రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
సౌలభ్య నియంత్రిత హైస్పీడ్ జాతీయ రహదారుల ప్రణాళికల రూపకల్పన... నిర్మాణంపై ‘ఎన్‌హెచ్‌ఏఐ’ కొత్త మార్గదర్శకాలు
ఈ మార్గదర్శకాలతో ఏకరూప చట్రం ఏర్పడటం ద్వారా భద్రత బలోపేతమై హైస్పీడ్ కారిడార్లలో నిరంతరాయ, నిరాటంక వాహన రాకపోకల సౌలభ్యం
నాడు పోస్టు చేయడమైనది:
21 SEP 2026 4:43PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా ‘ఎక్స్‌ప్రెస్‌వే’లు మినహా సౌలభ్య నియంత్రిత హైస్పీడ్ జాతీయ రహదారుల ప్రణాళికల రూపకల్పన, నిర్మాణంపై ‘ఎన్‌హెచ్‌ఏఐ’ కొత్త సమగ్ర మార్గదర్శకాలు జారీచేసింది. ‘వికసిత భారత్-2047’ సంకల్ప సాకారంతోపాటు అంతర్జాతీయ ప్రమాణాలతో జాతీయ రహదారుల నెట్‌వర్క్ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వ దీర్ఘకాలిక లక్ష్యం మేరకు వీటిని రూపొందించింది.
హైస్పీడ్ జాతీయ రహదారి కారిడార్ల సమగ్ర ప్రాజెక్టు నివేదికల (డీపీఆర్) తయారీ ప్రమాణాలలో ఏకరూపత, సాంకేతిక ప్రమాణాలలో మరింత స్థిరత్వం, రహదారి భద్రత బలోపేతం, జాతీయ రహదారులన్నిటా కార్యాచరణ సామర్థ్యం మెరుగుదల ఈ మార్గదర్శకాల లక్ష్యం. భవిష్యత్తులో నిర్మించే అన్ని 4, 6 వరుసల కొత్త జాతీయ రహదారులు సహా నవీకృత సౌలభ్య నియంత్రిత హైస్పీడ్ కారిడార్లకూ ఇవి వర్తిస్తాయి.
ఏకరూప ప్రమాణాల ఆవశ్యకత
కేంద్ర ప్రభుత్వ దీర్ఘకాలిక వ్యూహాత్మక భవిష్యత్ ప్రణాళికకు అనుగుణంగా ఈ మార్గదర్శకాలు రూపొందాయి. వికసిత భారత్-2047 కింద 50,000 కిలోమీటర్ల సౌలభ్య నియంత్రిత హైస్పీడ్ కారిడార్ల నిర్మాణంపై ప్రభుత్వం లక్ష్యనిర్దేశం చేసుకుంది. తద్వారా దేశవ్యాప్తంగా అనుసంధానం విస్తరించి, రవాణా వ్యయం గణనీయంగా తగ్గుతుంది.
ప్రస్తుతం ‘ఎక్స్‌ప్రెస్‌వే’లు మినహా సౌలభ్య నియంత్రిత హైస్పీడ్ జాతీయ రహదారుల ప్రణాళిక రూపకల్పనను నియంత్రించే ప్రత్యేక ప్రమాణాలు-నిర్దేశాలేవీ లేవు. ప్రస్తుతం అనుసరిస్తున్న ‘డీపీఆర్’ తయారీ ప్రమాణాల్లో అనేక లోటుపాట్లను ‘ఎన్‌హెచ్‌ఏఐ’ గమనించింది. ఈ నేపథ్యంలో జారీ అయిన కొత్త మార్గదర్శకాలు ఏకరూప సాంకేతిక, భద్రత నిబంధనల నిర్దేశం ద్వారా ప్రమాణాలను మెరుగుపరుస్తాయి.
