బొగ్గు మంత్రిత్వ శాఖ
కోల్ ఇండియా లిమిటెడ్‌లో కార్పొరేట్ సామాజిక బాధ్యత: ప్రజల సంక్షేమం నుంచి సమ్మిళిత వృద్ధి దిశగా పయనం
కోల్ ఇండియా లిమిటెడ్ వార్షిక సీఎస్ఆర్ ఖర్చు దాదాపు రూ.1,000 కోట్లు
2014-15 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరాల మధ్య చట్టపరమైన నిబంధన రూ.5,795 కోట్లు కాగా, సీఎస్ఆర్ ద్వారా రూ.7,276 కోట్లను ఖర్చు చేసిన సీఐఎల్
నాడు పోస్టు చేయడమైనది:
22 SEP 2026 12:07PM by PIB Hyderabad
దేశంలోనే వనరుల కొరతతో పాటు గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్)… తిరిగి సమాజానికి సేవలందించటం కొత్తేమీ కాదు. కంపెనీల చట్టం-2013 ద్వారా చట్టపరమైన నిబంధనగా కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) మారటానికి ముందుగానే కమ్యూనిటీ డెవలప్‌మెంట్ (సీడీ) పాలసీ-2005 ద్వారా సీఐఎల్, దాని అనుబంధ సంస్థలు గనుల సమీప ప్రాంతాల్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాయి.
గత సీడీ పాలసీ ద్వారా మైనింగ్ కార్యకలాపాలు జరిగే 8 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలకు తాగునీటి సదుపాయాలు, ఆరోగ్య శిబిరాలు, మౌలిక వసతుల కల్పన వంటి సహాయక చర్యలను అనుబంధ సంస్థలు అందించాయి. ఈ కార్యక్రమాలు స్థానిక ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించాయి. ఈ కీలక కార్యక్రమాల కోసం చట్టం అమల్లోకి రావటానికి ముందు మూడేళ్లలో (ఎఫ్‌వై2011-12 నుంచి 2013-14) సీఐఎల్ సీడీ వ్యయం రూ. 82 కోట్ల (2011-12) నుంచి రూ. 409 కోట్లకు (2013-14) చేరింది. నిజాయతీగా సాగిన ఈ పనులు క్షేత్రస్థాయిలో ప్రశంసలు పొందినప్పటికీ… ఏటా స్థిరంగా, భారీ ఎత్తున విస్తరించేందుకు వ్యవస్థాగత ప్రణాళికా వ్యవస్థ కొరవడింది.
ఈ పరిస్థితిని కంపెనీల చట్టం-2013లోని సెక్షన్ 135 ప్రాథమికంగా మార్చివేసింది. షెడ్యూల్ VIIలో పేర్కొన్న అంశాల ఆధారంగా బోర్డు స్థాయి సీఎస్ఆర్ కమిటీ పర్యవేక్షణలో కంపెనీలు సగటు నికర లాభాల్లో చట్టబద్ధంగా నిర్దేశించిన శాతాన్ని సీఎస్ఆర్ ద్వారా ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా సీఐఎల్ సొంత విధానాలను రూపొందించుకుంది. వార్షిక సీఎస్ఆర్ వ్యయంలో కనీసం 80 శాతాన్ని గనులు, కార్యాలయాలకు 25 కిలోమీటర్ల పరిధిలోని ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తూ వెచ్చించాలని... మిగిలిన నిధులను రాష్ట్ర, జాతీయ స్థాయి కార్యక్రమాలకు కేటాయించాలని నిర్ణయించింది. స్థానిక ప్రాంతాలపై దృష్టి సారించటం వల్ల సీఐఎల్ సీఎస్ఆర్ నిధుల్లో 90 శాతానికి పైగా బొగ్గు గనులున్న రాష్ట్రాల్లోనే ఖర్చవుతున్నాయి. తద్వారా గనుల తవ్వకాల ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాలకే ఈ ప్రయోజనాలు ఎక్కువగా దక్కుతున్నాయి.
