ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అంతర్రాష్ట్ర సరిహద్దుల మీదుగా బంగ్లాదేశ్‌ నుంచి బంగారం అక్రమ రవాణాను అడ్డుకున్న డీఆర్ఐ - రూ.17 కోట్ల విలువైన సుమారు 12 కిలోల విదేశీ బంగారం స్వాధీనం

నాడు పోస్టు చేయడమైనది: 23 SEP 2026 9:07PM by PIB Hyderabad

అంతర్జాతీయ సరిహద్దుల గుండా బంగారం అక్రమ రవాణాపై డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్ఐ) చేపట్టిన ముమ్మర దాడుల్లో భాగంగా, బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్ఎఫ్‌)తో సమన్వయంతో భారత్‌ - బంగ్లాదేశ్‌ సరిహద్దు మీదుగా అక్రమంగా తరలిస్తున్న విదేశీ మూలాల బంగారాన్ని, పలు సరుకులను అధికారులు అడ్డుకున్నారు. పశ్చిమ బెంగాల్‌, బీహార్‌లో వరుసగా నిర్వహించిన తనిఖీలు, దాడుల్లో సరిహద్దు ప్రాంతాల్లోని పలు ప్రదేశాలతో పాటు ఒక రైలు ప్రయాణికుడి నుంచి మొత్తం సుమారు 12 కిలోల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.17 కోట్లు ఉంటుందని అంచనా. దేశంలోకి బంగారాన్ని రహస్యంగా తరలించేందుకు బంగ్లాదేశ్‌ మార్గాన్ని అక్రమ రవాణాదారులు ఇప్పటికీ ఉపయోగిస్తున్నట్లు వెల్లడైంది. 

2026 సెప్టెంబర్‌ 20 - 21 తేదీల్లో పశ్చిమ బెంగాల్‌లో 161 బెటాలియన్‌కు చెందిన బీఎస్ఎఫ్‌ సిబ్బంది  బీఓపీ గోంగ్రా పరిధిలోని భారత్‌ - బంగ్లాదేశ్‌ సరిహద్దు రహదారి సమీపంలో ఎవరికీ చెందని స్థితిలో ఉన్న 27 విదేశీ మూలాల అక్రమ రవాణా బంగారం ముక్కలను గుర్తించారు. వీటి మొత్తం బరువు సుమారు 3.15 కిలోలు. అనంతరం డీఆర్ఐ అధికారులు తదుపరి చర్యలు చేపట్టి, 1962 కస్టమ్స్‌ చట్టంలోని నిబంధనల ప్రకారం ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

 

మరో ఆపరేషన్‌లో భాగంగా 2026 సెప్టెంబర్‌ 21న బీఎస్ఎఫ్‌ 161 బెటాలియన్‌కు చెందిన సిబ్బంది బీఓపీ మహాఖోలా పరిధిలో భారత్‌ - బంగ్లాదేశ్‌ సరిహద్దు కంచెకు అవతల ఉన్న హాత్‌ఖోలా గ్రామంలో హ్యాండ్‌పంప్‌ సమీపంలో దాచిన 24 క్యారెట్ల విదేశీ మూలాల అక్రమ రవాణా బంగారాన్ని గుర్తించారు. మొత్తం 10 ముక్కలుగా ఉన్న ఈ బంగారం సుమారు 1.16 కిలోల బరువు ఉంది. అనంతరం డీఆర్ఐ అధికారులు ఆ బంగారాన్ని 1962 కస్టమ్స్‌ చట్టంలోని సెక్షన్‌ 110 నిబంధనల ప్రకారం స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు 2026 సెప్టెంబర్‌ 10 - 11 తేదీల్లో బీఎస్ఎఫ్‌ సిబ్బంది బీఓపీ పాథర్‌ఘాటా పరిధిలో భారత్‌ - బంగ్లాదేశ్‌ సరిహద్దు కంచె సమీపంలో 48 బంగారు బార్లను గుర్తించారు. వీటి మొత్తం బరువు సుమారు 5.9 కిలోలు. అనంతరం ఈ బంగారాన్ని కూడా డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

పాట్నాలో డీఆర్ఐ అధికారులు ఒక రైలు ప్రయాణికుడి నుంచి విదేశీ మూలాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 15 బంగారు బార్లు, నాలుగు చిన్న బంగారు ముక్కల రూపంలో ఉన్న ఈ బంగారం మొత్తం సుమారు 1.71 కిలోల బరువు ఉంది. నిందితుడు రెండు కాళ్లకు చుట్టుకున్న వస్త్రంతో తయారు చేసిన మోకాలి కవచంలో బంగారాన్ని దాచిపెట్టి తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దర్యాప్తులో ఈ బంగారం బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా తరలించినట్లు తేలింది. ఆ వ్యక్తిని అరెస్టు చేశారు.

 

బంగ్లాదేశ్‌ మార్గం ద్వారా విదేశీ మూలాల బంగారం అక్రమ రవాణా, తరలింపు, పంపిణీ వెనుక ఉన్న ముఠాలను అడ్డుకునేందుకు బీఎస్ఎఫ్‌ సన్నిహిత సమన్వయంతో డీఆర్ఐ నిరంతరం చర్యలు చేపడుతున్నట్లు ఈ ఆపరేషన్లు వెల్లడిస్తున్నాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2314337) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Marathi , Bengali , Tamil