రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

హైస్పీడ్ జాతీయ రహదారి కారిడార్ల అభివృద్ధిలో సాంకేతిక అనుసంధానాన్ని, సుస్థిరతను బలోపేతం చేయటానికి ఎన్‌హెచ్‌ఏఐ మార్గదర్శకాలు


మెరుగైన ప్రణాళిక, ఆధునిక సాంకేతికత, సులభతరమైన టోల్ వ్యవస్థ, మెరుగైన డ్రైనేజీ, పర్యావరణహిత కారిడార్లపై నూతన మార్గదర్శకాల దృష్టి

నాడు పోస్టు చేయడమైనది: 24 SEP 2026 4:27PM by PIB Hyderabad

ప్రపంచ స్థాయి జాతీయ రహదారుల వ్యవస్థను అభివృద్ధి చేసే దిశగా కీలక ముందడుగు వేస్తూ.. ఎక్స్‌ప్రెస్‌వేలు కాకుండా ఇతర హై-స్పీడ్ యాక్సెస్-కంట్రోల్డ్ జాతీయ రహదారుల ప్రణాళిక, రూపకల్పనకు సమగ్ర మార్గదర్శకాలను భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) విడుదల చేసింది. హై-స్పీడ్ జాతీయ రహదారులను మరింత మెరుగ్గా రూపొందించటం, ప్రణాళిక సిద్ధం చేయటం, సురక్షితంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దటం, భవిష్యత్ ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా సిద్ధం చేయటం… ఈ నూతన మార్గదర్శకాల ముఖ్య ఉద్దేశం. రాబోయే అన్ని నాలుగు, ఆరు లేన్ల గ్రీన్‌ఫీల్డ్, బ్రౌన్‌ఫీల్డ్ హై-స్పీడ్ యాక్సెస్-కంట్రోల్డ్ జాతీయ రహదారులకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి.

భవిష్యత్తు ట్రాఫిక్ కోసం డేటా-ఆధారిత ప్రణాళిక

సమగ్ర ట్రాఫిక్ అంచనా, భవిష్యత్తు డిమాండ్ ప్రణాళికకు ఈ మార్గదర్శకాలు అధిక ప్రాధాన్యతనిస్తాయి. ట్రాఫిక్ అంచనాలు, ఇప్పటికే ఉన్న, మళ్లించిన ట్రాఫిక్‌తో పాటు ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలకు అనుసంధానించిన సరకు రవాణాలో వృద్ధిని పరిగణనలోకి తీసుకోవాలి. ట్రాఫిక్ అంచనాలను మరింత కచ్చితంగా రూపొందించటానికి టోల్ డేటా, ఇతర విశ్వసనీయ వనరులను ఉపయోగిస్తారు.

సాంకేతికత ఆధారిత నిర్మాణం

నాణ్యత, కచ్చితత్వం, పర్యవేక్షణను మెరుగుపరిచేందుకు హై-స్పీడ్ జాతీయ రహదారుల నిర్మాణానికి ఆధునిక సాంకేతికత వినియోగాన్ని మరింత పెంచనున్నారు. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా, రహదారుల నిర్మాణం, హైవే పేవ్‌మెంట్ల నిర్మాణంలో ఆటోమేటెడ్, ఇంటెలిజెంట్ మెషిన్-ఎయిడెడ్ కన్స్రక్షన్ సాంకేతికతను ఉపయోగించాలని ఈ మార్గదర్శకాలు నిర్దేశిస్తున్నాయి. దీనిద్వారా సాంకేతికతతో కూడిన నిర్మాణం సులభతరమై, జాతీయ రహదారుల అభివృద్ధిలో మెరుగైన నాణ్యత, స్థిరత్వం, పర్యవేక్షణ సాధ్యమవుతాయి. భారత ప్రభుత్వం నిర్దేశించినట్లుగా... హై-స్పీడ్ కారిడార్లపై మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో (ఎంఎల్ఎఫ్ఎఫ్) టోలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు, దానికి అనుగుణంగా ఎంఎల్ఎఫ్ఎఫ్ అమలుకు తగిన చర్యలను తీసుకుంటారు.

ప్రణాళిక దశ నుంచే ఉద్యానవన, పర్యావరణ రక్షణ చర్యలు తీసుకోవటం

ప్రాజెక్టు ప్రణాళికలో ఉద్యానవన, మొక్కల పెంపకాన్ని అంతర్భాగంగా చేర్చుతారు. స్థానిక వాతావరణం, నేల స్వభావం, పర్యావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని... లూప్ ఏరియాలు, ఫ్లైఓవర్ల కింద, డివైడర్లు, ఇతర అనువైన ప్రదేశాల్లో ప్రణాళిక ప్రకారం మొక్కల పెంపకాన్ని చేపడతారు. జాతీయ రహదారి డివైడర్లపై మొక్కల సులభమైన నిర్వహణకు, నీటి వృధాను అరికట్టి సమర్థవంతంగా వినియోగించుకునేందుకు డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తారు.

మెరుగైన నీటి పారుదల, నీటి నిర్వహణ

సమగ్ర డ్రైనేజీ ప్రణాళిక డీపీఆర్ ప్రక్రియలో అంతర్భాగంగా ఉంటుంది. వర్షపు నీటిని ఎక్కడికి మళ్లించాలి, జాతీయ రహదారి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే నీటిని సురక్షితంగా ఎలా నిర్వహించాలనేది ఈ ప్రణాళికలో ఉంటుంది. సహజంగా వర్షపు నీరు వెళ్లే మార్గం లేని లూప్ ప్రాంతాల్లో, ఇతర ప్రదేశాల్లో నీటి సంరక్షణ నిర్మాణాలను ఏర్పాటు చేస్తారు.

అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్లు, లోతైన డివైడర్లు, ఇతర నిర్మాణాల చుట్టూ నీటి నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తారు. ఇవి నీరు నిలవటాన్ని నివారించటంలో, జాతీయ రహదారి మౌలిక సదుపాయాలకు నష్టం జరగకుండా కాపాడటంలో సహాయపడతాయి. డ్రైనేజీ ప్రణాళికలు నీరు వెళ్లే ప్రాంతాలను స్పష్టంగా గుర్తిస్తాయి. హై-స్పీడ్ జాతీయ రహదారులు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే వర్షపు నీటిని నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లను అందిస్తాయి.

ఈ మార్గదర్శకాలు దేశవ్యాప్తంగా సురక్షితమైన, మరింత స్థిరమైన, భవిష్యత్తుకు తగిన హై-స్పీడ్ జాతీయ రహదారి కారిడార్ల అభివృద్ధికి గణనీయంగా దోహదపడతాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2314711) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Malayalam