ఈ కారిడార్లపై వాహనాలు వేగంగా ప్రయాణిస్తాయి కాబట్టి, తదనుగుణ అదనపు భద్రత చర్యలను నిర్దేశించడం కొత్త మార్గదర్శకాల ధ్యేయం. ఆ మేరకు నిష్క్రమణ-ప్రవేశ మార్గాలపై ముందస్తు సమాచారం వెల్లడికి ప్రత్యేక నిబంధనలను ఇవి సూచిస్తాయి. జాతీయ రహదారిపై ప్రయాణంలో ఎక్కడెక్కడ ప్రవేశ-నిష్క్రమణ ప్రదేశాలు ఉంటాయో ముందుగానే తెలియడం ద్వారా సురక్షిత ప్రయాణం సాధ్యమవుతుంది.
సౌలభ్య నియంత్రిత జాతీయ రహదారుల కోసం ఏకరూప నిర్మాణ చట్రం
వాహన రాకపోకల సమగ్ర అంచనా ప్రాతిపదికగా హైస్పీడ్ జాతీయ రహదారిలో వరుసల అమరికను ప్రామాణీకరిస్తారు. అంటే- 15,000 వాహనాల దాకా రద్దీగల 4 వరుసల హైవేలు, కారిడార్లు ఇకపై 60 మీటర్ల వెడల్పుతో ఉంటాయి. ఇక 15,000-25,000 మధ్య వాహన రాకపోకలుగల 4 వరుసల, 6 వరసల కారిడార్ల వెడల్పు 70 మీటర్ల దాకా ఉంటుంది. దీంతోపాటు 25,000-40,000 వాహన రాకపోకలు గల 6 వరుసల జాతీయ రహదారి కూడా 70 మీటర్ల వెడల్పు ఉంటుంది.
ప్రవేశ నియంత్రణ - నిరంతర వాహన రాకపోకలు
ఎక్స్‌ప్రెస్‌వేలు, జాతీయ-రాష్ట్ర రహదారులలో గణనీయ వాహన రాకపోకలకు కారణమైన కీలక ఆర్టీరియల్ రోడ్లు సహా ఓడరేవులు, విమానాశ్రయాలు, బహుళ వాహన రవాణా పార్కులు (ఎంఎంపీఎల్), పారిశ్రామిక ప్రాంతాలు, ప్రధాన పర్యాటక ప్రదేశాల్లో ప్రధాన వాహన రద్దీ ప్రాంతాలను సంధానించే రోడ్డు కూడళ్ల వద్ద వాహనాలు దాటేందుకు ర్యాంపులు ఏర్పాటు చేస్తారు.
ప్రవేశ నియంత్రణ బలోపేతం, ఆక్రమణలు-అనధికార ప్రవేశం సహా హైస్పీడ్ కారిడార్లలో పశువుల నిరోధం కోసం వెలుపలి అంచు వెంబడి ఒక మీటర్ ఎత్తుగల ప్రహరీ నిర్మించాలని మార్గదర్శకాలు నిర్దేశిస్తున్నాయి. ఈ మేరకు పూర్తి ప్రవేశ నియంత్రణ గల జాతీయ రహదారుల ప్రణాళిక-నిర్మాణాల ప్రామాణీకరణ సహా హైస్పీడ్ జాతీయ రహదారి ప్రాజెక్టులన్నింటా ఏకరూపతను నిర్దేశించే ఈ మార్గదర్శకాలను ఒక ప్రగతిశీల చర్యగా పరిగణించాల్సి ఉంటుంది.
సురక్షిత, నిరాటంక-నిరంతరాయ భవిష్యత్ సంసిద్ధ జాతీయ రహదారి నెట్‌వర్క్ రూపకల్పనపై ‘ఎన్‌హెచ్‌ఏఐ’ నిబద్ధతను బలపరిచే ఈ మార్గదర్శకాలు, మరోవైపు ‘వికసిత భారత్-2047’పై కేంద్ర ప్రభుత్వ స్వప్న సాకారానికీ దోహదం చేస్తాయి.
***
(రిలీజ్ ఐడి: 2313246)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4