నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
వరల్డ్‌స్కిల్స్ షాంఘై 2026: అంతర్జాతీయ వేదికపై భారత్ నుంచి అతిపెద్ద నైపుణ్య బృందం.. నేటి నుంచే పోటీలు ప్రారంభం
ప్రారంభోత్సవ కవాతులో సందడి చేసిన 70 మంది సభ్యుల టీమ్ ఇండియా.. 63 విభాగాల్లో ప్రారంభమైన పోటీలు
క్రీడాకారులతో కలిసి పోటీల్లో పాల్గొన్న భారత ప్రతినిధి బృందం.. నాలుగు రోజుల పాటు కొనసాగనున్న ప్రపంచ స్థాయి పోటీలు
నాడు పోస్టు చేయడమైనది:
23 SEP 2026 4:45PM by PIB Hyderabad
వరల్డ్‌స్కిల్స్ షాంఘై 2026 పోటీలు నేడు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశ చరిత్రలోనే 70 మంది యువ పోటీదారులతో కూడిన అత్యంత పెద్ద భారత జట్టు 63 నైపుణ్య విభాగాల్లో పోటీపడేందుకు సిద్ధమైంది. నిన్న సాయంత్రం జరిగిన ప్రారంభోత్సవంలో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన దేశాల బృందాలతో కలిసి భారత జట్టు ‘పరేడ్ ఆఫ్ నేషన్స్’లో ఉత్సాహంగా పాల్గొంది. నాలుగు రోజుల పాటు ఈ పోటీలు కొనసాగనున్నాయి.
షాంఘై వరల్డ్ ఎక్స్‌పో కల్చరల్ సెంటర్‌లో జరిగిన ఈ ప్రారంభోత్సవంలో 65కి పైగా దేశాలు, ప్రాంతాల నుంచి దాదాపు 1,400 మంది పోటీదారులు ఒకే వేదికపైకి వచ్చారు. జాతీయ పతాకాన్ని చేతిలో పట్టుకొని టీం ఇండియా దుస్తులు ధరించిన భారత బృందం ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ప్రేక్షకుల నుంచి విశేష ప్రశంసలు లభించాయి. దీంతో 48వ వరల్డ్‌స్కిల్స్ పోటీల అధికారికంగా ప్రారంభమయ్యాయి.
48వ వరల్డ్‌స్కిల్స్ పోటీలు షాంఘైలో అధికారికంగా ప్రారంభం కాగా.. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ శుభాకాంక్షలు తెలుపుతూ పంపిన లేఖను ప్రారంభోత్సవ వేదికపై చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో చైనా ప్రధాని లీ కియాంగ్ పాల్గొని పోటీలను అధికారికంగా ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువ ప్రతిభావంతుల నైపుణ్యాలను ఒకే చోటికి చేర్చే అంతర్జాతీయ స్కిల్స్ పోటీలకు ఇది నాంది పలికింది.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారత ప్రతినిధి బృందం నాయకత్వంలో వరల్డ్‌స్కిల్స్ ఇండియా అధికార ప్రతినిధి, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ సీనియర్ ఆర్థిక సలహాదారు శ్రీమతి మనీషా సేన్శర్మ, డీజీటీ డైరెక్టర్ జనరల్, జాతీయ నైపుణ్య సంస్థ (ఎన్ఎస్ఓ) సీఈఓ శ్రీ దిలీప్ కుమార్ పాల్గొన్నారు. ప్రపంచ స్థాయి పోటీలు ప్రారంభమైన సందర్భంగా వారు పోటీదారులు, నిపుణులు, మార్గదర్శకులతో భారత జట్టుకు మద్దతు తెలిపారు.
ఎన్ఎస్ఓ డీజీటీ డైరెక్టర్ జనరల్ శ్రీ దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. “మా పోటీదారులు నెలల తరబడి కఠినమైన సాంకేతిక శిక్షణ, అనేకసార్లు నిర్వహించిన సాధన పోటీలు, నిపుణులు, పరిశ్రమ భాగస్వాముల మార్గదర్శకత్వం తర్వాత షాంఘైకి చేరుకున్నారు. మొత్తం 70 మంది అభ్యర్థుల్లో 14 మంది పారిశ్రామిక శిక్షణా సంస్థల (ఐటీఐలు) నుంచి వచ్చినవారని తెలియజేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇప్పుడు నాలుగు రోజుల పోటీల్లో కచ్చితత్వం, సంయమనం, స్థిరమైన ప్రదర్శనతో రాణించడంపై దృష్టి పెట్టాలి. భారత జట్టుకు మొత్తం ప్రతినిధి బృందం పూర్తి మద్దతుగా నిలుస్తోంది” అని అన్నారు.