ఈ ఫలితాలు గణాంకాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. సీఐఎల్ చట్టబద్ధంగా బాధ్యతను నెరవేర్చటమే కాదు. ఏటా దాన్ని పెంచుతూ వస్తోంది. 2014-15 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరాల కాలంలో చట్టబద్ధమైన నిబంధన రూ. 5,795 కోట్లు కాగా సీఐఎల్ రూ. 7,276 కోట్లను వెచ్చించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... ఒకప్పుడు ఏటా దాదాపు రూ. 500 కోట్లు ఉన్న వార్షిక వ్యయం, ఇప్పుడు దాదాపు రూ. 1,000 కోట్లకు చేరుకుంది. దీంతో దేశంలోనే సీఎస్ఆర్ ద్వారా అత్యధికంగా ఖర్చు చేసే అతిపెద్ద కార్పొరేట్ సంస్థల్లో సీఐఎల్ ఒకటిగా నిలిచింది.
ఈ నిధుల పెంపుతో పాటు ఆశయాల్లోనూ స్పష్టమైన మార్పు వచ్చింది. సీఐఎల్ సీఎస్ఆర్ కార్యక్రమాలు జాతీయ లక్ష్యాలతో అనుసంధానమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 50,000లకు పైగా మరుగుదొడ్లను నిర్మించి స్వచ్ఛ విద్యాలయ అభియాన్‌కు అత్యధిక నిధులు అందించిన ప్రభుత్వ రంగ సంస్థగా నిలిచింది. పీఎం కేర్స్ నిధికి తొలినాళ్లలోనే విరాళం ఇవ్వటంతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో ప్రత్యేక ఆసుపత్రుల ఏర్పాటు నుంచి మిషన్ ప్రాణవాయు ద్వారా ఆక్సిజన్ ప్లాంట్ల వరకు కొవిడ్-19 సహాయక చర్యలను విస్తృతంగా చేపట్టింది. ఎన్నో ప్రతిష్ఠాత్మక పథకాలు ఈ కార్యక్రమానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. గనుల పరిసర జిల్లాలకు చెందిన 1,300 మందికిపైగా యూపీఎస్సీ అభ్యర్థులకు ప్రోత్సాహకాలనిచ్చిన నిర్మాణ్ పథకం, 1,000 మందికి పైగా ప్రాణాపాయంలో ఉన్న పిల్లలకు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్స అందించిన తలసేమియా బాల్ సేవా యోజన, 2 లక్షలకు పైగా పిల్లలకు పరీక్షలు నిర్వహించి 1,700 మందికి పైగా పుట్టుకతో వచ్చే గుండె జబ్బులను నయం చేసిన నాన్హా సా దిల్, భారత అత్యున్నత న్యాయస్థానం భాగస్వామ్యంతో 2,500 మందికి పైగా పిల్లలకు అందించిన స్కాలర్‌షిప్ పథకాలు ఇందులో ముఖ్యమైనవి. వీటితో పాటు రూ. 596 కోట్ల వ్యయంతో అంగుల్‌లో 500 పడకల వైద్య కళాశాల, ఆసుపత్రి, ఝార్సుగూడలో కార్డియాక్ కేర్ సెంటర్ వంటి భారీ ఆరోగ్య సంరక్షణ సదుపాయాలను కల్పించింది. ఇప్పుడవి ఆయా ప్రాంతాలకు తృతీయ స్థాయి సంరక్షణ కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. విద్యారంగంలో డిజిటల్ విద్య ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో 2,300కి పైగా స్మార్ట్ తరగతి గదులను, 500 ఐసీటీ, స్టెమ్ ల్యాబ్‌లను ప్రారంభించగా, రాంచీలో 5,000 సీట్ల సామర్థ్యంతో రాష్ట్ర గ్రంథాలయం నిర్మాణంలో ఉంది.
