పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఏరోడ్రోమ్‌ల అభివృద్ధికి ‘ఛాలెంజ్‌ మోడ్‌’ను ప్రారంభించిన పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు

21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో అవగాహన ఒప్పందాల ద్వారా ఉడాన్‌ తదుపరి దశ

నాడు పోస్టు చేయడమైనది: 22 SEP 2026 7:10PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ప్రాంతీయ విమాన అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నేడు కీలక అడుగు వేసింది. ఉడాన్‌ (ఉడే దేశ్‌ కా ఆమ్‌ నాగరిక్‌) పథకం తదుపరి దశ కింద 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో అవగాహన ఒప్పందాలు  కుదుర్చుకుంది. విమానయాన మౌలిక సదుపాయాల అభివృద్ధి, విమాన సేవలు తగినంతగా లేని లేదా అసలు అందుబాటులో లేని ప్రాంతాలకు విమాన అనుసంధానాన్ని విస్తరించేందుకు కేంద్రం - రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల మధ్య సహకారంలో ఈ అవగాహన ఒప్పందాలు ప్రధాన విజయంగా నిలిచాయి.

 

న్యూఢిల్లీలోని చాణక్యపురిలో గల 'ది అశోక్' వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి శ్రీ మురళీధర్ మొహోల్, పౌర విమానయాన శాఖ కార్యదర్శి శ్రీ సమీర్ కుమార్ సిన్హా, భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ) ఛైర్మన్ శ్రీ విపిన్ కుమార్, పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

“ఈ అవగాహన ఒప్పందాలతో టీమ్‌ భారత్‌ ఒక్కటిగా చేతులు కలిపి దేశ ప్రాంతీయ విమానయానాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తోంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో  వికసిత్ భారత్‌కు వికసిత రాష్ట్రమే పునాది. ఈ ప్రస్థానంలో ప్రతి రాష్ట్రం సమాన భాగస్వామిగా ఉంటుంది” అని శ్రీ రామ్మోహన్‌ నాయుడు అన్నారు.

ఉడాన్ పథకం ద్వారా చేకూరిన ప్రయోజనాలను గురింఛి మంత్రి మాట్లాడుతూ,  "ఉడాన్ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 687 రూట్లలో, 95 ఏరోడ్రోమ్‌లలో విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయి. అందులో భాగంగా 3.66 లక్షలకు పైగా విమాన సర్వీసుల ద్వారా దాదాపు 1.71 కోట్ల మంది ప్రయాణించారు. కానీ నాకు అత్యంత కీలకమైనది దీనివల్ల ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పే. విమానయాన రంగంలో ఉపాధి అవకాశాలు 2014లో ఉన్న 30 లక్షల నుంచి నేడు దాదాపు 77 లక్షలకు పెరిగాయి. ఇవి 2040 నాటికి 2.5 కోట్లకు చేరుకునే అవకాశముంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని తేజు, బిహార్‌లోని పూర్ణియా వంటి విమానాశ్రయాలు ఒకప్పుడు వందల కిలోమీటర్ల దూరంలో ఉండి రవాణా సౌకర్యాలకు దూరంగా ఉండేవి, కానీ నేడు అవి ప్రాంతీయ అభివృద్ధికి, సంపదకు చోదక శక్తులుగా మారుతున్నాయి" అని స్పష్టం చేశారు.

2026 జూలై 4న జోధ్‌పూర్‌లో ప్రధానమంత్రి ప్రారంభించిన ఉడాన్‌ పథకం తదుపరి దశకు కొనసాగింపుగా 2026 జూలై 16న ఉడాన్‌ వర్క్‌షాప్‌ జరిగింది. ఈ వర్క్‌షాప్‌లో పౌర విమానయాన రంగానికి చెందిన వివిధ భాగస్వాములు పాల్గొని, పథకం తదుపరి దశకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు.

“సవరించిన ఉడాన్‌ పథకం నాలుగు ప్రధాన అంశాలపై ఆధారపడి ఉంది. అవి - ప్రయాణికులకు అందుబాటులో ఉండే విమాన ఛార్జీలు, విమాన సేవల నిర్వహణలో సుస్థిరత, ప్రాజెక్టుల కోసం పారదర్శకమైన పోటీ విధానం, దేశీయ తయారీని ప్రోత్సహించడం. స్వదేశంలోనే పౌర విమానల తయారీ (మేడ్ ఇన్ ఇండియా సివిల్ ఎయిర్‌క్రాఫ్ట్) అనే మహోన్నత లక్ష్యం వైపు  ఒక సమగ్ర వ్యవస్థను నిర్మిస్తున్నాం. ఉడాన్ తదుపరి దశ మనల్ని ఆ దిశగానే ముందుకు తీసుకెళ్తోంది" అని శ్రీ రామ్ మోహన్ నాయుడు పేర్కొన్నారు.

నేటి కార్యక్రమంతో ఉడాన్‌ పథకం తదుపరి దశ విధాన రూపకల్పన, భాగస్వామ్య వర్గాలతో సంప్రదింపుల దశ నుంచి క్షేత్రస్థాయి అమలు దిశగా ముందుకు సాగుతోంది. ఇందులో కేంద్రం - రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, విమానయాన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, ప్రాంతీయ విమాన అనుసంధానాన్ని విస్తరించడం అనే మూడు ప్రధాన అంశాలపై దృష్టి సారించారు.

పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి శ్రీ మురళీధర్‌ మొహోల్‌ మాట్లాడుతూ, “ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్థ నాయకత్వంలో 2016 నుంచి ఉడాన్‌ పథకం ఎంతో ముందుకు సాగింది. దేశవ్యాప్తంగా ప్రాంతీయ, మారుమూల ప్రాంతాల విమాన అనుసంధానాన్ని విస్తరించింది. ఇప్పుడు సవరించిన ఉడాన్‌ పథకం ద్వారా వచ్చే పదేళ్లలో 120 కొత్త గమ్యస్థానాలకు విమాన సేవలను విస్తరించడంతో పాటు, మరో 4 కోట్ల మంది ప్రయాణికులకు విమాన ప్రయాణ సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. 20కి పైగా రాష్ట్రాలు కలిసి ఈ ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. దీంతో భారత పౌర విమానయాన రంగంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నాం” అని అన్నారు.

ఉడాన్‌ పథకం అమలు సంస్థ అయిన ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ( ఏఏఐ), కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, భాగస్వామ్య రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల మధ్య మొత్తం 21 అవగాహన ఒప్పందాలు కుదిరాయి.రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అనుసంధాన అవసరాలు, ప్రాధాన్యాలకు అనుగుణంగా విమానయాన ఆస్తుల గుర్తింపు, అభివృద్ధి, కార్యకలాపాల ప్రారంభానికి కేంద్రం, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, ఏఏఐ  సమన్వయంతో చర్యలు చేపట్టేందుకు ఈ అవగాహన ఒప్పందాలు ఒక క్రమబద్ధమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాయి.

ఏరోడ్రోమ్‌ల అభివృద్ధికి సంబంధించిన ‘ఛాలెంజ్‌ మోడ్‌’ పోర్టల్‌ను,  ఉడాన్‌ పథకం తదుపరి దశలో మార్గాల కేటాయింపు కోసం రూపొందించిన పథక పత్రాన్ని పౌర విమానయాన మంత్రి ఈ సందర్భంగా విడుదల చేశారు.

‘ఛాలెంజ్‌ మోడ్‌’ కింద రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు ప్రత్యేక పోర్టల్‌ ద్వారా ఉడాన్‌ పథకం తదుపరి దశలో అభివృద్ధి చేసేందుకు ఎయిర్‌స్ట్రిప్‌లు, హెలిప్యాడ్‌లను ప్రతిపాదించవచ్చు. దీంతో విమాన అనుసంధానానికి అవకాశమున్న ప్రాంతాలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చొరవతో గుర్తించడంతో పాటు, స్థానిక అవసరాలకు అనుగుణంగా విమానయాన మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధికి వీలు కలుగుతుంది.

రూట్‌ బిడ్డింగ్‌ ప్రక్రియలో గుర్తించిన ఉడాన్‌ మార్గాలకు విమానయాన సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానిస్తారు. తద్వారా మార్గాలు, ఆపరేటర్ల ఎంపికలో పారదర్శక, పోటీ విధానానికి వీలు కలుగుతుంది. ఈ ప్రక్రియ ద్వారా విమాన సేవలు అసలు అందుబాటులో లేని, తగినంతగా అందుబాటులో లేని ప్రాంతాలకు విమాన సేవలను విస్తరించడంతో పాటు రాకపోకలు, అనుసంధాన సదుపాయాలను మెరుగుపరచేందుకు అవకాశం ఏర్పడుతుంది. తద్వారా విస్తృత ఆర్థిక కార్యకలాపాలు, పర్యాటకం, వాణిజ్యం, ఉపాధి అవకాశాలకు కూడా ఊతం లభిస్తుంది.

ఈ కార్యక్రమంలో ఉడాన్‌ పథకం తదుపరి దశపై సాంకేతిక సమావేశం కూడా నిర్వహించారు. ఏరోడ్రోమ్‌ల అభివృద్ధికి సంబంధించిన ఛాలెంజ్‌ మోడ్‌, ఉడాన్‌ మార్గాల ఎంపికకు త్వరలో నిర్వహించనున్న బిడ్డింగ్‌ ప్రక్రియపై ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా,  విమానయాన సంస్థలు, ఇతర పౌర విమానయాన రంగ భాగస్వాములు పథకం అమలు విధానం, తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు ఈ సమావేశం అవకాశం కల్పించింది.

ఉడాన్‌ పథకం తదుపరి దశలో ఇప్పటివరకు సాధించిన ఫలితాలను మరింత ముందుకు తీసుకెళ్లడంతో పాటు దేశవ్యాప్తంగా విమానయాన వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విమాన అనుసంధానం, విమానయాన మౌలిక సదుపాయాల ప్రయోజనాలు మరిన్ని ప్రాంతాలకు, వర్గాలకు,  ప్రజలకు చేరేలా చూడడమే దీని ప్రధాన ఉద్దేశం.

 

***


(రిలీజ్ ఐడి: 2313713) సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Tamil