వరల్డ్‌స్కిల్స్ ఇండియా అధికార ప్రతినిధి, ఎంఎస్‌డీఈ సీనియర్ ఆర్థిక సలహాదారు శ్రీమతి మనీషా సెన్ శర్మా మాట్లాడుతూ.. “ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారత జట్టు కవాతను చూడటం ఎంతో గర్వంగా అనిపించింది. మా 70 మంది పోటీదారుల్లో ప్రతి ఒక్కరూ నైపుణ్యాలు కలిగిన, ఆత్మవిశ్వాసంతో ఉన్న దేశ ఆకాంక్షలకు ప్రతీకగా నిలుస్తున్నారు. ఈరోజు పోటీలు ప్రారంభమైనందున, ప్రపంచంలోని అత్యుత్తమ ప్రతిభావంతులతో తమ సామర్థ్యాలను పోల్చుకునే అవకాశం వారికి లభిస్తుంది. అంతర్జాతీయంగా ఉన్న సహచరుల నుంచి నేర్చుకోవడంతో పాటు, దేశ నైపుణ్యాభివృద్ధి వ్యవస్థ నుంచి వెలువడుతున్న ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పేందుకు వారికి అవకాశం లభిస్తుంది” అని పేర్కొన్నారు.
ఈ ఏడాది భారత జట్టు పాల్గొనడం ద్వారా పోటీల పరిమాణం, నైపుణ్యాల విభాగాల సంఖ్య గణనీయంగా పెరిగాయి. తొలిసారిగా భారత్ 11 కొత్త నైపుణ్య విభాగాల్లో పోటీ పడనుంది. అవి: డెంటల్ ప్రోస్థటిక్స్ (దంతాల కృత్రిమ పరికరాల తయారీ), డిజిటల్ ఇంటరాక్టివ్ మీడియా డిజైన్, ఇంటెలిజెంట్ భద్రతా సాంకేతికత, ల్యాండ్‌స్కేప్ గార్డెనింగ్, ఆప్టోఎలక్ట్రానిక్ సాంకేతికత, రిటైల్ సేల్స్, అన్‌మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్, ఇండస్ట్రియల్ మెకానిక్స్, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్, హెవీ వెహికల్ సాంకేతికత, ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్.
మార్చ్‌పాస్ట్‌లో భారత ప్రతినిధి బృందం పాల్గొనడం ద్వారా దేశంలోని నైపుణ్యాభివృద్ధి వ్యవస్థలో ఉన్న వైవిధ్యం, బలం ప్రతిబింబించాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, సెక్టార్ స్కిల్ కౌన్సిళ్లు, శిక్షణా సంస్థలు, పరిశ్రమ భాగస్వాములు, నిపుణులు, మార్గదర్శకుల సహకారంతో పోటీదారులు కఠినమైన ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి, నెలల తరబడి ప్రత్యేక శిక్షణ, విస్తృత సాధన, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన సన్నద్ధతను పొందారు.
వరల్డ్‌స్కిల్స్ ఇంటర్నేషనల్ ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే ప్రపంచ నైపుణ్య పోటీ, వృత్తి విద్య, శిక్షణ, నైపుణ్య ప్రావీణ్యానికి ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ వేదిక. ఈ పోటీ ద్వారా యువ నిపుణులు తమ సాంకేతిక నైపుణ్యం, ఖచ్చితత్వం, సృజనాత్మకత, పనితనం, ఆవిష్కరణ సామర్థ్యాన్ని ప్రదర్శించవచ్చు. ప్రపంచ ప్రమాణాలతో తమ నైపుణ్యాలను పోల్చుకునే అవకాశం లభిస్తుంది.
ఈరోజు ఉదయం 9 గంటలకు షాంఘైలోని నేషనల్ ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్‌లో నైపుణ్య పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలు సెప్టెంబర్ 26 వరకు కొనసాగుతాయి. అనంతరం సెప్టెంబర్ 27న ముగింపు కార్యక్రమం నిర్వహించనున్నారు. వరల్డ్‌స్కిల్స్ షాంఘై 2026లో వరల్డ్‌స్కిల్స్ ఎక్స్‌పో, వరల్డ్‌స్కిల్స్ కాన్ఫరెన్స్ కూడా జరుగుతున్నాయి. వీటిలో యువత, విధాన రూపకర్తలు, విద్యావేత్తలు, పరిశ్రమల నాయకులు పాల్గొని నైపుణ్యాలను తెలుసుకోవడంతో పాటు సాంకేతిక, వృత్తి విద్య, శిక్షణ, భవిష్యత్ ఉద్యోగుల అభివృద్ధిపై ఆలోచనలు పంచుకుంటారు.
పోటీలు ప్రారంభమైన నేపథ్యంలో, వరల్డ్‌స్కిల్స్ లియోన్ 2024లో భారత్ సాధించిన విజయాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని భారత జట్టు లక్ష్యంగా పెట్టుకుంది. ఆ పోటీల్లో భారత్ నాలుగు కాంస్య పతకాలు, 12 మెడలియన్స్ ఫర్ ఎక్సలెన్స్ (అత్యుత్తమ ప్రతిభకు గుర్తింపు పతకాలు) సాధించింది. షాంఘై పోటీలు భారత యువ నిపుణులకు ప్రపంచంలోని అత్యుత్తమ ప్రతిభావంతులతో తమ నైపుణ్యాలను పరీక్షించుకునే అవకాశం కల్పిస్తున్నాయి. దేశంలోని నైపుణ్యం కలిగిన యువత ప్రతిభ, క్రమశిక్షణ, భవిష్యత్తు అవసరాలకు సిద్ధంగా ఉండే సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే వేదికగా నిలుస్తున్నాయి.
****
(రిలీజ్ ఐడి: 2314205)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11