ఈ విస్తరణ కేవలం విద్య, వైద్య రంగాలకే పరిమితం కాలేదు. ప్రాజెక్టు ప్రగతి, గిరిజన మహిళలకు కోళ్ల పెంపకంలో మద్దతు కల్పించటం, ప్లాస్టిక్ ఇంజనీరింగ్, మల్టీ-స్కిల్ శిక్షణ ద్వారా గడిచిన నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో 48,000 మందికి పైగా ప్రజలు లబ్ధి పొందారు. జార్ఖండ్ ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఖేల్‌గావ్ స్పోర్ట్స్ అకాడమీ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో సాధించిన 15 పతకాలతో సహా మొత్తం 1,800కి పైగా పతకాలను సాధించింది. ఐఐటీ (ఐఎస్ఎం) ధన్‌బాద్‌లోని శతాబ్ది భవన నిర్మాణం నుంచి కోల్‌కతాలోని హౌరా బ్రిడ్జి విద్యుద్దీకరణ వరకు చేపట్టిన ఎన్నో ప్రతిష్ఠాత్మక ప్రజాప్రయోజన కార్యక్రమాలు... విద్యాసంస్థలు, జాతీయ ప్రసిద్ధ కట్టడాల వరకు సీఐఎల్ సీఎస్ఆర్ ప్రాముఖ్యతను చాటిచెప్పాయి.
ఈ ప్రయత్నాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 3.56 కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపాయి. లబ్ధిదారుల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలు, దివ్యాంగులు, మహిళల పాత్రే గణనీయంగా ఉంది. భారత్ నిర్దేశించుకున్న సుస్థిరాభివృద్ధి లక్ష్యాలైన (ఎస్‌డీజీలు) ఆరోగ్యం (ఎస్‌డీజీ-3), నాణ్యమైన విద్య (ఎస్‌డీజీ-4), లింగ సమానత్వం (ఎస్‌డీజీ-5), పరిశుభ్రమైన నీరు, పారిశుధ్యం (ఎస్‌డీజీ-6), పేదరిక నిర్మూలన (ఎస్‌డీజీ-1) సాధనకు ఈ కార్యక్రమాలు తోడ్పడ్డాయి.
ఈ పురోగతి యాదృచ్ఛికంగా జరగలేదు. సీఐఎల్ సీఎస్ఆర్ విధానం స్పష్టమైన ఫలితాల ఆధారిత కార్యాచరణతో నడుస్తుంది. స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా వార్షిక ప్రణాళికలు, నిర్దిష్ట గడువులు, లక్ష్యాలతో కూడిన ఎంఓయూలు, పనుల పురోగతి, వినియోగ ధ్రువీకరణ పత్రాల ఆధారంగా దశలవారీగా నిధుల విడుదల, బడ్జెట్ ఎక్కువగా ఉన్న ప్రాజెక్టులకు థర్డ్-పార్టీ మూల్యాంకనాన్ని తప్పనిసరి చేసే 'ఇంపాక్ట్ అసెస్‌మెంట్ మార్గదర్శకాలు' ఇందులో భాగాలుగా ఉన్నాయి. వీటన్నింటిపై అంతర్గత, చట్టబద్ధమైన, కాగ్ ఆడిట్ పర్యవేక్షణ ఉంటుంది. దీన్ని రంగాలవారీగా బలోపేతం చేస్తున్నారు. కోల్ పీఎస్‌యూల సీఎస్ఆర్ ప్రయత్నాల్లో మరింత స్థిరత్వం, సమన్వయం, జవాబుదారీతనం తీసుకురావటమే లక్ష్యంగా సెప్టెంబర్ 8న బొగ్గు రంగం మొత్తానికి వర్తించే సీఎస్ఆర్ విధానాన్ని ప్రారంభించిన తొలి మంత్రిత్వశాఖగా బొగ్గు మంత్రిత్వశాఖ నిలిచింది.
***
(రిలీజ్ ఐడి: 2313495)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5