయ్యాయి. ఈ సేకరణలో మహారాష్ట్ర వైవిధ్యభరిత సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే శిల్పాలు, చిత్రాలు, కళాకృతులు, స్మారక జ్ఞాపికలు, మతపరమైన కళాఖండాలు, క్రీడా జ్ఞాపికలు, నమూనాలు వంటి విస్తృత శ్రేణి వస్తువులు ఉన్నాయి.
ఈ సేకరణలో ప్రధానంగా కనిపించే అంశాల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ చిరస్థాయిగా నిలిచిన వారసత్వం ఒకటి. మరాఠా పాలకుడిని విభిన్న రూపాలు, కళాశైలుల్లో చిత్రీకరించిన పలు స్మారక వస్తువులు ఇందులో ఉన్నాయి. గుర్రంపై ఆయన స్వారీ చేస్తున్నట్లు, సింహాసనంపై కూర్చున్నట్లు, సింహంతో కలిసి ఉన్నట్లు, రాజసంబంధ వేడుకల్లో పాల్గొంటున్నట్లు శివాజీ మహారాజ్‌ను చిత్రీకరించిన విగ్రహాలు ఇందులో ఉన్నాయి.
రజత విగ్రహం, చెక్కతో చెక్కిన చిత్రపటం, ఫ్రేమ్ కట్టిన కళాకృతి, రాయ్‌గఢ్ కోటలోని మేఘదాంబరీ నమూనా కూడా ఈ సేకరణలో ఉన్నాయి.
మహారాష్ట్రలోని భక్తి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పలు కళాకృతులు కూడా ఇందులో ఉన్నాయి. సంప్రదాయ సంగీత వాయిద్యాలతో సంత్ తుకారామ్‌ను చిత్రీకరించిన కళాకృతులు, ధ్యానంలో ఉన్న సంత్ జ్ఞానేశ్వర్‌ను ప్రతిబింబించే చిత్రాలు వీటిలో ఉన్నాయి.
ఈ సేకరణలో మహారాష్ట్రకు చెందిన స్వదేశీ కళా సంప్రదాయాలకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా పలు వార్లీ కళాశైలి చిత్రాలు రాష్ట్ర సాంప్రదాయ కళా వైభవాన్ని చాటుతున్నాయి. గిరిజన నాయకుడు బిర్సా ముండా చిత్రపటాన్ని వార్లీ కళా రూపాలతో కలిపి రూపొందించిన ఒక చిత్రంతో పాటు, గ్రామీణ జీవనం, వ్యవసాయం, పండుగలు, సామాజిక సంప్రదాయాలను వార్లీ కళకు విశిష్టమైన జ్యామితీయ ఆకృతులతో చిత్రీకరించిన ఇతర కళాకృతులు కూడా ఉన్నాయి. ముదురు మెరూన్ రంగు వస్త్రంపై చేతితో చిత్రించిన వార్లీ కళాకృతితో పాటు, వస్త్రంపై రూపొందించిన మరికొన్ని చిత్రాలు ఈ సంప్రదాయ కళారూపంలోని వైవిధ్యాన్ని చాటుతున్నాయి.
ఈ జాబితాలో సాంస్కృతిక, ఆధ్యాత్మిక కళాకృతులతో పాటు మహారాష్ట్ర క్రీడా విజయాలకు సంబంధించిన జ్ఞాపికలకు కూడా చోటు కల్పించారు. పారా-బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సుకాంత్ కదమ్ సంతకం చేసిన బ్యాడ్మింటన్ రాకెట్, అలాగే 2024 పారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన సచిన్ ఖిలారీకి చెందిన సంతకం చేసిన క్యారీ బ్యాగ్, షాట్‌పుట్ ఇందులోని ప్రముఖ క్రీడా జ్ఞాపికల్లో ఉన్నాయి.
మహారాష్ట్రలో చేపట్టిన మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంస్థాగత ప్రగతికి సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలు కూడా పలు జ్ఞాపికల్లో ప్రతిబింబించాయి. వధావన్ ఓడరేవు, థానే–బోరివలి జంట సొరంగ ప్రాజెక్టు, నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన నమూనాలు ఇందులో ఉన్నాయి. దేశ సామాజిక, మేధో వారసత్వాన్ని ప్రతిబింబించే జ్ఞాపికలకు కూడా ఈ జాబితాలో ముఖ్య స్థానం కల్పించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, లోకమాన్య బాల గంగాధర్ తిలక్, అహల్యాబాయి హోల్కర్, పేష్వా బాజీరావు–I చిత్రపటాలు, శిల్పాలు ఇందులో ఉన్నాయి.
మొత్తంగా 89 జ్ఞాపికలు మహారాష్ట్ర సాంస్కృతిక గుర్తింపులోని విభిన్న కోణాలను ఒకే చోట ఆవిష్కరిస్తాయి. చారిత్రక ప్రముఖులు, ఆధ్యాత్మిక సంప్రదాయాలు, జానపద కళలు, మతపరమైన నిర్మాణాలు, క్రీడా విజయాలు, ఆధునిక మౌలిక వసతులు ఇందులో చోటు చేసుకున్నాయి. చేతితో రూపొందించిన వార్లీ చిత్రాలు, ఆధ్యాత్మిక శిల్పాల నుంచి సంస్థాగత ప్రాజెక్టుల నమూనాలు, క్రీడా జ్ఞాపికల వరకు ఈ సేకరణ మహారాష్ట్ర వారసత్వం, విజయాల వైవిధ్యాన్ని చాటుతోంది.
పీఎం మెమెంటోస్ ఈ–వేల 2026 ఎనిమిదో ఎడిషన్ 2026 అక్టోబర్ 2 వరకు కొనసాగుతుంది. వేలం తేదీలు, పాల్గొనే విధానం, పూర్తి జిబితా వివరాల కోసం అధికారిక పీఎం మెమెంటోస్ ఈ–వేలం వేదిక pmmementos.gov.in ను సందర్శించవచ్చు.
*****
(రిలీజ్ ఐడి: 2315366)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6