కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
గ్వాలియర్‌లో టెలికాం తయారీ జోన్ కు పెట్టుబడులను ఆకర్షించేందుకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ తో కలసి బెంగళూరులో పెట్టుబడిదారుల సమావేశం నిర్వహించనున్న కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా
గ్వాలియర్ టెలికాం తయారీ జోన్‌లో పరిశ్రమల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయనున్న బెంగళూరు సమావేశం
ఆసియాలోనే తొలి టెలికాం తయారీ జోన్ కు పెట్టుబడులు, ఆవిష్కరణలు, ఉపాధిని వేగవంతం చేసే లక్ష్యంతో పరిశ్రమల భాగస్వామ్యంపై బెంగళూరులో సమావేశం
నాడు పోస్టు చేయడమైనది:
21 SEP 2026 7:02PM by PIB Hyderabad
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఏర్పాటు చేస్తున్న ఆసియా తొలి టెలికాం తయారీ జోన్ (టీఎంజడ్)లో పరిశ్రమల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం, పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా కేంద్ర కమ్యూనికేషన్లు, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖల మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా నేతృత్వంలో కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని టెలికమ్యూనికేషన్స్ విభాగం (డాట్) బెంగళూరులో పెట్టుబడిదారుల సమావేశాన్ని నిర్వహించనుంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. న్యూఢిల్లీ, ముంబైల్లో ఇప్పటికే నిర్వహించిన పెట్టుబడిదారుల సమావేశాల ద్వారా పెట్టుబడులపై వచ్చిన విశేష స్పందనను మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.
బెంగళూరులో జరిగే పెట్టుబడిదారుల సమావేశానికి ప్రముఖ టెలికాం తయారీ సంస్థలు, సాంకేతిక సంస్థలు, ఎలక్ట్రానిక్స్, విడిభాగాల తయారీ సంస్థలు, పెట్టుబడిదారులు, మౌలిక సదుపాయాల సంస్థలు, టెలికాం రంగానికి చెందిన ఇతర కీలక భాగస్వాములు హాజరుకానున్నారు. పెట్టుబడి అవకాశాలను అందిపుచ్చుకోవడం, దేశీయ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, దేశంలో ప్రపంచ స్థాయిలో పోటీపడగల టెలికాం తయారీ వ్యవస్థను అభివృద్ధి చేయడంపై ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించనున్నారు. టెలికాం తయారీ రంగంలో భారత్ వాటాను పెంచే లక్ష్యంతో టెలికాం తయారీ జోన్ లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు అత్యంత ఆకర్షణీయమైన ప్రోత్సాహక ప్యాకేజీని ప్రకటించారు. పరిశ్రమల నుంచి అందిన సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని ఈ ప్యాకేజీని రూపొందించారు.
బెంగళూరులో జరిగే పెట్టుబడిదారుల సమావేశం న్యూఢిల్లీ, ముంబైల్లో విజయవంతంగా నిర్వహించిన పెట్టుబడిదారుల సమావేశాలకు కొనసాగింపుగా జరుగుతోంది. న్యూఢిల్లీ, ముంబైల్లో నిర్వహించిన పెట్టుబడిదారుల రౌండ్‌టేబుల్ సమావేశాల ఫలితంగా రూ.5,500 కోట్ల పెట్టుబడులపై హామీలు లభించాయి. వీటి ద్వారా దాదాపు 18,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంది.
బెంగళూరులో నిర్వహించనున్న ఈ సమావేశం నగరంలోని బలమైన సాంకేతికత, ఎలక్ట్రానిక్స్, టెలికాం, ఆవిష్కరణల వ్యవస్థతో టెలికాం తయారీ జోన్ ను అనుసంధానించడం ద్వారా ఇప్పటికే ఏర్పడిన పెట్టుబడుల ఊపును మరింత ముందుకు తీసుకెళ్లనుంది. టెలికాం తయారీ జోన్ ద్వారా తయారీ, పరిశోధన - అభివృద్ధి, సాంకేతిక భాగస్వామ్యాలు, సరఫరా శ్రేణుల అనుసంధానం, ఉపాధి కల్పన రంగాల్లో ఉన్న అవకాశాలను పరిశ్రమల ప్రముఖులు, పెట్టుబడిదారులు పరిశీలించేందుకు ఈ సమావేశం అవకాశం కల్పిస్తుంది.
టెలికమ్యూనికేషన్స్ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు టెలికాం తయారీ జోన్ ఏర్పాటు ఒక కీలక ముందడుగు. దేశీయ విలువ ఆధారిత సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, స్వదేశీ రూపకల్పన, తయారీని ప్రోత్సహించడం, ఎగుమతులను పెంచడం, టెలికాం ఉత్పత్తులు, తదుపరి తరం సాంకేతికతలకు విశ్వసనీయమైన ప్రపంచస్థాయి కేంద్రంగా భారత్‌ను నిలపడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలు.
టెలికాం సేవలు అందించే స్థాయి నుంచి ప్రపంచస్థాయి టెలికాం ఉత్పత్తుల తయారీ, ఆవిష్కరణల కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దే ప్రతిష్ఠాత్మక లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఈ లక్ష్యాన్ని పెట్టుబడులు, తయారీ సామర్థ్యం, సాంకేతిక ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాల రూపంలో సాకారం చేసే దిశగా బెంగళూరులో నిర్వహిస్తున్న సమావేశం మరో కీలక ముందడుగుగా నిలుస్తోంది.
గ్వాలియర్ టెలికాం తయారీ జోన్ (టీఎంజడ్) గురించి
గ్వాలియర్‌లో ప్రతిపాదిత టెలికాం తయారీ జోన్ (టెలికాం తయారీ, పరిశోధన - అభివృద్ధి, ఆవిష్కరణల కోసం పూర్తి వినియోగానికి సిద్ధంగా ఉన్న 170 ఎకరాల పారిశ్రామిక క్లస్టర్‌గా రూపుదిద్దుకోనుంది. ఇందులో మొబైల్ పరికరాలు, ఆప్టికల్ ఫైబర్, టెలికాం పరికరాలు, తదుపరి తరం5జీ/6జీ సాంకేతికతలు ఉంటాయి. ఇటీవల కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం, మొదటి దశకు కేంద్ర ప్రభుత్వం రూ. 493 కోట్లను 100% నిధులుగా అందిస్తోంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సుమారు 170 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయించడంతో పాటు, పెట్టుబడిదారులకు వివిధ ప్రోత్సాహకాలను కూడా అందిస్తోంది.
ఇందుకోసం ప్రత్యేక ప్రయోజన సంస్థ (ఎస్పీ వీ) ఏర్పాటు చేశారు. ఇందులో మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి 51 శాతం ఈక్విటీ, టెలికమ్యూనికేషన్స్ శాఖకు 49 శాతం ఈక్విటీ ఉంటుంది
***
(రిలీజ్ ఐడి: 2313255)
సందర్శకుల సూచీ సంఖ్య : : 2