ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
పాల ఆధారిత ఉత్పత్తులనే ‘పనీర్’గా పేర్కొనేలా సవరణ ముసాయిదాను ప్రతిపాదించిన ఎఫ్ఎస్ఎస్ఏఐ
అనుకరణ ఉత్పత్తులను 'పనీర్'గా తప్పుదోవ పట్టించే మార్కెటింగ్‌ను అరికట్టేందుకు ఎఫ్ఎస్ఎస్ఏఐ చర్యలు
పాలతో తయారు చేయని ఉత్పత్తులకు 'పనీర్' అనే పదాన్ని వాడటంపై నిషేధానికి ప్రతిపాదన
నాడు పోస్టు చేయడమైనది:
24 SEP 2026 7:23PM by PIB Hyderabad
అనుకరణ ఉత్పత్తులను 'పనీర్' పేరుతో తయారు చేయడం, విక్రయించడాన్ని నియంత్రించడం... అటువంటి ఉత్పత్తుల స్వభావం, కూర్పు విషయంలో వినియోగదారులను తప్పుదోవ పట్టించుటను నిరోధించడం లక్ష్యంగా 'ఆహార భద్రత, ప్రమాణాలు (అమ్మకాలపై నిషేధం, ఆంక్షలు) నిబంధనలు-2011'కు ఒక సవరణ ముసాయిదాను భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎప్ఎస్ఎస్ఏఐ) ప్రతిపాదించింది.
ప్రతిపాదిత 'ఆహార భద్రత, ప్రమాణాలు (అమ్మకాలపై నిషేధం, ఆంక్షలు) సవరణ నిబంధనలు-2026' ద్వారా, ప్రస్తుత నిబంధనల్లోని 'నిబంధన 2.1.1' కింద ఒక కొత్త అంశాన్ని చేర్చాలని ప్రతిపాదించారు. ఇది ప్రత్యేకంగా "పాల నుంచి లభించని పదార్థాలతో తయారు చేసిన పనీర్"కు సంబంధించినది.
ప్రతిపాదిత సవరణ ప్రకారం, ‘పాల ఉత్పత్తుల తరహా ప్రత్యామ్నాయాలు’ విభాగం కింద ఇప్పటికే లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ పొందిన ఉత్పత్తులు... తమ పేరు, లేబులింగ్ లేదా మార్కెటింగ్‌లో "పనీర్" అనే పదాన్ని ఉపయోగించరాదు.
ఆహార ఉత్పత్తుల పేరు, ప్రదర్శనలో వాటి స్వభావాన్ని, కూర్పును కచ్చితంగా ప్రతిబింబించేలా చూడటం, తద్వారా వినియోగదారులు సమాచారంతో కూడిన ఎంపికలు చేసుకోగలిగేలా చేయడం ఈ సవరణ ప్రతిపాదన లక్ష్యం.
ఈ నోటిఫికేషన్ ఒక ముసాయిదా నిబంధన అయినందున... సంబంధిత వర్గాలు, ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలను ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆహ్వానించింది. ఈ నోటిఫికేషన్‌తో కూడిన అధికారిక గెజిట్ ప్రతులు ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తేదీ నుంచి 60 రోజుల గడువు ముగిసిన తర్వాత, ఈ ముసాయిదా నిబంధనలను పరిగణనలోకి తీసుకుంటారు.
అభ్యంతరాలు లేదా సూచనలను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ), ఎఫ్‌డీఏ భవన్, కోట్లా రోడ్, న్యూఢిల్లీ – 110002 వారికి పంపవచ్చు లేదా నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఈమెయిల్ చిరునామా ద్వారా సమర్పించవచ్చు.
‘ఆహార భధ్రత, ప్రమాణాల చట్టం-2006' నిబంధనల ప్రకారం... కేంద్ర ప్రభుత్వ ముందస్తు ఆమోదంతో ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ సవరణ ప్రతిపాదనను జారీ చేసింది. ప్రధాన 'ఆహార భధ్రత, ప్రమాణాలు (అమ్మకాలపై నిషేధం, ఆంక్షలు) నిబంధనలు’ 2011లో నోటిఫై చేశారు. అప్పటి నుంచి ఎప్పటికప్పుడు వాటిని సవరిస్తూ ఉన్నారు.
ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన అధికారిక గెజిట్‌ను ఈ లింక్ ద్వారా పొందవచ్చు: https://egazette.gov.in/WriteReadData/2026/276430.pdf
(రిలీజ్ ఐడి: 2314718)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3